మొన్న సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హైద్రాబాద్‌కి వచ్చాడు

The Loneliness of Being
Rajesh Khanna
DARK STAR
ఇది ఇంగ్లిష్ పుస్తకం.

హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్.  ఈ పుస్తకానికి  #hydlitfestival కి  ఈ టపాకి ఏమిటి సంబంధం అని మీకు సందేహాలు రావడం ఆశ్చర్యం లేదు.  మద్రాసు.  అదే సంబంధం.  Chennai is a city, Madras is an emotion అదే జ్ఞాపకం వస్తోంది ఇప్పుడు.

దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు.  ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు.  వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి.  ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు.

చాలా సినిమాలు మద్రాసులో షూట్ చేసుకున్నారు బాంబే నిర్మాతలు.  వాటిలో ఒకటి.  హాతీ మేరే సాథి. నిర్మాత సాండో‘ చిన్నప్ప తేవర్. హాతీ మేరే సాథి లో నాయకుడు రాజు పాత్రధారి – రాజేష్ ఖన్నా. సినిమాలో హీరో ఉద్యోగం కోసం రోడ్లవెమ్మటపడతాడు.  అందులో భాగంగా పాండిబజార్‌ లో ఆ దృశ్యాలని చిత్రీకరించారు.  (ఆ పాండిబజారులోనే రాణి బుక్ సెంటర్ తెలుగు పుస్తకాల కొట్టు ఉండేది.  రాణి బుక్ సెంటర్‌ని స్థాపించింది  చౌదరాణి. రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు – చౌదరాణి నా తల్లితండ్రులు.  చౌదరాణి కవిరాజుత్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక.)  ఇక మా నాన్న అట్లూరి పిచ్చేశ్వరావు తొలి తెలుగు వెండితెర కథనాన్ని గ్రంధస్తం చేసినవారు.

హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి “ఉద్యోగం కావాలి, ఉందా?” అని అడిగితే, “లేదు పో,” పొమ్మనడం కూడ ఉంది. రాణి బుక్ సెంటర్ ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.

ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన రచయిత ఈ #hydlitfestival కి వస్తున్నాడు కదా అని వెళ్ళాను.

Gautam at hyd Lit festival jan26, 2015
రాజేష్ ఖన్నా డార్క్ స్టార్ రచయిత గౌతమ్ చింతామణి, ఉమా మగళ్, రచయిత రాఘవేందర్.

రచయిత ఎవరు?  కవిత చింతామణి పుత్రుడు.  కవిత ఎవరు?  కె. ఆరుద్ర రామలక్షి ల ప్రధమ పుత్రిక.  సరే, ఈ ఆరుద్ర, రామలక్షి‌ లు ఎవరు?  ( మీకు తెలియకపపోతే  గూగుల్ చెయ్యండి).  నా తల్లి తండ్రులకు స్నేహితులు. సాహితీ బంధువులు.  ఓహ్ రచయిత పేరు చెప్పలేదు కదూ!  అతని పేరు గౌతమ్ చింతామణి.

ఇవన్ని అతి ముఖ్యమైన కారణాలు నేను #hydlitfestival కి వెళ్లడానికి. జనవరి 23,24,25, 26 తారిఖులలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగం పేట లో జరిగింది ఈ హైద్రాబాద్ లిటరేచర్ ఫెస్టివల్.  పైన హెడర్ లో ఉంది ఆ పాఠశాల ప్రధాన భవంతి చిత్రమే!  అందులో 26 వ తేదిన టాటా రాక్‌ఫోర్ట్ సభాస్థలి వేదిక.  మధ్యాహ్నం Reams on Reels అనే శీర్షికమీద గౌతమ్ , ఎమ్. కె రాఘవేంద్ర లు చలనచిత్ర రంగం మీద తాము వ్రాసిన పుస్తకాలను గురించి సంచాలనకర్త ఉమ మగళ్ తో కలిసి వచ్చిన ఆహుతులతో పంచుకున్నారు.

ఇక పుస్తకం ఎలాగుంది?

ఇప్పటికే బాలివుడ్‌మీద రాస్తూ తనకుంటూ ఒక ఉనికిని ఏర్పరుచుకుంతున్న రచయిత గౌతమ్. నిబద్ధతతో చేసిన రచన ఇది.

సూపర్ స్టార్

Rajesh Khanna Superstar
The Loneliness of Being Rajesh Khanna Dark Star

→  రాజేష్ ఖన్నా ఎవరితో పడుకున్నాడు,
→  ఏ నిర్మాతని ఏడిపించాడు,
→  రోజుకుని ఎన్ని పెగ్గులు తాగేవాడు,
  పేక ఆడేవాడా?

లాంటి వ్యక్తిగత విషయాలూ, అతని జీవితంలోని వివాదాలు రాయలేదు. సూపర్‌స్టార్ రాజేష్‌ ఖన్నా గురించి అతని నటజీవితం గురించి మాత్రమే వ్రాసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే  ఈ గౌతమ్ చింతామణి తన మాతమహుల పేరు నిలబెట్టాడు.  అనవసరమైన వ్యక్తిగత వివాదాలలోకి వెళ్ళలేదు.  అయినా పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే మలి ముద్రణకి నోచుకుంది.  భారతీయ చలనచిత్ర రంగంలోని తొలి  “సూపర్ స్టార్” మీద వెలివడిన పుస్తకం ఇది.

The Loneliness of Being Rajesh Khanna  DARK STAR బాలివుడ్ మీద ఆసక్తి వున్నవాళ్ళు అందరూ చదవతగ్గ పుస్తకం.

1950 ప్రాంతలలో పుట్టిన వాళ్ళకి హింది సినిమా అభిమానులకు, ‘సూపర్ స్టార్’ రాజేష్ ఖన్నా ఫాన్‌లకు గొప్ప బహుమతి ఈ పుస్తకం.

ఈ పుస్తకం గురించి ఆంగ్ల పత్రికలలో వచ్చిన కొన్ని సమీక్షలు ఇక్కడున్నవి.
తెలుగులో ఈ పుస్తకం గురించి పూర్ణిమ వ్రాసిన పరిచయం ఇక్కడ  పుస్తకం డాట్ నెట్‌లో చదువుకోవచ్చు .
ప్రతులు – ఇక్కడ అమెజాన్ లోనూ ఫ్లిప్‌కార్ట్‌లో ఇక్కడ కొనుక్కోవచ్చు