స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

Telugu author Volga at Vedika Literary Meet

స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

స్త్రీ వాదము, స్త్రీత్వము, స్త్రీ ఆలోచనా విధానము.. వీటి గురించి ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది చెప్పినా, ఎంత చదివినా ఎప్పుడూ నాకు ఓ సరైన సమాధానం వచ్చేది కాదు. అసలు సమాధానమే వచ్చేది కాదా?

అంటే అలా అనేం లేదు. సమాధానమైతే వచ్చేది కానీ, నా వయసుకు, నా స్థాయికి సరిపడే ఆలోచనకు ఆ సమాధానాన్ని పోల్చుకుని చూసేప్పటికి అది ఎక్కడో తేలిపోయినట్లు కనిపించేది.

సరే, ఈ ప్రశ్నలా ఉండనీ, పూర్తి సమాధానం ఏదో ఒకరోజు దొరక్కపోదా అనుకుంటూనే నన్ను నేను అఫీషియల్‌గా ఫెమినిస్ట్‌నని ఎప్పుడో ప్రకటించుకున్నా. ప్రకటించుకోవడం వరకూ బాగానే ఉంది. నా ఆలోచనా
స్థాయిలో స్త్రీ వాదినని చెప్పుకోవడమూ బాగానే ఉంది. మరి పూర్తి సమాధానం ఎప్పుడు దొరకాలి? ఎలా దొరకాలి? ఉఫ్..

మోగిందండీ.. ‘నీకీ విషయం చెప్పడానికే వేదిక గ్రూపు ఓల్గా గారితో ఓ సమావేశం ఏర్పాటు చేసింద’న్న సమాచారంతో ఓ ఫోన్ కాల్.

13 ఫిబ్రవరి 2016. సరిగ్గా 5 అయిందప్పుడు (అంటే మన టైమ్ ప్రకారం నాలుగున్నరే అనుకుందాం!)

అప్పటికే వచ్చినవారంతా సమావేశం కోసం ఆసక్తి ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఆ రోజు సమావేశంలో సాహిత్యంతో తన ప్రయాణం గురించి చెప్పేందుకు ఓల్గా గారు సిద్ధంగా ఉన్నారు. నా మెదడులో ఒక్కటే
తిరుగుతోంది, సమాధానం దొరుకుతుంది కదా?

మెల్లిగా సమావేశం ప్రారంభమైంది. ఓల్గా గారు సాహిత్యంతో తన ప్రయాణాన్ని, తన సాహిత్య ప్రయాణాన్ని, స్త్రీ వాదాన్ని, స్త్రీ ఆలోచన విధానాన్ని లోతుగా ప్రస్తావిస్తూ వెళుతున్నా కొద్దీ, ఈ విషయంపై నాకు  కావాల్సిన సమాధానం కూడా దొరుకుతున్నట్లనిపించింది. ఇక్కడ ఆ ముందు మాటలు కొన్ని ఓల్గా స్వరంతోనే

కొన్ని పుటోలు ఇక్కడ.

చిన్నతనం నుంచే పుస్తకాలతో స్నేహం పెంచుకోవడం, కాలేజీ రోజుల్లో చిన్న చిన్న కవితలు రాయడం, సాహితీ వేత్తలను, రచయితలను కలుసుకోవడం, వాళ్ళ దగ్గర్నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, రాజకీయాలు, స్త్రీ ఆలోచనా, స్త్రీని సమాజం అర్థం చేసుకున్న విధానం, స్త్రీ వాదం అనే ఆలోచన, స్త్రీ వాదం అనే ఆలోచనను సమాజం అర్థం చేసుకున్న విధానం.. ఇలా ఓల్గా గారు ఒక్కో విషయాన్ని చెబుతూ పోతూ ఉంటే నీదనే ఆలోచన బలపడాలంటే నీదైన ప్రయాణం ఒకటి చేయాల్సి ఉంటుందని, ఆ ప్రయాణం మొదలుపెట్టడం దగ్గర్నుంచి, ఆ ప్రయాణం మనకు అర్థమయ్యే వరకూ ధైర్యంగా ముందుకెళ్ళడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమని ఆమె మాటల్లో అర్థం అర్థమవుతూ పోయింది.

స్త్రీ వాదం అంటే ఏంటో అర్థమయ్యాక, దాన్ని తానుగా ఈ ప్రపంచానికి ఎలా అర్థమయ్యేలా చెప్పడానికి చేసిన రచనలే తన సాహిత్య ప్రయాణమని చెప్పినపుడు ఒక వ్యక్తి, ఒక వాదాన్ని అర్థం చేసుకొని, దానికోసమే శ్రమిస్తే ఎంతదూరం వెళ్ళగలరో ఓల్గా గారు నిరూపించి చూపినట్లనిపించింది.

“స్త్రీ వాదమంటే.. స్త్రీ తన శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ప్రపంచానికి చెప్పడమే. స్త్రీ వాదమంటే స్త్రీ ధైర్యంగా తన సొంతంగా, తానుగా నిలబడి ముందుకెళ్ళడమన్న ఒక ఆలోచనే. అంతేకానీ, స్త్రీ వాదమంటే
పురుషుడిని ధ్వేషించడమో, మరోటో కాదు” అని స్త్రీ వాదానికి ఓల్గా గారిచ్చిన నిర్వచనం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది. స్త్రీ వాదంలో మళ్ళీ ఇంకా చాలా ఆలోచనలున్నాయని, వాటిని వేరు చేసి చూడడం అన్న ఆలోచనను పక్కనబెడితే, వాటి గురించి కూడా ఇంకా లోతైన చర్చ జరిగి ఒక అభిప్రాయం బలపడాల్సిన అవసరం ఉందని ఓల్గా గారు ఈ సందర్భంగా తన ఆలోచనను పంచుకున్నారు.

ఓల్గా గారి కథల సంపుటి ‘విముక్త‘కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడమనేది ఒక వాదాన్ని చెప్పడంతో పాటు, ఆ వాదాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఒక సరైన సాహితీ ప్రక్రియ వల్లే సాధ్యమైందని భావిస్తున్నట్లు ఒక అభిప్రాయం వినిపించింది. దాంతో పాటు ఈ సాహితి ప్రక్రియలో మీదైనా ముద్రను తేవడానికి ఎలాంటి కృషి చేశారు? అన్న ప్రశ్నకు ఓల్గా గారు సమాధానమిస్తూ.. “ఒక వాదాన్ని చెప్పేందుకు ఎంచుకునే భాషలో కూడా ప్రయోగం, కొత్తదనం చూపాలి. అప్పుడే అందరికీ ఆ ఆలోచన చేరడంతో పాటు దానికి ఒక అర్థం వస్తుంది. నా వరకూ నేను నా భాష పరంగా ఎదగడం ఎప్పటికప్పుడు సాహిత్యంతో స్నేహం వల్లే సాధ్యమైంది” అన్నారు.

ఇలా చాలా ప్రశాంతంగా మొదలైన సమావేశం, అంతే ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రశాంత సమావేశానికి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఓ అందాన్ని, అర్థాన్ని తెచ్చిపెట్టింది.

ఇలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేదికకు, ఆలంబనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలంబనలో చిన్నారులు నాకైతే తెగ నచ్చేశారు. గొడవ పడే స్థాయి చర్చలు జరిగినా, ఈ పిల్లలు నవ్వులు ఆ ఆలోచనను కూడా తేనివ్వవేమో అన్నంత అందంగా ఉన్నాయి.

రమణ మూర్తి గారు సమావేశం మొదలయ్యే ముందు The Story of an Hour అనే కథ గురించి ప్రస్తావించారు. ఆ కథను వీలైతే (వీలైతే కాదు, తప్పక) చదవండి.
ఈ నివేదిక ని అందించినవారు వర్ధమాన రచయిత – వి మల్లికార్జున్.

త్రిపురనేని గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం 2015

TripuraneniGopichandNationalLiteraryAward

సెప్టెంబరు 8న సాహిత్యకారుడు త్రిపురనేని గోపిచంద్ జన్మదినం.  గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని ఆరోజున ఎంపిక చేసిన గ్రహీతకు అందజేయడం ఒక సత్సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.   2015 సంవత్సరానికి గాను సర్.  విలియం మార్క్  టుల్లి కి ఈ సారి దానిని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అందించారు.  ఆ కార్యక్రమానికి వేదిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైద్రాబాదు.

ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రిక ఇది.
The invitation to the Tripuraneni Gopichand National Literary Award presentation to event.

గవర్నర్ రోశయ్య గారి ప్రసంగ పాఠం ఆంగ్లంలో ఇక్కడ.
పురస్కార స్వీకర్త సర్. విలియం మార్క్  టుల్లీ ప్రసంగం ఇక్కడ మీరు వినవచ్చు.
ఇక దిన పత్రికలలో వచ్చిన వ్యాసాలు వివరాలు ఇవి.
ఇక్కడ ది హిందు లో.
పున్నా కృష్ణమూర్తి పరిచయం వ్యాసం సాక్షి దినపత్రికలో ఇక్కడ.
ఈనాడు దిన పత్రికలో ఇక్కడ.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇక్కడ.

From your left: Y. K Nageswara Rao, Saichand (youngest son of Gopichand) Saripalli Kondal Rao,  Padmabhushan Sir Mark Tully (seated), Sri Latha, Dr Sunaina Singh and Dr T H Chowdary

From your left: Y. K Nageswara Rao, Saichand, Saripalli Kondal Rao, Sir Mark Tully, Sri Latha, Dr Sunaina Singh, Dr T H Chowdary

కధ 2014… కధకులు ముగ్గురూ…మరొకరు

Kadha 2013 volume 24

చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. వీటన్నింటికి       ఒకటే అర్ధం, తెలుగులో దారి అని.  తెరువు అనే పదాన్ని “అంద చెన్నై మానగరిత్తిలే,” వాళ్ళు వాడగా విన్నాను, నేను వాడాను.  వాళ్ళు ఇంకా వాడుతున్నారు.   రెండు వందల పదహారు పేజిల కతల గంప లో
18 కతలున్నాయి.  అందులోని ఆఖరి కతే, విశాలాక్షి మాస పత్రిక తమ అక్టోబర్ 2014 సంచికలో ప్రచురించింది.  ఆ కధే కథ 2014 లో కూడా చోటు చేసుకుంది.

Sa Vem Rameshఉత్తరపొద్దు (2003), ఊడల్లేని మర్రి (2006 ), రయికముడి ఎరుగని బతుకు(2012), సిడిమొయిలు (2013), ఇదిగో ఈ రెండువేల పద్నాలుగులో ఈ దారమ్మ చెప్పిన కత.  మొన్న అంటే రెండవ ఆదివారం సెప్టెంబరు 13 ఈ కథను గురించి కూడా వేదిక సభ్యులు చర్చించుకున్నారు.  కధానిలయంలో ఈ కథకుడి కథల పట్టిక ఇక్కడ చూడోచ్చు.

తొలికధ మీసర వాన. 2002 లో నడుస్తున్న చరిత్ర లో ప్రచురితం.  నడుస్తున్న చరిత్ర ఇప్పుడు అమ్మనుడి గా సామల రమేశ్ బాబు గారే మాస పత్రికగా ప్రచురిస్తున్నాను. చేతులు మారలేదు.

ఇక కధానిలయం లో  కల్పన రెంటాల కథలు మూడు మాత్రమే నమోదయ్యాయి.  తన తొలి బ్లాగ్ నవల తన్హాయి. కొంత అలజడిని, ఆసక్తిని కలిగించిన ఆ నవల గురించి ప్రస్తావన లేదు మరి ఎందుకనో.  వీరి తొలి కధ ఋతుభ్రమణం వార్త వారి ఆదివారం అనుబంధంలో 2003-12-14 లో ప్రచురించారు. కధ 2014 లోకి ఎన్నుకున్న ఈ కధ ప్రాతినిధ్య 2014 కధాసంపుటంలో కూడ ఉంది. వేదిక కూడ ఈ కధని చర్చించుకుంది.  కల్పన బ్లాగ్ ఇక్కడ.


Gorti SaiBrahmanandam
“ఇండియాకి వస్తున్నాను,” అని అనగానే వేదిక సభ్యులతో ఒక సాయంత్రం ఏర్పాటు చేస్తాను మీకు వీలుంటే అనగానే సంతోషంగా ఒప్పేసుకున్నారు ఈ కథకుడు. అలాగా ఏప్రిల్, 2015 లో ఒక ఆదివారం, 5వ తారిఖున గొర్తి సాయిబ్రహ్మానందంవేదిక కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

ఈ కధకుడి కధలు కొన్ని ఇదివరకు కధాసాహితి సంపుటిలో చేరినవి; అతను (2009), సరిహద్దు (2011), ఈ సారి కూడా.  కధకోసం ఆ సంపుటిని చూడాల్సిందే! 🙂

 

Author Vimala
1978 లో తొలి కధ ప్రచురించుకున్న కవి విమల. ఆ పత్రిక నూతన.  అవును కవి.
కధలు కూడా వ్రాస్తారు.

2015 మార్చ్ ఒకటిన, వేదిక నిర్వహించిన కధ నిన్న – నేడు – రేపు లో వీరు కూడ నిర్వాహకులుగా తమ సహాయాన్ని అందించారు.  వేదిక వీరి కధను కూడ చర్చకు తీసుకుంది.  ఆ కధే ఈ కధ 2014 లో కూడా ఉంది.

 

మొన్న ముగ్గురు కథకులు, మరో ముగ్గురు కధకులు గురించి చెప్పాను.  ఇక ఇంకో ముగ్గురు కాక ఇంకొకరు కధకుల గురించి తెలుసుకున్నారు.  ఈ టపాతో కధ 2014 లోని కధకులు ముగ్గురూ మరొకరు కధకులందరి గురించి కొంత చెప్పాను.  ఇక కధ 2014 వివరాలు రేపు కొన్ని చెప్తాను.

కధ 2013
ప్రతులకు
కధాసాహితి, 164, రవి కాలని, Tirumalgherry, Secunderabad 500 015.
ధర:  అరవై రూపాయలు / పది అమెరికన్ డాలర్లు
గమనిక: తపాల / కొరియర్ ఖర్చులు అదనం

 

 

 

 

కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు

katha 1990 to 2009

2014 లో సెప్టెంబరు నెలలో రెండవ ఆదివారం తేది14 అయ్యింది.  ఆ రోజున మధురాంతకం నరేంద్ర గారి  కథని వేదిక – సాహితీ సమావేశం సభ్యులు చర్చించుకున్నారు. ఆ కథ ని కధా సాహితి సంపాదకులు తమ కధ 2014 సంకలనంలో చేర్చుకున్నారు.  మధురాంతకం నరేంద్ర సాహిత్యం గురించి మరి కొన్ని వివరాలు కథానిలయం లో ఇక్కడ చూడండి.

రచయిత మధురాంతకం నరేంద్ర

పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం వారి చేతుల మీదుగానే అందుకుంటున్న మధురాంతకం నరేంద్ర.  వీరిద్దరూ అధ్యాపకులే!  తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారిని కూడా ఇందులో చూడవచ్చు.

ఇవి కాక ఆంగ్లంలో The Hans India ఆంగ్ల దిన పత్రికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద నరేంద్ర వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. నరేంద్ర గారి కథలలో కొన్ని; అత్యాచారం (991), నిత్యమూ నిరంతరమూ (1993), అస్తిత్వానికి అటూ – ఇటూ – (2001), నమ్మకం (2008), చిత్రలేఖ (2010), చివరి ఇల్లు (2013)  ఇదివరలో కథాసాహితి వారి కధ సంపుటాలలో చోటు చేసుకున్నవి.

ఇందులో చెప్పుకోవలిసిన అంశం ఏమిటంటే 1992 లో  కధ 1991ని ఆవిష్కరించింది కీ.శే మధురాంతకం రాజారాం.  వారి తనయుడు మధురాంతకం నరేంద్ర.

ఇక కథా సారంగ లో (July 9, 2015) 3456GB వ్రాసిన కొట్టం రామకృష్ణారెడ్డి తొలి కధ – తీర్పు.  ఇది 1991 ఫిబ్రవరిలో రచన మాస పత్రికలో వచ్చింది.  వీరి కథ కూడ ఈ కథ 2014 సంపుటిలో ఉంది. వివరాలకు  సంకలనాన్ని చూడండి.

బంధం కధ 2013 లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురించింది.  ఆ కథ వ్రాసింది బోడపాటి హరితాదేవి.  కలం పేరు రాధిక. సంపాదకులు ఎన్నుకున్న కధని మీరు కథ 2014 లోనే చూసుకోవాలి మరి.  🙂

2014 అక్టోబరులో రెండవ ఆదివారం 12 వ తేది అయ్యింది.  ఆ రోజు సాయంత్రం డా. వి చంద్రశేఖర రావు గారి నవల నల్లమిరియం చెట్టు మీద వేదిక సాహితీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వినిపించారు కన్నెగంటి రామారావు. మరో సాహిత్య పిపాసి 🙂 డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఆ రోజు సాయంత్రం వేదిక సమావేశంలో పాల్గొన్నారు.  వీరిద్దరూ అమెరికాలో ఉంటారు.  చెప్పొచ్చేదేమిటంటే యాజి కూడా అమెరికాలోనే ఉంటారు.
కథకుడు యాజి తన కధకు ఎన్నుకున్న అంశం మీద సాహిత్యలోకంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది.  యాజి కథకూడ కధ 2014 లో చోటుచేసుకుంది.  విశేషం ఏమిటంటే యాజి స్వస్థలం తెనాలి.  😎

Author Yajiకధ 2014 – కధాసంపుటిలోని ఒక ముగ్గురు కథకులను గురించి, ఇక్కడేమో మరో ముగ్గురు కధకులు గురించి తెలియచేసాను.  రేపు … ఆ మిగతా కథకుల గురించి.  😎   అన్నట్టు తెనాలి కి వస్తున్నారుగా! తెనాలి లో కవిరాజు ఉద్యావనం (పార్క్) ఇక్కడుంది.

రెండు దశాబ్దాలు
కథ 1990 – 2009
౩౦ కధలతో రెండు దశాబ్దాల ఉత్తమ కధల సంకలనం

ప్రతులకు
164, Ravi Colony, Tirumalagherry, Secunderabad 500 015, India  Ph: +91 2779 7691
ధర: రూ 150.00 / US $ 25.00
పోస్ట్ / కొరియర్ ఖర్చులు అదనం.

కథ 2014 … మరో ముగ్గురు కథకులు

katha 2014 book launch invitation

కథ 2014 కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది.  ఈ పాతిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెలువడింది.  కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో.  కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ.  ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి.  ఆ అధ్యక్షుల వారిది తెనాలి.  పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.

ఇక ఆ ముగ్గురు కథకులు ఎవరో చూద్దాం.

Author Patanjalisastry
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి తొలి కథ సీతన్న తాట.  ఇది 1962 లో ఆంధ్రప్రభ వారు ప్రచురించారు.  వీరి ఇతర కథలు, నవలలు గురించిన వివరాలు కథానిలయంలో
ఇక్కడ తెలుసుకోవచ్చు.

వాల్ పోస్టర్, సర్మా, గారడీ, రామేశ్వరం కాకులు ఇదివరలో ఆయా కథ వార్షిక సంకలనాలలో ప్రచురించారు.

వీటిలో వేదిక లో రామేశ్వరం కాకులు మీద చర్చ జరిగింది. ఆ కధని ఇక్కడ చదువుకోవచ్చు.

అద్దేపల్లి ప్రభు, కాకినాడ వాస్తవ్యులు.  వీరి తొలి కధ విలువలు 1984 లో అరుణతార మాస పత్రికలో వెలువడింది. వారి ఇతర సాహిత్యం కథానిలయంలో ఇక్కడ చూడండి.

     

Sunil Kumar P V - Author

1986 స్వాతి వార పత్రికలో ప్రచురించిన మూషికార్జునీయం కథకులు పి విసునీల్ కుమార్. లఘుచిత్రం గా వెలుగుచూసిన కథ దెయ్యం వీరిదే.  వేదిక లో వీరి తోక దెయ్యం చెప్పిన డిసిప్లి మీద 2015 మే నెలలో చర్చించుకున్నారు.   ఆ కథని ఇక్కడ చదువుకోవచ్చు.

వీరు ముగ్గురూ, నిన్న ముగ్గురు కధకులు మాత్రమే కాదు.  ఇంకా ఉన్నారండి.  వారిలో మరో ముగ్గురు కధకులని మీకు రేఫు పరిచయం చేస్తాను.

రానున్న ఆదివారం, సెప్టెంబరు 20, 2015 న తెనాలిలో  జరగనున్న ఆవిష్కరణ సభకి ఇదిగో ఆహ్వానం.katha 2014 book launch invitation

కథ 2014…ముగ్గురు కథకులు

గత పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా వెలువడుతున్న కధాసాహితి వారి 25 వార్షిక కథా సంకలనం కథ 2014 లో ఈ ముగ్గురి కథలున్నవి.

బత్తుల రమాసుందరి
మొదటి కథ ఇక్కడRamasundari Battula - Atuhor
చదువుకోవచ్చు; మనిద్దరమే ఉందాం అమ్మా!
ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం (01-09-2013లో ప్రచురితం)

 

 

 

Author Palagiri Viswa Prasada Reddy

ఇక రెండవ వారు పాలగిరి విశ్వప్రసాద్, వీరి  మొదటి కథ
బోలు మనుషులు  రచన మాస పత్రిక సెప్టెంబరు 1991లో
ప్రచురితం.  నేను వెతికినంతలో అది నాకు జాలంలో దొరకలేదు.

 

 

 

 

Author Bhagavantham
ఇక మూడవ కథకుడు భగవంతం.
వీరి మొదటి కథ వెయిటింగ్ ఫర్ యాద్గిరి.
ఈ కథ తొలిసారిగా 2006లో వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
చలన చిత్ర దర్శకుడు వంశీ, నా కెందుకు నచ్చిందంటే  అనే శీర్షికతో
గోతెలుగు డాట్ కాం
 లో ఈ కథని మెచ్చుకుంటూ పరిచయం చేసిన కథ.  భగవంతం పాడిన పాట ఇక్కడ వినొచ్చు.  సా.వెం.రమేశ్ స్వరం కూడా!

రానున్న ఆదివారం 20న, తెనాలి లో జరగనున్న  కథ 2014 ఆవిష్కరణ సభలో బహుశ వీరందరిని మీరు కలుసుకోవచ్చు.  వీరు ముగ్గురే కాదు ఇంకా ఉన్నారు.  వారిలో కొంతమంది గురించి రేపు చెబుతాను.

ఇదిగో కథ 2014 కి అహ్వాన పత్రిక.

katha 2014 book launch invitation

పగలని గోళీ

ఆరడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ. ఇనుముతో చేసిన చట్రానికి ఇనుపరేకు బిగించిన గేటు. అటూ ఇటూ చూస్తే
గేటుని బిగించిన స్తంభానికి అమర్చి ఉంది ఒక బుల్లి మీట. దానిని నొక్కాడు. భయంకరమైన గొంతుతో కుక్క
అరుపులు మొదలైనవి. ఒక్కసారి ఝడుసుకున్నాడు. అప్రయత్నంగానే ఒకడుగు వెనుకకు పడింది. దానిని
అదిలిస్తూ లోపలెక్కడ్నుంచో ఒక ఆడమనిషి వచ్చి గేటు పైనించి అతన్ని ఎవరికోసం అన్నట్టు చూసింది.

గొంతు పెగల్చుకుని అక్కకోసం అని చెప్పేలోపు వసారా లోపల నుండి అక్క. ‘‘ఎవరూ?’’ అని చూస్తూ
తమ్ముణ్ని గుర్తుపట్టి, పనిమనిషిని గేటు తెరవమని పురమాయిస్తూ ముందు వసారాలోకి వచ్చింది.

‘‘ఎప్పుడొచ్చావు?’’ అని అడుగుతూ, పరదాలని అడ్డం తీస్తూ లోపల హాలులోకి దారితీసింది. ‘‘నిన్ననే
వచ్చాను, ఇంటర్వ్యూ కోసం,’’ అని చెబుతూ ఎడమచేతి వైపు త్రీ సీటర్ సోఫాలో ఒదిగి కూర్చున్నాడు. అతనికి
ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది అక్క. పనిమనిషి తెచ్చిన మంచినీళ్ల గ్లాసును అందుకుంటూ అటూ ఇటూ
చూస్తుంటే, ‘‘బావగారు ఆఫీసు పనిమీద బయటకు వెళ్లారు’’ అంటూ అందరి క్షేమ సమాచారాలు అడిగి
తెలుసుకుంటోంది. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత. ‘‘మాటల్లో పడి మరిచిపోయాను, ఉండు నీకు టీ అంటే
ఇష్టం కదా! చేసి తీసుకు వస్తాను’’ అని లేచి లోపలికి వెళ్లింది. ఆ గుమ్మానికీ పొడుగాటి పరదాలు.

ఎదురుగా ఉన్న పత్రికని అందుకుని తిరగెయ్యడం మొదలుపెట్టాడు. ఏదో అలికిడి అయితే కుడిచేతి వైపుకి తలతిప్పి చూశాడు. గాలికి కదిలిన పరదాల చప్పుడు కాబోలు. దృష్టి తిప్పితే గుమ్మానికి ఎడం పక్కనే గోడకి ఉన్న ఫొటోఫ్రేమ్‌లో ఒక పదేళ్ల పాప నవ్వుతూ కనపడింది. అక్క కూతురు. ఎంత చక్కగా ఉందో. కళ్లల్లో ఒక
విధమైన పెంకితనం కూడా కనపడింది అతనికి. మరోపక్క గోడమీద చామనచాయ రంగు చెక్కలతో చేసిన చట్రానికి బిగించిన అద్దం లోపలి నుంచి కనబడుతున్న బొమ్మ.

ఆ! బొమ్మ కాదు అది. ఒక్కసారి వాడి ఊపిరి స్తంభించింది. అక్క వస్తున్నదేమోనని చూశాడు. అలికిడి లేదు. లేచి సోఫాలు దాటుకుంటూ వెళ్లి ఆ చట్రం ముందు నిలబడ్డాడు. పసుపుపచ్చని రంగు అట్టమీద ఒక వైపుకి
వాలుగా నెమలిపింఛం బిగించి ఉంది. గుమ్మం బయటి నుంచి హాలులోకి వస్తున్న వెలుతురు ఆ అద్దం మీద
గింగిరాలు తిరుగుతున్నది. నెమలి పురివిప్పుకుని అద్భుతమైన నాట్యాన్ని మొదలుపెట్టింది. అతని కళ్లు
చెమ్మగిల్లాయి. మసకబారిన ఆ కళ్లలోని తడి నెమ్మదిగా అతని మనసు లోపలి పొరలలోకి ఇంకుతోంది.

అతనే వాడు. వాడి మనసిప్పుడు గాలిపటంలాగా రివ్వున ఎగురుతోంది. మాంజా వేసిన దారం, పట్ట్టీలేసుకున్న
వేళ్ల మధ్య నుంచి సర్రున జారుతోంది. వాడి మనసు నిండా అక్కే! కళ్ల నిండా అక్కే. వాడి ఆలోచనల నిండా
అక్కే. అక్క ఈసారి ఎక్కడికి తీసుకెళుతుందో! అక్కని ఈసారి తప్పకుండా జూకి తీసుకెళ్లాలి.

సాయంత్రం స్నేహితులతో గోళీలు ఆడుతున్నా, వీధి మలుపు మీదే వాడి దృష్టి. కుడిచేతి చూపుడు వేలుని
ఎడమచేతి చూపుడు వేలుతో పూర్తిగా వెనక్కి లాగి, ఆరు జానలవతలున్న నీలం రంగు గోళీ మీదకి తన
పసుపురంగు గోళీని గురిచూస్తున్నా, వాడి చెవులిక్కడ లేవు. అక్క ఫియట్ కారు హార్న్ చప్పుడు వినడం
కోసం ఎదురు చూస్తున్నవి. వాడి దృష్టి నీలం రంగు గోళీ మీదున్నా, పక్కన చెవిపోగు గాడి చెమట కంపు
నాసికల ద్వారా అందుతున్నా, అక్క పూసుకునే కునేగా సెంటుతో వాడి బుర్ర నిండిపోయింది. వాడి దృష్టికిప్పుడు అక్క కనబడుతోంది!

వాడి కుడి భుజం మీద చెలికాడి అరిచేయి స్పర్శ వాడికి అక్క నునువెచ్చని స్పర్శనే గుర్తుచేస్తోంది. కుడిచేతి
బొటనవేలు నెమ్మదిగా, మెత్తగా అప్పుడే మొలుస్తున్న గడ్డి మొలకల మధ్య నుండి చల్లగా ఉన్న ఆ నేలలోకి
దిగబడుతోంది. ఇక చూపుడి వేలుకున్న గోళీకాయ విడివడడమే ఆలస్యం. నీలం రంగు గోళీకాయ పగిలిపోవాలి. వాడి ఏకాగ్రత అంతా దానిమీదే ఉంది. వాడి సావాసగాళ్ల కళ్లన్నీ కూడా వాడి చూపుడువేలుకి ఉన్న పసుపురంగు గోళీకాయ మీదే ఉన్నాయి. పగులుద్దా! వాళ్లందరూ ఊపిరి ఆపి బిగబట్టి చూస్తున్నారు.

వాడి ఎడమ చూపుడు వేలుతో నెమ్మదిగా కుడిచేతి చూపుడువేలు అంచుకు లాగుతున్నాడు. నేలలోకి పాతుకుపోయిన బొటనవేలు పూర్తిగా సాగిపోయింది. బొటనవేలు, చూపుడువేలు మధ్యనున్న కండ తెగుతుందా అన్నట్టుగా సాగింది.ఇక అయిపోయింది. నీలిరంగు గోళీకాయ పగిలిపోవడం తప్పదు! అక్క నవ్వు వినపడిన తరువాత వెనక్కి లాగిన చూపుడు వేలుని వదిలాడా, లేక నీలిరంగు గోళీకాయలో అక్క నవ్వు కనపడిన తరువాత వదిలాడా అన్నది వాడికిప్పటికీ తెలియదు. ఏదైతేనేం ఆ నీలిరంగు గోళీకాయ పగిలిపోలేదు. గోడకి తగిలి మరో యాభై జానల అవతల ప్లాట్‌ఫాం అంచునుండి కిందకి జారనా వద్దా అన్నట్టు వూగి, రోడ్డుమీదకి జారిపడిపోయింది.

అప్పుడు వినపడింది ఫియట్ కార్ హార్న్ వాడికి. కారు మలుపు తిరుగుతోంది. వెనక సీట్లో అక్క కనపడుతోంది.
బావగారికి డ్రైవర్ అడ్డంగా ఉన్నాడు. ఆయన సరిగ్గా కనపడ్డం లేదు. అటుపక్కనే ఉన్న చెవిపోగులు గాడిని,
ఇటువైపున్న గద్దముక్కుని తోసేసి ఉరుకు. లాగు నడుంపైకి లాక్కుంటూ ఉరుకు. ఇంటిగేటు వైపుకు
కారుకి ఎదురుగా ఉరుకు. కారు ఇంకా ఆగలేదు. వెనక తలుపు తెరుస్తూ తనవైపుకి లాక్కున్నాడు. అక్క
ముఖం నిండా నవ్వు. వాడి మొఖం నిండా నవ్వు. అక్క మీదకి దూకి. రెండు చేతులు అక్క మెడ చుట్టూ
వేసేశాడు. అక్క వాడిని వాటేసుకుని, హత్తుకుంది. వాడికి ఆ క్షణంలో ప్రపంచం గుర్తులేదు. వాడికి అక్కే
ప్రపంచం అయిపోయింది.

అక్క కదిలింది. వాడు కదిలాడు. అక్క కుడిపాదం జాపి నెమ్మదిగా కారులోంచి దిగింది. ఈలోపు అలికిడికి అమ్మ
బయట వసారాలోకి వచ్చింది. అక్కని కుడిచెయ్యి పట్టుకుని దాదాపుగా లాక్కుంటూ తీసుకువెళుతున్నాడు వాడు.అక్కను చూస్తున్న ఆనందంతో అమ్మ మొహం విప్పారింది. వెనక వస్తున్న బావగారిని చూసి పలకరింపుగానవ్వింది. వసారాలో గుమ్మం పక్కనే చెప్పులు విడిచింది అక్క. ఆమె కుడిచేతిని వాడు ఇంకా వదల్లేదు. అమ్మలోపల హాలులోకి వెళ్లింది. బావగారు కూడా వసారాలోకి వచ్చి, అక్క విడిచిన చెప్పుల పక్కనే తన చెప్పులు విడిచారు.

హాలు లోపలికి అక్క వెనకే అడుగులు వేశారు. హాలులో ఎడమచేతి వైపు విడిగా ఉన్న సోఫాలో బావగారు
కూర్చున్నారు. ఆయన పక్కనే ఉన్న చిన్న మోడా మీద కూర్చుంది. అక్క ఒడిలోకి జారిపోయాడు వాడు. డ్రైవరు హాలులోపల గుమ్మానికి కుడిపక్కన గోడపక్కనే సూటుకేసులని నిలబెట్టాడు. ఈలోపు పనిమనిషి స్టీలు ట్రేలో రెండు గాజు గ్లాసుల నిండా మంచినీళ్లు తెచ్చింది. బావగారు ఒక గ్లాసు అందుకున్నారు. వాడు ఆ రెండో గ్లాసుని అందుకుని అక్కకి ఇచ్చాడు. హాలులో గుమ్మం పక్కనే పొట్టి టేకు బల్లమీద నల్ల ఫోను అందుకుని అమ్మ ఫోను చేసింది నాన్నగారికి… ‘‘అమ్మాయి, అల్లుడుగారు వచ్చేశారు, తొందరగా వచ్చేయండి’’ అంటూ.

సూటుకేసులు అవీ పాప గదిలో పెట్టమని పనిపిల్లని పురమాయిస్తూ వచ్చిన జంటని స్నానం చేసి బట్టలు
మార్చుకోండి అని చెబుతూ నాన్నగారికి వారి రాకని తెలియజేశానని తొందరగా వచ్చేస్తారని అక్కకి చెప్పింది అమ్మ. వాడుఅక్కతో పాటు పడకగదిలోకి వెళ్లాడు. ఒక పక్కగా చిన్న బల్లమీద పెట్టి ఉన్నవి సూట్‌కేసులు. ఆ బల్ల పక్కనే రెండు టేకుతో చేసిన కుర్చీలు. సూట్‌కేసుని తెరిచింది అక్క. బట్టలపైనే ఉందది. కపిల వర్ణం కాగితంతో
ఉన్న చిన్న కట్ట. తెల్లని టై్వన్ దారంతో భద్రంగా కట్టారు. పక్కనే తనని ఆనుకుని నిలబడ్డ తమ్ముడికి
ఇచ్చింది అక్క. రెండు చేతులతో దానిని అందుకున్నాడు. పక్కనే ఉన్న కుర్చీమీద కూర్చుని దాని ముడి విప్పాడు.

లోపల రంగు రంగుల బొమ్మలతో అందంగా ఉన్న పుస్తకాలు. జానపద కథలు, కొన్ని విజ్ఞానానికి సంబంధించినవి.  పిల్లల గేయాలు. వాడి కళ్లల్లో ఆనందం చూసి అక్క మురుసుకుంది. కొద్దిగా వంగి, వాడి చెంపలని తన రెండు అరచేతుల మధ్య పట్టుకుని వాడి తలని తన ఒడిలోకి లాక్కుని గట్టిగా, చప్పుడు చేస్తూ వాడి నుదుటిమీద ముద్దుపెట్టుకుంది. అటుపక్కన తన సూట్‌కేసులో బట్టలు తీసుకుంటున్న బావగారు వాళ్లిద్దర్ని చూస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. క్రీగంటన అది చూసి వాడు సిగ్గుపడ్డాడు. గారంగా భుజాలూపుతూ వాడు అక్క ఒడిలోకి మరింతగా ఒదిగిపోయాడు. వీపు మీదకి చేతులు జార్చి చప్పుడయ్యేట్టు చరిచి వాడిని పక్కకి నెట్టేసింది అక్క.

అక్క, బావగారు ఒక వారం రోజులున్నారు. ఒకరోజు హాలులో భోజనాలు. ఒక సాయంత్రం బతికిన కాలేజీ. మరో
రోజు హోటల్లో. ఒకపూట అక్క చదువుకున్న స్కూలు. మరోరోజు ఉదయం వరండాలో పిట్టగోడమీద కూర్చుని
టిఫిన్లు. ఇంకో రోజు డాబామీద వెన్నెల రాత్రిలో భోజనాలు. అక్కతో కనీసం ఒక ముద్దన్నా పెట్టించుకోనిదే భోజనాల తరువాత చెయ్యి కడిగేవాడు కాదు. మరొకపూట ఉద్యానవనం. ఉయ్యాలలో అక్కతో పోటీ. బావగారితో సినిమాలు, షికార్లు.ఆ వారం రోజులు పండగే వాడికి.

ఆగమని అంటూ తుర్రుమని ఇంట్లోకి పరుగెత్తాడు. తన మేజా మీదనున్న లెక్కల నోటు పుస్తకం తెరిచి పేజీలు
తిరగేశాడు. మెరుస్తూ కనపడిందది. వాడి బెస్టుఫ్రెండ్ వాడి కోసం ఇచ్చిందది. దాన్ని జాగ్రత్తగా పట్టుకుని
మళ్లీ రివ్వున పరిగెత్తుకుంటూ కారు దగ్గిరకి వచ్చాడు. అక్కని చెయ్యి చాపమని అడిగాడు. కారు తలుపులో
నుంచి కుడిచేతిని చాపింది. అరచెయ్యి తెరిచి ఉంది.

నెమ్మదిగా అక్క అరచేతిలోకి జార్చాడు దానిని. మృదువుగా, మెత్తగా వాడి ప్రేమంత మధురంగా ఉంది ఆ నెమలిపింఛం. అందుకుంది అక్క. కళ్లు చెమర్చాయి. అమ్మ పక్కకి తిరిగి చీరకొంగుతో కళ్లు వత్తుకుంది. గేటు
దగ్గర నిలబడ్డ నాన్న కళ్లజోడు అద్దాలు కొంచెం మందమైనవి. ఆయన కళ్లు ఆ జోడులో నుంచి కనపడలేదు.
బావగారు చేతులూపారు. కారు కదిలింది. అక్క ఆయన భుజం మీదకి వాలిపోవడం కనపడింది. ఆయన ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశారు. బహుశా ఓదార్చుతున్నారేమో!

‘‘ఏమిటి ఇక్కడ నిలబడ్డావు?’’ అని అడుగుతూ అక్క ఆ నెమలిపింఛాన్ని చూసి చిరునవ్వుతో, ‘‘నువ్వు
ఇచ్చిందే. బావగారు ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు’’ అంటూ సోఫా వైపుకు దారితీసింది. వాడికోసం టీతో పాటు కొన్ని
చేగోడీలు, చక్కిడాలు, పంచదార గవ్వలు ఉన్న పింగాణి పళ్లెం తెచ్చి సోఫా ముందున్న గాజు టేబుల్ మీద
పెట్టింది. అక్కకి మాత్రమే కాదు తనంటే ప్రేమ. బావగారికి కూడా తనంటే ఎంతో ఇష్టం అని మురుసుకున్నాడు.
ఎప్పుడెప్పుడా రాలిపోదాం అని చూస్తున్న కన్నీళ్లని అక్క చూడకుండా ఒడుపుగా అరచేతుల్తో గబుక్కున
తుడిచేసుకున్నాడు.

లోపలెక్కడో ఉన్న కుక్క మళ్లీ నెమ్మదిగా గారంగా మొరుగుతోంది. సోఫాలోకి కూలబడి, తలవంచుకునే తన చదువుగురించి, ఉద్యోగంలో ఇంటర్వ్యూ కోసం వచ్చిన సంస్థ గురించి, ఉద్యోగం ప్రాముఖ్యత గురించి చెబుతూ అక్క గుర్తుచేసినప్పుడల్లా ఒక గవ్వో, చేగోడో, చక్కిడమో అందుకుని తింటూ, ఇక చాలన్నట్టుగా మంచినీళ్లు
అందుకుని తాగాడు. టీ కప్పున్న సాసర్‌ని అందుకున్నాడు కుడిచేతితో. ఎడమచేతితో సాసర్‌ని పట్టుకుని
కుడిచేతితో కప్పు చెవిని చూపుడువేలు, బొటన వేళ్ల మధ్య పట్టుకుని పెదవుల దగ్గరికి తీసుకువెళ్లాడు
నెమ్మదిగా. పెదవులకి ఆనించి, ఒక గుక్క జాగ్రత్తగా నోట్లోకి లాగాడు చప్పుడుచేయకుండా. కాలలేదు. తనకి
సరిపోయే వేడితోనే ఉందా టీ. పంచదార కూడా సరిపోయింది. అక్క టీ చెయ్యడంలో మార్పేమీ లేదు. అప్పుడు తలెత్తి అక్కని చూశాడు. దేవత.

ఫోను మోగింది. బావగారేమో? అక్క లేచి వెళ్లి ఫోనులో ఏదో మాట్లాడుతోంది. టీని మరో గుటక వేశాడు. అక్క కలిపిన టీ. ఎంత బాగుందో. నెమ్మదిగా గొంతులో నుంచి జారుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో! అక్క తనకోసం చేసింది.  అక్కకి తనమీద ప్రేమ తగ్గలేదు. పనిమనిషిని చెయ్యనివ్వలేదు. తనే చేసి తనే తీసుకువచ్చి ఇచ్చింది. అక్కకి తనమీద ప్రేమ ఏమీ తగ్గలేదు. లోపలి నుంచి ఇందాక ఫొటోలో చూసిన పాప సుడిగాలిలా గదిలోకి వచ్చింది. తెల్ల రంగు ఫ్రాక్. ఎర్రని అంచులతో. బొద్దుగా, ఆరోగ్యంగా చక్కగా ఉంది. హాలులో ఎవరో కొత్తమనిషి ఉన్నారన్నది గుర్తించింది. ఒక్క క్షణం. అలా అక్కడే ఆగిపోయింది. ‘‘ఎవరో గుర్తుపట్టావా?’’ అని అక్క పాపని అడిగితే, లేదంటూ అడ్డంగా, కొంచెం విసురుగానే తలని తిప్పినట్టుంది. అక్క నవ్వుతూ, ‘గుర్తుతెచ్చుకో’ అంటోంది.

ముందుకు వంగి గాజు టేబుల్‌మీద టీకప్పుని అందుకుని, అక్క ఎంతో ప్రేమగా తనకోసం చేసిన టీ మరో గుటక
వేసుకోవడానికి నోట్లోకి వంపుకున్నాడు. అది గొంతులోకి జారి అక్కడి నుంచి నెమ్మదిగా, అతి నెమ్మదిగా అతని
గుండెల్లోకి ఆమె ప్రేమని వొంచి నింపుకుంటున్నాడు. పాప అప్పుడు గమనించినట్టుంది అతను టీ తాగడం.
అక్కవైపు చూస్తూ, ‘‘టామీకి పాలు లేవు మమ్మీ. చూశావా?’’ అని అడుగుతూ, కొత్తగా కనబడుతున్న
అతనివైపు చూసింది.

పాప దృష్టి ఇప్పుడు అతని చేతిలోని టీ కప్పు మీద పడింది. ఆ మరుక్షణం ఆ కళ్లలో ఒక వెలుగు. ఒక
మెరుపు. తనకి అర్థమై తెలిసిపోయిందన్న అమాయకపు గర్వంతో కూడిన వెలుగు. ఒక్క క్షణమే ఆ మెరుపు.
అప్పుడు ఆ కళ్లలోని అర్థమైన మెరుపుని ఆ ‘పక్కింటి’ తమ్ముడు ఎప్పటికీ మరిచిపోడు. ‘‘మమ్మీ, టామీ పాలతో టీ కలిపిచ్చావా? చీ యాఖ్… ఆ పాలు కుక్కకోసం ఉంచినవి’’ అంటూ ప్రపంచంలోని అసహ్యాన్నంతా ఆ పదాలలోకి ఒంపి, నింపి బయటకు విసిరేసింది.

ఈ కథ , సాక్షి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం ఫన్‌డే జూన్ 21, 2015 లో ప్రచురితం.

కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’

అదితి - aditi - telugu short story by Anil Atluri

మొన్న అంటే మార్చ్ పదిహేనో తారీఖున, ఆంధ్రజ్యోతివారి ఆదివారం అనుబంధం లో, నేను తెలుగులో వ్రాసుకున్న కథని తొలిసారిగా ప్రచురించారు.  దాని పేరు అదితి.  మీరు అదితి చదవకపోతే ఇక్కడ చదువుకోవచ్చు.

ఆ కథ మీద పాఠకులనుండి వచ్చిన స్పందనల గురించి ఈ టపా.ఈ స్పందనలను ఇక్కడ నమోదు చెయ్యడానికి ప్రేరణ వి వి న మూర్తి గారు తమ కథ “ఒక రేపిస్టు ప్రేమలేఖ” (ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం – ఫిబ్రవరి 1,2015, ప్రచురణ) మీద ఫేస్‌బుక్‌లోని కథ సమూహంలో వారికి వచ్చిన స్పందనలని పంచుకోవడమే.  అలాగని వారితో కాని మరెవ్వరితోకాని నన్ను కాని నా రచనలని కాని నేను పోల్చుకోవడం లేదు.

మరొక ముఖ్యమైన కారణం –  భవిష్యత్తులో ఈ అదితి గురించి పాఠకులు నాకు చేరవేసిన తమ అభిప్రాయాలు వ్రాసుకున్న ఈ కొన్ని, నా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.  కథ చదువుకున్న తరువాత మీరు ముందుకు సాగితే బాగుంటుందని నా అభిప్రాయం.  కథ చదవకుండా దానిమీద పాఠకుల స్పందన తెలుసుకున్న తరువాత కథ చదివితే మీ అభిప్రాయంలో మార్పుకి అవకాశం ఉండవచ్చు.  ఉండకపోనూవచ్చు.

ఈ పాఠకుల స్పందనలకి గణాంకాలు కాని సంఖ్యాక వివరాలు కాని లేవు.  జ్ఞాపకం ఉన్నంతమేరకు ఇక్కడ పంచుకుంటున్నాను. గమనించగలరు.  ఫోన్లు చేసిన పాఠకుల పేర్లు నేను అడగలేదు.  వారి ఏ ఊరు నుంచి చేస్తున్నారన్నది తెలుసుకోవడానికి మాత్రమే వారి ఊరి పేరు అడిగాను.

అదితి ని స్త్రీలూ పురుషులు ఇద్దరూ చదివారు.  ఫోన్లు చేసారు, ఎస్ ఎమ్ ఎస్ లు పంపారు.  చాట్ లో చెప్పారు.

ఫోన్లు చేసిన వారి సంఖ్యని నేను మొదట్లో లెఖ్ఖ పెట్టడానికి ప్రయత్నించాను కాని తరువాత విరమించుకున్నాను, నాకు అంత ఓపికాలేదు, ఆ ఆసక్తి లేకుండా పోయింది. ఉజ్జాయింపుగా ఒక అంచనా అయితే ఉంది.

అదితి కథ చదివిన తరువాత, నా గురించి తెలిసిన వారు, నా గురించి విన్నవారు చాలా ఆసక్తిగా అడిగిన ప్రశ్న.  “ఇదేనా మీరు వ్రాసిన తొలి కథ?” అని. ముఖ్యంగా సాహిత్యకారులు.  రచయితలు, కొంత మంది సంపాదకులు కూడా.  ఆ ప్రశ్నని నేను అసలు ఎదురుచూడలేదు.  బహుశ నన్ను నేను ఆ కోణంలోనుంచి (ఒక తెలుగు రచయితగా) చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ కలగలేదు. అందుకనేమో మరి!

ఇక వారి ప్రశ్నకి జవాబు;
తెలుగులో నేను వ్రాసిన కథలలో ఆఫ్‌లైన్‌లో అంటే (అచ్చు) పత్రికలలో ప్రచురణకి నోచుకున్న తొలి కథ ఇదే.

 పోతే ఇందాక అనుకున్న పాఠకులలో రచయితలు, సంపాదకులూ ఉన్నారన్నాను కదా!  వారందరి ఏకాభిప్రాయం: “ఇది మీ తొలికథ లాగా లేదు.”

గోక్కోవడం
“దురద” ని మెచ్చని వారు కూడా ఉన్నారు.  కనీసం ముగ్గురున్నారు.  ఒకరు స్వయంగా నాకు తన అభిప్రాయం తెలియజేస్తే మరొకరు ఫేస్‌బుక్‌ కథ సమూహంలో ఆ మాటలే కాకున్న అటువంటి అర్ధం వచ్చే మాటలే వాడారు.  ఒకరు సందేశం పంపారు.

అదితి - aditi - telugu short story by Anil Atluri
అదితి కథలో లంకేష్
ఒకరిద్దరు “శిల్పాన్ని ఇంకా చక్కగా engineer చేసి ఉంటే బాగుండేది,” అన్నవారున్నారు. కథని గతం – వర్తమానం మధ్య నడిపిస్తూ “మీరు కొత్తగా ఏమి  చేసారు?” అని నిలదీసినవారున్నారు.  అడిగిన వారికి నా అప్రకటిత (కనీసం వారి దృష్టిలో) రచనా సామర్థ్యం మీద వారికున్న నమ్మకానికి ఆశ్చర్యమేసింది.
శైలిని కూడ దాదాపు అందరూ మెచ్చుకున్నారు.  భాష విషయానికి వస్తే, “మరి అంత ఇంగ్లిష్ అవసరమా?” అని అడిగినవారు కూడా ఉన్నారు.  “మీరు ఎన్నుకున్న నేపధ్యానికి మీరు వాడిన బాషే సరిపోయింది,” అని మెచ్చుకున్నవారున్నారు.

దాదాపు అందరూ “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” అని చెప్పారు.

మీ కథని తెలుగు పాఠకులు మెచ్చుకోవడం అనుమానమే,” అని అభిప్రాయాన్ని వెల్లడించిన ఇద్దరు పాఠకులు రచయితలే!  వారిద్దరూ నా శ్రేయోభిలాషులే.

“మీ ఈ కథలని తెలుగు పాఠకులు అందుకోలేరండి.  తొందరగా మీ కథలని కూడా నాకివ్వండి.  అనువదిస్తాను,” అని అంటే ముక్కున వేలేసుకోవడం నా వంతైయ్యింది.

కాస్త చదువుకున్నవారు ( సాహిత్యం ), లోకజ్ఞానమున్నవారు కథ ముగింపుని హర్షించలేదు.  సైకోసొమాటిక్ డిజార్డర్ అని మీరు చెప్పకపోయినా అది పాఠకులకి అర్ధం ఆయ్యేది అని వారు అభిప్రాయపడ్దారు.  వీరందరూ పట్టణ ప్రాంతాలలో జీవిస్తున్న విద్యాధికులే! రచయితలందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
కథకి పాత్ర పేరు అదితి కాకుండా మరోక మకుటం పెట్టిఉంటే బాగుండేది అన్నపాఠక, సంపాదక వర్గ,  రచయితలున్నారు.
  • అదితి కథ అర్ధం కాలేదు అని సందేశాలు పంపినవారు ఇద్దరు.
  • బోర్ కొట్టిందని సందేశం పంపుతూ “ఇంకా మంచి కథలుమీరు వ్రాయలి!” అని ప్రోత్సహించిన వారు ఒకరు.
  • సైకోసొమాటిక్ డిజార్డర్ అనే లక్షణం నిజంగా ఉందా అని అడిగిన వారు కొందరు.
  • దాదాపు ఒక పదిమంది దాకా తమ కుటుంబంలోనో , స్నేహితులలోనే ఇటువంటివి చూసినవారున్నారు.  వివరంగా నాతో వారి అనుభవాన్ని పంచుకున్నారు.
  • అదితి చదివిన తరువాత ఆ దురద లాంటి ఇతర అలవాట్లని గుర్తించిన పాఠకులు కథని విపరీతంగా  మెచ్చుకున్నారు.

అదితి  ఒక ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టింది.  కుటుంబ సమస్యలకి నన్ను పరిష్కారం కోరుతూ పాఠకులు ఫోను చేసారు.  మరీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య వచ్చిన అవగాహానాలేమి.  ఫోన్లు  చేసిన వారందరూ స్త్రీలే!

పాత్రల పేర్లు మీద కూడా స్పందించారు.  “ఆ పేర్లు ఏమిటి?  అన్ని కృతకంగా ఉన్నాయి!  ఆ భాష ఏంటి?” అని అన్నవారు కూడా ఉన్నారు.

ఈ టపా సమయానికి ప్రవాసాంధ్ర పాఠకులెవరి స్పందనా నాకు అందలేదు.
కథలతో పాటు రచయిత ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రచురణకర్తలకు అభిప్రాయాలు అందటం లేదట!
– ౦ –
నా పరిశీలనలోనూ, నా అధ్యయనంలో తెలిసిన రెండు ముఖ్యమైన విషయాలు చెప్తాను.
1 – స్థూలంగా 40ల లోపున్న వారికి ఈ కథ అంతగా నచ్చలేదు.
2 – 40 లు దాటిన వారందరికీ ఈ కథ చాలా బాగా నచ్చింది.
3 – ఈ నలభైలలోపు ఉన్నవారికి ఈ కథ:
శోభన్ బాబు లాంటి పల్లెటూరి మొగుడు, పట్నం పెళ్లాం, కొత్త దేవత లాంటి భార్య ఇందులో కొత్తేముంది?” అని అడిగినవారు ఉన్నారు.  మరో అడుగు ముందుకేసి ఇల్లాలు సినిమా కి మీ కథకి పెద్ద తేడా ఏముంది అనికూడా అడిగేసారు. 🙂
4 – లంకేష్ ఒక “చచ్చెధవ, సౌమ్య భలే పని చేసింది,” అని ఆ పాత్రని మెచ్చుకున్న స్త్రీ లు కూడా ఉన్నారు.  🙂

ఫేస్ బుక్ కథ సమూహంలో కథని పంచుకున్న సాయి పద్మ కి, సోదరుడు అట్లూరి శ్రీ కి, అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ , వ్యవస్థాపక అధ్యక్షులు రాష్త్ర కధానిలయం, నందలూరు వారికి మప్పిదాలు.ఇక ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం సంపాదక వర్గం సభ్యులకి, బొమ్మలు వేసిన అక్బర్ గారికి నా నెనర్లు.

గమనిక

  • ఈ కథని ఏ ఒక్క పత్రికనో దాని పాఠకులనో దృష్టిలో ఉంచుకుని వ్రాసింది కాదు.  కథని వ్రాసుకున్న తరువాత ఒకే ఒకరితో పంచుకున్నాను.  వారి అభిప్రాయాన్ని విన్నాను.  ఆ అభిప్రాయంతో నా కథలో మార్పులు చేర్పులు చెయ్యలేదు.  అది వారి అభిప్రాయంగానే తీసుకున్నాను.    అంతే.
  • ఈ కథకి నేపధ్యం ఉందా అంటే ఉంది.
    ఒకటి అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొకరు “మీరే వ్రాసారా?  ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చింది.  అంతేకాదు మరొక distant cousin కూడా ఎక్కడో “…వ్రాసేవాళ్ళెవరూ లేరు నేను తప్ప,” అని అంటే అది గుచ్చుకుంది.  అప్పుడు వ్రాసుకున్న కథలలో ఇది ఒకటి.  అందుకోసమే వ్రాసిన దాన్ని ప్రచురణకి పంపాను.  నాకు కోపం తెప్పించిన వారిద్దరికి కూడ మప్పిదాలు. 🙂 రెండు నా దృష్టికి వచ్చిన కొన్ని అనుభవాలని ఏర్చి కూర్చి ఒక కథగా మలిచాను.  ఆ అనుభవాలు కూదా దాదాపుగా మూడు దశాబ్దాలమేరా విస్తరించిన అనుభవాల సమాహారం.

మురుగన్ ‘తలుగు’ విదిలించుకున్నాడు!

vedika - a literary meet
మొన్న అంటే ఫిభ్రవరి 8 తారీఖున, ఆదివారం రోజు  లా మకాన్‌ లో ఉదయం ఒక సాహిత్య కార్యక్రమం జరిగింది.  ఆ కార్యక్రమంలో ఒక అంశం తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ (రచయిత గా నేను చచ్చిపొయ్యాను అని ప్రకటింఛిన రచయిత) కి సంఘీభావం తెలియజేయటం. రెండవ అంశం కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్, జనవరి 2015 లో ప్రచురించుకున్న తన కథ “తలుగు” కథా పఠనం.  మూడవ అంశం యువ కథకులు – కథన రీతులు మీద డాక్టర్ ఏ కే ప్రభాకర్ విశ్లేషణ.
Battula Ramadevi
బత్తుల రమాసుందరి – సాహిత్యాభిమాని, కార్యకర్త
మొదటి అంశం:
రచయిత్రి బత్తుల రమాసుందరి ,  తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ని పరిచయం చేస్తూ, ఆ రచయిత ప్రకటనకి నేపధ్యం, ఆ రచయితకి ఎందుకు సంఘీభావం తెలియచేయాలి అన్ని దాన్ని మీద కూలంకషంగానే అయినా తనకున్న పరిమితులలో, ఆ రచన గురించి పరిచయం చేస్తూ, ఆ రచన పుర్పాపరాలను విశదీకరిస్తూ, ప్రస్తుత సమాజం ఆ రచయితకి నైతిక మద్దతునివ్వాల్సిన అవసరం మీద తన దృకద్పం గురించి సమగ్రంగానే మాట్లాడారు.  బహూశ ఆ సభకు వచ్చినవాళ్ళలో ఆమె తప్పితే పెరుమాళ్ మురుగన్ రచనలు చదివిన వారున్నారని అనుకోను.  నాతో సహా! తమిళ భాష చదవడం వచ్చి ఉండదు కాబట్టి!  అలాగే ఇంగ్లిష్ అనువాదం ఉన్నా కొని చదివివుంటారా అంటే అదీ అనుమానమే!

మూడో అంశం ఇది: యువ కథకులు – కథనరీతులు.
ఫేస్‌బుక్‌లో కథ కోసం ఏర్పడిన ఒక సమూహం (గ్రూప్) ఉంది.  ఆ సమూహం ఒక కథల పోటిని నిర్వహించింది.  ఆ కథలలో కొన్నింటిని ఎన్నుకుని “యువకథకులు – కథన రీతులు” అనే అంశం ప్రాతిపదికగా సాహితీవేత్త డా. ఏ కే ప్రభాకర్ ని విశ్లేషించమన్నారు.  పదకొండు గంటలకు మొదలుపెట్టాల్సిన సమావేశం దాదాపు పన్నెండు గంటలకు మొదలవ్వడంలో ప్రభాకర్ కూడ తనకిచ్చిన యువ కథకులు – కథనరీతులు ని కుదించుకోవాల్సి వచ్చింది.సూచన ఆ నాటి కార్యక్రమ నిర్వాహకులు ఆయన విశ్లేషణ‌ని ఎక్కడన్నా పదిమందికి అందుబాటులో ఉండేవిధంగా పొందు పరిస్తే బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆయా రచయితలకి. ఇది ఒక సూచన మాత్రమే సుమా!

మరొక విషయం.
కథ మీద రచయితలకోసం వేదిక ద్వారా చేయదలుచుకున్న ఒకానొక కార్యక్రమం గురించి ఒక ప్రకటన చేద్దాం అని అనుకున్నాను.  కార్యక్రమ నిర్వాహకుల అనుమతి కూడా తీసుకున్నాను.

ఇక పోతే ప్రభాకర్ “యువ కథకులు – కథనరీతులు” విశ్లేషిస్తూ కొన్ని వాఖ్యలు చేసారు. వాటిల్లో ఒక విషయం గురించి మాత్రమే మీతో ప్రస్తావించుదామని అనుకున్నాను.
Dr A K Prabhakar
డా ఏ కే ప్రభాకర్ – సాహిత్య విశ్లేషకులు – “సమకాలీనం” రచయిత

వేగం
కథనంలో కథకులలో వేగం. అది  వాసి కావచ్చు. రాశి కావచ్చు.  “రహదారి మీద టూ వీలర్ మీదో, ఫోర్ వీలర్ మీద మనం వెడుతున్నప్పుడు మన భుజాల్ని దాదాపుగా తాకుతు, అత్యంత వేగంగా మనముందు నుంచి దూసుకువెళ్ళే క్షణం లో ఒక “ఝలక్” కి గురవుతాము చూసారా? ఒక క్షణం పాటు.  అది ఉంది ఈ యువ రచయితలలందరిలోను.  మంచిదే!  ఆ వేగం కూడ కావాలి.  ఆ దూసుకుపోయే తత్వం కూడా కావాలి.  అయితే  నా బోటి వాడికి భయం కూడా వేస్తుంది!   ఎందుకంటే అంత వేగంతో వెళ్తున్నప్పుడు ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది.  అద్భుతమైన రచనలు చెయ్యాల్సిన ఔత్సాహిక రచయిత వేగంగా వెడుతున్నప్పుడు కొన్ని అంశాలని గుర్తించలేకపోవచ్చు.  (శిల్పం, కథనం, వస్తువు, భాష రచనకు సంబంధించిన తదితర విషయాలు).  తద్వారా ఒక గొప్ప రచయితని మనం కోల్పోయే అవకాశం ఉంది!”

ఇవన్ని నా మాటల్లో డా. ప్రభాకర్ ఏ కె గారి అభిప్రాయాలు.  నా మాటల్లో కాబట్టి నేను అర్ధం చేసుకుని, వాటిని మీకందించే క్రమంలో పొరబాట్లు జరిగే అవకాశం ఉంది.  కాబట్టి వీటిల్లో ఈకలు వెతికి పీక్కోవద్దు.

రెండవ అంశం

talugu - a short story in Telugu by Vempalli Sheriff
‘తలుగు’  కథ రచన: వేంపల్లి షరిఫ్

కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్ కథ తలుగు పఠన కార్యక్రమం ముందు అనుకున్న పద్దతిలో కాకుండా ఒక రెండు ముందు మాటలు.. కథనుండి కొన్ని ముఖ్యమైన పేరాగ్రాఫులని ప్రముఖ కథా రచయిత, చలనచిత్ర సంభాషణల కర్త అరిపిరాల సత్యప్రసాద్ చదివి వినిపించడంతో ఆ సమావేశం ముగిసింది.

కాకపోతే ఆ సభలో కథ గురించి వేదిక చేయనున్న ఒకానొక కార్యాక్రమం గురించి వచ్చిన సభికులకు ఒక ప్రకటన చేద్దామనుకుంటే కారణాలేమైనా ఆ ప్రకటన చెయ్యలేకపోయ్యాను.

*   *   *

వేదిక
అదే రోజు సాయంత్రం ఆలంబన లో ప్రతి నెల రెండవ ఆదివారం సాయంత్రం 4.30 నుండు 6.30 మధ్య జరగుతున్న సాహిత్య సమావేశం ఈ సారి పూర్తిగా చంద్రశేఖర ఆజాద్ కథ నీళ్ళు – రక్తం కే సరిపోయింది.
దాదాపు ఏడున్నర దాకా సాహిత్య ప్రేమికులందరూ ఆ ఒక్క కథ మీదే చర్చని కొనసాగించాvedika - a literary meetరు.

ఏతా వాత తేలిందేమంటే…రచయత అన్నట్టు “మనం వినే సామెతలు, సూక్తులు, పాక్షిక సత్యాలు.  ఆయా సందర్భాలకు వర్తిస్తాయంతే.”

నేను పరిచయం చేద్దామనుకు ఝంపా లహరి కథ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది.  🙂

ఆ రోజు సాయంత్రం సమావేశానికి వచ్చిన వారిలో ప్రధములు వేమూరి సత్యం గారు.  గతంలో స్వాతి మాస పత్రిక ప్రారంభంలో  70 – 73 వరకూ సంపాదక శాఖలోను, నిర్వాహణ శాఖలోను పాలుపంచుకుని, 73 నుండి దాదాపు తొమ్మిదేళ్ళపాటు జ్యోతి (కీ.శే వి రాఘవయ్య –  లీలావతి రాఘవయ్య గార్ల మాస పత్రిక) కి సహ-సంపాదకుడి గాను, ఆ తరువాత సినిమా రంగంలోనూ – ప్రొడక్షన్ డిజైనర్‌గాను, ఎక్జిక్యూటివ్ నిర్మాతగాను, స్టోరి డిస్కషన్స్, స్క్ర్రిన్‌ప్లే‌ రైటింగ్‌లలోనూ ఇంకా పలు బాధ్యతలను నిర్వహించిన సాహిత్యాభిమాని వేమురి సత్యం (సత్యనారాయణ) గారి మాట ఒకటి పంచుకుంటాను.

Protima Bedi
Time Pass – Memoirs of Protima Bedi

ఒకానొక సందర్భంలో ఆయన ప్రొతిమా బేడి (ప్రొతిమా గౌరి) తో ఒక భేటిలో “మీరు కబిర్ బేడి ( Sandokan / Octopussy fame) కి విడాకులిచ్చేసారు. అప్పుడు మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని ‘ఇదిగో ఈమే ప్రొతిమ.  మొగుడుకి విడాకులిచ్చేసి తిరుగుతున్నది’ అని వేలేత్తి చూపించి, దూషించి, విమర్శించి ఉంటుంది కదా!  మరి అప్పుడు ఆ విమర్శని మీరు ఏ విధంగా  ఎదుర్కొన్నారు? ” అని ప్రశ్నించారట.

దానికి ప్రొతిమ (గౌరి) బేడి జవాబు, “It is the business of society.  It would stop, point out something that catches its attention and then moves on.  It has other  businesses too on its agenda.  It happened the same with me too.  I knew it would raise it’s finger at me. It did and then it moved on to the next one.  It doesn’t bother me any more.

మళ్ళీ కలుద్దాం!

ఈ టపాలో సాహిత్యవేత్తల పుస్తకాలు కావాలంటే…
మీ దగ్గిర్లోఉన్న పుస్తకాల దుకాణం లో అడగండి.  లేవు అని అంటే తెప్పించి పెట్టమనండి.  కుదరదంటే ఇక్కడ ఇచ్చిన చిరునామాలలో సంప్రదించండి.

తలుగు కథ ప్రతులకు మీరు సంప్రదించవలసిన చిరునామా:

talugu - a short story in Telugu by Vempalli Sheriff
తలుగు కథ రచన: వేంపల్లి షరిఫ్

సూఫీ ప్రచురణలు, c/o: Sabina Parlapati, 6-3-2000,
3rd Floor, Prem Nagar,
Chinthalbasti, Khairatabad, Hyderabad 500 004
,
Mobile:  +91 96034 29666

ధర;  25.00 రూపాయలు

 

 

 

samakaleenam -
సమకాలీనం – కథా విమర్శ
డా . ప్రభాకర్

సమకాలీనం ప్రతులు ఇక్కడ కూడ దొరుకుతాయి.
Spruha Saahiti Samstha, 1-8-702/33/20A, Padma Colony, Nallakunta, Hyderabad 500044

రచయిత చిరునామా:
A.K Prabhakar,B 205,Solanki’s Gulmohar, Brahmanwada, Begumpet, Hyderabad 500016  Ph: 040 2776 1510.

వెల: 150 రూపాయలు

 

మొన్న సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హైద్రాబాద్‌కి వచ్చాడు

The Loneliness of Being
Rajesh Khanna
DARK STAR
ఇది ఇంగ్లిష్ పుస్తకం.

హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్.  ఈ పుస్తకానికి  #hydlitfestival కి  ఈ టపాకి ఏమిటి సంబంధం అని మీకు సందేహాలు రావడం ఆశ్చర్యం లేదు.  మద్రాసు.  అదే సంబంధం.  Chennai is a city, Madras is an emotion అదే జ్ఞాపకం వస్తోంది ఇప్పుడు.

దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు.  ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు.  వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి.  ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు.

చాలా సినిమాలు మద్రాసులో షూట్ చేసుకున్నారు బాంబే నిర్మాతలు.  వాటిలో ఒకటి.  హాతీ మేరే సాథి. నిర్మాత సాండో‘ చిన్నప్ప తేవర్. హాతీ మేరే సాథి లో నాయకుడు రాజు పాత్రధారి – రాజేష్ ఖన్నా. సినిమాలో హీరో ఉద్యోగం కోసం రోడ్లవెమ్మటపడతాడు.  అందులో భాగంగా పాండిబజార్‌ లో ఆ దృశ్యాలని చిత్రీకరించారు.  (ఆ పాండిబజారులోనే రాణి బుక్ సెంటర్ తెలుగు పుస్తకాల కొట్టు ఉండేది.  రాణి బుక్ సెంటర్‌ని స్థాపించింది  చౌదరాణి. రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు – చౌదరాణి నా తల్లితండ్రులు.  చౌదరాణి కవిరాజుత్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక.)  ఇక మా నాన్న అట్లూరి పిచ్చేశ్వరావు తొలి తెలుగు వెండితెర కథనాన్ని గ్రంధస్తం చేసినవారు.

హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి “ఉద్యోగం కావాలి, ఉందా?” అని అడిగితే, “లేదు పో,” పొమ్మనడం కూడ ఉంది. రాణి బుక్ సెంటర్ ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.

ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన రచయిత ఈ #hydlitfestival కి వస్తున్నాడు కదా అని వెళ్ళాను.

Gautam at hyd Lit festival jan26, 2015
రాజేష్ ఖన్నా డార్క్ స్టార్ రచయిత గౌతమ్ చింతామణి, ఉమా మగళ్, రచయిత రాఘవేందర్.

రచయిత ఎవరు?  కవిత చింతామణి పుత్రుడు.  కవిత ఎవరు?  కె. ఆరుద్ర రామలక్షి ల ప్రధమ పుత్రిక.  సరే, ఈ ఆరుద్ర, రామలక్షి‌ లు ఎవరు?  ( మీకు తెలియకపపోతే  గూగుల్ చెయ్యండి).  నా తల్లి తండ్రులకు స్నేహితులు. సాహితీ బంధువులు.  ఓహ్ రచయిత పేరు చెప్పలేదు కదూ!  అతని పేరు గౌతమ్ చింతామణి.

ఇవన్ని అతి ముఖ్యమైన కారణాలు నేను #hydlitfestival కి వెళ్లడానికి. జనవరి 23,24,25, 26 తారిఖులలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగం పేట లో జరిగింది ఈ హైద్రాబాద్ లిటరేచర్ ఫెస్టివల్.  పైన హెడర్ లో ఉంది ఆ పాఠశాల ప్రధాన భవంతి చిత్రమే!  అందులో 26 వ తేదిన టాటా రాక్‌ఫోర్ట్ సభాస్థలి వేదిక.  మధ్యాహ్నం Reams on Reels అనే శీర్షికమీద గౌతమ్ , ఎమ్. కె రాఘవేంద్ర లు చలనచిత్ర రంగం మీద తాము వ్రాసిన పుస్తకాలను గురించి సంచాలనకర్త ఉమ మగళ్ తో కలిసి వచ్చిన ఆహుతులతో పంచుకున్నారు.

ఇక పుస్తకం ఎలాగుంది?

ఇప్పటికే బాలివుడ్‌మీద రాస్తూ తనకుంటూ ఒక ఉనికిని ఏర్పరుచుకుంతున్న రచయిత గౌతమ్. నిబద్ధతతో చేసిన రచన ఇది.

సూపర్ స్టార్

Rajesh Khanna Superstar
The Loneliness of Being Rajesh Khanna Dark Star

→  రాజేష్ ఖన్నా ఎవరితో పడుకున్నాడు,
→  ఏ నిర్మాతని ఏడిపించాడు,
→  రోజుకుని ఎన్ని పెగ్గులు తాగేవాడు,
  పేక ఆడేవాడా?

లాంటి వ్యక్తిగత విషయాలూ, అతని జీవితంలోని వివాదాలు రాయలేదు. సూపర్‌స్టార్ రాజేష్‌ ఖన్నా గురించి అతని నటజీవితం గురించి మాత్రమే వ్రాసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే  ఈ గౌతమ్ చింతామణి తన మాతమహుల పేరు నిలబెట్టాడు.  అనవసరమైన వ్యక్తిగత వివాదాలలోకి వెళ్ళలేదు.  అయినా పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే మలి ముద్రణకి నోచుకుంది.  భారతీయ చలనచిత్ర రంగంలోని తొలి  “సూపర్ స్టార్” మీద వెలివడిన పుస్తకం ఇది.

The Loneliness of Being Rajesh Khanna  DARK STAR బాలివుడ్ మీద ఆసక్తి వున్నవాళ్ళు అందరూ చదవతగ్గ పుస్తకం.

1950 ప్రాంతలలో పుట్టిన వాళ్ళకి హింది సినిమా అభిమానులకు, ‘సూపర్ స్టార్’ రాజేష్ ఖన్నా ఫాన్‌లకు గొప్ప బహుమతి ఈ పుస్తకం.

ఈ పుస్తకం గురించి ఆంగ్ల పత్రికలలో వచ్చిన కొన్ని సమీక్షలు ఇక్కడున్నవి.
తెలుగులో ఈ పుస్తకం గురించి పూర్ణిమ వ్రాసిన పరిచయం ఇక్కడ  పుస్తకం డాట్ నెట్‌లో చదువుకోవచ్చు .
ప్రతులు – ఇక్కడ అమెజాన్ లోనూ ఫ్లిప్‌కార్ట్‌లో ఇక్కడ కొనుక్కోవచ్చు