స్థిత ప్రజ్ఞులు – శివలెంక రాజేశ్వరీ దేవి

“కలిసారా వీరిని?  ఈవిడే శివలెంక రాజేశ్వరి దేవి, మంచి కవితలు వ్రాస్తుంది” అని తొలిసారి పరిచయం చేసినప్పుడు, “…అలాంటిదేమి లేదండి” అంటూ నేను నమస్కరించే లోపు…అలా వెళ్ళిపోయి ఒక జ్జ్ఞాపకంగా మిగిలిపోయింది.  ఆ తరువాత అప్పుడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి ఆవిడ కవితని చదువుకునే వాడిని.  నాకు మళ్ళీ ఆ మనిషి భౌతికంగా కనపడలేదు.  ఆవిడ పోయిన తరువాత, ఆమె బతికి ఉన్నప్పుడు ఫోనులు (ఆమే తన సొంత ఖర్చుతో చేసినా మాట్లాడలేని వారు, అందరూ కాదులెండి కొంత మంది) భోరున విలపించి సోషల్ మీడియాని చీదేసి, కాగితం రుమాళ్ళతో కన్నీళ్ళని పిండి మరి ముంచేసారు. ఈ కింది కవిత చదివినప్పుడు అదంతా గుర్తు వచ్చింది.  అందుకే ఇక్కడ ఇలా…

అనంతు  చెప్పాడు. కవితలన్నింటిని ఒక పుస్తకంగా వేస్తున్నాము అని.  ఇదిగో ఇలా నామాడి శ్రీధర్ సంపాదకత్వంలో వెలువడింది.  వాళ్ళిద్దర్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టున్నాను…పుస్తకం కావాలని.  చివరికి కత్తి మహేశ్ మొన్న విశాఖలొ యువతరంతో నవతరం కోసం వచ్చినప్పుడు ఈ పుస్తకం ఇచ్చి వెళ్ళాడు.

స్థిత ప్రజ్ఞులు

వాళ్ళు గొప్పవాళ్ళు సుమా నిజంగా
వాళ్ళకి బంధాలు వుండవు ఋణాలు వుండవు
ఋణానుబంధాలసలే వుండావు
కాపలలుంటాయి ముళ్ళకంచె కాపలాలు
అక్షరాలా మన మంచే మనకి కాపలా ఇక్కడ
మనకనేక ఋణాలు అనేక బంధాలూ
అనేక ఆపేక్షలూ అనేక బాధలూ అనేకానేక చిక్కుముళ్ళు
మనం ఇస్తాం తీసుకుంటాం
వాళ్ళు ఇవ్వరు తీసుకోరు
ఇస్తాం గానీ తీసుకోం అంటారు బడాయిగా
వాళ్ళు స్థితప్రజ్ఞులు
ఒఖ్క  టీ ఇచ్చి కూచోపెట్టి
ఎన్నెన్ని స్టేట్‌మెంట్లయినా వినిపిస్తారు
అప్పటికప్పుడు అక్కడికక్కడ
రెడీమేడ్ తీర్పులు చెపుతారు
వారు సర్వజ్ఞ సింగభూపాలురు
వాళ్ళకి కుటుంబం అంటే
‘మొగుడు పెళ్ళాం పిల్లాడూ’ నిర్వచనం
స్నేహితులు శాశ్వతంగా ఉంటారుటండి
మీ పిచ్చిగానీ అనేస్తే
మనం దిమ్మతిరిగి దిక్కులు చూడాల్సిందే

మనకేమో
ఒక సంతోషం ఇటొచ్చి ఒక దిగులు
అటొచ్చి ఒక నవ్వు ఇటొచ్చి ఒక మాట
నవ్వొస్తే పకపకా ఏడుపొస్తే వలవలా
నీ పిచ్చిగాని నీ మిణుగురులుమీంచి సైతం
వెలుగు చూస్తానంటే నవ్విపోతారమ్మా

స్థిత ప్రజ్ఞులు
స్థిత ప్రజ్ఞులు

ప్రతి మనిషి రెండు వైపులుంటాయండీ
అటో చెంపా ఇటో చెంపా
పైకి కనిపించేది కాదు అసలూ…
అంటూ వెర్రి పీనుగుల్ని చేసి
ఎంతైనా చెప్పగలరు ఎరిక్ ఫ్రామ్ లెవల్లో
గూడలు పడిపోయి నవ్వీ నవ్వలేక ఏడ్చీ ఏడ్వ‌లేక
తల ఎటుకేసి వూపుతున్నమో మనకే తెలీని స్థితిలో
సరైన టైమ్‌ అంటే వాళ్ళకి కలిసివచ్చినట్లు
కాలజ్ఞానం తెలిసినట్లు మాటల్ని మాయామయంగా కలిపేస్తారు.
” ఆ( ఇంత చేసి సొంతానికంటూ ఏమీ లేకపోయింది”
సాక్షాత్తు మదర్‌ కే
సానుభూతి చూపే గుండె ధైర్యం వాళ్ళకి
కంకరరాళ్ళు శబ్దం వినీవినీ
మస్తిష్కం మొద్దుబారిపోయింది
ఆ స్థిత ప్రజ్ఞుల వైపు వెళ్లకు
సిక్ సొసైటి మనుషులు వాళ్ళు

నువ్వేమో అమ్మలూ! సేన్ సొసైటి పాపాయివి
అటు పోకమ్మ ‘ఇన్నొసెన్స్’ పోగొట్టుకుని
‘ఇంటలిజెంట్’ అయిపోతావు
చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అనేస్తావు
ఆ ముదిరిపోయి గిడసబారిన ‘ఇంటలిజెన్స్‌’
మనకి వద్దులే తల్లీ!
ఏదో మన మానాన మనం
రాత్రి వర్షాన రాలిన పున్నాగపూలని
చేతుల్లోకి తీసుకుంటూ!

  • శివలెంక రాజేశ్వరి దేవి, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, 31.08.1998 లో ప్రచురితం.

ప్రతులకు / for copies
Namadi Sridhar
Door No: 3-129, Ambajipeta,
East Godavari district, Andhra Pradesh
PIN 533 214
Phone: 93968 07070

సర్వ హక్కులు ప్రకాశకులవే.

“అమ్మ” ఉంది, జాన్!

ఆయనతో నాకు పరిచయం లేదు. సుమారుగా బ్లాగ్‌లోకం రోజులనుండి తెలుసు.  అయినా  మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నది లేదు. ఒకసారి ఎక్కడో పలకరించుకున్న గుర్తు. అయితే ఏం? ఆయన మంచితనం గురించి తెలుసు.  ఈయన పేరు జాన్ హైడ్ కనుమూరి.  నిన్న రాత్రి హటాత్తుగా హృద్రోగం తో వెళ్ళిపొయ్యాడు.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/JphnHydeKanymuri.jpg? w=656" alt="amma" originalw="255" width="300" height="291" scale="2">
జాన్ హైడ్ కనుమూరి – తెలుగు బ్లాగర్ ( ? – 7th Dec 2014 )

ఆయన సంపాదకత్వాన తెలుగులో ఒక ఈ బుక్ వెలువరించాడు.  బహుశ అది తెలుగువారికి రెండవ ఈబుక్ అవుతుందేమో! ఈ మనిషిలో ప్రేమ పొంగినట్టే ..ఆ ఈబుక్ కూడ “అమ్మ” ప్రేమతోనే నిండింది. ఆమే ప్రేమతోను, అమ్మ మీద ప్రేమను వెలిబుచ్చిన  సుమారు 15 మంది బ్లాగర్ల కవితలతోను “అమ్మ”ని కూర్చాడు.  కవితలు కూర్చడానికి కారణం ..కవిత్వం అంటే వల్లమాలిన ప్రేమ జాన్‌కి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/ammaAcompilationByJohnHydeKanumuri_AnilAtluri.jpg? w=656" alt="amma" originalw="584" width="775" height="300" scale="2">
“amma” is a compilation of poetry by a few Telugu bloggers. John compiled them.

జాన్  అమ్మ ఈబుక్ ని తనే డిజైన్ చేసాడు.  డిటిపి మొత్తం అంతా తనే చేసుకున్నాడు.  దానికి ముందు మాటలు వ్రాసాడు.  ఆ ముందు మాటల్లో రెండు వాక్యాలు.
“జన జీవనం వస్తూవుంటుంది, పోతూ వుటుంది, నేను ప్రవహిస్తునేవుంటాను
జాన్ లేడు..కాని …”అమ్మ” ఉంది, జాన్!
ఏందుకో..జాన్ అలా వెళ్ళిపొయ్యాడు అంటే బాధగా ఉంది.

జాన్ సంపాదకత్వాన్న వెలువడిన కొందరి తెలుగు బ్లాగర్ల కవితల సంకలనాన్ని –  “అమ్మ” ఈబుక్ ని ఇక్కడ్నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జాన్ హైడ్ కనుమూరి బ్లాగులు:
http://johnhaidekanumuri.blogspot.in/
http://telugubible.blogspot.in/
http://alalapaikalatiga.blogspot.in/

కవి స్వరాలు

మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో కిన్నెర వారి తెలుగు కవిత మహోత్సవాలు లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన ‘తెలుగు వెన్నెల‘ లో “అనువాద కవిత్వం – దశ – దిశ‘ అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.అంతే కాకుండా అంతకు క్రితం రోజున విశిష్ట కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రత్యేకత ఏమిటంటే వేదిక నెక్కిన ప్రతి కవి తన కవితని తనే చదివి సభకు వినిపీంచాలి.

వేదిక నెక్కిన కవులు, వారి కవితలు వారి గళాలలోనే, మీ కోసం ఇక్కడ.

అద్దేపల్లి రామమోహనరావు

ద్వా.నా.శాస్త్రి

శిఖామణి

ఆశారాజు

శ్రీమతి ఎన్. అరుణ

శ్రీమతి జ్వలిత

రామకృష్ణా రావు

ఫణీంద్ర

వెనిగళ్ళ రాంబాబు

దేవరాజు మహారాజు

ముకుంద రామారావు

వడ్డేపల్లి కృష్ణ

చిమ్మపూడి

ఆచార్య గోపి
రాళ్ళబండి కవితా ప్రసాద్

కవులు గుర్రపు డెక్కలు కారు..కవి శివారెడ్డి

నిన్న రవీంద్ర భారతిలో జరిగిన కిన్నెర వారి తెలుగు వెన్నెల కవిత మహోత్సవాల సందర్భంలో కొందరు కవులు తమ తమ కవితలతో సదస్యులను రంజింపజేసారు. నిన్నటి సభలో కీలకోన్యాసం ఇచ్చిన శ్రీ కె. శివారెడ్డి గారి ఉపన్యాసం కూడా మీరు ఇక్కడ విన వచ్చు.

కవులు గుర్రపు డెక్కలు కారు

 

మొదటి భాగం

రెండవ భాగం

మూడవ భాగం

శివారెడ్డి కవిత ఆయనే ఆలాపించాడు.

గమనిక

మనవాళ్ళు వొట్టి వెధావాయలోయ్
ఇది నా దగ్గిర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో స్ప్రీకర్ అనే అప్‌ తో రికార్డ్ చేసింది.  మధ్యలో వచ్చిన ఫోన్ కాల్సు మూలంగా రికార్డింగ్ దెబ్బతిన్నది.  సాంకేతిక కారణాలు నా నియంత్రణలో లేవు. అందుకని ప్రసంగంలో కొన్ని భాగాలు మీకు అందివ్వలేక పోతున్నాను. మిగతా కవులందరి కవితలను వారి గొంతులతోనే మీకు వినిపించే అవకాశం కలిగించాలి అన్నది కూడ నా ఉద్దేశం.  ఈ రెండు మూడు రోజులలో ఆ పని కూడా ముగిస్తాను.

మో “బ్రతికిన క్షణాలు” లో కొన్ని..

ఆరేళ్ళో అరవై ఏళ్ళో బ్రతుకుతాం.  ఆరేళ్ళముందెలా పుట్టామో ఎవడికి తెలీదు.  అరవై తర్వాత ఎలా చస్తామో మనకి తెలీదు.  తీసుకు తీసుకుని తడిసిన నులక మంచానికి తప్ప ఆరు నుంచి అరవైదాక ఈలోపల బేరామాడ్తాం. చివరకు గిట్టుబాటవుతుంది తప్పక.

ఒకే కవితకు ఆరు అర్థాలు ఒస్తాయని ఒకడు అమ్మ చూపుతాడు.  ఆరూ అనర్థాలే.  అసలు అర్థం అమ్మేవాడికే తెలీదు. కొనేవాడు నూరర్థాలు అడుగుతాడు – ఓ శతాధిక గ్రంధకర్తని.  శతపత్ర సుందరిని అరవై ఏళ్ళ ఆంధ్ర కవిత్వాన్ని ఆరు రూపాయలకే అచ్చెయ్యమంటాడు అరసున్నాలకి అమ్ముడు పోయేవాడు.

మో వీటిని ‘పద మూర్చన’ లన్నాడు. చచ్చిన తర్వాత చెప్పే మొదటి మాటలంట!  పైగా అంటాడు..”వాస్తవాన్ని అధివాస్తవికంగా మలుచుకునే ప్రయత్నంలో వచనం విరిగి ముక్కలయ్యి ఆ గాజు పెంకులు పద్యానికి గుచ్చుకొంటాయి”ట.

“ప్రతి నేనుకి ఒక మేనుంటుంది.  నేను లోంచి మేము, మనం అవటానికే ఏ రచన అయినా.  తారీఖులూ, దస్తావేజులూ ఏమిలేని అనామక స్వీయ జీవన చిత్రణ ఈ ‘బతికిన క్షణాలు‌’.  దృశ్యం అదృశ్యంగాను శబ్దం నిశ్శబ్దంగానూ రంగులు పులుముకుని మాటలుగా మ్రోగుతాయ్.

అంతాలో ఎంతో కొంత యిది.

ఎక్కువ మాట్లాడే వాడు ఏది చెప్పడు.

నిశ్శబ్ద క్షణంలో శాశ్వత శబ్దాన్ని పట్టుకోవాలని

ఈ నూత్న యత్నం”.

వెతకండి..ఎక్కడన్నా దొరికితే, దొరకబుచ్చుకుని చదవండి. చదివి ఆ “బతికిన క్షణాలు” మళ్ళీ బతకడానికి ప్రయత్నించండి.

ఎందుకంటే “మో” ఆ “బతికిన క్షణాలు” అన్నింటిని ఐదు వందల ప్రతులకి మాత్రమే పరిమితం చేసాడు..అది ఒక దశాబ్దం క్రితం!

మో “బ్రతికిన క్షణాలు” తొలి ముద్రణ 1990 – మలి ముద్రణ  2000

అశాశ్వత సత్యం; శాశ్వతం

కవిత నుండి కొన్ని పంక్తులు:

ఎన్ని బాడిలు అన్ని జన్మలు ఎన్నిక్షణాలు

నిల్చి సాగి తూలి జారి రాలి

నిలూనా చీలుస్తాయి నిన్నూ నన్నూ

రక్తాక్షరాలలో ఏ కవి రాసుకుంటాడు ఎన్నని

ఇన్ని సత్యాల్ని ఇన్ని ప్రేగుల్ని

బొమికెల్ని చర్మపు నునుపుల్ని

సౌందర్యపుటుంగరాల్ని కేశపాశపు మోహపు మెలికల్ని

మమతా మైత్రి పాశాలెన్నని తెంచుకుంటాడు

ఎన్ని రంగుల్ని ఉడుపుల్నిఒల్చుకుంటాడు

ఆయాసంతో

ఏ అసఫలీకృత కాంక్షల్ని

పాపం! ఎన్నిటినని పేర్చుకుంటాడు

దేహం గొప్పది దేహమే గొప్పదనకుండా!

ఆత్మలేదు

శరీరం అనాత్మ.

 చితిచింత లోని ఒక కవితలోని పై పంక్తులు “మో” వి.

మో ఇక లేరు.

‘మో’ ఎవరు?

అని నిన్న నన్నొకరు అడిగారు.

ఎక్కడ?

రవీంద్రభారతి, భాగ్యనగరం.

సందర్భం:

తనికెళ్ళ భరణి సాహితి పురస్కార ప్రదానం.

కూర్చోడానికి ఖాళీ కుర్చీ కనపడక అడిగినట్టున్నాడు.  అడిగిందెవరా అని వెనక్కి తిరిగి చూసాను.  కళ్ళజోడు. నెరిసిన జుత్తు. “సభ మొదలైన తరువాత తెలుస్తుందండి మీకు”, అని  మళ్ళీ నా దృష్టిని వేదిక మీదకి సారించాను.

అవధానం జరుగుతున్నది. అప్రస్తుత ప్రశ్న ; ” అత్యంత లోభి కూడ దానం చెయ్యలేనిది ఏది?”.  అవధాని గారు జవాబిచ్చే లోపే, నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ” కాలధర్మం” అని ఘొల్లుమన్నారు.

అధ్యక్షుడు సి. నారాయణ రెడ్డి గారు, నిషాదం అంటే సంగీతంలో సప్తమ స్వరం అని  వివరిస్తూ.. మో పుస్తకం నిషాదం చదవడం మొదలుపెట్టినప్పుడు..”ఏమో‌” అని అనుకున్నానని కాని “అమ్మో” అని అనిపిస్తుందని అన్నారు.

గవర్నమెంట్ ఎలిమెంటరి స్కూల్ళో చదువుకున్న తనకు, “మో‌” నిషాదం మీద మాట్లాడేంత పరిజ్ఞానం లేదని, నటుడు భరణి ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేసారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య.

ఇక తెలుగు భాష బోధకుడిగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, చలన చిత్ర నటుడుగా బ్రహ్మాండంగా సాగిపోతున్న బ్రహ్మానందం,

“అది గది

దాని అద్దె పది”

అనే కవితలోస్తూన ఈ రోజుల్లో, మో నిషాదం చదివి, అర్ధం చేసుకుని, జీర్ణం చేసుకునే అవకాశం ఆ భగవంతుడు తనకివ్వలేదని, తన ఫేసుకి ఆయన ఒక స్టఫ్ ని ఇచ్చి ప్రజలని రంజింపజెయ్యమన్నాడని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులతో పాటూ గా కూర్చోవలసిన తనను, వేదిక మీద కూర్చోపెట్టిన భరణి, తన అభిమానాన్ని చాటుకున్నాడే కాని తనకి ఆ అర్హత లేదని, వినమ్రంగా విన్నవించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘మో‌’ మీద కోపం వచ్చింది.  ఔను, దర్శకుడు శ్రీనివాసే! ‘మో‌’ చదివినంత తను చదవలేదు కాబట్టి, తన కోపం.  ఆ కోపంతో ఆ సాహిత్యం అంతా చదివేస్తానంటాడియన.  అసలు తనకి రవింద్ర భారతి కార్ పార్కింగ్‌లో నిలబడే అర్హత కూడా లేదని కాని భరణి మాట తీసెయ్యలేక వేదిక మీద దాక్కోడం కుదరక కూర్చున్నాని నవ్వుల మధ్య చెప్పాడు.

న్యాయనిర్ణేతలు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆచార్య మృణాళిని, కవి శివారెడ్డి.  తాము ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కవితా సంపుటి “నిషాదం” అని తమకు అందిన 108 కవితా సంపుటాలలో దానిని ఎన్నుకోవడానికి గల కొన్ని కారణాలని వివరించారు, కవి శివారెడ్డి.

తనికెళ్ళ భరణి, చక్కని చామరం క్రింద ‘మో‌’ అని  మనం పిలుచుకునే వేగుంట మోహన ప్రసాద్ ని సుఖాసీనుడిని చేసి, వేద పండితుల మంత్రోచ్హారణల మధ్య  స్వర్ణ పుష్పాభిషేకం చేసారు. వేదికనలంకరించిన పెద్దలలో చలన చిత్ర కథకులు, సంభాషణ కర్త పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వేంకటేశ్వర రావు గారితో సహా అందరూ ‘‌మో’ కి తమ శుభాకాంక్షలు అందజేసారు.

‘మో‌’ తన దైన శైలిలో..ముందే వ్రాసుకుని తెచ్చుకున్న పాఠం నుంచి కొంత మేరకు చదివి వినిపించారు.

బర్త్ డే బాయ్ భరణికి కొంత మంది మిత్రులు తమ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.

జాతీయ గీతం జనగణ మణతో సభ ముగిసింది.

ఎటువంటి హడావిడి లేకుండా, వెకిలి ప్రసంగాలు, అనవసరపు డప్పాలు లేకుండా సాఫీగా, హాయిగా జరిగిన గొప్ప సాహిత్య సభ ఇది.  తెలుగు కవి కి తెలుగు కవిత్వానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ రోజులకి ఇది తొలి రోజు మాత్రమే.

భరణి తన మాటల్లో చెప్పిన “గద్వాల్ సంస్థానం వారి ఆచారం” మళ్ళీ మొదలవ్వాలని..తెలుగు భాష బ్రతకడానికి ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు విరివిగా జరగాలని మనమందరం కోరుకోవాలి.

వీలైతే ‘మో‌’ ప్రసగం పూర్తి పాఠం, అలాగే మితృడు నరేశ్ నున్న ‘మో‌’ మీద వ్రాసి, అచ్చొత్తంచి, ఉచితంగా పంచిన ఒక చిన్న పుస్తకాన్ని మీకు ఇక్కడ అందించడానికి ప్రయత్నిస్తాను.

ఈ తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం జరిగినది కళా ఫౌండేషన్ ఆధ్యర్యంలో..కనకధార వెంచర్స్ సహాయంతో..

కినిగె.కాం లో

తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ  ..  ‘మో’ నిషాదం ఇక్కడ  లభ్యం.