త్రిపురనేని రామస్వామి, ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, ఐర్లాండ్ లో తన న్యాయశాస్త్ర విద్యాభ్యాస్యాన్ని 1917లో ముగించు కున్నారని నా పరిశోధనలో దొరికిన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఐతే ఆయన అదే సంవత్సరం నవంబర్ 11న భారతదేశ భూభాగం లో అడుగుపెట్టా రని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అది ఆయన బొంబాయికి చేరిన తేదినా, లేక తెనాలి లో అడుగుపెట్టిన తారీఖా అన్నది పరిశోధించి తెలుసుకోవాల్సి ఉంది. ఆయన ఆ రోజుకు అంగలూరు కూడా వెళ్లి ఉండవచ్చు.
ఏది ఏమైనప్పటికీ కవిరాజు మాతృదేశానికి తిరిగి వచ్చి ఈ నవంబరు 11కి, శతవసంతాలు నిండినట్టే.
మొన్న అంటే ఫిభ్రవరి 8 తారీఖున, ఆదివారం రోజు లా మకాన్లో ఉదయం ఒక సాహిత్య కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక అంశం తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ (రచయిత గా నేను చచ్చిపొయ్యాను అని ప్రకటింఛిన రచయిత) కి సంఘీభావం తెలియజేయటం. రెండవ అంశం కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్, జనవరి 2015 లో ప్రచురించుకున్న తన కథ “తలుగు” కథా పఠనం. మూడవ అంశం యువ కథకులు – కథన రీతులు మీద డాక్టర్ ఏ కే ప్రభాకర్విశ్లేషణ.
మొదటి అంశం:
రచయిత్రి బత్తుల రమాసుందరి , తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ని పరిచయం చేస్తూ, ఆ రచయిత ప్రకటనకి నేపధ్యం, ఆ రచయితకి ఎందుకు సంఘీభావం తెలియచేయాలి అన్ని దాన్ని మీద కూలంకషంగానే అయినా తనకున్న పరిమితులలో, ఆ రచన గురించి పరిచయం చేస్తూ, ఆ రచన పుర్పాపరాలను విశదీకరిస్తూ, ప్రస్తుత సమాజం ఆ రచయితకి నైతిక మద్దతునివ్వాల్సిన అవసరం మీద తన దృకద్పం గురించి సమగ్రంగానే మాట్లాడారు. బహూశ ఆ సభకు వచ్చినవాళ్ళలో ఆమె తప్పితే పెరుమాళ్ మురుగన్ రచనలు చదివిన వారున్నారని అనుకోను. నాతో సహా! తమిళ భాష చదవడం వచ్చి ఉండదు కాబట్టి! అలాగే ఇంగ్లిష్ అనువాదం ఉన్నా కొని చదివివుంటారా అంటే అదీ అనుమానమే!
మూడో అంశం ఇది: యువ కథకులు – కథనరీతులు.
ఫేస్‌బుక్‌లో కథ కోసం ఏర్పడిన ఒక సమూహం (గ్రూప్) ఉంది. ఆ సమూహం ఒక కథల పోటిని నిర్వహించింది. ఆ కథలలో కొన్నింటిని ఎన్నుకుని “యువకథకులు – కథన రీతులు” అనే అంశం ప్రాతిపదికగా సాహితీవేత్త డా. ఏ కే ప్రభాకర్ ని విశ్లేషించమన్నారు. పదకొండు గంటలకు మొదలుపెట్టాల్సిన సమావేశం దాదాపు పన్నెండు గంటలకు మొదలవ్వడంలో ప్రభాకర్ కూడ తనకిచ్చిన యువ కథకులు – కథనరీతులు ని కుదించుకోవాల్సి వచ్చింది.సూచన ఆ నాటి కార్యక్రమ నిర్వాహకులు ఆయన విశ్లేషణని ఎక్కడన్నా పదిమందికి అందుబాటులో ఉండేవిధంగా పొందు పరిస్తే బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆయా రచయితలకి. ఇది ఒక సూచన మాత్రమే సుమా!
మరొక విషయం. కథ మీద రచయితలకోసం వేదికద్వారా చేయదలుచుకున్న ఒకానొక కార్యక్రమం గురించి ఒక ప్రకటన చేద్దాం అని అనుకున్నాను. కార్యక్రమ నిర్వాహకుల అనుమతి కూడా తీసుకున్నాను.
ఇక పోతే ప్రభాకర్ “యువ కథకులు – కథనరీతులు” విశ్లేషిస్తూ కొన్ని వాఖ్యలు చేసారు. వాటిల్లో ఒక విషయం గురించి మాత్రమే మీతో ప్రస్తావించుదామని అనుకున్నాను.
వేగం
కథనంలో కథకులలో వేగం. అది వాసి కావచ్చు. రాశి కావచ్చు. “రహదారి మీద టూ వీలర్ మీదో, ఫోర్ వీలర్ మీద మనం వెడుతున్నప్పుడు మన భుజాల్ని దాదాపుగా తాకుతు, అత్యంత వేగంగా మనముందు నుంచి దూసుకువెళ్ళే క్షణం లో ఒక “ఝలక్” కి గురవుతాము చూసారా? ఒక క్షణం పాటు. అది ఉంది ఈ యువ రచయితలలందరిలోను. మంచిదే! ఆ వేగం కూడ కావాలి. ఆ దూసుకుపోయే తత్వం కూడా కావాలి. అయితే నా బోటి వాడికి భయం కూడా వేస్తుంది! ఎందుకంటే అంత వేగంతో వెళ్తున్నప్పుడు ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. అద్భుతమైన రచనలు చెయ్యాల్సిన ఔత్సాహిక రచయిత వేగంగా వెడుతున్నప్పుడు కొన్ని అంశాలని గుర్తించలేకపోవచ్చు. (శిల్పం, కథనం, వస్తువు, భాష రచనకు సంబంధించిన తదితర విషయాలు). తద్వారా ఒక గొప్ప రచయితని మనం కోల్పోయే అవకాశం ఉంది!”
ఇవన్ని నా మాటల్లో డా. ప్రభాకర్ ఏ కె గారి అభిప్రాయాలు. నా మాటల్లో కాబట్టి నేను అర్ధం చేసుకుని, వాటిని మీకందించే క్రమంలో పొరబాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిల్లో ఈకలు వెతికి పీక్కోవద్దు.
రెండవ అంశం
కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్ కథ తలుగు పఠన కార్యక్రమం ముందు అనుకున్న పద్దతిలో కాకుండా ఒక రెండు ముందు మాటలు.. కథనుండి కొన్ని ముఖ్యమైన పేరాగ్రాఫులని ప్రముఖ కథా రచయిత, చలనచిత్ర సంభాషణల కర్త అరిపిరాల సత్యప్రసాద్ చదివి వినిపించడంతో ఆ సమావేశం ముగిసింది.
కాకపోతే ఆ సభలో కథ గురించి వేదికచేయనున్న ఒకానొక కార్యాక్రమం గురించి వచ్చిన సభికులకు ఒక ప్రకటన చేద్దామనుకుంటే కారణాలేమైనా ఆ ప్రకటన చెయ్యలేకపోయ్యాను.
* * *
వేదిక
అదే రోజు సాయంత్రం ఆలంబన లో ప్రతి నెల రెండవ ఆదివారం సాయంత్రం 4.30 నుండు 6.30 మధ్య జరగుతున్న సాహిత్య సమావేశం ఈ సారి పూర్తిగా చంద్రశేఖర ఆజాద్ కథ నీళ్ళు – రక్తం కే సరిపోయింది.
దాదాపు ఏడున్నర దాకా సాహిత్య ప్రేమికులందరూ ఆ ఒక్క కథ మీదే చర్చని కొనసాగించారు.
ఏతా వాత తేలిందేమంటే…రచయత అన్నట్టు “మనం వినే సామెతలు, సూక్తులు, పాక్షిక సత్యాలు. ఆయా సందర్భాలకు వర్తిస్తాయంతే.”
నేను పరిచయం చేద్దామనుకు ఝంపా లహరి కథ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. 🙂
ఆ రోజు సాయంత్రం సమావేశానికి వచ్చిన వారిలో ప్రధములు వేమూరి సత్యం గారు. గతంలో స్వాతి మాస పత్రిక ప్రారంభంలో 70 – 73 వరకూ సంపాదక శాఖలోను, నిర్వాహణ శాఖలోను పాలుపంచుకుని, 73 నుండి దాదాపు తొమ్మిదేళ్ళపాటు జ్యోతి (కీ.శే వి రాఘవయ్య – లీలావతి రాఘవయ్య గార్ల మాస పత్రిక) కి సహ-సంపాదకుడి గాను, ఆ తరువాత సినిమా రంగంలోనూ – ప్రొడక్షన్ డిజైనర్‌గాను, ఎక్జిక్యూటివ్ నిర్మాతగాను, స్టోరి డిస్కషన్స్, స్క్ర్రిన్‌ప్లే రైటింగ్‌లలోనూ ఇంకా పలు బాధ్యతలను నిర్వహించిన సాహిత్యాభిమాని వేమురి సత్యం (సత్యనారాయణ) గారి మాట ఒకటి పంచుకుంటాను.
ఒకానొక సందర్భంలో ఆయన ప్రొతిమా బేడి (ప్రొతిమా గౌరి) తో ఒక భేటిలో “మీరు కబిర్ బేడి ( Sandokan / Octopussy fame) కి విడాకులిచ్చేసారు. అప్పుడు మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని ‘ఇదిగో ఈమే ప్రొతిమ. మొగుడుకి విడాకులిచ్చేసి తిరుగుతున్నది’ అని వేలేత్తి చూపించి, దూషించి, విమర్శించి ఉంటుంది కదా! మరి అప్పుడు ఆ విమర్శని మీరు ఏ విధంగా ఎదుర్కొన్నారు? ” అని ప్రశ్నించారట.
దానికి ప్రొతిమ (గౌరి) బేడి జవాబు, “It is the business of society. It would stop, point out something that catches its attention and then moves on. It has other businesses too on its agenda. It happened the same with me too. I knew it would raise it’s finger at me. It did and then it moved on to the next one. It doesn’t bother me any more.”
మళ్ళీ కలుద్దాం!
ఈ టపాలో సాహిత్యవేత్తల పుస్తకాలు కావాలంటే…
మీ దగ్గిర్లోఉన్న పుస్తకాల దుకాణం లో అడగండి. లేవు అని అంటే తెప్పించి పెట్టమనండి. కుదరదంటే ఇక్కడ ఇచ్చిన చిరునామాలలో సంప్రదించండి.
ఒకటి, యండమూరి వీరేంద్రనాధ్ కామెంట్ నా దృష్టికి రాకపోతే ఈ పుస్తకాని అంత త్వరగా చూసేవాడిని కాదు. రెండుదాసరి అమరేంద్ర గారు ఈ అనువాదకుడికి ‘వాగ్దానం’ చెయ్యకపోయినా ఈ పుస్తకాన్ని ఒక్క రాత్రి పూట చదివి ముగించేవాడిని కాదు. మూడు ఈ పరిచయం ఇక్కడ ఉండటానికి కారణం విజయవాడలో పుస్తక ప్రదర్శన.
పైగా జనవరి 28 ఆదివారం ఉదయం హైద్రాబాదు చలిలో ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాల్సిరావడం. అబ్బే, వేదిక తరఫున కాదు. ఆలంబన దీనికి సభాస్థలి. కార్యక్రమం డా వింజమూరి సూర్యప్రకాశ్ గారి Spreading Lights లో ఒక భాగం.
ఇక పోతే ఈ పుస్తకం లో 70 వ పేజిలో ఒక చిన్న పిట్ట కథ ఉంది. ఆ కథ విపించింది సూఫీ బాబా.
“అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ ని చూడలేదతడు. తన అనుమానాన్ని వెలిబుచ్చుతూ, ఆమె గుండెలకేసి చూపించి, తామిద్దరిమధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. అమాయకమైన ప్రశ్నకి ఆ తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మొదటిసారి తమ ప్రపంచంలోకి వచ్చిన బౌద్ధసన్యాసి అని అతడికి తెలుసు. తేడా గురించి చెపుతూ, ‘తల్లి అయిన తరువాత, పిల్లల్ని పోషించ వలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ప్రకృతి ఆ బాలికకు ఆ విధమైన అవయవాలను ఇచ్చింద’ని వివరణ ఇచ్చాడు. ఆమాటలకు సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆరోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజులదినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరికి చేరుకున్నాడు. ఇలా ఎందుకు చేశావని అడిగాడు గురువు.“
ఇందాక యండమూరి షేర్ చేసారు అని ఉదహరించింది ఈ పై కథనే.
ఇది ఈ పోస్ట్‌కి నేపధ్యం. నేను అభిమానించే పారిశ్రామికవేత్త “జే” ( టాటా సన్నిహితులు ఆయన్ని ఆ పేరుతో పిలుచుకునేవారు) కి ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాడు అజిత్ సింఘాని. అది మరొక కారణం ఈ పుస్తకాని చదవడానికి.
ఒక్క మాట. ఇది పుస్తక పరిచయం మాత్రమే.
ఇక వివరాలలోకి వెడదాం. పుస్తకం పేరు ఇంగ్లీష్ లో One life to ride. రచయిత Ajit Harisinghani.
ప్రయాణానికే జీవితం – తెలుగు అనువాదం కొల్లూరి సోమశంకర్
మూలం – ఆంగ్లం – అజిత్ సింఘాని
కోలా శేషాచలంనీలగిరి యాత్ర లో ఒక ప్రకరణం మాకు ఫిఫ్త్ ఫార్మ్ లో అనుకుంటాను పాఠంగా ఉండేది. మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ వీరాచారి గారు మాకు దానిని చెప్పారు. అప్పటికే తెలియని తెలుగు పదాలని ఆ పాఠం తో పాటు వారి ద్వారా నేర్చుకున్నాం.
ఇవి కాక మరో రకం పుస్తకాలున్నవి. వాటిల్లో వీసాలు, మోసాలు, పాస్‌పొర్ట్లు, టికెట్లు, హోటళ్లు, తిండి, తిప్పలు వగైరాలు మాత్రమే ఉంటాయి.
సోమశంకర్ అనువదించిన ప్రయాణానికే జీవితం లో ఇవేమి ఉండవు. మరేవో ఉంటాయి కాబట్టి ఈ పుస్తకం చదివిన తరువాత కూడ పాఠకుడ్ని వెన్నంటి వేటాడుతుంది అని అంటున్నాను.
Richard David Bach పుస్తకం ఒకటి 70 లలో పాఠకులని ఒక కుదుపు కుదిపింది. ఆ పుస్తకం పేరు Jonathan Livingston Seagull .
ప్రయాణానికే జీవితం చదువుతుంటే నాకు ఆ పుస్తకం జ్ఞాపకం వచ్చింది. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడైన పుస్తకం అది.
ప్రయాణానికే జీవితం పుస్తకంలో వీసాలు, మోసాలు, పాస్‌పోర్ట్లు, ట్రైయిన్ టైంటేబుల్స్ గాని అజిత్ ప్రయాణానికి ఉపయోగించుకున్న బుల్లెట్ గురించి వివరాలు కాని ఉండవు. లోలోన, పొరలలో దాగి ఉన్న మనిషి మనసుని అది ఆవిష్కరింపచేస్తుంది. గమ్యం మొక్కటే కాదు ముఖ్యం అజిత్ లాంటి యాత్రికులకు. మనసును తెలుసుకోవడం కూడ ముఖ్యమే!
54 వ పేజిలో ఒక జీవిత గాధ ఉంది. జరిగిన కథ అది. ఒక భారతీయుడు అతని కుటుంబం, ఒక పాకిస్థాని అతని కుటుంబం. ఒక కుటుంబాన్ని రక్షించిన మరో కుటుంబం ఏమైంది అన్నది చదివితే మనసు ద్రవించిపోతుంది.
157 పేజిలో మరాఠ యువకులు పదాతి దళంలో చేరి, తమ కుటుంబానికి, స్నేహితులకి బంధువులకి దూరంగా, శత్రువులకి అత్యంత సమీపంగా జీవిస్తూ… ప్రతి క్షణం ప్రాణభీతితో ఎలా జీవిస్తున్నారో చదువుతుంటే అజిత్ తో పాటు మనం కూడ కన్నీరు పెడతాం.
అంత ఒడుపుగా ఆంగ్లలోనుంచి తెలుగులోకి అనువదించి పాఠకుడ్ని కూడ ఉద్వేగానికి లోను చేసేటంత గొప్పగా అనువదించాడు ఈ అనువాదకుడు – కొల్లూరి సోమశంకర్.
బుల్లెట్ బండి మీద సవారి కాదా ఈ పుస్తకం? కాదు. అంతేకాదు. ఈ పుస్తకం విపశ్యన (విపాసన)గురించి కూడా మీకు చెబుతుంది.
అచ్చు తప్పులున్నాయి కాని పంటి కింద రాయిలాగా అడ్డుపడవు. ముద్దకి ముద్దకి రాళ్ళని వెతుక్కోనక్కర్లేదు. భాష సాఫీగానే ఉంది.
చదవతగ్గ పుస్తకమే! సందర్భం ఏదైనా బహుమతిగా కూడ ఇవ్వొచ్చు .
ప్రతులకు:
K. Soma Sankar
1-30-28, Tirumalanagar,
Kanajiguda, Secunderabad 500 015.
మొబైల్ ఫోను: +91 99484 64365
ధర : రూ: 120.00
ప్రముఖ పుస్తక విక్రేతలందరి దగ్గిర దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే వారిని తెప్పించి పెట్టమని అడగండి. కుదరకపోతే రచయిత ఉండనే ఉన్నాడు. ఆర్డర్ పెట్టండి.
మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం. అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది. శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”
సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు. ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.
తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.
కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం. కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను. మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.
ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.
వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.
రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి ముఖచిత్రాలు ఇక్కడున్నవి. సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082
“బెర్నాడ్ షా వ్రాసిన ‘సీజర్ అండ్ క్లియోపాట్రా’ నాటకంలో థియోడాటస్ అనే అతను అలెగ్జాండ్రియా లైబ్రెరి తగలబడిపోతుంటే చూడలేక సీజర్ దగ్గిరకి వెళ్ళి బ్రతిమాలాతాడు. సైనికులని పంపి మంటలార్పమనీ, పుస్తకాలని కాపాడమనీ. సీజరు ససేమిరా అంటాడు.
‘అక్కడాహుతౌతున్నది వట్టి కాగితాల కట్టలు కాదు. మానవజాతి కష్టించి ఆర్జించుకున్న సంస్కృతీ, సంస్కార, సంప్రదాయాలు దగ్ధమౌతున్నాయి. మానవజాతి సంపాదించుకున్న మధుర స్మృతులన్నీ మసైపోతున్నాయి’ అని అక్రోశిస్తాడు ధియోడాటస్.
‘నువ్వేమి చెయ్యకుండా కూర్చుంటే రాబొయ్యే తరాలవారు నిన్ను పుస్తకాల విలువ కూడా తెలుసుకోలేని మూర్ఖుడిగాను, ఆటవిక సైనికుడిగాను జమ కడతారు సుమా!’ అని సీజర్ని హెచ్చరిస్తాడు.
అలాంటి సీజర్లింకా యీ యిరవయ్యో శతాబ్దంలో కూడా ఉన్నారా? అని మనం సందేహించవల్సిన అగత్యం లేకుండా పోయింది: ‘ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వాతంత్యానికి పట్టుకొమ్మ అని, భూతలస్వర్గం (God’s own country) అని పేరు మోసిన అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది.’ ” అట్లూరి పిచ్చేశ్వర రావు వ్రాసిన విన్నవి – కన్నవి లో నుంచి.
నిన్న జరిగిన సంఘటన నాకు మా నాన్న వ్రాసిన పై పేరాగ్రాఫ్‌ని గుర్తు చేసింది.
కానీ దాని నేపధ్యం వేరు.
నిన్న సాయంత్రం యువ సాహితీ మిత్రుడు అనిల్ బత్తుల (అతను ఈ భూమ్మిద పడకముందే ప్రచురించబడ్డ సోవియట్ పుస్తకాలు అతి ముఖ్యంగా వాటి తెలుగు అనువాదాలని ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ లో ఉచితంగానే అందరికి అందజేయాలనే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నవాడు) నాకు ఫోన్ చేసి, “సార్, పారిస్ పతనం మీ నాన్నగారే కదా అనువదించింది? ఒక పాత ప్రతి ఒకటి ఈ హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఎక్కడో ఉందట! ఇందాక ఫలానా వారు ఫోన్ చేసారు. ఒక్కసారి మిమ్మల్ని కనుక్కుని కన్ఫర్మ్ చేసుకుందామని చేసాను సార్,” అని అన్నాడు.
అతను అడిగింది నిజమే! The Fall of Paris ని వ్రాసింది ఇల్యా ఎహ్రెన్‌బర్గ్ (Ilya Ehrenburg). ఆంగ్లంలో తొలి ప్రచురణ 1940 ప్రాంతాలలో.
దాని తెలుగులో కి అనువదించింది అట్లూరి పిచ్చేశ్వర రావు. సుమారు 840 పేజిలు. తెలుగులో ప్రచురణ కాలం మార్చ్ 1960.
సరే, ఇక బుక్ ఫైయిర్ లో పారిస్ పతనం దొరకడానికి, మీ నాన్న వ్రాసిన దానికి, సీజర్ కి ఆ లైబ్రేరి తగలబెట్టడానికి సంబంధం ఏవిటి అనే దానికి వస్తున్నాను.
1980 ప్రాంతాలలో తానా సభలకి వెళ్ళారనుకుంటాను డి. వి. నరసరాజు గారు. తానా పత్రిక లో ఏదో వ్యాసం కోసం వారికి ఫోను చేసినప్పుడు “ఇస్తాను, రండి ఇంట్లోనే ఉన్నాను,” అని అన్నారు. ఆ సందర్భాన్ని కూడ గుర్తు చేసింది నిన్నటి అనిల్ బత్తుల ఫోన్ కాల్.
నరసరాజు గారు అన్నారు కదా, “అనిల్, పుస్తకాలు మన దగ్గిరే ఉంటే లాభం ఏమి ఉంది? అవి ముద్రించింది పది మంది చదవాలనే కదా! మీరు తీసుకు వెళ్లండి. చదవండి. మీ పని అయిపోయిన తరువాత నాకు తెచ్చి ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోయినా ఫరవాలేదు. ఇంకేవరైనా చదువుతానంటే వారికివ్వండి,” అని.
పదిమంది చదవడానికి పుస్తక భాండాగారాలు అంటే లైబ్రేరిలు ఏర్పడ్డాయి. ఆ భాండాగారాలలోని పుస్తకాలు ఇప్పుడు పదిమందికి అందుబాటులోకి వెళ్లకుండా దొడ్డి గుమ్మంద్వారా ఇలా బజారులోకి వస్తున్నాయ్యా? అది హర్షణీయమా అన్న ప్రశ్న తలెత్తింది నాలో.
మా నాన్న గారి సాహిత్యం పునర్ముద్రణ కోసం నాకు ప్రస్తుతం అందుబాటులోలేని పుస్తకాలకోసం వెతుక్కుంటున్నప్పుడు సాహిత్యాభిమానులలో ఒకరిద్దరు తాము చూసామని దొరికిన రెండు మూడు పుస్తాకాలు సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రచురితమైన వాటి ప్రతులు కొని పంపారు.
840 పుటల పారిస్ పతనం, 1960 మార్చి ప్రచురణ, (బవుండ్ ఎడిషన్ అనేవారు) ప్రతి ధర 10 రూపాయలు. ఈ రోజు అదే పుస్తకాన్ని బహుశ ఏ 250/- కో 300/- కో అమ్మినా కొనుక్కునే వారున్నారు. ఎందుకంటే అంత ధర పెట్టి ఆ ప్రతిని కొన్నవారిని నేనెరుగుదును.
మనకి తెలుసో, తెలియకో ఇలాంటి అరుదైన పుస్తకాలని ఏదో ఒక విధంగా సంపాదించి ఇలా అమ్ముకోవడాన్ని మనం సమర్ధించాలా అన్నది నా ప్రశ్న. ఏదో ఒక పుస్తకమే కదా అని సరిపుచ్చుకోమంటారా? అలా ఒక పుస్తకంతో మొదలైనది మరి రేపు లైబ్రేరిలను కొల్లగొడితే? పది మంది కి అందాల్సిన పుస్తకాలు ఏ ఒక్కరి అలమారకో పరిమితమైతే అప్పుడేమంటారు?
దయచేసి మీ అభిప్రాయాల్ని క్రింది వ్యాఖ్యలలో తెలియజేయగోర్తాను.
తా. కలం: హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రతి అమ్ముడైపోయింది ! చి న.
ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని.
ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని.
మరొకరిని అడిగాను. “అయ్ ఆమ్ ఎక్స్‌ప్రెసివ్” అని జవాబు.
ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”.
సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది. దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు. భాష అయ్యింది అది. కథలు చెప్పుకోవడం మొదలయ్యింది. అనుకుందాం! సరే మౌఖికంగా కథలు చెప్పుకుంటున్ననాటి నుంచి బూతులు, అసభ్యపదజాలం వాడుక దేశ కాల పరిస్థితులని బట్టి మారుతునే ఉన్నవి. రోజు ఇంటా బయటా వింటున్నవేకదా?
ఫ్రీడ్‌మన్ అన్నట్టు, డాల్ఫిన్స్ కి , వేల్స్ కీ కూడా భాష ఉంది. మాట్లాడుకుంటాయి. ఏనుగులు, కాకులు, కుక్కలు, పిల్లులు, పాములు అన్నింటికి ఒక భాష వుంది. అన్ని ప్రేమించుకుంటాయి, కాట్లాడు కుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి అన్ని పనులు చేసుకుంటాయి.
“దిద్దుబాటు” తెలుగులో తొలి కథ అని అన్నారు. అబ్బే లేదు..ఇంకా చాలా కథలున్నవి (దాదాపు ఒక తొంభై దాకా అని ఒక అంచనా!) దానికి ముందే అని తెల్ఛేసారు. రేపో, మాపో అవి మనచేతుల్లోకి రానున్నవి. (బహుశ ఈ 2014 లోనే రావచ్చు).దిద్దుబాటు ని షార్ట్‌ఫిల్మ్‌గా కూడా తీసాడు అట్టాడ అప్పల్నాయుడు గారి అబ్బాయి సృజన్.
సరే, దిద్దుబాటుతోనే మొదలు పెడదాం.
మరి ఆ రోజే సాని కొంపలున్నవిగా?
మగాడు తిరుగుతునే ఉన్నాడుగా? ఆవిడ ఇంట్లోనే ఉందిగా?
“కన్యాశుల్కం” నుంచి, ఈ రోజు “వాడి పాకేజి నాకంటే తక్కువలేవే..వాడ్ని నేనెలాచేసుకుంటానే మమ్మీ?” అని ఈ రోజు చదువుకుని,ఉద్యోగంచేసుకున్న యువతి గారాలు పోతోంది.దిద్దుబాటు వెలువడిన సాంఘిక నేపధ్యం ఏమిటి? దేశ కాల పరిస్థితులేమిటి? ఈ రోజు దేశ కాల పరిస్థితులేమిటి? ఎరుపు రోజుల్లో కథకి ఒక సాంఘిక బాధ్యత ఉంది అని అనుకుని వాళ్ళు కథలు, నవలలు, కవితలు, నాటికలు గట్రా వ్రాసుకున్నారు. అవి “గర్జించు రష్యా” రోజులనుకుంటే ఇవి “గాండ్రించు అమెరికా ” రోజులనుకోవచ్చు. మరి మార్పు రాలేదా?మూలింటామె లో లాగా పందొసంత లాంటి వ్యక్తులు లేరా? అంటే ఉన్నారు! ఇప్పుడు కాదు..అనగనగా అప్పుడెప్పుడోనే ఉన్నారు. ఈ రోజు బయటికి వచ్చిందా? కాదే? పల్లెటూళ్ల లో పాలేర్లు, రైతులు, రైతు కూలీలు అయితే, పట్టణాలలో సేల్స్ గరల్స్, ఆఫీసులో క్లెర్క్‌లు వాళ్ళ రాసలీలల మీద ఎన్ని కథలు రాలేదు!
మరి “అరుంధతి” (ఉన్నంతలో – రాజారామ్మోహనరావు – 2012 స్వాతి మాస పత్రికలో) రామారావు పక్కలోకి వెళ్ళలేదేం? (కథ 2012 సంకలనం – సం: వాసిరెడ్డి నవీన్, శివశంకర్ పాపినేని)
కాబట్టి ఆ మార్పుని ఒప్పుకున్నవాళ్ళు ఈ మార్పులని కూడా అంగీకరించాలి.
అలాగే చదవతగ్గ రచన ఏదైనా సరే చదువుతారు. దానికి భాష అడ్డం రాకూడదు. కాని వచ్చేసిందిగా?!
భాషే కాదు. వస్తువులో కూడా మార్పులు వచ్చేసినవి.
* * *
ఈ మధ్య వచ్చిన కథ ఒకటి. ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ ని వ్రాసింది కాశీభట్ల వేణుగోపాల్.
ఈయన “F” నాలుగు అక్షరాల పదాన్ని ఆంగ్లంలోనే అయినా వాడారు. (ఈ నాలుగు అక్షరాల ఎఫ్ పదం ఏమిటని అడగేవారి కోసం కాదు ఇది వ్రాస్తుంట!) అందులో ఎబినేజర్ పాత్రకి కళ్ళలో ఒక దానికి శుక్లం వచ్చింది. శుక్లాన్ని ఆంగ్లంలో కాటరాక్ట్ అంటారు. కాటరాక్ట్‌ని కొన్ని ప్రాంతలలో కొంత మంది “కన్ను పూసింది” అని అంటారు. శుక్లం ని “కన్ను లో పూత” అని కూడ చెప్పుకుంటారు. అంటే ఈ కథలో ఎబినీజర్ అనే పాత్ర కన్నుపూచింది. కన్నులో పూవు. కన్నులో పూవు ఉంది కాబట్టి ఆ వ్యక్తికి *పూకంటోడు అనే మారుపేరు (నిక్‌నేమ్) ఎగతాళిగా పిలుచుకునే పేరు పెట్టారు.ఆ మారుపేరు తన పాఠకులకు అమోదయోగ్యంకాదని ఒకరో ఇద్దరో సంపాదకులు అభిప్రాయపడ్డారు. ఆ మారుపేరులో వారికి బూతు వినపడింది. అంతే కాదు వారికి అసభ్యంగాను అభ్యంతరకరంగాను తోచింది. రచయితకి ఒక సూచన చేసారు. ఎబినేజర్ “మారుపేరు” (nickname) మార్చండి. ఆ కథని మేము ప్రచురిస్తామని. రచయిత ఒప్పుకోలేదు. రచయిత “మా ప్రాంతంలో అలా కన్నులో పూత అంటే శుక్లాలున్నవాడిని అదే పేరుతో పిలుస్తారు. అది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది కాబట్టి నేను మీ సూచనను అంగీకరించను. మీరు కథని ప్రచురించకపోయినా ఫరవాలేదు” అంటూ వివరణ ఇచ్చారు.
ఆ పత్రిక సంపాదకులు అంగీకరించలేదు. కాబట్టి ఆ కథని అచ్చులో చదువుకునే అదృష్టం కొంత మంది పాఠకులకి దక్కలేదు. కొంతమంది జాలపాఠకులకి (online readers) ఆ దురదృష్టం కలిగింది. అవును, ఎవరు దీన్ని గురించి మాట్లడుకున్నట్టు కనపడలేదే!?
ఇందులో లచ్చుమమ్మ మొగుడు కామేశ్వరరావు. ఆ లచ్చుమమ్మ వయసు దాదాపు 39 ఏళ్ళు. కాలేజిలో చదువుకునే సరయు ఈ దంపతుల కూతురు. మురళి లచ్చుమమ్మ మేనల్లుడు. డాక్టరి చదువుకుంటున్నాడు. వాడి దృష్టి తన మీదకు “మళ్ళించుకోవడానికి సరయు తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు.” అని ఆ తల్లి స్వగతం. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? మురళీ తన మేనత్త తో గడపటానికే వాళ్ళింటికి వెళ్ళడం. ఎందుకని అంటే ఆమెకి “చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది” అనుకుంటుంది. లచ్చుమమ్మ మళ్ళీ మరో మాట కూడా అనుకుంటుంది “అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అని.
ఎబనీజర్ పాత్ర వాడి పూకంటోడు అనే పేరు 2014 లోదే. అరుంధతి పాత్ర 2012 లోదే
పునీత పాత్ర 2014 లోదే.
ఈ మూడు కథలని చదువుకున్నవారు ఉన్నారు.
“కీమో” కథలో ఆరు చోట్ల *F* పదం వాడారు రచయిత. అది ఆంగ్ల పదం అయినా సంభాషణలు ఇంగ్లిష్‌లో కాబట్టి ట్రాన్స్‌లిటరేటేడ్ పదం అది. మరి ఇందాక భాష అనుకున్నామే?! మరి ఇక్కడ ఇది కూడా వచ్చేసిందిగా?!
మరో సందర్భం;
ఈ సారి ఏకంగా ఒక వెబ్‌జైన్ సంపాదకుడే వాడేసుకున్నారు F పదాన్ని!
ఆయన మాటల్లోనే “I fucked up so many relationships. I want us to be a success“.
మరి దీనికేమంటారు ?
మరి మంచుపూవు లోని కావేరి కూతురు ప్రియ లో భార్యని చూసుకున్న తండ్రి ఆలోచనలని వెలికి తెచ్చిన రచయిత ని ఏంచెయ్యాలి?మొన్న వేదికసమావేశం లో ఒక ఆంగ్ల కధని పరిచయం చేసాను. Ba-Boon – థామస్ పియర్సన్ వ్రాసిన కథ అది. 2014 లొనే వచ్చిందా కథ. అన్ని తనే అయిన సోదరుడు ఒకానొక దుర్ఘటనకి గురైన తరువాత అతని చెల్లెలు అతనికి తోడై ఉండాల్సిన పరిస్థితి. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఒకానొక సందర్భంలో ఒక compromising situation లో వీడియో షూట్ లో పాల్గొంటుంది. ఆ టేప్ తెచ్చుకోవాలి. కొన్ని వందల వీడియో టేపులన్నింటిని చూస్తేగానీ ఏది తనది అన్నది తెలియదు. మరి సొంత అన్నతోనే ఆ వీడియో చూడాలా? ఈ అంశాన్ని ప్రంపంచంలోని ప్రతి ఆంగ్ల పాఠకుడు అంగీకరిస్తాడా?
కొవ్వలి నవలలని జాకెట్లలలో, లంగాలలో, ఓణీలలో దాచుకుని చదువుకునే వారు ఒకనాటి చదువుకున్న స్త్రీలు. అలాగే మధు పుస్తకాలని కూడా దాచుకుని చదువుకునేవారు ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద, ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది. కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాలం లోనే వెబ్‌జైన్‌లలోనే వెలువడ్డవి. అంతర్జాలానికి ఎల్లలు లేవు. అలాగే అక్కడ స్వేచ్చమీద కట్టడి లేదు.కా రా మాస్టారు అన్నట్టు: ” చీకటిలో ఉన్నా కొందరందులో వెలుగుని గురించి రాస్తారు. వెలుగులో ఉంటూ జీవితం లోని చీకటి గురించి రాస్తారు. వెలుగే తప్ప చీకటిని ఎరుగని వారు అందులోని నీలి నీడలనే చీకటిగాను, మరి కొందరు చీకటి చీకటి కాదని, వెలుగే చీకటి, చీకటే వెలుగని రాస్తారు” ( కా రా రచనలు పుట 379).
ఆయన వ్రాసిన సందర్భం వేరైనా ఈనాటి కథకులకి, పాఠకులకి తెలియాల్సి ఉంది.
ఆంక్షలు పెట్టకండి.వచ్చేవి ఎలాగు వస్తాయి. పొయ్యేవి ఎలాగూ పోతాయి.
మంచి ముత్యాలని ఏరుకోవడమే మీరు చేయగలిగింది!
ఏది మంచి? మీకు ఏది మంచి అని తోస్తే అదే మంచి!!
కా రా మాస్టారు ని అడిగాను, “చదవగలుగుతున్నారా?” అని. “ఇబ్బందిగానే ఉంది. ఇదివరకటిలాగా ఏకధాటిగా చదవలేక పోతున్నాను. ఐనా మధ్య మధ్య ఆపి కళ్ళకి కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను. చదవకపోతే ఎలా? ఊపిరి ఆడదుగా?! మీకు తెలియందేముంది ?” అని అన్నారు. అప్పటికి వారికి సుమారు 86 ఏళ్ళు అనుకుంటాను. ఐనా చిన్న స్టూలు లాక్కుని దానిమీద కెక్కి నిలబడి, అటక మీదున్న కొన్ని పుస్తకాలని అందుకుని, దిగి తీసుకువచ్చి మీరు చదవాలని నాకు అందజేసారు. చదవడం మీద ప్రేమ అది.
“అదిగో, దానితో చదువుతున్నాను” అంటూ టేబుల్ మీదున్న భూతద్దాన్ని చూపించారు త్రిపుర, అదే ప్రశ్నని వారిని అడిగినప్పుడు. అది చూసినప్పుడు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” కోసం భూతద్దం తో కుస్తీపడుతున్న ఆరుద్ర గుర్తు వచ్చారు. “చెక్కుల మీద సంతకాలు పెట్టగలుగుతున్నారా?” అని అడిగాను. “నా కోడి కెలుకుడిని మా బాంక్ వాళ్ళు సంతకం క్రిందే భావిస్తున్నారు. ఐ యాం థాంక్‌ఫుల్ టు దెం” అని అన్నారు త్రిపుర నవ్వుతూ. చదవకుండా, రాయకుండా ఎలా ఉండగలరు ఎవరైనా అన్నది వారి ప్రశ్న. చదవడం మీద ప్రేమ అది.
“నేను బయటకు వెళ్లడం తగ్గింది. కాని మీ బోటి మిత్రులు, నాకు పుస్తకాలని అందజేస్తున్నారు. ఇంకా చదవగలుగుతున్నాను. మనకి అంతకంటే కావాల్సిందేముంది” అన్నారు పెద్దిభొట్ల గారు. చదవడం మీద ప్రేమ అది.”స్క్రిఫ్ట్‌ని స్కాన్ చేసి పంపిస్తున్నాను. నా దస్తూరి కాని నేను వాడిన పదం కాని అర్ధం కాక పొరబాటున మరో పదం కంపోజ్ చేసే సందర్భాలు వచ్చేస్తున్నవి. ఇక నా రచనలని నేనే తెలుగులో టైప్ చేసుకోవడం తప్పదు. మనకి తెలిసిందే రాయడం, చదవడం! అవి రెండూ లేకపోతే పిచ్చెక్కిపోదు? ” అని అన్నారు అశేష ఆంద్రపాఠకుల అభిమాన రచయిత , షాడో సృష్టికర్త మధుబాబు. చదవడం మీద ప్రేమ అది.
“ప్రతిరోజు నెట్ ని ఎప్పుడో ఒకప్పుడు చూస్తూనే ఉంటాను. కంప్యూటర్ మీద, నా రచనలన్నింటిని నేనే టైప్ చేసుకుంటాను నాకు ఇబ్బంది ఏమి లేదు. ఇంటర్నెట్ లో చదువుకుంటాను కూడా”, అని అన్నారు మొన్న “పెద్ధిభొట్ల సాహితీ పురస్కారం” అందుకున్న రచయిత్రి సత్యవతి పోచిరాజు. చదవడం మీద ప్రేమ అది.
“టాంక్ బండ్ మీద వెళ్తున్నప్పుడు వచ్చింది..ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన. బండి అపేసి, పక్కనే లాన్‌లో కూర్చుని లాప్‌టాప్ మీద అప్పటికప్పుడు వ్రాసిన కధ “వర్డ్ కాన్సర్” అని తెలియజేసిన పాత్రికేయురాలు – వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు. వ్రాయడం, చదవడం మీద ప్రేమ అది.
తెలుగు ఆచార్యులు. మల్లీశ్వరి గారు ఆన్‌లైన్‌లో వ్రాసుకున్న బ్లాగులను ఏర్చి కూర్చి “జాజిమల్లి” బ్లాగు కథలు గా ప్రచురించింది పర్‌స్పెక్టివ్ ప్రచురణ సంస్థ.
ఆ మధ్య ఒక పుస్తక ఆవిష్కరణ సభకి హైద్రాబాదు నుండి సకాలంలో అచ్చు పుస్తకాలు అమెరికాలో అందకపోతే, “ప్రింట్ ఆన్ డిమాండ్” సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడే తెలుగు పుస్తకాలన్ని అచ్చొంతించి ఆ ఆవిష్కరణ సభని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించుకున్నారు.
కేంద్ర సాహిత్య అకాడెమి లాంటి ప్రచురణ సంస్థలు కూడా ఈ నాడు రచయితలు తమకు పంపే రచనలను సాఫ్ట్‌కాపీలుగానే పంపమని కోరుతున్నవని గమనించాలి.
ఈ రోజు అదిలాబాదు లో తను రాసిన రచన ని ఆన్‌లైన్‌లో తన లాప్‌టాప్‌నుండే ఈపబ్లిష్ చేసుకుంటున్నాడు తెలుగు రచయిత.
అది ఈ రోజు రచనా వ్యాసంగంలో ఉన్న తెలుగు రచయితలు, వారి రచనలు, ప్రచురణల పరిస్థితి. ఒకప్పుడు హైద్రాబాదులోని కోఠీలోనో, కాచీగూడాలోనో, వైజాగు గుప్తా బ్రదర్స్‌లోనో, విజయవాడ ఏలూరు రోడ్డులోని నవోదయలో నో, మద్రాసు పాండి బజారులోని రాణి బుక్ సెంటర్ లోనో, తెలుగు పుస్తకాలు కొనుక్కుని, మద్రాసు ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టు నుంచి వెళ్ళే వారు ప్రవాసాంధ్ర పాఠకులు. కాని ఇప్పటి పరిస్థితి వేరు.
ఇల్లినాయ్‌లో ఉంటున్న అన్నయ్య, అదిలాబాదులో తన తమ్ముడికి కావల్సిన పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో ఈబుక్ రూపంలో కొని ఈమైల్ ద్వారా పంపిస్తే దానిని డవున్‌లోడ్ చేసుకుని చదువుకుంటున్నాడు ఆ విద్యార్ధి. ఫ్రాన్స్ లో తెలుగు పదాన్ని ఉపయోగించడంలో సంధిగ్ధం ఎదురైతే ఆన్‌లైన్ లో ఆంధ్రబారతికి వెళ్ళి అర్ధం తెలుసుకుంటున్నాడు తెలుగు భాషాభిమాని.
ఇంటర్నెట్ పుణ్యామా అని పుస్తకాలకోసం ఇది వరకటిలాగా గంటల సేపు ప్రయాణాలు, రోజుల తరబడి విలువైన సమయాన్ని వెచ్చించి వెతుక్కోవడం తగ్గింది. ఆన్‌లైన్ లో ఈబుక్స్ మాత్రమే కాదు, అచ్చు పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు, బంగారం, బస్సు, టికెట్లు లాగా. కొనుక్కోవడమే కాదు, అద్దెకి కూడా తీసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల మీద దాడికి అమెరికా ఉపయోగించిన “డ్రోన్” ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న నవతరం “డ్రోన్” తో పాఠకుడు కోరుకున్న అచ్చు పుస్తకాన్ని అతని ఇంటికే అతి తక్కువ ఖర్చుతో అందే ఏర్పాట్లు చక చకా సాగుతున్నవి.
మనవడితో మాట్లాడుకోవడానికి బామ్మ “టాబ్‌లెట్” తో కుస్తీ పడుతోంది. మనవరాలికి తెలుగు నేర్పడానికి “స్మార్ట్‌ఫోన్” ఆప్స్‌ని ఆశ్రయిస్తున్నాడు తాత గారు. సీరియల్స్ వచ్చి తెలుగు పుస్తకాలని పక్కకి నెట్టేసింది అనడం ఫాషన్ అయి’పోయింది’.
ఈ రోజున సాంకేతిక ప్రగతి విద్యుత్‌స్థంభాల చెయ్యి పట్టుకుని గ్రామాలలోకి వ్యాపిస్తున్నది. లేని చోట మొబైల్ టెలిఫోని వాడుకుంటున్నది. ఇంటర్నెట్, మొబైల్ టెలిఫోన్, టెలివిజన్ పరస్పర కరచాలనం చేసుకుంటూ నేటి పాఠకుడికి, ‘చదువు’ ని ఒక అద్బుతమైన దృష్టికోణం నుండి ఆవిష్కరించి చూపుతున్నది. అచ్చు, దృశ్య, శ్రవణ మాధ్యమాల అనుసంధానం ద్వారా ఒక “ఇమ్మెర్స్‌వ్ రీడింగ్” ని పాఠకుడి అనుభవంలోకి తెస్తున్నది నేటి చదువు.వేనవేల ఘనపు చదరపు అడుగులలో నిర్మించిన పుస్తక భాండాగారాలలోని లక్షల పుస్తకాలని ఈ రోజ పాఠకుడుకి తన డెస్క్‌టాప్ కంప్యూటర్ లో, లాప్‌టాపు, టాబ్లెట్, ఈబుక్‌రీడర్, స్మార్ట్‌పోన్ ద్వారా కాక అంతర్జాల విహరిణి (ఇంటర్నెట్ బ్రౌజర్) ద్వారా చదువుకునే వీలు కలిపిస్తున్నది ఈ ఆధునిక విజ్ఞానం. ఈ సాంకేతిక పరికరాలు అభివృద్దిచెందిన పాశ్చ్యాత దేశాలలోనే ఉందన్న భ్రమ వద్దు. ఇది మన తెలుగు పాఠకుడికికూడా అందుబాటులో ఈ రోజున వుంది. వాటి రూపమే నేటి మన వెబ్‌జైన్ (వెబ్+(మాగ) జైన్)లు. అక్షరాలతో స్క్రోలింగ్ వార్తలతో పాటు, టెలివిజన్ క్లిప్పులను ప్రదర్శిస్తున్నవి నేటి వార్తాపత్రికల జాలగూళ్ళు (వెబ్‌సైట్లు).ఈ రోజున సగటు తెలుగు పాఠకుడికి విస్తారమైన తెలుగు సాహిత్య సంపద అతని అరచేతిలొ పెడుతున్నది ఈ ఆధునిక విజ్ఞానం. పురాణాల నుంచి, ఇతిహాసలనుంచి నేటి తెలుగు హైకూల వరకు. చదువుకున్న వాడికి చదువుకున్నంత మహదేవా అన్నట్టు! ఐతే పాఠకుడు చదవడం కోసం వెచ్చించే వ్యవధిలోను మార్పులు వచ్చినవి. వేయి పేజీల నవలలు చదివే సమయం అతనికి లేదు. కాబట్టి నవల పరిమాణం ఇప్పుడు 200 లేదు 300 పేజిల పరిమాణానికి కుంచించుకుపోయింది. నవలికలు పెరిగినవి. కథలు పెరిగినవి. స్వకీయ ప్రచురణలు కూడ ఎక్కువైనవి.
మొన్నటికి మొన్న తమ వైవాహిక జీవితం పాతిక వసంతాలు చూసిన సందర్భాన ఆ భార్య భర్తల రచయితల ద్వయం తమలో తామే ఒకరి పుస్తకాన్ని ఒకరికి ఆన్‌లైన్‌లో అంకితమిచ్చుకున్నారు! వారే “అనామకుడు” రామశాస్త్రి, డా. గాయత్రీదేవి దంపతులు. రచయితలు, పాఠకులు దగ్గిరవుతున్న సందర్భం ఇది. పాఠకులు, రచయితల మధ్య గీత చిన్నదవుతున్న నేపధ్యం ఇది. ప్రచురణకర్త, రచయిత మధ్య ఉన్న భేదం తగ్గిపోతున్న కాలం ఇది.
తెలుగు పాఠక ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతున్నది. అంది పుచ్చుకోవలసిన వారు, రచయితలు, ప్రచురణ కర్తలే! వారిదే ఆలస్యం! పాఠకుడే రారాజు, ఈ రోజున!
ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్
ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక, ఫామిలీ లో మొదలైన గెస్ట్‌కాలం లో వచ్చింది. పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు. ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది. అన్నట్టు ఈ గెస్ట్‌కాలం ప్రతి బుధవారం వస్తుంది. ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు. ఇక వ్యాసం ఇది. స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది. పూర్తి పాఠం తరువాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇక్కడే పోస్ట్ చేస్తాను.
సూచన: బొమ్మ మీద క్లిక్ చెయ్యండి. సులభంగా చదువుకోవచ్చు
నిన్న సాయంత్రం “కొత్తవంతెన” పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక సంపాదకుడు. కె.శ్రీనివాస్, ఈ వ్యాసాలను తొలుత “ప్రజాతంత్ర” పత్రికలో దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రచురించారు. వాటన్నింటిని ఇప్పుడు మళ్ళీ ఒక సంకలనం కింద “అనేక పబ్లికేషన్స్” ప్రచురించింది.
ఘంటా చక్రపాణి నిర్వహించిన ఈ సభలో “కొత్తవంతెన” అచ్చు పుస్తకాన్ని టిజాక్ అధ్యక్షులు కోదండరామ్ ఆవిష్కరించగా, “కినిగె” ఈబుక్ ని ఆచార్యులు జి హరగోపాల్ ఆవిష్కరించారు. రచయిత కె శ్రీనివాస్ కోరిక మేరకు “గొంతు బాగొలె”దంటునే “జై తెలంగాణ” పాటని పాడి ప్రముఖ గాయకుడు అందెశ్రీ సభికులను అలరించారు.
వేదికని అలంకరించినవారిలో షాజహాన, జూపాక సుభద్ర, “నమస్తే తెలంగాణ” సంపాదకుడు అల్లం నారాయణ ఉన్నారు.
విరసం సభ్యులు వరవరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభలో మరో విశేషం ఏమిటంటే, రచయిత శ్రీనివాస్ తండ్రి శ్రీ సింగరాచార్యులు పాల్గొని ప్రసంగించడం.