మనసుంటే మార్గముంటుంది!

eenaaDu, vipula, chatura etc


1908, సెప్టెంబరు 9 బుధవారం. వినాయక చవితి పండగ రోజు. ముంబై లో ఆ రోజున ఆంధ్రపత్రిక – వారపత్రిక గా మొదలైంది. వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరావు పంతులు.  ముంబై నుండి 1914 లో మద్రాసు – ప్రస్తుతం చెన్నై కి వెళ్లింది ఆంధ్రపత్రిక. ఇసబెల్లా హాస్పిటల్, లజ్ కార్నర్ కి మధ్యలో నాగేశ్వరరావు పార్క్ వుంది. దానిని ఆనుకునే అమృతాంజన్ (ఆయుర్వేదం తైలం) నొప్పికి వాడే మందు కర్మాగారం కూడా అ పక్కనే వుండేది. (నాన్నతో కొన్ని సాయంత్రాలు ఆ పార్క్ లో గడిపాను నేను.) మద్రాసులో ఆ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ఆ దినపత్రికతో బాటు ‘అంధ్ర పత్రిక’ వారపత్రిక కూడ వెలువడడం మొదలైంది.  దాదాపు దశాబ్దం తరువాత అంటే జవరి 1924 లో ‘భారతి‘ మాసపత్రిక వెలువరించారు నాగేశ్వరావు పంతులు గారు.

భారతియందు భాష, వాజ్మయము, శాస్త్రములు, కళలు మొదలగు విషయములు సాదరభావముతోఁ జర్చించుటకవకాశములు గల్పించబడును. వాజ్మయ నిర్మాణమునకిపుడు జరుగుచున్న ప్రయత్నములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతోఁ బ్రచురింపఁ బడును.” అని భారతి సంపాదకులు చెప్పుకున్నారు.

పంతులు గారి మనవడు శివలెంక రాధకృష్ణ గారి హయాంలో ‘భారతి’ ని నిలిపి వేయాల్సి వచ్చింది. కారణం ‘ఆర్ధిక భారం.’ (ఆ రోజుల్లో మద్రాసులో రాణీ బుక్ సెంటర్ మాత్రమే క్రమం తప్పకుండా భారతి ని పాఠకులకి అందించేది. ప్రత్యేక సంచికలను ఒక పదో/పాతిక మందో నెల ముందే ‘బుక్’ చేసుకునేవారు.) కాని ‘భారతి’ ప్రచురణ ఆపడానికి కుదరదు. ఎందుకని? పంతులు గారు ‘అంధ్రపత్రిక’ దినపత్రిక వెలువడినంతకాలం ‘భారతి’ వెలువడాల్సిందే’ అని ఒక నిబంధనని పెట్టారు. మరేం చెయ్యాలి అని యాజమాన్యం ఆలోచించింది. ‘టాబ్లాయిడ్‘ గా వెలువరించాలని నిర్ణయించారు. అలా ‘ఆంధ్రపత్రిక’ దిన పత్రిక లో ఒక ‘బ్రాడ్ షీట్’ ని ‘భారతి’ అని మకుటం పెట్టి ‘టెక్నికల్’ గా ఆపకుండా దానిని నెలకొక సారి ప్రచురించారు. తరువాతి రోజుల్లో మళ్ళీ పుస్తక రూపంలో తెచ్చారు. కానీ ఆంధ్రప్రదేశానికి తరలివచ్చిన తరువాత మొత్తం ‘ఆంధ్రపత్రిక’ మూత పడిపోయింది. దిన పత్రిక, వార పత్రిక, భారతి అన్ని మూత పడ్డాయి.

eenaaDu, vipula, chatura etc
ఆంధ్రపత్రిక, భారతి, ఈనాడు ప్రకటన

ఇటీవలి కాలంలో ‘ఆంధ్రజ్యోతి‘ ఆదివారం ‘సండే’ కి కూడా గ్రహణం పట్టింది. అప్పట్లో పిన్నింగు అని, బైడింగు అని రవాణా సరఫరాలో ఇబ్బందులున్నవని చెప్పి ఆంధ్రజ్యోతి ‘ఆదివారం’ ని దినపత్రికలో టాబ్లాయిడ్ కి మార్చేసారు. ఏది ఏమైనా చివరకి అది మళ్ళీ తన పాత రూపులో వెలువడ్డం సంతోషం. ఈ #కరోనా #కోవిడ్19 గడ్డు కాలంలో కూడా పుటలు తగ్గించినా జాల పత్రికగా దాన్ని వెలువరించింనందుకు #ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి, యాజమాన్యానికి సాహితీప్రియులు ధన్యవాదాలు చెప్పుకోవాలి. గత కొద్ది వారాలుగా అచ్చులో కూడా ‘ఆదివారం’ ఆంధ్రజ్యోతి అందుబాటులోకొచ్చింది. అందుకు కూడా మనం ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు తెలియజెయ్యాలి.

కొన్ని నెలల క్రితమే ‘సాక్షి‘ దినపత్రిక కూడా ‘సాహిత్యం‘ పేజిని ‘ఫన్ డే‘ లో కి పంపింది. ఆ ‘సాహిత్యం’ పేజి ‘డ్రాప్’ అయినప్పుడల్లా వచ్చే వారం వుంటుందా, వూడుతుందా అని ఎదురుచూసేవాళ్లు పాఠకులు. వాళ్లని నిరాశపరచడమెందుకని ‘పర్మనెంటు డ్రాప్’ అనుకుని, వద్దులే అని దయతో ‘ఫన్ డే’ లో ఒక పేజి ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి.  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రతి సోమవారం ‘వివిధ‘ లో సాహిత్యానికి ప్రాముఖ్యత ఇచ్చి అందజేస్తోంది.  ఇంకా కొన్ని తెలుగు దిన పత్రికలు కూడా ఆదివారం మాగజైన్ సంచికలు వెలువరుస్తున్నవి. ఉదాః విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, వార్త, సూర్య, దర్వాజ, నమస్తే తెలంగాణా ఇత్యాదులు.

మనకి జాలపత్రికలు కూడా తక్కువేమి కాదు. ‘సాహిత్యసేవ’ కోసం సాహితీ ప్రియులు వెలువరిస్తున్నవారున్నారు. ఈమాట (1998 అక్టోబరులో ప్రారంభం), సారంగ (దాదాపు దశాబ్దం క్రితం), కౌముది (2007), సంచిక, నెచ్చెలి, వగైరాలు. ఇవన్ని కూడా ఆయా నిర్వాహకులు ఎటువంటి ఆర్ధికమైన లాభాపేక్ష లేకుండా ప్రచురిస్తున్నారు. ప్రకటనలు సైతం వుండవు వీటిల్లో. సభ్యత్వం / చందా రుసుములు కూడా లేవు.

ఈ అంతర్జ్వాల పత్రికలని వ్యక్తులు నిర్వహిస్తుండగా, ఈనాడు / వసుంధర / రామోజి ఫౌండేషన్ ఆ నాలుగు పత్రికలు; విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం ని కనీసం జాల పత్రికల రూపాన్నైనా వెలువరించలేకపోవడం అన్నది నమ్మశక్యంగా లేదు. విపుల, చతుర లు 1978లో మొదలైనవి. దాదాపు నలభై మూడేళ్ళ క్రిత్రం. అలాగే ‘భాషకు, సాహిత్యాని సేవ చేసేందుకు ప్రత్యేక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో 2012 సెప్టెంబరు’ లో తెలుగు వెలుగు పాఠకులకి అందించారు. నా వరకు నేను ఇది తెలుగు వారికి మరో ‘భారతి’ గా వుంటుందని ఆశించాను. అలాగే జరిగింది మూతపడటం విషయంలో. ‘ఇన్నాళ్ళుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికలను’ ఈమ్యాగజైన్స్ రూపంలో ఈనాడు నెట్ లో అందుబాటులో ఉంచా‘ రు. కానీ ఈ ఏప్రిల్ నుండి నిలిపివేయడం అన్నది ‘సాహిత్యాభిమానులకు’ జీర్ణం కావడం కష్టం. ఈనాడు లాంటి వ్యవస్థ, మానవవనరులున్న సంస్థ ఈ నాలుగు పత్రికల నిర్వాహణ భారాన్ని మోయలేకపోతుండంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. నిజమే #కోవిడ్19 లాంటి అనూహ్యమైన ఆపద మానవజీవితాన్ని అతలా కుతలం చేసింది కానీ ఈ రోజున మనకి కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. వాటిని అధిగమించడం ఈనాడు లాంటి సంస్థలకు కష్టమేమి కాదు. ఈనాడు కంటే చిన్నవి మనగలుగుతున్న సందర్భంలో ‘మన అమ్మభాష పరిపుష్టత కోసం ఈనాడు, ఈటీవీ, ఈ టీవీ భారత్ లు నిరంతరం కృషిచేస్తునే ఉంటాయని’ మేనేజింగ్ ట్రస్టీ – రామోజీ ఫౌండేషన్ చెప్పినా …తెలుగు సాహితీ చరిత్రలో ఈ పత్రికలు ఆపేయ్యడం విషాదమే. ఇన్నాళ్లుగా ఆయా పత్రికలకి రచనలు పంపుతున్న రచయితలు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు ఈ వార్త తెలుసుకుని. పాఠకుల ఆదరణ తగ్గింది అన్నప్పుడు బహుశ రచయితలు కూడా తమ చేస్తున్న రచనల గురించి పునరాలోచించుకోవల్సిన సందర్భం అనిపిస్తుంది. మనసుంటే మార్గముంటుంది! కనీసం జాలపత్రికల రూపంలో ఐనా ఈ నాలుగు పత్రికలని బ్రతికించమని రామోజీ ఫౌండేషన్ ని కోరడమే ఒక సాహిత్యాభిమానిగా నేను చెయ్యగలిగింది!

▓► ఆంధ్రపత్రికకి సంబంధించిన వివరాలకి మూలం తెలుగు వికి. – te.wikipedia.org/

త్రిపురనేని గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం 2015

TripuraneniGopichandNationalLiteraryAward

సెప్టెంబరు 8న సాహిత్యకారుడు త్రిపురనేని గోపిచంద్ జన్మదినం.  గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని ఆరోజున ఎంపిక చేసిన గ్రహీతకు అందజేయడం ఒక సత్సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.   2015 సంవత్సరానికి గాను సర్.  విలియం మార్క్  టుల్లి కి ఈ సారి దానిని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అందించారు.  ఆ కార్యక్రమానికి వేదిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైద్రాబాదు.

ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రిక ఇది.
The invitation to the Tripuraneni Gopichand National Literary Award presentation to event.

గవర్నర్ రోశయ్య గారి ప్రసంగ పాఠం ఆంగ్లంలో ఇక్కడ.
పురస్కార స్వీకర్త సర్. విలియం మార్క్  టుల్లీ ప్రసంగం ఇక్కడ మీరు వినవచ్చు.
ఇక దిన పత్రికలలో వచ్చిన వ్యాసాలు వివరాలు ఇవి.
ఇక్కడ ది హిందు లో.
పున్నా కృష్ణమూర్తి పరిచయం వ్యాసం సాక్షి దినపత్రికలో ఇక్కడ.
ఈనాడు దిన పత్రికలో ఇక్కడ.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇక్కడ.

From your left: Y. K Nageswara Rao, Saichand (youngest son of Gopichand) Saripalli Kondal Rao,  Padmabhushan Sir Mark Tully (seated), Sri Latha, Dr Sunaina Singh and Dr T H Chowdary

From your left: Y. K Nageswara Rao, Saichand, Saripalli Kondal Rao, Sir Mark Tully, Sri Latha, Dr Sunaina Singh, Dr T H Chowdary

కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’

అదితి - aditi - telugu short story by Anil Atluri

మొన్న అంటే మార్చ్ పదిహేనో తారీఖున, ఆంధ్రజ్యోతివారి ఆదివారం అనుబంధం లో, నేను తెలుగులో వ్రాసుకున్న కథని తొలిసారిగా ప్రచురించారు.  దాని పేరు అదితి.  మీరు అదితి చదవకపోతే ఇక్కడ చదువుకోవచ్చు.

ఆ కథ మీద పాఠకులనుండి వచ్చిన స్పందనల గురించి ఈ టపా.ఈ స్పందనలను ఇక్కడ నమోదు చెయ్యడానికి ప్రేరణ వి వి న మూర్తి గారు తమ కథ “ఒక రేపిస్టు ప్రేమలేఖ” (ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం – ఫిబ్రవరి 1,2015, ప్రచురణ) మీద ఫేస్‌బుక్‌లోని కథ సమూహంలో వారికి వచ్చిన స్పందనలని పంచుకోవడమే.  అలాగని వారితో కాని మరెవ్వరితోకాని నన్ను కాని నా రచనలని కాని నేను పోల్చుకోవడం లేదు.

మరొక ముఖ్యమైన కారణం –  భవిష్యత్తులో ఈ అదితి గురించి పాఠకులు నాకు చేరవేసిన తమ అభిప్రాయాలు వ్రాసుకున్న ఈ కొన్ని, నా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.  కథ చదువుకున్న తరువాత మీరు ముందుకు సాగితే బాగుంటుందని నా అభిప్రాయం.  కథ చదవకుండా దానిమీద పాఠకుల స్పందన తెలుసుకున్న తరువాత కథ చదివితే మీ అభిప్రాయంలో మార్పుకి అవకాశం ఉండవచ్చు.  ఉండకపోనూవచ్చు.

ఈ పాఠకుల స్పందనలకి గణాంకాలు కాని సంఖ్యాక వివరాలు కాని లేవు.  జ్ఞాపకం ఉన్నంతమేరకు ఇక్కడ పంచుకుంటున్నాను. గమనించగలరు.  ఫోన్లు చేసిన పాఠకుల పేర్లు నేను అడగలేదు.  వారి ఏ ఊరు నుంచి చేస్తున్నారన్నది తెలుసుకోవడానికి మాత్రమే వారి ఊరి పేరు అడిగాను.

అదితి ని స్త్రీలూ పురుషులు ఇద్దరూ చదివారు.  ఫోన్లు చేసారు, ఎస్ ఎమ్ ఎస్ లు పంపారు.  చాట్ లో చెప్పారు.

ఫోన్లు చేసిన వారి సంఖ్యని నేను మొదట్లో లెఖ్ఖ పెట్టడానికి ప్రయత్నించాను కాని తరువాత విరమించుకున్నాను, నాకు అంత ఓపికాలేదు, ఆ ఆసక్తి లేకుండా పోయింది. ఉజ్జాయింపుగా ఒక అంచనా అయితే ఉంది.

అదితి కథ చదివిన తరువాత, నా గురించి తెలిసిన వారు, నా గురించి విన్నవారు చాలా ఆసక్తిగా అడిగిన ప్రశ్న.  “ఇదేనా మీరు వ్రాసిన తొలి కథ?” అని. ముఖ్యంగా సాహిత్యకారులు.  రచయితలు, కొంత మంది సంపాదకులు కూడా.  ఆ ప్రశ్నని నేను అసలు ఎదురుచూడలేదు.  బహుశ నన్ను నేను ఆ కోణంలోనుంచి (ఒక తెలుగు రచయితగా) చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ కలగలేదు. అందుకనేమో మరి!

ఇక వారి ప్రశ్నకి జవాబు;
తెలుగులో నేను వ్రాసిన కథలలో ఆఫ్‌లైన్‌లో అంటే (అచ్చు) పత్రికలలో ప్రచురణకి నోచుకున్న తొలి కథ ఇదే.

 పోతే ఇందాక అనుకున్న పాఠకులలో రచయితలు, సంపాదకులూ ఉన్నారన్నాను కదా!  వారందరి ఏకాభిప్రాయం: “ఇది మీ తొలికథ లాగా లేదు.”

గోక్కోవడం
“దురద” ని మెచ్చని వారు కూడా ఉన్నారు.  కనీసం ముగ్గురున్నారు.  ఒకరు స్వయంగా నాకు తన అభిప్రాయం తెలియజేస్తే మరొకరు ఫేస్‌బుక్‌ కథ సమూహంలో ఆ మాటలే కాకున్న అటువంటి అర్ధం వచ్చే మాటలే వాడారు.  ఒకరు సందేశం పంపారు.

అదితి - aditi - telugu short story by Anil Atluri
అదితి కథలో లంకేష్

ఒకరిద్దరు “శిల్పాన్ని ఇంకా చక్కగా engineer చేసి ఉంటే బాగుండేది,” అన్నవారున్నారు. కథని గతం – వర్తమానం మధ్య నడిపిస్తూ “మీరు కొత్తగా ఏమి  చేసారు?” అని నిలదీసినవారున్నారు.  అడిగిన వారికి నా అప్రకటిత (కనీసం వారి దృష్టిలో) రచనా సామర్థ్యం మీద వారికున్న నమ్మకానికి ఆశ్చర్యమేసింది.
శైలిని కూడ దాదాపు అందరూ మెచ్చుకున్నారు.  భాష విషయానికి వస్తే, “మరి అంత ఇంగ్లిష్ అవసరమా?” అని అడిగినవారు కూడా ఉన్నారు.  “మీరు ఎన్నుకున్న నేపధ్యానికి మీరు వాడిన బాషే సరిపోయింది,” అని మెచ్చుకున్నవారున్నారు.

దాదాపు అందరూ “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” అని చెప్పారు.

మీ కథని తెలుగు పాఠకులు మెచ్చుకోవడం అనుమానమే,” అని అభిప్రాయాన్ని వెల్లడించిన ఇద్దరు పాఠకులు రచయితలే!  వారిద్దరూ నా శ్రేయోభిలాషులే.

“మీ ఈ కథలని తెలుగు పాఠకులు అందుకోలేరండి.  తొందరగా మీ కథలని కూడా నాకివ్వండి.  అనువదిస్తాను,” అని అంటే ముక్కున వేలేసుకోవడం నా వంతైయ్యింది.

కాస్త చదువుకున్నవారు ( సాహిత్యం ), లోకజ్ఞానమున్నవారు కథ ముగింపుని హర్షించలేదు.  సైకోసొమాటిక్ డిజార్డర్ అని మీరు చెప్పకపోయినా అది పాఠకులకి అర్ధం ఆయ్యేది అని వారు అభిప్రాయపడ్దారు.  వీరందరూ పట్టణ ప్రాంతాలలో జీవిస్తున్న విద్యాధికులే! రచయితలందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
కథకి పాత్ర పేరు అదితి కాకుండా మరోక మకుటం పెట్టిఉంటే బాగుండేది అన్నపాఠక, సంపాదక వర్గ,  రచయితలున్నారు.
  • అదితి కథ అర్ధం కాలేదు అని సందేశాలు పంపినవారు ఇద్దరు.
  • బోర్ కొట్టిందని సందేశం పంపుతూ “ఇంకా మంచి కథలుమీరు వ్రాయలి!” అని ప్రోత్సహించిన వారు ఒకరు.
  • సైకోసొమాటిక్ డిజార్డర్ అనే లక్షణం నిజంగా ఉందా అని అడిగిన వారు కొందరు.
  • దాదాపు ఒక పదిమంది దాకా తమ కుటుంబంలోనో , స్నేహితులలోనే ఇటువంటివి చూసినవారున్నారు.  వివరంగా నాతో వారి అనుభవాన్ని పంచుకున్నారు.
  • అదితి చదివిన తరువాత ఆ దురద లాంటి ఇతర అలవాట్లని గుర్తించిన పాఠకులు కథని విపరీతంగా  మెచ్చుకున్నారు.

అదితి  ఒక ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టింది.  కుటుంబ సమస్యలకి నన్ను పరిష్కారం కోరుతూ పాఠకులు ఫోను చేసారు.  మరీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య వచ్చిన అవగాహానాలేమి.  ఫోన్లు  చేసిన వారందరూ స్త్రీలే!

పాత్రల పేర్లు మీద కూడా స్పందించారు.  “ఆ పేర్లు ఏమిటి?  అన్ని కృతకంగా ఉన్నాయి!  ఆ భాష ఏంటి?” అని అన్నవారు కూడా ఉన్నారు.

ఈ టపా సమయానికి ప్రవాసాంధ్ర పాఠకులెవరి స్పందనా నాకు అందలేదు.
కథలతో పాటు రచయిత ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రచురణకర్తలకు అభిప్రాయాలు అందటం లేదట!
– ౦ –
నా పరిశీలనలోనూ, నా అధ్యయనంలో తెలిసిన రెండు ముఖ్యమైన విషయాలు చెప్తాను.
1 – స్థూలంగా 40ల లోపున్న వారికి ఈ కథ అంతగా నచ్చలేదు.
2 – 40 లు దాటిన వారందరికీ ఈ కథ చాలా బాగా నచ్చింది.
3 – ఈ నలభైలలోపు ఉన్నవారికి ఈ కథ:
శోభన్ బాబు లాంటి పల్లెటూరి మొగుడు, పట్నం పెళ్లాం, కొత్త దేవత లాంటి భార్య ఇందులో కొత్తేముంది?” అని అడిగినవారు ఉన్నారు.  మరో అడుగు ముందుకేసి ఇల్లాలు సినిమా కి మీ కథకి పెద్ద తేడా ఏముంది అనికూడా అడిగేసారు. 🙂
4 – లంకేష్ ఒక “చచ్చెధవ, సౌమ్య భలే పని చేసింది,” అని ఆ పాత్రని మెచ్చుకున్న స్త్రీ లు కూడా ఉన్నారు.  🙂

ఫేస్ బుక్ కథ సమూహంలో కథని పంచుకున్న సాయి పద్మ కి, సోదరుడు అట్లూరి శ్రీ కి, అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ , వ్యవస్థాపక అధ్యక్షులు రాష్త్ర కధానిలయం, నందలూరు వారికి మప్పిదాలు.ఇక ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం సంపాదక వర్గం సభ్యులకి, బొమ్మలు వేసిన అక్బర్ గారికి నా నెనర్లు.

గమనిక

  • ఈ కథని ఏ ఒక్క పత్రికనో దాని పాఠకులనో దృష్టిలో ఉంచుకుని వ్రాసింది కాదు.  కథని వ్రాసుకున్న తరువాత ఒకే ఒకరితో పంచుకున్నాను.  వారి అభిప్రాయాన్ని విన్నాను.  ఆ అభిప్రాయంతో నా కథలో మార్పులు చేర్పులు చెయ్యలేదు.  అది వారి అభిప్రాయంగానే తీసుకున్నాను.    అంతే.
  • ఈ కథకి నేపధ్యం ఉందా అంటే ఉంది.
    ఒకటి అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొకరు “మీరే వ్రాసారా?  ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చింది.  అంతేకాదు మరొక distant cousin కూడా ఎక్కడో “…వ్రాసేవాళ్ళెవరూ లేరు నేను తప్ప,” అని అంటే అది గుచ్చుకుంది.  అప్పుడు వ్రాసుకున్న కథలలో ఇది ఒకటి.  అందుకోసమే వ్రాసిన దాన్ని ప్రచురణకి పంపాను.  నాకు కోపం తెప్పించిన వారిద్దరికి కూడ మప్పిదాలు. 🙂 రెండు నా దృష్టికి వచ్చిన కొన్ని అనుభవాలని ఏర్చి కూర్చి ఒక కథగా మలిచాను.  ఆ అనుభవాలు కూదా దాదాపుగా మూడు దశాబ్దాలమేరా విస్తరించిన అనుభవాల సమాహారం.