కవి స్వరాలు

మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో కిన్నెర వారి తెలుగు కవిత మహోత్సవాలు లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన ‘తెలుగు వెన్నెల‘ లో “అనువాద కవిత్వం – దశ – దిశ‘ అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.అంతే కాకుండా అంతకు క్రితం రోజున విశిష్ట కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రత్యేకత ఏమిటంటే వేదిక నెక్కిన ప్రతి కవి తన కవితని తనే చదివి సభకు వినిపీంచాలి.

వేదిక నెక్కిన కవులు, వారి కవితలు వారి గళాలలోనే, మీ కోసం ఇక్కడ.

అద్దేపల్లి రామమోహనరావు

ద్వా.నా.శాస్త్రి

శిఖామణి

ఆశారాజు

శ్రీమతి ఎన్. అరుణ

శ్రీమతి జ్వలిత

రామకృష్ణా రావు

ఫణీంద్ర

వెనిగళ్ళ రాంబాబు

దేవరాజు మహారాజు

ముకుంద రామారావు

వడ్డేపల్లి కృష్ణ

చిమ్మపూడి

ఆచార్య గోపి
రాళ్ళబండి కవితా ప్రసాద్

మందేరా!

బ్రహ్మపురము మందేరా
పర్లాకిమిడి మందేరా
కాదనివాదుకివస్తే
కటంకదాక మందేరా!

బస్తరేల్లా మందేరా
జయపూరంతా మందేరా
కాదనివాదుకివస్తే
నాగపురుదాకా మందేరా!

గోలకొండ మందేరా
తెలింగానా మందేరా
కాదనివాదుకివస్తే
నైజామంతా మందేరా!

చెన్నపురము మందేరా
చంగల్ పట్టు మందేరా
కాదనివాదుకువస్తే
తంజావూరు మందేరా!

బెంగుళూరు మందేరా
బళ్ళారి మందేరా
కాదనివాదుకువస్తే
కన్నడ మర్ధం మందేరా!

దేవికోట మందేరా
పుదుక్కోట మందేరా
కాదనివాదుకువస్తే
కాండే దాకా మందేరా!
– “కవిరాజు” త్రిపురనేని రామస్వామి, శతావధాని

– ‘manderaa’ by “Kaviraju” Ramaswamy Tripuraneni


* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.

తెలుగు తల్లి – Telugu Talli by “Kaviraju”

తెలుగు తల్లి

మాలదాసరి నోట, మహితభూసురనోట,
నొకతీరిమాటాడి యొప్పినావు!

మాలవాడలాబాట, మహితభూసురపేట,
నొక్కరీతిగ జిందు తొక్కినావు!

మాలగేస్తునింట, మహితభూసురినింట,
నొకరీతిబదముల నుంచినావు!

మాలపెద్దాలచెవి, మహితభూసురుచెవి,
నొకరీతి సామెతలూదినావు!

కన్నబిడ్డలదెస నొక్క కనికరంబె
చూపి, యెల్లవారికి దారి చూపినావు!
తల్లి! నీ మాట, నీ పాటదలుచుకొన్న
జలదరించుచు మేనెల్ల పులకరించు!

*0*

అతిశయభక్తిన్ వినుమా
ప్రతిభాషింపకయె తెనుగుభాష కుమారా!
అతిమధురం బతిపేశల
మతిపేయము కాదే బాసలన్నిటిలోలన్!

– “కవిరాజు” త్రిపురనేని రామస్వామి

Telugutalli by “Kaviraju” Ramaswamy Tripuraneni

* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.

వీరగంధము

వీరగంధము

వీరగంధము దెచ్హినారము
వీరులెవ్వరొ దెల్పుడీ!
పూసిపోతము మెడను వైతుము
పూలదండలు భక్తితొ!

తెలుగు బావుట కన్నుచెదరగ
కొండవీటను నెగిరినప్పుడు-
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు-

తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందునున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు-

ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలెదు రవంతయున్;
ఇట్టిప్రశ్నలడుగువారలు
లేకపోయిరి సుంతయున్!

నడుము గట్టిన తెలుగుబాలుడు
వెనుక తిరుగడెన్నడున్!
బాస ఇచ్హిన తెలుగుబాలుడు
పారిపోవడెన్నడున్!

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము, మై నలందుము;
శాంతిపర్వము జదువవచ్హును
శాంతిసమరం బైనపిమ్మట!

తెలుగునాటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగిరమ్మిక,
పలు తుపాకులు, పలు ఫిరంగులు
దారికడ్డము రాకతప్పవు!

తెలుగుబిడ్డా! మరిచిపోకురా!
తెలుగుదేశము పురిటిగడ్డరా!
కొక్కరకొ పాటపాడరా!
తెలుగువారల మేలుకొల్పర!

“కవిరాజు” త్రిపురనేని రామస్వామి

Veeragandhamu by “Kaviraju” Ramaswamy Tripuraneni

* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.