గతంలో మిత్రుడు చంద్రశేఖర అజాద్ రాసిన ఒక నవల విపరీత వ్యక్తులు కి ఒక ముందు మాట తన బలవంతం మీదే రాసాను. ఈ కవిగారి అంతరంగాలు కి రాసిన ముందుమాట తన పుస్తకమే. ఇందులో కూడా తన మిత్రులు కవిరాజు, , గఫార్ గారలతో పాటు ఎందుకో నాతో కూడా రాయించుకున్నాడు. ఇది నిన్న తనకోసం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాను. అది అందరికి అందుబాటులో వుండదని ఇక్కడ ఇస్తున్నాను.
ఇక్కడ ముందు మాటలో చెప్పినట్టు మిత్రుడు ఆజాద్ ప్రతిభావంతుడు కాకపోతే దాదాపు వంద నవలలు రాయగలడా? దాదాపు వెయ్యి కథలు రాయగలిగేవాడా? సరే అవన్ని పక్కన పెడితే సుమారుగా ఒక ఐదువేల టీ వీ సిరియల్ ఎపిసోడ్స్‌కి స్క్రిప్ట్ అందించగలిగేవాడా? కవితలు రాసి మెప్పించగలిగేవాడా? బాల సాహిత్యం రాసి మరి కేంద్ర సాహిత్య పురస్కారం కూడా అందుకున్నవాడు. మరి అటువంటి మనిషి ఇటీవలే విడుదలైన తన ‘కవిగారి అంతరంగాలు’ (తన ఆత్మకథ కాదు తన పరిశీలనకు అందిన వాటి గురించి)కు ముందుమాట రాయమని నా మీద ‘ప్రేమ’ తోనే అడిగాడని అనుకోవాలి. నా బలహీనత. గట్టిగా కాదనలేకపొయ్యాను. కాకపోతే కవులు, కాబోయే-కవులు, ‘కవి’ బిరుదు తగిలించుకోవాలనుకునేవారికి కొన్ని ‘ఘాటు’, కొన్ని ‘స్వీటు’ సలహాలతో నిండిన ప్రయణామవుతుంది తన ‘కవిగారి అంతరంగాలు’. అంతే కాక తన అంబుల పొది నుంచి కొన్ని బాణాలు కూడా సంధించాడు ప్రస్తుతం వున్న తెలుగు సాహిత్య ప్రపంచం మీద. సరే. ఇక్కడికి ఇది ఆపుదాం. ముందు మాటలో కి పదండి.
ఇంకా వుంది ‘నేను ఆల్క హాలికుణ్ణి అయ్యాను.’ పద్యమే మద్యం కాదు ఈ రచయితకి. అలాగని సభానంతర కార్యక్రమాలలో పాల్గొనలేదని కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ కవి సాధారణంగా సాహితీజీవులతో కనపడడు. కాలానుగుణంగా కలాన్ని విదిలిస్తాడు. అది పద్యమో, గద్యమో ఔతుంది. ‘శ్రీశ్రీ కవిత్వంలో మేధావులకు కూడా అర్థం కాని విషయాలున్నవి’ అని అందరు ఒప్పుకోని నిజాన్ని బద్దలుకొడతాడు. అందుకనే కొన్ని సాహితీ సమూహాలు ఈ కవిని దూరంగా పెడతాయి.
నిజమైన విమర్శకులు ఒకప్పుడుండేవారు. బృందాలుగా దాడులు చేస్తున్న కాలమిది, అని చెప్తూ ‘ఆ సమస్త దాడులకు నేను తయారుగా వున్నాను’ అని అంటున్నాడు. నాకు అవార్డులు, రివార్డులు అక్కర్లేదు. కనీసం కొద్దిమంది పాఠకులైనా నన్ను గుర్తిస్తే చాలంటున్నాడు. కవికి కావాల్సింది క్రిటిక్కులు కాదు, రెండు ‘వహ్వాలు’. అలాగని కవిత్వం రాయడం మార్నింగ్ వాక్ కాదు అని ఈ కవి అంటున్నది నిష్టూర సత్యం.
తనలోకి తను చూసుకుంటున్న ఆత్మవిమర్శలో కవితకి ఏం కావాలో, ఎలా కావాలో ఎలా వుండాలో అన్నది ఈ ‘కవిగారి అంతరంగాలు’లో వుంది. తన ఏడుపదుల జీవితంలో వందల కథలు, నవలలు, కవితల నేపధ్యంలో జీవితాన్ని వెలికి తీసి చెప్పుకుంటున్న డాక్యుమెంట్ ఇది. కలం పట్టుకున్న ప్రతివారు ఈ ‘కవిగారి అంతరంగాలు’ని తెరిచి, తరచి చూడాల్సిందే. / ‘కవిగారి అంతరంగాలు’ ధర: ₹100-00 ప్రతులకు: నవోదయ, హైదరాబాద్ వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్ లో కూడా తీసుకోవచ్చు. Navodaya Book House 3-3-865,Opp Arya Samaj Mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027 Mob:+91-9000413413, * విజయవాడలో : కలిమిశ్రీ Malleteega Prachuranalu, 3rd Floor, Subhasri Towers, Vuyyoor Zamindar Street, Gandhi Nagar, Vijayawada PIN 520 003 Mobile: 92464 15150
స్క్రీన్ బీ – త్రీ లోకి ప్రవేశించాడు జిష్ణు. షో అయిపోయినట్టుంది. ఖాళీగా ఉంది థియేటర్. తనకి దగ్గిర్లో కిందపడిఉన్న ఖాళీ ‘లేస్’ కవర్‌ని తీసేస్తున్న క్లీనింగ్ స్టాఫ్‌ని ఉద్దేశించి “నెక్స్ట్ షోకి ఇంకా ఎంత టైముంది?” అని అతను అడిగితే “టెన్ మినిట్స్” అని జవాబిచ్చింది ఆమె. అతను “థాంక్స్” అని గొణుగుతూ వెనక్కి తిరిగి ఫోయర్ ( థిఏటర్ ఆవరణ) లోకి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళాడు.
డోర్స్‌కి రెండువైపులా గోడలకి ఆనించి పొడుగ్గా సోఫాసెట్‌లు ఉన్నవి. వాటికి ఎదురుగా ఫోయర్‌లోనే అక్కడక్కడ డిస్‌ప్లే విండోస్. వాటితో పాటే రిలీజ్ కాబొయ్యే కొత్త సినిమాల పోస్టర్లు, ఫొటో కార్డ్‌లు.
కుడి చేతివైపు సోఫాలో, ఆ చివర గోడకి ఆనుకుని ఒక యువతి కూర్చునుంది. ఆమె కాళ్ళు తన ముందున్న యువకుడి ఒడిలో ఉన్నాయి. వాళ్ళు తమదైన మరో ప్రపంచంలో ఉన్నారు.
జిష్ణు చిరాకుగా ఎడం వైపుకి తల తిప్పాడు.
ఎడం చేతి వైపు సోఫా వరుసలో అటు చివరగా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అతను. లౌడ్ కలర్స్ తో ఉన్న చెక్‌డ్ షర్ట్. స్లిమ్ ఫిట్ డార్క్ బ్లూ కలర్ జీన్స్‌లోకి టక్ చేసుకున్నాడు. లెదర్ బెల్ట్ కొంచెం బిగించినట్టున్నాడు. అయినా పొట్ట బెల్ట్ మీదుగా కొంచెం కిందకి జారి కనపడుతున్నది. కుడి కాలు తొడ మీద, ఎడం కాలేసుకుని కూర్చున్నతను కాస్త తీక్షణంగాను ప్రపంచాన్ని మరిచిపోయి మరీ చూస్తున్నాడు. రెప్పవెయ్యకుండా. అతను చూస్తున్నవైపే జిష్ణు తన దృష్టిని జారించాడు.
అక్కడ చూడ ముచ్చటగా ఉన్న జంట. వారితో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు. ఏడెమినిదేళ్ళుండవచ్చు. కొంచెం ఊరిన బుగ్గలతో, ఎర్ర్రని పెదాలతో, నిగ నిగ లాడుతూ ఆరోగ్యంగా ఉన్నాడు. బ్లేజింగ్ రెడ్ కలర్ టీ. కొంచెం టైట్‌గానే ఉన్నట్టుంది. ఛాతికి అతుకున్నట్టు ఉంది. అది వైట్ కలర్ షార్ట్స్ లోకి టక్ఇన్ చేసుంది. షార్ట్స్ కూడా టైట్‌గా ఉన్నట్టున్నాయి. పిర్రలకి అతుక్కుని లోపలి అండర్‌వేర్ కూడా కనపడి కనపడకుండా కనపడుతోంది. బొద్దుగా, క్యూట్‌గా కూడా ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న ‘జస్టిస్ లీగ్’ సినిమా పోస్టర్ వాడిని ఆకర్షించినట్టుంది. 3డి సినిమా పోస్టర్ అది. వాడు అటు తిరిగి దాని దగ్గిరకు వెళ్ళాడు. ఈ లోపు ఆ బాబుతో ఉన్న ఆమె తనతో ఉన్నతనితో డ్రింక్స్‌కో, ఈటబుల్స్‌కో ఆర్డర్ ఇవ్వమన్నట్టుంది. అతను ఆ ఫోయర్‌లో కుడి చేతి వైపున్న స్టాల్స్ వైపు వెళ్ళాడు.
బాబు పోస్టర్‌ని చూస్తున్నాడు. రెప్ప మూసి తెరిచేటప్పడికి, బ్లూజీన్స్ వ్యక్తి బాబు పక్కనే నిలబడి పోస్టర్‌ని చూస్తూ కనపడ్డాడు. బాబు వైపు తిరిగి ఏదో అన్నాడు. వాడు నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు. అతను బాబు వెనక్కి వెళ్ళాడు. వాడి భుజాల మీద తన చేతులు వేసాడు. బాబు పక్కనే ఉన్న మరో పోస్టర్ దగ్గిరకి వెళ్ళాడు. అతను వాడి భుజాలమీద చేతులు తియ్యలేదు. అలాగే వాడి వెనకే నిలబడి బాబు అడుగులో అడుగువేస్తూ ఫాలో అయ్యాడు. ఇప్పుడు బాబు వెనక్కి ఆనుకుని నడుస్తున్నాడు. బాబు ఎడమ భుజం విదిలించుకున్నాడు. బ్లూ జీన్స్ వాడి భుజాలని వదలలేదు. ఇప్పుడు పూర్తిగా బాబు వెనుకభాగాన్ని బ్లూ జీన్స్ శరీరం ఆక్రమించేసింది. వాళ్ళిదరి మధ్య ఏ మాత్రం ఖాళీ లేదు.
ఇందాక బాబుతో ఉన్నామె ఇప్పుడు మరో పోస్టర్‌ని చూస్తోంది. ఆమెతో వచ్చినతను ఇంకా స్టాల్స్ దగ్గిరే ఉన్నాడు. బాబుని వాళ్ళిద్దరు పట్టించుకున్నట్టు లేరు.
జిష్ణు చూపు ఇప్పుడు ఫోయర్‌లో ఎడం చేతివైపుకి మళ్ళింది. అక్కడున్న ఆ అమ్మాయి ఎదురుగుండా వాల్ డిస్‌ప్లే లో వస్తున్న సినిమా ట్రైలర్ ని చూడడంలో నిమగ్నమై ఉంది.
బ్లూజీన్స్ ఇంకా బాబుని వెనకనుండి గట్టిగా హత్తుకున్నట్టే ఉన్నాడు. బాబు భుజాలు విదిలిస్తున్నాడు. అతని చేతులు వాడి భుజాల మీద బిగుతుగానే ఉన్నాయి. బాబు అసహనంగా కదులుతున్నాడు.
డోర్స్ దగ్గిరున్న జిష్ణు వాళ్ళిద్దరి వైపు కదిలాడు.
బాబు ఈ సారి గట్టిగా విదుల్చుకున్నాడు. బ్లూజీన్సతని చేతులు వాడి భుజం మీద నుంచి జారిపోయినవి. బాబు దాదాపుగా పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ దగ్గిరకి వెళ్లిపోయి నడుం చుట్టూ చేతులు వేసేసి మొహాన్ని ఆమె వొడిలోకి దూర్చేసాడు.
జిష్ణు బయలుదేరిన చోటే ఆగిపొయ్యాడు.
బాబు భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆమె ముందుకి వంగి బాబుకి మాత్రమే వినపడేటట్టుగా ఏదో అడిగింది. బాబు తల విసురుగా విదిలిస్తున్నాడు. బాబు భుజాలు పట్టుకున్న ఆమె కిందకి మోకాళ్ళమీదకి వంగి బాబుని సముదాయిస్తూ మాట్లాడుతోంది. బాబు తల పైకెత్తకుండా ఏదో చెబుతున్నాడు. ఆమె తల తిప్పి అటు ఇటు చూసింది. మళ్ళీ వాడి గెడ్డం పట్టుకుని తలని కొంచెం ఎత్తి వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఈ సారి వాడి కళ్ళనిండా నీళ్ళు. బుగ్గలమీద చారికలు కనపడ్డాయి జిష్ణుకి. వాడు కళ్ళు అటు ఇటు తిప్పి ఆ బ్లూ జీన్స్ వ్యక్తి వైపు సారించి ఆవిడతో ఏదో చెప్పాడు.
సరిగ్గా అప్పుడే స్టాల్స్ దగ్గిరున్నతను వెనుతిరిగాడు.
విసురుగా ఆమె లేచి నిలబడి బాబు కుడి చెయ్యి మణికట్టు దగ్గిరపట్టుకుని దాదాపుగా లాక్కుని వెళ్తున్నట్టు, బ్లూజీన్సతని వైపుకి బయలు దేరింది. స్టాల్ దగ్గిర నుండి వెనక్కు తిరిగినతను ఆమె హడావుడిని గమనించి అనుసరించాడు.
ఫోయర్‌కి ఎడం చేతివైపున్న (‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’) సినిమా వాల్ పోస్టర్ని చూస్తోంది, ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి. పన్నెండు పదమూడేళ్లు ఉంటాయేమో! వైట్ హెయిర్ బాండ్ కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు, భుజాల మీదుగా వీపు మీదకి జారుతోంది. టాప్ టైట్‌గా ఉంది. వికసిస్తున్న (రానున్న) టీన్స్‌ని దాచలేక పోతోంది ఆ టాప్. రెడ్ కలర్ బెల్ట్ ఉన్న బ్లూ కలర్ జీన్స్‌కి ఆ టాప్‌కి మధ్య మెరుస్తూ కనపడుతున్న నడుం. రివెటెడ్ బటన్స్‌తో ఉన్న హిప్ హగ్గింగ్ జీన్స్ అవి!
బ్లూ కలర్ జీన్సతని దృష్టి ఆ అమ్మాయి మీద పడినట్టుంది. నెమ్మదిగా ఆ అమ్మాయి పక్కకి చేరుకున్నాడు. నవ్వుతూ ఆ అమ్మాయితో ఏదో అంటూ చనువుగా ఆమె ఎడం భుజం మీద తన ఎడం చెయ్యి వేసాడు.
జిష్ణు దృష్టిలో పడిందది. జిష్ణు దూకుడుగా వాళ్ళిదరి వైపుకి అడుగులు వేసాడు.
ఫెటేలన్న మోతతో ఆ ఫోయర్ దద్దరిల్లింది. ఒక్కసారిగా అందరు ఉలికి పడ్డారు. అప్పటికే బ్లూజీన్సతని దగ్గిరకి బాబు, ఆమె, అతనూ చేరారు. జిష్ణు కూడా.
జిష్ణుని చూడగానే ఒక్క గెంతులో అతని పక్కకి చేరి అతని కుడి చేతిని పెనవేసుకుంది ఆ వైట్ టాప్, బ్లూజీన్స్ అమ్మాయి, “మామయ్యా!” అంటూ ఏడుపు గొంతుతో. తన ఎడం చేత్తో ఆ అమ్మాయిని దగ్గిరకు తీసుకున్నాడు జిష్ణు.
ఎర్రగా కందిపోయిన ఎడమ చెంపని రుద్దుకుంటూ బ్లూజీన్స్ అక్కడి నుంచి పరుగువేగంతో ఫోయర్ లోని లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా, మెట్ల మీదుగా దూకుతూ కిందకి వెళ్లిపోయ్యాడు. బాబుతో ఉన్నావిడ ఆవేశంతో రొప్పుతోంది. ఆతను ఆమెను చూస్తూ నిలబడిపొయ్యాడు. కళ్ళు నులుముకుంటున్నాడు బాబు.
Footnote దాదాపు ఐదేళ్ళక్రితం ఖదీర్‌బాబు, కె సురేశ్ , తాము 2018 నిర్వహించిన రైటర్స్‌మీట్‌లో పాల్గొన్న వారు రాసిన కథలను, కొత్తకథ 2018 మకుటంతో వెలువరించిన సంకలనంలో ప్రచురించిన కథ ఈ #మీటు. సంకలనంలో వచ్చిన కథలని కనీసం రెండు సంవత్సరాలు బయట ఎక్కడ ప్రచురించరాదని వారి సూచనని మన్నించి ఇప్పటివరకు దీనిని ప్రచురించలేదు. కథలలో సత్తా వుంటే పాఠకులు గుర్తుపెట్టుకుని, వెతుక్కుని మరీ చదువుతారనే బలమైన అభిప్రాయం మరొక కారణం. వెతుక్కోవడానికి ముందు వుండాలిగా అందుకని ఈ అంతర్జాలంలో ఈ బ్లాగులో...
౨ - ఈ కథ పూర్వాపరాలకు చెందిన మరికొంత అదనపు సమాచారం ఈ లంకె లో చదువుకోవచ్చు. ౩ - దిగువనున్నది కొత్తకథ2018 సంకలనాన్ని, 13 మే 12018 ఉదయం, తెలుగు విశ్వవిద్యాలయం, భాగ్యనగరంలో ఆవిష్కరించిన సందర్భలో, నా హితోభిలాషి, కవి దేవిప్రియగారి నుండి ప్రతి అందుకుంటున్నప్పటిది.
కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః ధర: రూ 149.00 మాత్రమే (24 కథలు) ♣ నవోదయ బుక్ హౌజ్ 3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027, Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387 Email:[email protected] Web: www.TeluguBooks.in
వినూత్న తెలుగు సాహిత్య వాతావరణంలో ఒక కొత్త సంస్కృతి వచ్చి చేరింది. అది మంచిదిలాగే కనపడ్తుంది గానీ దాని వల్ల కల్గే హాని చాప కింద నీరులా విస్తరిస్తూ పోతుంది.
కొత్తగా రాస్తున్న వాళ్ళలో చాలా మంది “కాఫ్కాని చదువు, మాయా ఫలానా రచన చదివావా? మంటో శైలి ఎంత గొప్పదంటే, ఫలానా ఫ్రెంచ్ రచయిత ఏమన్నాడంటే, ఫలానా ఇంగ్లీష్ నవల్లో ఒక చోట రచయిత ఇలా అంటాడు” అని ఉటంకిస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే వీళ్ళలో తొంబైశాతం మందికి మన సొంతింటి సుగంధాలు బహుదూరం. వాళ్ళేమన్నారో, రాశారో తెలీదు. పక్కా లోకల్ చాసోనో, కుటుంబరావో, రావిశాస్త్రో తెలుస్తారని, వాళ్ళ పుస్తకాలు వీళ్ళు చదివారని మనం అనుకోకూడదు. చాలామంది కొత్త రచయితలకి వీళ్ల పుస్తకాలు గ్రీకూ లాటినూ.
ఆనాటి పాత సాహిత్యాన్ని ఇష్టపడి చదివే పాఠకులకు అపురూపంగా దొరికిన కొత్త పుస్తకం అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు (కొత్త ముద్రణ).
అనేక సంవత్సరాల నుంచి పెండింగ్‌లో పెట్టబడిన ఈ పుస్తకాన్ని పిచ్చేశ్వరరావుగారి కుమారుడు, రచయిత అనిల్ అట్లూరి ఎట్టకేలకు ఇటీవల తీసుకు వచ్చారు. ఈ పుస్తకంలో పిచ్చేశ్వరరావుగారివి 26 కథలు, నాలుగు పుస్తక సమీక్షలు, అనిల్ రాసుకున్న కొన్ని మాటలూ, జ్ఞాపకాలూ ఉన్నాయి. పుస్తకం పేపర్ క్వాలిటీ అంత గొప్పగా లేకపోవడం కొంత నిరాశపరిచే విషయం. తర్వాతి ముద్రణలో ఈ విషయమై ప్రకాశకులు జాగ్రత్త పడాల్సి ఉంది. అలానే పిచ్చేశ్వరరావు కథలకే ఈ పుస్తకాన్ని పరిమితం చేసుంటే బాగుండేదేమో. కాని ఇవి పట్టించుకోవలసిన అభ్యంతరాలు కావు. ఈ పుస్తకంలో కథలు అలాంటివి.అట్లూరి పిచ్చేశ్వరరావుగారి పేరు తెలిసినవారికి ఆయన కథకుడిగా కంటే అనువాదకుడిగా ఎక్కువగా తెలుసు. ముఖ్యంగా కిషన్ చందర్ అనువాదకుడిగా. ఆయన సినిమా రచయితగా కూడా పని చేశారు. ముఖ్యంగా ‘వెండితెర నవల’ కాన్సెప్ట్ పిచ్చేశ్వరరావుగారితోనే మొదలైందని కోతి కొమ్మచ్చిలో ముళ్ళపూడి కూడా రాస్తారు. తొలి వెండితెర నవల గౌతమ బుద్ధ. అది రాసింది పిచ్చేశ్వరరావుగారు.
పూర్తి సమీక్ష చదవడానికి ఈ లంకె మీద క్లిక్ చెయ్యండి.
ఆయన యుద్ధకాలాన్ని చూశారు. స్వయంగా నేవీలో పనిచేశారు.
ఈ పుస్తకం చదివాక, రచయితగా ఆయనేమిటో తెలిశాక, ఆయన ఇంకా ఏమి రాశారనే ఆలోచన పాఠకుడి మెదడులో తప్పక మొలకెత్తుతుంది. అటువంటి ప్రభావశీలమైన కథలు ఇందులో ఉన్నాయి.
రచయిత విప్లవ వాది కావడంతో దాదాపు అన్ని కథల్లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది. దాదాపు ప్రతి కథా ఒక విముక్తిని సూచిస్తూ ముగుస్తుంది. సుబ్బమ్మ కథ ‘సంఘానికీ జై’ అని ముగిస్తే, నెత్తురు కథ ఆసాంతం ఎర్రెర్రగా సెగలు కక్కుతుంది.
చిరంజీవి కథ ఒక విప్లవ తరంగమే. ఆయన కథలన్నిటిలోకీ ది బెస్ట్‌గా ఈ కథను విమర్శకులు ఎన్నిక చేస్తారు.
‘ఇదిప్పుడు మన దేశమే’, ‘బ్రతకటం తెలియని మనిషి’, ‘జీవచ్ఛవాలు’ ఇత్యాది కథలన్నీ సామాజిక అంశాలు, నిరసన, తిరుగుబాటు తత్వాలతోనే నిండి ఉంటాయి. అమెరికా నుంచి వచ్చిన నావికుడి కథ జీవచ్చవాలు. యుద్ధం ప్రజల జీవితంలోనే కాదు, యుద్ధంలో పనిచేయాల్సి వచ్చినవారి జీవితంలోనూ ఎంతటి అశాంతిని మనిషి జీవితంలో నింపుతుందో. అందుకే ఆ కథలో చివర్లో “మళ్ళీ టోవెడో (నౌక)ఎప్పుడొస్తుందిరా?” అని రచయిత స్నేహితుడు అడుగుతాడు. “ఎందుకురా?” అని కథకుడు అడిగితే అతడంటాడు. “ఆ మృతజీవిని చూడాలిరా.”
ప్రతి కథలోనూ మానవతాకోణం అంతర్భాగమై అల్లుకుపోయి ఉంటుంది. మనుషులన్నా, స్వేచ్చ అన్నా, స్వాభిమానమన్నా, పోరాటమన్నా, ముఖ్యంగా చిక్కని ఎరుపన్నా రచయితకు మహా ప్రేమ. మనుషుల కోసం, మానవకల్యాణం కోసం ప్రతి కథలో రచయిత తపిస్తాడు. జీవితంలో దుఃఖానికి కారణాలు అన్వేషిస్తాడు.
కథాకాలాన్ని అనుసరించి ఈ కథల్లో యుద్ధ వాతావరణమూ, యుద్ధం మీద చర్చా ఉన్నాయి. రచయితకు ఉన్న అపార విజ్ఞానం ఈ కథల్లో చోటు చేసుకున్న సంఘటనల మీద, అంతర్జాతీయ పరిణామాల మీద ఆయన వ్యాఖ్యానం తేటతెల్లం చేస్తుంది. స్వయంగా నేవీలో కొంతకాలం పనిచేసిన రచయిత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో పాల్గొని ఉండటం ఆయన నేవీ కథలకు నేపథ్యం అని స్పష్టమవుతుంది.
చిరంజీవి కథ ఈ నేపథ్యంలోంచి పుట్టిందే. ప్రతి పాఠకుడినీ కదిలించే ఈ కథ తెలుగు కథాసాహిత్యంలో నిజంగా ఎప్పటికీ నిల్చిపోయేదే.
చిరంజీవి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రత్యేక వ్యక్తిత్వపు కథ. ఎవరికీ లొంగని, ఎన్నడూ జంకని చిరంజీవి మిలటరీ హాస్పటల్లో పడి చివరి క్షణాల్లో మూలుగుతున్నపుడు కథకుడు అతని కథ మనకి చెపుతూ పోతాడు. అధికారులను ఎక్కడికక్కడ ఎదిరిస్తూ, ప్రశ్నిస్తూ, తిరగబడుతూ, తోటి సైనికుల్ని తన మాటలతో, ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి, రక్తాన్ని పరుగులు పెట్టించి విప్లవ జ్వాలలు రేపిన చిరంజీవి చచ్చిపోతాడేమో అని గుండె దడ పుట్టిస్తాడు రచయిత. చివరికి డాక్టరు లోపల నుంచి వచ్చి కళ్ళు తుడుచుకుని “చిరంజీవి చనిపోలేదు, అట్లా చూస్తావేం? వీళ్ళంతా చిరంజీవులే, ఈ జనం చిరంజీవులే” అని పాఠకులకు చిరంజీవితో ఎనలేని బంధాన్ని క్షణంలో కట్టేస్తాడు.
మసకబారిన చూపు మధ్య నుంచి ఆ తర్వాతి వాక్యం “ఎస్. బీ. ఏ. చేతుల్లోంచి తుపాకీ లాక్కున్నా నేను” అని కనపడి అని చిరంజీవిని నిజంగా చిరంజీవిని చేస్తుంది.
‘కథకుడికిగా పిచ్చేశ్వరరావు’ అని కొడవటిగంటి కుటుంబరావు 1967లో రాసిన వ్యాసంలో “ఒక మనిషి చావు అవాస్తవం అనిపించడానికి కారణం ఏమిటని నేను ఆలోచించాను. ఆ మనిషి మీది ప్రేమాభిమానాలు మాత్రమే అందుకు కారణం కావు. మనిషితో పాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో ఉంటుంది. అదే మనిషి చావుని నమ్మశక్యం కాకుండా చేస్తుంది” అంటారు. డాక్టరు వచ్చి “చిరంజీవి చనిపోలేదు, ఈ జనమంతా చిరంజీవులే” అన్నపుడు, చప్పున ఈ వాక్యం గుర్తొస్తుంది.
ఈ కథలు చదివి, పుస్తకం అలా గూట్లో పడేసి పక్కకి పోలేం. అలా అని పుస్తకం ఎదురుగా ఉంటే అది వేసే ప్రశ్నల్ని మనం తట్టుకోలేం. వెంటాడి ప్రశ్నించి వేధించే పుస్తకం ఇది.
మనం బజారుకి పోతే, ఏ ఆస్పత్రి సందు చివరో చిరంజీవి కనపడి పలకరిస్తాడేమో, ఏ సుబ్బమ్మో కనపడి నినదిస్తుందో, వసుంధర గురించి తనకేం తెలుసో ఆ రోడ్డు చెప్తుందేమో, శాస్త్రి పలకరిస్తాడా, విమలాదేవి ఎదురై విషాదంగా నవ్వుతుందా అన్నంతగా జీవం నింపుకున్న ఆ పాత్రలన్నీ మన వెంట పడతాయి.
పుస్తకం మొదలు కావడమే నెత్తురు కథతో మొదలవుతుంది. అది నెత్తురా, మనిషా, ఆత్మా, రక్తమాంసాలు నిండినా మనిషా?
‘రంగేసిన గుడ్డ కాదది, నెత్తురు పులుముకున్న గుడ్డ, నీలా నాలా బతికిన మనిషి నెత్తురు’ అని స్పష్టత ఇస్తాడు రచయిత. ఆ నెత్తురులో తెల్ల రక్తకణాలూ ఈదినై, ఎర్ర రక్తకణాలూ ఈదినై అంటాడు.
ఈ కథల నిండా గట్టి గుండె, స్థిరమైన ఆలోచనలు, మొండి తిరుగుబాటు స్వభావమూ ఉన్న మనుషులు పలకరిస్తుంటారు. నేవీలో ఆవిరి మెషిన్ లీకేజ్ నుంచి అందరినీ కాపాడిన చిరుద్యోగికి పెన్షన్ ఇవ్వ నిరాకరించి “గేటు దగ్గర కూచునే ఉజ్జోగం చేస్తావా పోనీ” అన్న ఆఫీసరు మొహాన్న పేణ్ణీళ్ళు కొడతాడతను.
తన పెన్షన్ గవర్నమెంట్‌కి వృథా ఖర్చు అన్న ఆ అధికారికి, ఆనాడు జరిగిన సంఘటన మొత్తం చెప్పి నేవీ ఆఫీసర్ల జీతాలెంత వృథానో వివరించి, “గేటు కీపర్ ఉజ్జోగం చెయ్యను” అంటాడు. ఇలాంటి వ్యక్తులే కాదు, జీవం నిండిన వాక్యాలు, చదవగానే ఎప్పటికీ గుర్తుండిపోతాయేమో అన్నట్టుండే మెరుపు వాక్యాలు, కథకు నిండుతనాన్ని తెచ్చిపెట్టే వాక్యాలు ఈ కథల నిండా పరుచుకుని ఉంటాయి.
– నేటి నుంచీ నేను స్వతంత్రుణ్ణట. ఔను, కాదనేందుకు నాకు స్వాతంత్ర్యం లేదు (ఆగస్టు 15 న).
– మారే పరిస్థితుల్లో చావు బతుకులు చోట్లు మార్చుకుంటాయి. వీళ్ళందరూ చావంటే ఉన్న భయంతో బతుకుతున్నారు గానీ, బతుకంటే ఉన్న మమతతో కాదు ( బ్రతకటం తెలియని వాడు).
– చేతిలో ఉన్న చావుని చూసి భయపడటానికి ఒప్పుకోక పోతే గతంలో బతకండి (వెర్రి కాదు వేదాంతం).
అభ్యుదయపు మేలిముసుగుల మీద ఛెళ్ళున తగిలే సన్నని చర్నాకోల దెబ్బలున్నాయి ఈ కథల్లో.
‘మనవాళ్ళమ్మాయే’ కదాని పనిలో పెట్టుకున్న సుబ్బమ్మని ‘సుబ్బి’ అని పిలిచే రమణయ్య లాటి మనుషుల మీద చెణుకు: “మనవాళ్ళ పిల్లే కదా, మరి సుబ్బీ అని పిలుస్తావేమిరా?” అని అడగబోయిన కథకుడు “ఒకవేళ మన వాళ్ల పిల్ల కాకపోతే వాడు సుబ్బీ అని పిలిస్తే నేనేమి అభ్యంతరం చెప్పే వాడినో” అంటాడు.
పాపారావు తండ్రి, మాల వాళ్ల సరసన కూచుని భోజనాలు చేసిన మనిషి. కొడుకు మాత్రం వెట్టి వెంకడి కొడుకుతో గోళీలాడ్డం అతనికి సుతరామూ నచ్చదు. వెంకడొచ్చి వీడిని “చిన్న దొరగారూ” అంటుంటే, వెంకడి కొడుకొచ్చి “పాపారావూ, రావోయ్ గోళీలాడుకుందాం” అని పిలుస్తుంటే ఆయనకు మండుతుంది. “మాలవాళ్ల చేత నీళ్ళెందుకు పోయించుకుంటున్నావంటే, వాళ్లంటే ప్రేమ ఉండీ కాదు,అంటంటే పెడమొగం ఉండీ కాదు, పడమర చెరువు మీ ఇంటికి అరమైలు దూరంలో ఉంది. ఇంట్లోకి కావల్సిన పది కావిళ్ళూ మోస్తే పెద్దలు గుర్తొస్తారని చేస్తున్నావు ఈ సంస్కరణంతా. మీ పాలేరుకు పది సోలలు వడ్లెక్కువ కొల్చావా? పది రోజులు సెలవులిచ్చావా?” అని పక్కింటి వాడు అడుగుతాడేమో అని పాపారావు భయపడుతున్న మాటలు తాను అనేస్తాడు రచయిత.
కొన్ని కథలు ఆలోచనల ప్రవాహంతో చైతన్యస్రవంతి శైలిలో సాగుతాయి. వెర్రి కాదు వేదాంతం, ఒక అనుభవం, కోరిన వరం ఈ కోవలోవే. అబ్‍స్ట్రాక్ట్ చిత్రణ పిచ్చేశ్వరరావుగారికి అతి సులభమైన ప్రక్రియగా తోస్తుంది కొన్ని కథలు చదువుతుంటే. ఓల్గా అన్నట్టు ఆయన చిన్న వయసులోనే కాలం చేయకుండా ఉండి ఉంటే, తన మార్మికతతో తెలుగు సాహిత్యపు మార్కెజ్‍గా మిగిలేవారే.
వసుంధర కథ తెలుగు కథా సాహిత్యంలో ఎన్నడూ చూడని, ఎవరూ చేయని ఒక వినూత్న ప్రయోగం. వసుంధర గురించి ఆమె చదువుకున్న కాలేజీ, ఆమె నడిచిన రోడ్డూ, గడ్డీ అన్నీ వివరంగా చెపుతుంటాయి. మధ్యలో కాలం, వ్యక్తులు వచ్చి మార్పులు అనివార్యమంటుంటాయి. కథ వసుంధర చుట్టూనే తిరిగినా, ఆమె ఎక్కడా మాట్లాడదు. ప్రజాకంటకుడైన భర్త నుంచి సమాజాన్ని కాపాడటానికి వసుంధర చేసిన పనిని కూడా వసుంధర చెప్పదు. ఇటువంటి కథ బహుశా ఇంతకు ముందెన్నడూ చదివి ఉండం. ఈ సంకలనంలో ఇదొక ఆణిముత్యం లాంటి కథ. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఈ వసుంధర. ఒక బలమైన వ్యక్తి ఆమె, రాజీ పడిని నిక్కచ్చి మనిషి.
వేదన, హింస అనుభవిస్తూ కూడా, రేపటిలో వెలుగు చూసి సర్దుకుపోయే ఇద్దరు స్త్రీల కథలు ఇందులో ఉన్నాయి. గడిచిన దినాలు కథని ఉత్తమ పురుషలో నడుపుతూ రచయిత, తల్లి పాత్రని వర్ణించిన విధానం చదువుతుంటే గుండె చెమరుస్తుంది.
పని మనిషి మరో కథ. ఇందులో కథ మొత్తం కథలోని భార్యా భర్తల మధ్య నడుస్తుంది గానీ రచయిత వారింట్లో పని చేసే పని మనిషిని శీర్షికగా ఎంచారు. తన వెగటు అలవాట్లు మార్చుకోలేక, భార్య అందాన్ని, పరిశుభ్రతను సహించలేక, తాను స్వయంగా ఆత్మన్యూనత పాలవుతూ, ఆమెపై గెలవటానికి ఆమె పుట్టింటిని ఎద్దేవా చేసే విమలా దేవి భర్త, చివరికి ఆత్మన్యూనత ఉక్రోషంగా మారి భార్యను ఇనపచువ్వతో చితకబాదుతాడు. పర్యవసానం పైడితల్లి నెత్తిన పడుతుంది. ఇటువంటి భర్తలు కూడా చిరంజీవులే, కాలాతీత వ్యక్తులే ఒక విధంగా. ప్రతి సమాజంలోనూ, ప్రతి వీధిలోనూ ఉంటారు.
తీరని కోరిక కథలో ‘కోరికలలో తెగలూ తరగతులూ తప్పించుకోలేని వాళ్లం, తరగతులూ తెగలూ లేని సమాజాన్ని సృష్టించుకోగలమా?’ అనే వాక్యం రేకెత్తించే ఆలోచనలు అసంఖ్యాకం. శాస్త్రి, కథకుడు, వింత మరణం, గడవని నిన్న – దేనికదే సరి కొత్త ఇతివృత్తం, అబ్బురపరిచే శైలి, దొరికినట్టే దొరికి జారిపోయే వాక్యం.
గొప్ప రచయితలు నిశ్శబ్దంగా రచనలు చేస్తారు. తమంతట తాము మన దగ్గరికి రారు. మనమే వెదికి పట్టుకోవాలి. తెలుగు రాయడం తెలియడమే అర్హతగా కథారచన సాగుతున్న ఈ రోజుల్లో, అట్లూరి పిచ్చేశ్వరరావుగారి రచనలు చదవడం ఒక అవసరం. ఒక పాఠం.
ఇన్ని రోజుల తర్వాత ఈ పుస్తకం తెలుగు పాఠకుడి చేతిలోకి రావడం తెలుగు సాహిత్య వాతావరణంలో ఒక మేలి మలుపు. కొత్తగా రాస్తున్న వాళ్ళూ, ఎప్పటి నుంచో రాస్తున్న వాళ్ళే కాక, పాత కొత్త పాఠకులు, సాహితీ ప్రేమికులూ తప్పక చదవవలసినవి అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు.
ఇవి పాఠకులని నిరాశ పరచవు సరికదా, పాత సాహిత్యం ఎంత గొప్పదో తెలిసి మరి కొన్ని పాత పుస్తకాలూ తిరగేసేలా చేస్తుంది.
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు పుటలు: 280 ప్రచురణ: CLS Publishers, Hyderabad. పుస్తకం ధర: 250రూ.
ప్రతుల కోసం ఈ లంకెని క్లిక్ చెయ్యండి: లభ్యం: నవోదయా బుక్‍హౌస్ (హైదరాబాద్), పల్లవి పబ్లికేషన్స్ (విజయవాడ), అనల్ప ప్రచురణలు, అమెజాన్, లోగిలి (గుంటూరు), బుక్ సెంటర్, వాగ్దేవి (విశాఖపట్నం).
కాస్త సిగ్గేసింది… మూడుదశాబ్దాల జీవితంలో చాలా చదివా అనే గర్వం లాంటిది ఏ మూలనైనా ఉంటే అది సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. అట్లూరి పిచ్చేశ్వరరావు అనే పేరు కేవలం అనువాద రచయితగా మాత్రమే తెలుసు నాకు. అదీ… కిషన్ చందర్ రచనలవరకే…అయితే…! ఇదిగో ఈ పుస్తకం చూశాక ఈ కథలు చదివాక, ఒకానొక ఉద్విగ్న, దుఃఖ సమయాలని అనుభవించాక.. మా తరంమీద జాలేసింది. కొత్త కొత్త పుస్తకాలని తెస్తున్నాం, చూస్తున్నాం ఆధునిక సాహిత్యాన్ని మళ్లీ వెలుగులతో చూస్తున్నాం. కానీ, ఒకానొక కాలపు వెతలని ఇంత హృద్యంగా మళ్లీ చదవటం ఒక అనుభవం. భాష, కథనం రెండూ కలిసిన ఒక ఫ్లో… అద్భుతం కదా ఈ అనుభవం.
ఈ కథల్ని ఇప్పటికైనా చదవగలిగాను.. చదువుతూ గుండె చప్పుడు పైకే విన్నాను, కంటినుంచి అప్రయత్నంగా వచ్చిన కన్నీటి చుక్కని తుడుచుకుంటూ పుస్తకాన్ని చేతిలో ఆప్యాయంగా పట్టుకున్నాను… అట్లూరి పిచ్చేశ్వరరావుని అభిమానించుకున్నాను…
నెత్తురు కథలో… ఒక కాలాన్ని, ఒక పోరాటాన్ని అనుభవిస్తూనే ఆనాటి కాలాన్ని దర్శించుకున్నాను. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాంశాలని. పోరాట జీవితకాలాలని ఇంత హృద్యంగా టచ్ చేయటం, దాన్ని ఇంత అందంగా రాయటం. ఎలా పట్టుబడుతుందీ కళ!? “ఆ.. అదే ఎర్రజండా. సుత్తీలేదు,కొడవలీ లేదు. నిజమే! ఆ రంగు గూడానూ.. రంగేసిన గుడ్డ కాదది. నెత్తురుపులుముకున్న గుడ్డ. నీలా నాలా బతికిన మనిషి నెత్తురు…” (నెత్తురు కథ) పాఠకుడా! ఎట్లా భరించగలవీ వలపోతని? నిజంగా రాయటానికి ముందు ఆ రచయిత మామూలు మనిషిగా ఎలా భరించాడీ వ్యధని?? కథ సమకాలీన పరిస్థితులకి కూడా అచ్చంగా సరిపోయేదే మన దేశపు ముఖ చిత్రమైన నెత్తుటి బతుకు చిత్రణ ఈ కథ.
“చిరంజీవి చనిపోలేదు. అట్లా చూస్తావేం! వీళ్లంతా చిరంజీవులు కాదూ! ఆ (తిరగబడే) జనమంతా చిరంజీవులే!!” అంటున్నాడు డాక్టరు. ఎస్.బీ.ఏ. చేతిలోంచి తుపాకీ లాక్కున్నాను నేను… ఇక్కడితో “చిరంజీవి” కథ ముగుస్తుంది. కానీ ఆ చిరంజీవి ఇచ్చిన ఆలోచన మనలోనూ మొలకెత్తిపోయి ఉంటుంది. ఆ ఫీల్ నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. అది ముద్ర రచయిత వేసిన ముద్ర.
“తెలివిగల నాలుక పనిచేయదోయ్ పిచ్చి! నవ్వే మొఖం పని చేస్తుంది” అంటుంది విన్నీ. (గడవని నిన్న) ఎన్నెన్ని ముఖాల, మరెన్ని మనుషుల్ని చూసిన అనుభవం ఇది. ముఖ్యంగా ఆ కథల్లో కనిపించే వాతావరణం. అచ్చంగా మనం ఆ పరిసరాలని ఊహించుకుంటూ చదవగలిగేంత స్పష్టంగా ఉంటుంది. అసలు దాదాపుగా వందేళ్ల కిందట రాసిన కథ… ఇప్పుడు ఈ కాలాన బతుకుతున్న కుర్రాడికి కూడా అదే అనుభవం ఇవ్వటం… వ్యవస్థ వైఫల్యమా? రచయిత భవిష్యద్దర్శనమా?? (ఆగస్టు 15న) ఒక ఆలోచన, అబ్స్ట్రాక్ట్ చిత్రణ. ఎన్నెన్ని ఆలోచనలకు మొలకలు వేసిన కథ ఇది. “నేటినుండీ నేను స్వతంత్రున్నట. ఔను! కాదనేందుకు నాకు స్వాతంత్రం లేదు.” ఎప్పటికాలపు వ్యాఖ్య ఇది!!? నిన్నా మొన్నా కూడా ఇదే వినపడిందే…!!!
నిజానికి తెలుగులో కథలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అద్భుతం అనిపించే థాట్, కొత్త రకపు ప్రజంటేషన్ మనల్ని చకితుల్ని చేస్తుంది. “వసుంధర” కథ రాసిన తీరు. ఇలాంటి ఫార్మాట్ లో కథ రాయొచ్చనే ఆలోచనే ఒక తిరుగుబాటు. స్టిల్ ఎ ఫ్రెష్ ఫీల్ ఇన్ ఇట్. అంత వైవిధ్యంలోనూ…. చెప్పాలనుకున్న విషయం సూటిగా పాఠకుడి మెదడుకు చేరుతూనే ఉంటుంది. చదవడంలో ఏమాత్రం అడ్డంకి ఉండదు. ఖచ్చితంగా ఇవి ఈనాటి కొత్త రచయితలకు అందాల్సిన కథలు, రాబోయే తెలుగు పాఠకులకు చేరాల్సిన విషయాలు. బహుశా ఇలాంటి శైలిలో తెలుగు కథ నావరకూ నేను గమనించింది “త్రిపుర”లో. పిచ్చేశ్వరరావుని అందుకోవటంలో కాస్త ఆలస్యమే జరిగింది. ఆనాటి కాలానికి ఇంత రాజకీయ చైతన్యంతో కూడిన రచనలు చాలా వచ్చి ఉండవచ్చును కానీ కచ్చితంగా ఇలాంటి ఫ్రేమింగ్ మాత్రం లేదు. ఇది పారడాక్స్ అనొచ్చునో లేదో కానీ ఒక విధపు “క్లిష్టమైన సరళత” కనిపించింది.
మంటో కథల్లో కనిపించే హృద్యమైన చిత్రణ, తగలి శివశంకరన్ పిళ్ళై తరహా సూటిదనం… పిచ్చేశ్వరరావులో కనిపించాక నిజ్జంగా మొదటిగా చెప్పుకున్నట్టు సిగ్గుగానే అనిపించింది. వేరు వేరు భాషల కథలని, కథకులని తెలుసుకున్న నేనూ… ఈయనని ఇంత ఆలస్యంగానా తెలుసుకోవటం?? నేవీ నేపథ్యంలో ఉన్న కథలు… ఆ కథల్లో కనిపించే వాతావరణం, కొత్త కొత్త పదాలు, ఆనాటి వస్తువులు… ఆఖరికి వారి వస్త్రధారణ కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఆ పాత్రల ప్రవర్తన మనలో కూడా కొన్నిసార్లు ప్రవేశిస్తుంది. ఇది ఒక సినిమాకి పనికి వచ్చే స్టైల్, ప్రతీ కథని అలాగే నేరుగా స్క్రిప్టు కింద తీసుకోవచ్చు. అంత చక్కటి స్క్రీన్ ప్లే తరహా కథనం కనిపిస్తుంది.
శాస్త్రి కథ ఒకసారి చదివాక జీవితంలో మర్చిపోగలమా? అలాగని అందులో ఏముంది?? నరాల్ని పొంగించే ఇతివృత్తంకాదు, మరీ హత్తుకునే విషయమూ లేదు.. కానీ, ఆ సున్నితమైన వ్యంగ్యంతో కూడిన రచనా శైలి, ఆ స్మూత్ సర్కాజం. అవునూ..!ఈ శాస్త్రి కథ రాసినాయనేనా ఆ “నెత్తురు కథ”రాసిందీ!!?? “ఇదుగో, నిన్నే, ఎవరో చూడు. అడుక్కుతినేవాళ్ళు లాగుంది.” (అన్నాడు కవి) “మనకంటేనా” అంటూ నడవాలోకెళ్లింది.(కవిగారి భార్య). అచ్చంగా కాదుగానీ ఇలాంటి కవి/రచయిత కథతో ఈమధ్యే టాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది. రాయలేని తనాన్ని “కొత్తదనం అని, పాఠకులు తనంత ఎదగలేదని” కవర్ చేసుకునే రచయితలు ఉంటారుంటారు.. అప్పుడూ ఇప్పుడూనూ…
నన్ను అమితంగా ఆకట్టుకున్న కథ “విముక్తి” ఎన్నెన్ని తెలంగాణా పల్లెల జీవితాల చిత్రణ ఇది. ఆనాటి కాలపు పెను మార్పును డాక్యుమెంటేషన్ చేస్తూనే.. ఒక గుండెను పట్టుకునే ముగింపుతో మనసులోకి కథ ఇంకిపోతుంది. “సంఘానికీ జై” అన్న సుబ్బమ్మతో పాటుగా మనసులో జై… జై… అని అరవాలనిపిస్తుంది.
“అమ్మా ఆ పరుపుల పెట్టెలో మనం ఎందుకు ఎక్కలేదు?” అంటూ మొదలైన పసివాడి ప్రశ్నలు నిజంగా మనం ఎంతమందిమి వేసుకున్నాం? (కథకుడు) పిల్లలు.. అల్లరి చేసే పిల్లలు.. అమాయకప్పిల్లలు.. ఎన్ని ప్రశ్నలేస్తారు.. ఎంత ఆలోచనని తెప్పిస్తారు.. ఇవే ప్రశ్నలు మనం ఎందుకని ఎవర్నీ అడగటం లేదు? ప్రశ్నించటం మర్చిపోయామా?? ఇన్ని ప్రశ్నలని లేవనెత్తిన కథ “కథకుడు” ఆ పెట్టెలో ఎక్కితే డబ్బులు ఎక్కువ ఖర్చు కదా మరి వాళ్లేందుకు ఆపెట్టెలో ఎక్కారు? మనమెందుకు ఇంకా ఈ పెట్టెలో ఎక్కుతున్నాం అణా ప్రశ్న ఎంతటి తిరుగుబాటుని నిద్రలేపగలదూ… Leopoled Staff “మూడూళ్ళు” కవితలో అన్నట్టు.. “ప్రశ్నలడగని వాడు ఎంత దరిద్రుడైఉండాలి” అనే వాక్యం గుర్తొచ్చింది.
మొత్తంగా అట్లూరి పిచ్చేశ్వరరావు రాసిన ఈ కథలు ఇప్పుడు మళ్లీ చదవటం ఒక అవసరం. పాఠకుడికే కాదు… కొత్తగా రాస్తున్న రచయితలకు చాలా చాలా అవసరం. ఆనాటి తనాన్నే అందుకోలేక పోయిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏమి కొత్తదనాన్ని వెతుకుతారు?
అద్భుతమైన అనుభవాన్నిచ్చిన కథలు… ఈ రకంగా నాకు అందటం చాలా హ్యాపీ. ఎంతో నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. With సూఫీ 27 Dec 2021 11.06pm
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు పుస్తకం ధర: 250.00 రూపాయలు పుటలు : 280 బరువు : 220 గ్రాములు ఈ పుస్తకానికి Sole Distributors: Navodaya Book House, Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad 500 027, Mobile: +91 – 90004 13413 వీరిదే ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.
మీకు అమెజాన్‌లో కావాలనుకుంటే Analpa Books ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు:
పుస్తకం లోగిలిలోకూడా లభ్యం: Logili Book House, Guntur – 522007 Mobile: +91 95501 46514 వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ తీసుకోవచ్చు: https://bit.ly/APRonLogili
విజయవాడ పుస్తకాల పండుగ (Vijayawasda Book Festival) లో జనవరి 1 వ తారీఖు నుంచి 11 వరకు ఈ క్రింది స్టాల్స్ లో అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు అందుబాటులో వుంటాయి.
నవచేతన బుక్ హౌస్: 8 -10 పల్లవి పబ్లికేేషన్స్: 25 – 27 సాహితీ మిత్రులు: 29 – 31 శ్రీ హర్ష పబ్లికేషన్స్: 70 – 71 నవసాహితీ బుక్ హౌస్: 117 – 118 విశాలాంధ్ర బుక్ హౌస్: 160-166
2016 లో వ్రాసుకున్న ఒక పెద్ద కథలో ఒక భాగం, ఈ ‘#మీ టూ’. ఆ కధ చాల పెద్దది. బహుశ జాల పత్రికలకి కూడా పెద్దదయ్యేదేమో. అందుకనే అందులో నుంచి ఒక భాగమే తీసుకున్నాను.
కధా వస్తువు నా జీవితంలో నేను చూసిందే. నా బాల్యంలోనే. లోపల ఎక్కడో దాగుంది అది. 2016 లో బయట పడింది. మార్నింగ్ వాక్ లో పార్క్‌లో కనబడేవాళ్లోలో ఒకతను తన కూతుర్ని కూడా తీసుకుని వఛ్హేవాడు. ప్రతిరోజు వఛ్హేవాడు కాదుకాని వఛ్హినప్పుడు ఒకొసారి అతని కూతురు కూడా తనతో పాటు వఛ్హేది. చిన్న పిల్ల బహుశ ఒక పది పన్నెండేళ్లుంటాయేమో! ఆ వారంలో వాళ్ల స్కూల్లో ఏదో పోటిలో ఒక చిన్న బహుమతి అందుకుంది. తండ్రి తన కూతురు ప్రతిభని గురించి చెబుతుంటే ఆపి, పాపనే చెప్పమన్నాను. దాన్ని గురించి నా పక్కనే కూర్చుని సిగ్గు పడుతూ చెబుతోంది. ఆ సిగ్గు చూసి ముఛ్హటేసి, దగ్గిరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. It was spontaneous act of appreciation, and an act of encouragement to continue to participate in competitions without giving a damn about winning or losing! అంతే. నేను ముద్దు పెట్టిన మరుక్షణం తన చేత్తో బుగ్గని తుడుచుకుంది. It was almost a reflex action. ఎందుకనో ఆ అనుభవం (తనకి గతంలోఒక bad touch అనుభవాన్ని గుర్తుంచేసిందేమో అన్న అనుమానం) తో ఇక నా దగ్గిరకు రాదేమో అనుకున్నాను. ఆ తరువాతెప్పుడో ఒకసారి వాళ్ళింటికి వెళ్లడం తటస్థించింది. “అంకుల్” అంటూ దగ్గిరకొఛ్హి వాటేసుకుంది. అక్కడ పడింది ఈ కథకి పునాది. గత అయిదారు దశాబ్దాల పరిశీలన, ఇతరుల జీవితానుభవాలతో ఒక కధ రాయడం మొదలుపెట్టాను. ఇందాక అన్నట్టు చాలా పెద్దదైపోయింది. అందులో నుంచి ఒక భాగాన్ని విడగొడితే ఈ #మీటూ వఛ్హింది. ఇది సూక్షంగా ఈ కథ నేపధ్యం. #మీటూ పోగా మిగతా వాటితో బహుశ మరో రెండు కధలు రాద్దామనుకుంటున్నాను. చూద్దాం.
2017 లోనే ఈ కధని వీలైనంత మంది పాఠకుల చేరువగా తీసుకెళ్లాలని అనుకున్నాను. 2017 నవంబరులో ఒక ప్రధాన పత్రికకి పంపాను. సంపాదక వర్గం ఎందుకనో ‘గజ,గజ’ వణికిందన్నారు. నాలుగు అక్షరాల పదాలు లేవు. అసభ్యమైన మాటలు లేవు. సెక్సు లేదు. బూతు లేదు. మరో పత్రికకు పంపాను. ఆ పత్రిక కూడా నిరాకరించింది. రెండో పత్రిక నుంచి, కథ అర్ధంకాక రెండో సారి చదువుకుని నాకు ఫోను చేస్తే ఆ కధ వివరం చెప్పిన సందర్భం కూడా ఉంది. పిడోఫైలియా అన్నదొకటి ఉన్నది అని కూడా తెలియని తనం కనపడింది. బహుశ అప్పుడే అక్టోబర్ ఆ ప్రాంతాల్లో #మీటూ ఉద్యమం మన భారతదేశంలో కూడ మొదలయ్యింది. బహుశ అదొక కారణం అయివుంటుంది. సున్నితమైన వస్తువు అని అనుకునుంటాయి ఆ రెండు పత్రికలు. పైగా ఆ సమయంలోనే కాదు, ఇతరత్రా కూడా అందరి దృష్టి స్త్రీల మీదే ఉంది. పిల్లల మీద లేదు. నాకు తెలిసినంతలో పిడోఫైలియా మీద తెలుగులో కధలు లేవు. ఉంటే దయచేసి తెలియజేయండి. చదువుకుంటాను. లింక్ ఇస్తే మరీ సంతోషం.
ఇందాక అన్నాను కదా, ఎక్కువమంది పాఠకులకి అందాలని అనుకున్నానని. కారణం ఇది. తల్లి, తండ్రులకి, శ్రేయోభిలాషులకి, ఇలాంటి అనుభవాలు కూడా ఉండే ఉంటాయి, కాబట్టి జాగ్రత్త అని హెఛ్హరించాలని! ఒక సేఫ్ టచ్, బాడ్ టచ్ గురించి పిల్లలకి చెప్పడం మాత్రమే కాదు. వారి వేష భాషల్లోను మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని వేళలా, అన్ని చోట్ల వారిని ఒంటరిగా వదిలెయ్యడం కూడా సరికాదు.
కథను చదివిన పెద్దలు (మగవారు) కొందరు తాము కూడా ఈ అనుభవాలకి గురయ్యాము అని తెలియజేసారు! మాములుగా స్త్రీలు చెబుతారు, మగవాళ్ళు ఇలా చేస్తారు, అలా చూస్తారు అని!
2017 లో వెలువడాల్సిన కథే ఇది. ప్రచురణకి నోచుకున్న నాలుగో కధ అయినా, (ఇది నా మూడో కథ, మొదటిది ఇక్కడ, రెండోది ఇక్కడ), కొత్త కధ 2018 సంకలనం లో చేర్చుకున్నందుకు ఖదీర్‍కి, సురేష్ కి కృతజ్ఞుడను. కొత్తకధ 2018 సంపాదకులైన వెంకట్ సిద్ధారెడ్డికి, కుప్పిలి పద్మకి నమస్సులు. సోషల్ మీడియాలో ప్రాచుర్యం కోసం ఆకర్షణీయమైన బొమ్మతో ఒక డిజైన్ ని తయారు చేసి ఇఛ్హినందుకు Artio మహీ బెజవాడకు ధన్యవాదాలు.
సోషల్ మీడీయాలో #మీటూ ప్రచురణార్ధం, మహీ బెజవాడ తయారుచేసిన కార్డ్ లో కధలోని వాక్యం ఇదిః ‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్‘ సినిమా వాల్ పోస్టర్ని చూస్తోంది. ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి, పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయేమో! వైట్ హెయిర్ బాండ్ కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు భుజాల మీదుగా వీపు మీదకి జారుతోంది. టాప్ టైట్ గానే ఉంది.’
కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః ధర: రూ 149.00 మాత్రమే (24 కథలు) ♣ నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email:[email protected]
Web: www.TeluguBooks.in
భరణీ స్టూడియోస్ అధినేత పాలువాయి రామకృష్ణ దర్శకత్వంలో వెలువడిన ‘బాటసారి‘ లో నాయిక పాత్ర పోషించిన భానుమతి, రామకృష్ణగారి సతీమణి. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడుగా నటించిన ఈ చిత్రానికి మూలకధ బెంగాలి నవల ‘బడదీది‘. బెంగాలి రచయిత శరత్‍బాబు. ఆ ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా ఆవిష్కరించి తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. త్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక చౌదరాణి వీరి శ్రీమతి. ఆ విధంగా బారిస్టరు, శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు. అట్లూరి పిఛ్హేశ్వరరావు నాకు తండ్రి. చౌదరాణి నాకు తల్లి. నాన్న 92 ముగించుకుని 93లో అడుగు పెడుతున్న రోజు ఇది. బానుమతి పాడిన “ఓ బాటసారి…” పాట ని ఇక్కడ వినవఛ్హు.
baaTasaari (బాటసారి) film novel – 153 pages was published by the makers of the movie in July 1961. It was priced 0.75 np. That would be three annas.
Tidbit
You will notice the banner mentioning the title of the movie is signed GHRao He was quite popular in those days. I personally knew him. My mother and I were keen on having the signboard for the proposed Rani Book Centre (an exclusive Telugu bookstore) written in Telugu. Our search brought him to us. He was Hanumantha Rao. In fact he did the first sign board in Telugu for Rani Book Centre in 1969. What a coincidence!
స్క్రిప్ట్ ఆర్ట్శ్ శాస్త్రిగారు ‘బాపు‘ బొమ్మలతో తెలుగువారి పండగలకి కొత్త శోభలిఛ్హిన రోజులవి. ఉగాదికి, సంక్రాంతికి, వివాహాలకనేమిటి ప్రతి సందర్భానికి ఒక బాపు కార్డ్. ఒక పాకెట్లో పది కార్డులు. పది కవరులు వాటికి సరిపడా! బొమ్మలాయనివి. లోపల మాటలు. బొమ్మకి తగినట్టుగా పదాలు. కొన్ని కావ్యాలలోనుంచి. కొన్ని ఆరుద్ర లాంటి కవుల కలాలనుండి.
ఒకటి రెండూ కాదు. కొంటే అదొక పాకెట్టు. ఇదొక పాకెట్టు. తలా ఒకటి అసార్టెడ్. బావకి మరదలు. చెల్లెలికి అన్నయ్య. భార్యకి భర్త. మామ్మకి మనవడు. ఆఫ్రికాకి. అట్లాంటాకి. ఆస్ట్రేలియాకి. అబుదభికి. గవర్నర్ గారేంటి. సి ఎమ్ గారేంటి. సినిమా తారలేంటి. గుమస్తా ఏమిటి? ఎమ్ డి ఏవిటి? ఒకడేవిటి? ఒక నెలరోజుల ముందే కొనేసి రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపేవాళ్ళు కొందరు. స్పీడ్‍పోస్ట్ లో పంపేవాళ్ళు కొందరు.
సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి, బీచీ స్టేషన్‍లో దిగి, మద్రాసులో సి ఎ చదివేసి, పనిలో పనిగా సినిమా తారలందర్ని ఒక లుక్కేసి మళ్ళీ ఏ హౌరా మెయిలో, కోరమాండలో ఎక్కేసే రోజులవి.
అలాంటి రోజుల్లో…
ఒక ఉగాది.
పొద్దున్నే.
నీరసంగా వఛ్హారు ఇద్దరు కుర్రాళ్ళు.
బాపు గ్రీటింగ్స్ కావాలంటూ. అన్ని అయిపోగా మిగిలిన వాటిల్లో నుంచి తలాఒకటి కార్డ్లు తీసుకున్నారు. ఆంధ్రపత్రిక వారి పంచాగం ఒకటి. నేమాని వారి పంచాంగం ఒకటి. మొహాలు వేలాడేసుకుని చిల్లర ఇస్తున్నారు అమ్మకి.
“ఏంటయ్యా, పండగరోజు ఇలా నిరుత్సాహంగా ఉన్నారు?” అని అడిగింది అమ్మ.
“ఉగాది రోజండి. ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చేత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఆ గతి లేదు. ఇక్కడెక్కడా ఉగాది పచ్చడి పెట్టేవాళ్ళెవరూ లేరు. ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో. ఏదో కంపెనిలో ఇంటర్నల్ ఆడిట్ కని వఛ్హారట. పండక్కి ఇంటికి వెళ్ళడానికి కుదర్లేదు. “వెళ్ళొస్తామండి” అని వాళ్ళు వెళ్లబోతుంటే అమ్మ వాళ్ళని మాటల్లో దింపింది. నేను కలగజేసుకున్నాను. ఏలూరు వైపు వాళ్ళు. అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది. మధ్యలో ఫోన్ చేసింది ఇంటికి. నా భార్యకి ఏదో చెప్పింది. నాతో ‘కరుప్పయ్య’ ని ఒక్కసారి వెంటనే ఇంటికి వెళ్ళి రమ్మనమని చెప్పు అంది.
కరుప్పయ్యన్ రిక్షాతను. కొత్తగా అప్పట్లో రిక్షాలకి మోటర్లుండేవి. పోస్టాఫిసు మూలమీద రిక్షా స్టాండ్. అక్కడుంటాడు. స్టాండ్ లోనే ఉన్నాడు. “ఒకసారి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిరా,” అని పంపాను. ఇదిగో ఇక్కడున్నటు వస్తాను అని బుర్రు మని వెళ్ళాడు. గట్టిగా నడిస్తే పది నిముషాలు పట్టదు ఇంటికి చేరుకోవడానికి.
పది నిముషాలలో వఛ్హాడు వెనక్కి. చేతిలో చిన్న సంచి. అందుకుని అమ్మకిచ్చాను. సంచి తీసుకుని అమ్మలోపలికి వెళ్ళింది. పుస్తకాల రాక్‍ల వెనుక కొంత ఖాళీ ఉంటుంది. ఈ కుర్రాళ్ళ మూడు బాగోలేదుగా! “వెళ్ళొస్తామండి” అని కుర్చిల్లో కూర్చున్నవారు లేచారు. (అప్పట్లో ‘ఆంటి’ లు ‘అంకుల్స్’ లేరు. అక్కయ్య గారు, బాబయ్, పిన్ని గార్లే. ఎక్కువ. లేదు “అండి”!)
“ఆగండాగండి,” ఆంటూ అమ్మ ముందుకు వఛ్హింది. అమ్మ చేతిలో స్టీలు పళ్ళెం. అందులో రెండు గిన్నెలు. గెన్నెలో స్పూన్. ఆ రెండిట్లోను ఉగాది పఛ్హడి.
అవి చూడగానే వాళ్ళ ముఖాలు విప్పారి ఇంతింతైనవి. కళ్ళలో ఆనందం. అమ్మ వాళ్ళ అరిచేతిల్లోకి గిన్నెలో నుంచి స్పూన్ తో తీసి ఆ ఉగాది పచ్చడిని అందించింది. లొట్టలేసుకుంటూ తినేసారు. అందులో ఒకతను అరి చెయ్యి నాకేసుకున్నాడు. బయటపెట్టిన బకెట్ నీళ్లతో చేతులు కడుకున్నారు ఇద్దరూ. మాటల్లేవు. పాంట్ జేబులోంచి హాంకిలు తీసుకుని మూతులు తుడుచుకున్నారు. చేతులు తుడుచుకున్నారు. ” తినండమ్మా ఇంకా కావాలంటే,” అని అమ్మ ఆ పళ్ళెం టేబుల్ మీద పెట్టింది, టేబుల్ వెనక్కి వెళ్ళి కూచోబోతూ.
“ఉండండుండండి,” అంటూ అందులో ఒకరు అమ్మ కాళ్ళమీదకి పడిపోయ్యి ” మా అమ్మ అంతటివారు, మిమ్మల్ని మరిచిపోలేమమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి” అని అపేశారు. అందంతా అయిపోయింది. వెళ్లలేక వెళ్ళారిద్దరూ! కళ్ళు తుడుచుకుంటూ!
ఆ ఉగాది మొదలు ప్రతి ఉగాది రోజున అడిగిన వారికి ఉగాది పచ్చడి వడ్డించడం ఆనవాయితి అయిపోయింది రాణీ బుక్ సెంటర్ కి. తరువాత తరువాత ‘రాణమ్మ’ చేతి ఉగాది పచ్చడి కోసమే పాండిబజారులోని రాణీ బుక్ సెంటర్ కి వచ్చేవారు కొంతమంది. వాళ్ల ఇళ్ళల్లో చేసుకుని తిన్నా!
But today, it is a different story. Neither is Rani Book Center there, nor my mother! What an irony! But that is life I guess.
అమ్మ = చౌదరాణి
ఇక్కడ వాడిన బాపు బొమ్మకి హక్కుదార్లుః https://te.wikipedia.org/w/index.php?curid=78744
“కలిసారా వీరిని? ఈవిడే శివలెంక రాజేశ్వరి దేవి, మంచి కవితలు వ్రాస్తుంది” అని తొలిసారి పరిచయం చేసినప్పుడు, “…అలాంటిదేమి లేదండి” అంటూ నేను నమస్కరించే లోపు…అలా వెళ్ళిపోయి ఒక జ్జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ తరువాత అప్పుడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి ఆవిడ కవితని చదువుకునే వాడిని. నాకు మళ్ళీ ఆ మనిషి భౌతికంగా కనపడలేదు. ఆవిడ పోయిన తరువాత, ఆమె బతికి ఉన్నప్పుడు ఫోనులు (ఆమే తన సొంత ఖర్చుతో చేసినా మాట్లాడలేని వారు, అందరూ కాదులెండి కొంత మంది) భోరున విలపించి సోషల్ మీడియాని చీదేసి, కాగితం రుమాళ్ళతో కన్నీళ్ళని పిండి మరి ముంచేసారు. ఈ కింది కవిత చదివినప్పుడు అదంతా గుర్తు వచ్చింది. అందుకే ఇక్కడ ఇలా…
అనంతు చెప్పాడు. కవితలన్నింటిని ఒక పుస్తకంగా వేస్తున్నాము అని. ఇదిగో ఇలా నామాడి శ్రీధర్ సంపాదకత్వంలో వెలువడింది. వాళ్ళిద్దర్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టున్నాను…పుస్తకం కావాలని. చివరికి కత్తి మహేశ్ మొన్న విశాఖలొ యువతరంతో నవతరం కోసం వచ్చినప్పుడు ఈ పుస్తకం ఇచ్చి వెళ్ళాడు.
స్థిత ప్రజ్ఞులు
వాళ్ళు గొప్పవాళ్ళు సుమా నిజంగా
వాళ్ళకి బంధాలు వుండవు ఋణాలు వుండవు
ఋణానుబంధాలసలే వుండావు
కాపలలుంటాయి ముళ్ళకంచె కాపలాలు
అక్షరాలా మన మంచే మనకి కాపలా ఇక్కడ
మనకనేక ఋణాలు అనేక బంధాలూ
అనేక ఆపేక్షలూ అనేక బాధలూ అనేకానేక చిక్కుముళ్ళు
మనం ఇస్తాం తీసుకుంటాం
వాళ్ళు ఇవ్వరు తీసుకోరు
ఇస్తాం గానీ తీసుకోం అంటారు బడాయిగా
వాళ్ళు స్థితప్రజ్ఞులు
ఒఖ్క టీ ఇచ్చి కూచోపెట్టి
ఎన్నెన్ని స్టేట్‌మెంట్లయినా వినిపిస్తారు
అప్పటికప్పుడు అక్కడికక్కడ
రెడీమేడ్ తీర్పులు చెపుతారు
వారు సర్వజ్ఞ సింగభూపాలురు
వాళ్ళకి కుటుంబం అంటే
‘మొగుడు పెళ్ళాం పిల్లాడూ’ నిర్వచనం
స్నేహితులు శాశ్వతంగా ఉంటారుటండి
మీ పిచ్చిగానీ అనేస్తే
మనం దిమ్మతిరిగి దిక్కులు చూడాల్సిందే
మనకేమో
ఒక సంతోషం ఇటొచ్చి ఒక దిగులు
అటొచ్చి ఒక నవ్వు ఇటొచ్చి ఒక మాట
నవ్వొస్తే పకపకా ఏడుపొస్తే వలవలా
నీ పిచ్చిగాని నీ మిణుగురులుమీంచి సైతం
వెలుగు చూస్తానంటే నవ్విపోతారమ్మా
ప్రతి మనిషి రెండు వైపులుంటాయండీ
అటో చెంపా ఇటో చెంపా
పైకి కనిపించేది కాదు అసలూ…
అంటూ వెర్రి పీనుగుల్ని చేసి
ఎంతైనా చెప్పగలరు ఎరిక్ ఫ్రామ్ లెవల్లో
గూడలు పడిపోయి నవ్వీ నవ్వలేక ఏడ్చీ ఏడ్వలేక
తల ఎటుకేసి వూపుతున్నమో మనకే తెలీని స్థితిలో
సరైన టైమ్ అంటే వాళ్ళకి కలిసివచ్చినట్లు
కాలజ్ఞానం తెలిసినట్లు మాటల్ని మాయామయంగా కలిపేస్తారు.
” ఆ( ఇంత చేసి సొంతానికంటూ ఏమీ లేకపోయింది”
సాక్షాత్తు మదర్ కే
సానుభూతి చూపే గుండె ధైర్యం వాళ్ళకి
కంకరరాళ్ళు శబ్దం వినీవినీ
మస్తిష్కం మొద్దుబారిపోయింది
ఆ స్థిత ప్రజ్ఞుల వైపు వెళ్లకు
సిక్ సొసైటి మనుషులు వాళ్ళు
నువ్వేమో అమ్మలూ! సేన్ సొసైటి పాపాయివి
అటు పోకమ్మ ‘ఇన్నొసెన్స్’ పోగొట్టుకుని
‘ఇంటలిజెంట్’ అయిపోతావు
చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అనేస్తావు
ఆ ముదిరిపోయి గిడసబారిన ‘ఇంటలిజెన్స్’
మనకి వద్దులే తల్లీ!
ఏదో మన మానాన మనం
రాత్రి వర్షాన రాలిన పున్నాగపూలని
చేతుల్లోకి తీసుకుంటూ!
శివలెంక రాజేశ్వరి దేవి, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, 31.08.1998 లో ప్రచురితం.
ప్రతులకు / for copies
Namadi Sridhar
Door No: 3-129, Ambajipeta,
East Godavari district, Andhra Pradesh
PIN 533 214
Phone: 93968 07070
కొత్త ఉద్యోగానికి వెళ్ళేముందు అనే తొలి అధ్యాయంతో మొదలైన ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం కొత్తగా కాలేజీలనుంచి బయటికొచ్చి విశాల ప్రపంచలోకి అడుగుపెడుతున్న లక్షలాదిమందిలో మీరు ఒకరు” అనే వాక్యంతో మొదలవుతుంది. దాన్నిబట్టి ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ని ఎవరిని దృష్టిలో పెట్టుకుని మొదలు పెట్టాడో ఈ రచయిత అర్ధం అవుతుంది. అలా అని ఇది విద్యార్ధులకి మాత్రమే కాదని గుడ్డిగా ఈ పుస్తకం మధ్యలో ఎక్కడ తలదూర్చినా తెలిసిపోతుంది. ఒహో ఇది IT industry లోని టెకీ గాళ్ళకా అంటే…కాదు బోయ్స్ అండ్ గరల్స్. ఇది అందరికీను. అంటే ముఖ్యంగా ఉద్యోగస్థులందరికి…కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టేవారికి, వేసేసిన వారికి, అలా ముందుకు సాగి పోతున్నవారికి కూడా!
వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ని తను ఎంచుకున్న అంశాలను 36 చాప్టర్స్‌గా వర్గీకరించి, సుమారుగా 160 పేజిలలో పొందుపరిచి అందజేసాడు సురేశ్.
సోషల్ మీడియా (పేజి 76) గురించి ప్రస్తావిస్తూ, వర్క్‌ప్లేస్ లోనే కాదు ఉద్యోగం రావడానికి, పోవడానికి కూడా అదే కారణం అంటూ సోదాహరణంగా చెప్పాడు.
ఈ పుస్తకం పాఠకులకి బహుశ బోనస్ ఇవ్వాలనుకున్నట్టున్నడు రచయిత. సంపాదనకి సేఫ్టి అనే పేరుతో ఒక అధ్యాయం (చాప్టర్ 33)ఇచ్చాడు. చాలమంది కొత్తవారికి, ఉద్యోగంలో ఉన్నా పూర్తిగా తెలియని వారికి ఇందులో ఇచ్చిన వివరాలు బోనస్సే!
139 వ పేజి నుంచి 146 పేజీ వరకు కేవలం మహిళల కొరకే వినియోగించి వారికి బాగా పనికివచ్చే సమచారాన్ని క్లుప్తంగా ఇచ్చడు. స్మార్ట్ ఫోన్లు వాడే వారికీ కొన్ని సేఫ్టీ ఆప్స్ గురించి తెలియజేసాడు. 169 పేజిలో టొస్ట్‌మాస్టర్స్ ని పరిచయంచేసాడు. వెబ్‌లింక్ ఇచ్చాడు కాబట్టి పాఠకులకి సులువుగానే అదనపు సమాచారం అందే అవకాశం కల్పించాడు.
67 వ పేజిలో 5W’s & 1H ఫార్ములా గురించి ప్రస్తావించాడు కాని ఆ ఫార్ములా ఏమిటో చెప్పలేదు. ప్రసారమాధ్యామాలలో అనుభవజ్ఞులకు తెలిసే అవకాశం ఉంది కాని ఉద్యోగస్తులకి మరీ ముఖ్యంగా తను ఎంచుకున్న రీడర్ ప్రొఫైల్ ఉన్నవారికి ఆ ఫార్ములా తెలిసిఉండే అవకాశం తక్కువ. కాకపోతే అదే ఫార్ములాని 155 వ పేజిలో మరో విధంగా పరిచయం చేసాడు…ఇలా ఫైవ్ డబ్ల్యూస్ అండ్ వన్ హెచ్ (ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఎలా?) అని వివరించాడుకూడా!.
కాకపొతే పూనే ఉద్యోగస్తుడి ఆపసోపాలు చెబుతూ, మళ్ళీ అతని కధే (?) 122 వ పేజిలో కూడా చెప్పాడు. తన ముందుమాట (11 వ పేజిలో) కంటెట్ రిపీట్ అయినట్టు ముందే చెప్పినా, రిపీట్ కాకుండా చెప్పే అవకాశం కూడ ఉంది.
తెలుగు చదువుకున్న వారికే ఈ పుస్తకం అనుకున్నప్పుడు కొత్తగా ఉద్యోగరంగంలోకి అడుగు పెడుతున్నవారికి పింక్ స్లిప్ గురించి తెలుస్తుందా అనే సందేహం కలిగింది. పేజి 132. కనీసం ఇటువంటి వాటికోసమైనా పాద సూచికలు అంటే ఫుట్‌నోట్స్ / ఫర్దర్ రీడింగ్ అంటే ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలనుకునేవారికి పుస్తకం చివర్న ఒక చిన్న బిబ్లియోగ్రఫి (bibliography) ని ఇచ్చి ఉంటే బాగుండేది.
ఆఫిస్ కాదు రచయిత మాటల్లో వర్క్‌ప్లేస్ అనుకుంటే ఆ వర్క్‌ప్లేస్ ఎటికెట్ గురించి కూడా చెప్పిఉంటే ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఇంకొంచెం సమగ్రంగా తయారైఉండేది.
“పుస్తకం రాస్తున్నాను సార్,” అన్నప్పట్నుంచి దీని కోసం ఎదురుచూస్తునే ఉన్నాను. ఆసక్తిగా! గతంలో నేను ఆంధ్రజ్యోతి పత్రిక వారి దిక్సూచికి కెరీర్ కార్నర్ కాలం ఒకటి వ్రాసాను. అదొక పక్క, మరో పక్కన అప్పట్లో ఒక HR సంస్థకి CEO గా ఉండటం మూలంగా కలిగిన ఆసక్తి, అంతే కాదు people management మీద నాకున్న ఉత్సుకత…సురేశ్ ఈ తరం వాడు ఏం వ్రాస్తాడు, ఎలా రాస్తాడు అని. పైగా నేను కూడ గత అయిదారేళ్ళుగా వ్రాద్దామని అనుకుంటూ…తాత్సారం చేస్తూ వస్తున్నాను. అది కొంత కుతూహలం. ఇక ఆ సొంత గోల ఆపితే…ఈ పుస్తకం అవసరమా అని నన్ను అడిగితే… ఈ విషయలా మీద ఇదే తొలు పుస్తకం …కాబట్టి తెలుగు వరకే పరిమితమైనవారికి ఇది ఉపకరిస్తుంది. మనకి తెలుగులో పర్సనాలిటి డెవలప్‌మెంట్ పుస్తకాలు చాలా వచ్చినవి కాని ఆఫీసు లో ఇలా గెలవండి అన్న పుస్తకం వచ్చినట్టు లేదు. కాబట్టి ఈ పుస్తకం అవసరమైనదే ఉద్యోగస్తులకి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చిన్న యాజమాన్యాలకి కూడా!
ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎందుకంటే వారికి కూడా ఒక చాప్టర్‌ని కేటాయించాడు రచయిత.
ఇక చిన్న చిన్న యాజమాన్యాలకి ఎందుకంటే, ఉద్యోగస్తుడు కుక్కలాగ విశ్వాసంతో పడిఉండే వాడు కాదు, అలాగే గాడిద చాకిరికి మాత్రమే పనికి వచ్చేవాడు కాదని, వాడుకూడా మనిషేనని సంస్థమేలుకోసం ఆరాట పడే ప్రాణమని…అలాంటి వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం ఇస్తే, తమ సంస్థ కూడా బాగుపడి మరో పదిమందికి చేయుత నిస్తే వ్యాపారం కూడ అభివృద్ధి చెందుతుంది, సమాజానికి ఆ మేర కొంత మేలు జరుగుతుంది.
వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండిఇంగ్లిష్ లో కూడా తయారవుతున్నది.
ప్రస్తుతం తెలుగులో 176 పేజీల వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం ధర 199.00 రూపాయలు. పుస్తకం ధర తక్కువే. Brahmam (Bhavana Graphix) కవర్ పేజి డిజైన్ చేసారు. Charitha Impressions వాళ్ళ ముద్రణ. అప్పుతచ్చులైతే పంటికింద పడలేదు మరి!
2014 లో సెప్టెంబరు నెలలో రెండవ ఆదివారం తేది14 అయ్యింది. ఆ రోజున మధురాంతకం నరేంద్ర గారి కథనివేదిక – సాహితీ సమావేశం సభ్యులు చర్చించుకున్నారు. ఆ కథ ని కధా సాహితి సంపాదకులు తమ కధ 2014 సంకలనంలో చేర్చుకున్నారు. మధురాంతకం నరేంద్ర సాహిత్యం గురించి మరి కొన్ని వివరాలు కథానిలయం లో ఇక్కడ చూడండి.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం వారి చేతుల మీదుగానే అందుకుంటున్న మధురాంతకం నరేంద్ర. వీరిద్దరూ అధ్యాపకులే! తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారిని కూడా ఇందులో చూడవచ్చు.
ఇవి కాక ఆంగ్లంలో The Hans India ఆంగ్ల దిన పత్రికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద నరేంద్ర వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. నరేంద్ర గారి కథలలో కొన్ని; అత్యాచారం (991), నిత్యమూ నిరంతరమూ (1993), అస్తిత్వానికి అటూ – ఇటూ – (2001), నమ్మకం (2008), చిత్రలేఖ (2010), చివరి ఇల్లు (2013) ఇదివరలో కథాసాహితి వారి కధ సంపుటాలలో చోటు చేసుకున్నవి.
ఇందులో చెప్పుకోవలిసిన అంశం ఏమిటంటే 1992 లో కధ 1991ని ఆవిష్కరించింది కీ.శే మధురాంతకం రాజారాం. వారి తనయుడు మధురాంతకం నరేంద్ర.
ఇక కథా సారంగ లో (July 9, 2015) 3456GB వ్రాసిన కొట్టం రామకృష్ణారెడ్డి తొలి కధ – తీర్పు. ఇది 1991 ఫిబ్రవరిలో రచన మాస పత్రికలో వచ్చింది. వీరి కథ కూడ ఈ కథ 2014 సంపుటిలో ఉంది. వివరాలకు సంకలనాన్ని చూడండి.
బంధం కధ 2013 లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురించింది. ఆ కథ వ్రాసింది బోడపాటి హరితాదేవి. కలం పేరు రాధిక. సంపాదకులు ఎన్నుకున్న కధని మీరు కథ 2014 లోనే చూసుకోవాలి మరి. 🙂
2014 అక్టోబరులో రెండవ ఆదివారం 12 వ తేది అయ్యింది. ఆ రోజు సాయంత్రం డా. వి చంద్రశేఖర రావు గారి నవల నల్లమిరియం చెట్టు మీద వేదికసాహితీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వినిపించారు కన్నెగంటి రామారావు. మరో సాహిత్య పిపాసి 🙂 డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఆ రోజు సాయంత్రం వేదిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ అమెరికాలో ఉంటారు. చెప్పొచ్చేదేమిటంటే యాజి కూడా అమెరికాలోనే ఉంటారు.
కథకుడు యాజి తన కధకు ఎన్నుకున్న అంశం మీద సాహిత్యలోకంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. యాజి కథకూడ కధ 2014 లో చోటుచేసుకుంది. విశేషం ఏమిటంటే యాజి స్వస్థలం తెనాలి. 😎
కధ 2014 – కధాసంపుటిలోని ఒక ముగ్గురు కథకులను గురించి, ఇక్కడేమో మరో ముగ్గురు కధకులు గురించి తెలియచేసాను. రేపు … ఆ మిగతా కథకుల గురించి. 😎 అన్నట్టు తెనాలి కి వస్తున్నారుగా! తెనాలి లో కవిరాజు ఉద్యావనం (పార్క్) ఇక్కడుంది.
రెండు దశాబ్దాలు
కథ 1990 – 2009
౩౦ కధలతో రెండు దశాబ్దాల ఉత్తమ కధల సంకలనం
ప్రతులకు
164, Ravi Colony, Tirumalagherry, Secunderabad 500 015, India Ph: +91 2779 7691
ధర: రూ 150.00 / US $ 25.00
పోస్ట్ / కొరియర్ ఖర్చులు అదనం.