బాలాంత్రపు – గోపీచంద్

Balantrapu Rajanikanta Rao

ఈ బాలాంత్రపు గోపీచంద్ ఎవరు?  
బాలాంత్రపు రజనీకాంతరావు గారంటే తెలుగువారిని తన లలిత సంగీతంతో అలరించినవాడు.  గేయకర్త.  స్వరకర్త.  ఇన్ని మాటలెందుకు, బహుముఖ ప్రజ్ఞాశాలి.  

Tripuareneni Gopichand
(8 September 1910 – 2 November 1962)

గోపీచంద్ అంటే సినిమాల్లో హీరో వేశాలేస్తుంటాడు. అతనేగా?  కాదు.  మరి?
ఈయన ఇంటిపేరు త్రిపురనేని.   కవి, సంఘసంస్కర్త, హేతువాది ‘కవిరాజు‘ బిరుదాంకితుడు, బార్-ఎట్‌-లా చదివినవాడు, త్రిపురనేని రామస్వామి కుమారుడు, ఈ త్రిపురనేని గోపీచంద్
తెలుగువారికి తొలి మనోవైజ్ఞానిక నవల అసమర్ధుని జీవయాత్ర  ని అందించి తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయినవాడు.  చలన చిత్ర దర్శకుడు.  కొన్నింటికి కధలు కూడా అందించిన వాడు.  

మరి ఈ బాలంత్రపు వారికి, ఈ గోపిచంద్ కి ఏమిటి సంబంధం?  చలనచిత్రాలలో సంగీతం ఉంటుందిగా!  మరీ ముఖ్యంగా మన భారతీయ చలన చిత్రాలలో నృత్యాలు కూడా ఉంటాయికదా!  అలా…గోపీచంద్ కి బాలాంత్రపు వారికి సంబంధం ఉంది.  వారిద్దరు మిత్రులు.  గోపీచంద్ సినిమాలలో పాటలకి స్వరకర్త, బాలాంత్రపు.  

Balantrapu Rajanikanta Rao
బాలాంత్రపు రజనీకాంతరావు

 

వారిద్దరిమధ్య జరిగిన ఒక హాస్య సంఘటనే ఈ బ్లాగ్ పోస్ట్ కి నేపధ్యం.  బాలంత్రపు రజనీకాంతరావు గారి కుమారుడు హేమచంద్ర నాకు మంచి మిత్రుడు.  ఆ మధ్యేప్పుడో, ఫేస్ బుక్ లో తన తండ్రిగారికి, గోపీచంద్ కి మధ్య జరిగిన ఒక సున్నితమైన హాస్య సంఘటన గురించి తెలియజేసాడు.   రజనీకాంతరావు గారు మద్రాసులో మా అమ్మ స్థాపించి నిర్వహించిన రాణీ బుక్ సెంటర్ కి వచ్చిన గుర్తు నాకుంది.  ఆయనికి  గోపీచంద్ కి ఉన్న సాన్నిహిత్యం తెలిసి ఉండటం వల్ల వారివురి మధ్య జరిగిన ఆ హాస్య సంఘటనని తెలుగువారి సాంస్కృతక చరిత్రలో పొందుపరిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను.  


Hemachandra Balantrapu
బాలాంత్రపు హేమచంద్ర

 సాక్షి దిన పత్రికలో  ప్రతి సోమవారం సాహిత్యానికంటూ ఒక పుటని కేటాయిస్తుంది.  అందులో మరమరాలు  మకుటంతో, సంగీత, సాహిత్యమనే కాకుండా ఇతర కళకారుల జీవితాలలోని ఆసక్తికరమైన సంఘటనలని ప్రచురించడం తెలుసు.  మొన్న గురువారం అంటే మే 8 న, హేమచంద్రతో కొన్ని చిన్న చిన్న సందేహాలుంటే తీర్చుకుని, ఈ కధనం ప్రచురించడానికి (వీలుంటే ఏదేని పత్రికలో) అనుమతి తీసుకుని, రాసి, శుక్రవారం మే 9న, సాక్షి దినపత్రిక కి పంపాను.  వాళ్ళు కూడా ప్రచురిస్తామని తెలియజేసారు. 



సాక్షి పత్రికకి పంపిన కధనానికి  నేను  కాలక్షేపం – బఠాణీలు అని పేరు పెట్టాను.  దానికి ఒక కారణం ఉంది.  దాసు వామనరావు గారనే హాస్య రచయిత ఒకాయన ఉండేవారు.  ఆయన ఆ రోజుల్లో ఒక కాలం రాసేవారు. దానిపేరు ‘కాలక్షేపం‘ అన్నట్టు గుర్తు. ఆయన్ని నేను గుర్తు  చేసుకున్నట్టూ ఉంటుందని ఆ పేరుతో  పంపాను.  (ప్రస్తుతం మద్రాసు, టీ. నగర్ లో దండపాణి వీధిలో ఉంటున్న ష్రైన్ వేలాంగణ్ణి సీనియర్ సెకండరీ స్కూల్, ఆ రోజుల్లో వామనరావు గారిదే!  )అంతే కాదు, హేమచంద్ర జ్ఞాపకాన్ని, నా మాటల్లో చెప్పానని కూడా సాక్షి వారికి తెలియజేసాను.  కాని ఏం లాభం!  రాసిన వారికే బైలైన్ క్రెడిట్ ఇవ్వటం వారి సాంప్రదాయమనుకుంటాను, అలానే చేసారు. 

ఇక కధలోకి వెళ్దాం!

రచయిత త్రిపురనేని గోపీచంద్ ‌– చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు చిత్రాలకు కథ, మాటలు అందించారు; పేరంటాలు, లక్షమ్మ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గాయకుడు, స్వరకర్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్‌ మంచి స్నేహితులు. మద్రాసులో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. గోపీచంద్‌ తీయబోతున్న చిత్రానికి బాలాంత్రపు గేయ రచన, సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఒకానొక ఘట్టంలో కావల్సిన పాటకి కావాల్సిన మాటల కోసం ఆలోచనలో పడ్డారు గోపీచంద్‌. ఆ పాటకి సంగీతం గురించి ఆలోచిస్తున్న రజనీకి కాలుమీద దురద పుట్టి, పరధ్యానంగా గోక్కోవడం మొదలుపెట్టిన కాసేపటికి గాభరా పడుతూ, ‘‘నా కాలు స్పర్శ కోల్పోయింది. నేను గోక్కుంటుంటే తెలీటం లేదు. అర్జంటుగా డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలి’’ అన్నారు. తలతిప్పి ఆయన వంక చూసిన గోపీచంద్, ‘‘డాక్టరు, గీక్టరు అక్కర్లేదు. ఇందాకటి నుంచి మీరు గోక్కుంటున్నది మీ కాలు కాదు, నా కాలు’’ అన్నారు. దాంతో అసలు విషయం అర్థమై ఇద్దరు మిత్రులు పగలబడి నవ్వుకున్నారు.
అనిల్‌ అట్లూరి

సాక్షి సాహిత్యం పేజికి లంకె ఇక్కడ
ఇక ఆ సాహిత్యం పేజిలో కధనం జెపెగ్ ఈ దిగువునః

Sakshi LIterature page Gopichand and Balantrapu by Hemachandra and Anil Atluri
బాలాంత్రపు – గోపిచంద్ హాస్యం

ఎంజాయ్ చేసారా?  చి న

కవిరాజు – స్వదేశాగమనము

త్రిపురనేని రామస్వామి,    ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, ఐర్లాండ్ లో తన న్యాయశాస్త్ర విద్యాభ్యాస్యాన్ని 1917లో ముగించు కున్నారని నా పరిశోధనలో దొరికిన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఐతే ఆయన అదే సంవత్సరం నవంబర్ 11న భారతదేశ భూభాగం లో అడుగుపెట్టా రని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అది ఆయన బొంబాయికి చేరిన తేదినా, లేక తెనాలి లో అడుగుపెట్టిన తారీఖా అన్నది పరిశోధించి తెలుసుకోవాల్సి ఉంది. ఆయన ఆ రోజుకు అంగలూరు కూడా వెళ్లి ఉండవచ్చు.

ఏది ఏమైనప్పటికీ కవిరాజు మాతృదేశానికి తిరిగి వచ్చి ఈ నవంబరు 11కి, శతవసంతాలు నిండినట్టే.

passenger liner / merchant ship

వేనరాజు “ఖూనీ”

“ఆంధ్రా బెర్నాడ్ షా త్రిపురనేని” అని అన్నది కట్టమంచి రామలింగారెడ్డి.  ఆయన అనడానికి ఒక కారణం ఉంది.  “కవిరాజు” త్రిపురనేని రామస్వామి తన రచనలకి సుధీర్ఘమైన పీఠికలు వ్రాసాడు, ఐరిష్ రచయిత జార్జ్ బెర్నాడ్ షా లాగ. పీఠికలు ఎందుకు వ్రాస్తారు?  తను చెప్పదలుచుకున్నదానికి ఉపోధ్ఘాతం.  ఆ రచనకి పూర్వాపరాలు.  నేపధ్యం.  ఎందుకు వ్రాయవలసి వచ్చింది.  రచనకి ఉపయోగపడ్డ వస్తు సామగ్రి గురించి. ఇత్యాదులన్నింటి గురించి.  ఒక వివరణ అని అనుకోవచ్చు.  పీఠిక చదవడం మూలంగా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు చెప్పదలుచుకున్నాడు అన్నది పాఠకుడికి కొంత తెలుస్తుంది.  తరువాత రచయిత రచనలోకి ప్రవేశించవచ్చు.  ఆ రచయిత ఆలోచన తెలుసు కాబట్టి ఆ దారంటే ఆ రచనని చదవవచ్చు.  చదివిన తరువాత తనకి తెలిసిన దానితో బేరీజూ వేసుకోవచ్చు. తనకి తెలియని అంశం మీద ఐతే  కొత్తది తెలుసుకుంటాడు. రచన వస్తు సామగ్రి గురించి ముందే తెలిసినవాడు మరొక పాఠకుడు.  అతను దాని మీద అభిరుచి ఉంటే చదువుతాడు.  లేక పోతే ఈ గోల నా కేల అని ఆ పుస్తకాన్ని అవతల పడే అవకాశం ఉంది.

కవిరాజు“కి తను వ్రాయలి అని తెలుసు.  ఎందుకు వ్రాయలో కూడా తెలుసు.  ఎవరికోసం వ్రాయలో కూడా తెలుసు.  తన రచనలు చదివే వారి గురించి కూడా తెలుసు.  తన పాఠకుడుని ఆయన గౌరవించాడు.  కాబట్టే అంత పెద్ద ముందుమాటలు, పీఠికలు వ్రాసాడు. తనతో పాటు తన కాలంలో ఉన్న తన సమకాలీనుల కోసం కూడా వ్రాసాడు.  వాటిని తన కోసం వ్రాసుకోలేదు. తను నమ్మిన “లోక కళ్యాణార్ధం”  వ్రాసాడు.

'కవిరాజు" త్రిపురనేని రామస్వామి రచించిన నాటకం "ఖూనీ"కాలం పరిగెడుతోంది. దానితో పాటు మనిషి పరుగెడుతున్నాడు.  ఆ పరుగు క్రమంలో మార్పుకి లోనవుతున్నాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నవి.  మార్పు సహజం కదా!  వేష, భాషలు, సంస్కృతి అన్ని ఎంతో కొంత మార్పుకి లోనవుతున్నాయ్.  ఆ నేపధ్యం లో 1980 ప్రాంతాలలో మళ్ళీ కవిరాజు రచనల ని చదవడం మొదలు పెట్టాను.  నా తోటి వాళ్ళు “కవిరాజు” రచనలను చదివిన వారు చాల తక్కువమందే కనపడ్డారు.  కారణం భాష.  త్రిపురనేని రామస్వామి చక్కని తెలుగులో వ్రాసినా,  ఆ తెలుగు వీళ్ళకి పాషాణ పాకం లాగా కనపడుతుండేది. పైగా ఆయన మీద ఆయన రచనల మీద ఒక అభిప్రాయం. ఆయన దేముళ్ళని తిట్టాడు. నేను దేముడ్ని నమ్ముతాను కాబట్టి ఆయన దేముడిని నమ్మడు కాబట్టి ఆయన పుస్తకాలని నేను చదవవలసిన అవసరం లేదని వీరి భావన.

అప్పుడనిపించింది నాకు.  ఈ తరానికి కూడా త్రిపురనేని రచనలు అందాలి.  వాటిని మళ్ళీ మూలాలు చెడకుండా, ఈ నాటి యువత కి అందజెయ్యాలి అని.  మద్రాసులో (చెన్నై ఇప్పడు) ” ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి ఫౌండేషన్” ని స్థాపించడం జరిగింది.  ఆ ఫౌండేషన్ ఉద్దేశాలలో ఇది కూడ ఒకటి.  కవిరాజు రచనలని యువతరానికి వారికి అర్ధమయ్యేరీతిలో వారు వాడుతున్న “తెలుగు” లోనే అందించాలని.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత “కవిరాజు” త్రిపురనేని రామస్వామిని అభిమానించిన కీ శే బొడ్డు రామకృష్ణ, కవిరాజు “సూతపురాణం” రెండు భాగాలని వచనం చేసారు.  2011 లో ఆ వచన “సూతపురాణం” రెండు భాగాల్ని తెనాలి లోని కవిరాజు త్రిపురనేని ఫౌండేషన్ వెలవరించి ఉచితంగానే ఆ పుస్తకాలని పదిమందికి పంచింది.  ఆ “సూతపురాణం” రెండు భాగాల్ని,  పీకాక్ క్లాసిక్స్ , హైద్రాబాదు ప్రచురించింది.

సూతపురాణం వెలువడింది.  మరి మిగతా రచనల సంగతి ఏమిటి?  వాటిని ఎలా ఈ పాఠకులకి అందించాలి?

ఈ నేపధ్యం లో  నేను సంప్రదించిన వారిలో గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఉద్యోగవిరమణ చేసిన, తెలుగు భాషాభిమాని, కవిరాజు త్రిపురనేని రామస్వామి ఆశయాలని నమ్మి ఆచరిస్తూన్న రావెల సాంబశివరావు గారు ఒకరు.  వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిసినవి. త్రిపురనేని వేనరాజు మీద వ్రాసిన “ఖూనీ” నాటిక ని “మన మాటలు” లో ఈ తరానికి అందిద్దాం అని ముందుకువచ్చారు.  వారే దానిని ఈ నాటి తెలుగు చదవగలిగిన వారికి అర్ధమయ్యేరీతిలో, పీఠికలతో సహా వ్రాసారు.  2013 జనవరి లో రామస్వామి జయంతి రోజునే దీనిని ప్రచురించాల్సింది.  కారణాంతరాల వల్ల 2014 జనవరిలో “కవిరాజు” త్రిపురనేని రామస్వామి 127 జయంతి నాడు దీనిని ఈబుక్ రూపంలో మీకు అందజేస్తున్నాను.

బహుశ ఫిబ్రవరి, మార్చి నాటికి అచ్చులో కూడ ఈ పుస్తకాన్ని వెలువరిద్దామని అనుకుంటున్నాము.

మీకు అర్ధమయ్యే తెలుగులో, సుమారు 42 పేజీలూ మాత్రమే ఉన్న ఈ “ఖూనీ” ని చదవండి.  మీకు నచ్చితే పదిమంది కి చెప్పండి. దీని మీద మీ అభిప్రాయాలు ఇక్కడే వ్యాఖ్యల ద్వారా తెలియజేయవచ్చు.
కినిగె.కామ్ లో ఈ కవిరాజు త్రిపురనేని రామస్వామి “ఖూనీ”  ఈబుక్‌ని ఈ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
http://kinige.com/kbook.php?id=2482&name=khooni

కొన్ని వేల ప్రతులని కినిగె తన పాఠకులకి అందించింది.  ఐనా డౌ‌న్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు కాని, చేసుకున్న తరువాత గాని ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ లింక్స్‌ని చదవండి.
http://kinige.com/help.php
ఇంకా అవసరం ఐతే [email protected] కి ఈమైల్ చెయ్యండి.  వారు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు.

ఉంటాను.
అనిల్

విదేశాలలో ‘కవిరాజు‌’ త్రిపురనేని 125వ జయంతి కార్యక్రమాలు

విదేశాలలో కూడా ‘కవిరాజు‌’ 125 జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని నేటి ఆంధ్రజ్యోతి ద్వారా వారి మనుమడు, త్రిపురనేని గోపిచంద్ గారి పుత్రుడూ, లఘు / చలన చిత్ర నిర్మాత, దర్శకుడు, ప్రముఖ నటుడు  త్రిపురనేని సాయిచంద్ తెలియజేస్తున్నారు.

ఈ పత్రికా ప్రకటన మూలంగా కొంత  సమాచారం అందినా, సభా వేదిక, సంప్రదించవలసిన వారి వివరాలు తెలియడం లేదు.  బహుశ స్థలాభావం వల్ల పత్రికలు ఆ వివరాలను ఇవ్వలేక పోయినవేమో! ఆయా ప్రాంతాలలోని తెలుగు వారికి, ‘కవిరాజు’ అభిమానులకి ఆ వివరాలు అందిస్తే బాగుంటుంది. మీలో ఎవరికైన ఆ వివరాలు తెలిస్తే నాకు అందించ గలరు.  అందరికి అందుబాటులో ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ పత్రికా ప్రకటనలో ఉన్న వివరాలతో మీరు ప్రయత్నించ గలరు.

వివిధ దేశాలలో కార్యక్రమం వివరాలు

అమెరికాలోని డల్లస్ నగరంలో మే 14 న  – శ్రీ తోటకూర ప్రసాద్ ఆధ్వ్యర్యంలో,

న్యూ యార్క్‌ నగరంలో మే 15న – శ్రీ త్రిపురనేని తిరుమల రావు ఆధ్వర్యంలో,

సెయింట్ లూయి నగరంలో మే 20 న – శ్రీ దండమూడి ఆధ్వర్యంలోను జరగనున్నాయి.

అలాగే,

ఇంగ్లండ్ లో మే 28 న – శ్రీ చదలవాడ సుబ్బారావు ఆధ్వర్యంలోను,

లండన్ నగరం లో మే 28 న – శ్రీ దాసోజు రాములు ఆధ్వర్యంలోను ఈ సభలను నిర్వహించడానికి ఏర్పాటులు జరిగినవి.

kaviraju anniversary in USA, Canada, UK
అమెరికా,కెనడ, ఐరోపాలలో కవిరాజు త్రిపురనేని రామస్వామి 125 జయంతి ఉత్సవాలు

నేటి ఆంధ్రజ్యోతిలో పత్రికా ప్రకటన

దుర్దినం

 

Eenadu_dated_11thMarch_20110311a_002101013
టాంక్ బండ్ మీద కవిరాజు త్రిపురనేని రామస్వామి (మార్చ్ 10, 2011)

 

*ఈనాడు పత్రికలోని చిత్రం

తెలుగు తల్లి – Telugu Talli by “Kaviraju”

తెలుగు తల్లి

మాలదాసరి నోట, మహితభూసురనోట,
నొకతీరిమాటాడి యొప్పినావు!

మాలవాడలాబాట, మహితభూసురపేట,
నొక్కరీతిగ జిందు తొక్కినావు!

మాలగేస్తునింట, మహితభూసురినింట,
నొకరీతిబదముల నుంచినావు!

మాలపెద్దాలచెవి, మహితభూసురుచెవి,
నొకరీతి సామెతలూదినావు!

కన్నబిడ్డలదెస నొక్క కనికరంబె
చూపి, యెల్లవారికి దారి చూపినావు!
తల్లి! నీ మాట, నీ పాటదలుచుకొన్న
జలదరించుచు మేనెల్ల పులకరించు!

*0*

అతిశయభక్తిన్ వినుమా
ప్రతిభాషింపకయె తెనుగుభాష కుమారా!
అతిమధురం బతిపేశల
మతిపేయము కాదే బాసలన్నిటిలోలన్!

– “కవిరాజు” త్రిపురనేని రామస్వామి

Telugutalli by “Kaviraju” Ramaswamy Tripuraneni

* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.

వీరగంధము

వీరగంధము

వీరగంధము దెచ్హినారము
వీరులెవ్వరొ దెల్పుడీ!
పూసిపోతము మెడను వైతుము
పూలదండలు భక్తితొ!

తెలుగు బావుట కన్నుచెదరగ
కొండవీటను నెగిరినప్పుడు-
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు-

తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందునున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు-

ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలెదు రవంతయున్;
ఇట్టిప్రశ్నలడుగువారలు
లేకపోయిరి సుంతయున్!

నడుము గట్టిన తెలుగుబాలుడు
వెనుక తిరుగడెన్నడున్!
బాస ఇచ్హిన తెలుగుబాలుడు
పారిపోవడెన్నడున్!

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము, మై నలందుము;
శాంతిపర్వము జదువవచ్హును
శాంతిసమరం బైనపిమ్మట!

తెలుగునాటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగిరమ్మిక,
పలు తుపాకులు, పలు ఫిరంగులు
దారికడ్డము రాకతప్పవు!

తెలుగుబిడ్డా! మరిచిపోకురా!
తెలుగుదేశము పురిటిగడ్డరా!
కొక్కరకొ పాటపాడరా!
తెలుగువారల మేలుకొల్పర!

“కవిరాజు” త్రిపురనేని రామస్వామి

Veeragandhamu by “Kaviraju” Ramaswamy Tripuraneni

* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.