కాని నమ్మకం ఉంటే చాలదు. దానికి ప్రణాళిక కూడా ఉండాలి. బలమైన పునాదులుండాలి. అసలు చెయ్యవలసిన గమ్యం ఏమిటి అన్నది నిర్ణయించుకుంటే కాని మిగతా విషయాలు తెరపైకి రావు.
నేను నెత్తిక్కెక్కించుకున్నది ఎక్కువ. వాటన్నింటిని నేను గమ్యం చేర్చాలి. చేర్చాలి అంటే నేను రేపు బ్రతికి ఉండాలి. ఉండాలి అంటే ఒక అంచనా, ఒక ప్రణాళిక, ఒక నీయమావళి ఉండాలి. దాని ప్రకారం పనులు మొదలు పెట్టాలి. ముగింపుకి కి త్రోవని ఎర్ఫాటు చెయ్యాలి. మధ్యలో ఆగిపోవలసి వస్తే..అందుకోవడానికి మరొక చేతిని కూడా చూసుకోవాలి.
కాబట్టి ఈ పూట మందులు వేసుకోవాలి. రేపటికోసం ఈ రోజు మందులు వేసుకోవాలి. బ్రతకడందేమున్నది..చెట్లు బతకడం లేదా..కుక్కలు పందులు బ్రతకడంలేదా? కొమ్మచివరనున్న పూవులు వికసించడం లేదా? రాలే లోపు చెయ్యాల్సినవి చాలా ఉన్నవి మిత్రమా!
చెయ్యగలను అన్న ధీమా, ధైర్యంతోనే ఉన్నాను.
రేపు తెల్లవారుఝామున లేచి, ఉదయించే సూర్యుడ్ని చూస్తానన్న నమ్మకంతోనే ఈ పూట నిద్రిస్తున్నాను.
చూసాను.
చాలామందిని చూసాను.
అతి దగ్గిరగా చూసాను.
ఎక్కించిన వాళ్లను చూసాను.
పైకి ఎగదోసి మరి ఎక్కించిన వారిని చూసాను.
చిటారు కొమ్మదాక ఎక్కిన వారిని చూసాను.
ఎక్కిన వారిని చూసాను.
ఎక్కి కళ్ళు మూసుకుని పోయి గుడ్డివాళ్ళైపోయిన వారిని చూసాను.
పైనుంచి క్రిందపడ్డ వారిని చూసాను.
దబ్బున పడ్డ వారిని చూసాను.
కాళ్ళు చేతులు విరిగిన వారిని చూశాను.
నడుములు పడిపోయి జీవితాంతం మంచాలకే బంది ఐపోయిన వాళ్ళని చూసాను.
పడిన వాళ్ళకి అసరాగా ఎవరూ నిలబడని పరిస్థితులని కూడా చూసాను.
వాళ్ళు ఒంటరిగా దుర్భరమైన జీవితాన్ని గడిపి కాల గర్భంలో కలిసిపోయిన వైనాన్ని గమనించాను.
ఇంకా చెప్పాలంటే మునగ చెట్టుకి మిగతా చెట్లకి ఉన్న తేడా కూడా తెలుసుకున్నాను.
దేవదారు వృక్షాలకి, మామిడి చెట్లకి, పూల పొదలకి, గడ్డిపోచలకి మధ్య ఉన్న సారూప్యాలను కూడా తెలుసుకున్నాను.
పైవేవి నేను స్వయంగా అనుభవించి తెలుసుకోలేదు.
జీవితం నాకు నేర్పిన పాఠాలు అవి.
నేను మంచి విద్యార్ధిని అని నా నమ్మకం.
కరెంటు షాక్ కొడుతుందని ముట్టుకుని తెలుసుకోనఖర్లేదు.
నిప్పు ముట్టుకుంటే కాలుతుందని కూడ దానిని ముట్టుకుని తెలుసుకోనఖర్లేదు.
అలాగే మునగ చెట్టు ఎక్కి కింద పడి అనుభవం పొందనఖర్లేని ఒక జీవితం నాకు దొరికింది.
అటువంటి జీవితం నాకు ప్రసాదించిన జ్ఞానం అది.
కాబట్టి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించవద్దు.
భంగ పడి మీరు అవమానాల ఊబి లో కూరుకుపోవద్దు.
చక్కగా మీ జీవితాన్ని, హుందాగా, ఆత్మగౌరవంతోను, ఆనందంగాను, సుఖసంతోషాలతో గడపండి.
దయచేసి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించొద్దు!
అది మీవల్ల కాదు కదా..మీమ్మల్ని పుట్టించిన ఆ బాబు వల్ల కూడా కాదు!!
లక్షాలాది మంది ఆయన పాడగా వినాలని,
ఆయనతో ఒక కరచాలనం చెయ్యాలని,
వారి ఆశిస్సులుంటే చాలని కోరుకునేవారు.
ఆయనేమో అక్కడెక్కడో బెంగుళూరు బేకరిలో ఏ పాస్ట్రీ యో, బిస్కట్టో బాగుందని కొని తీసుకువచ్చేవారు. నాకోసం.
అడయారు నుంచి టీ నగర్ దాకా. (http://goo.gl/maps/6Z7xu ) దాదాపు ఓ పది కిలోమీటర్లు. నన్ను గుర్తు పెట్టుకుని మరీ. వారికి నేనేమి బంధువును కాను. ఐనా.
ఆదివారం సాయంత్రాలు ఆరు ఏడు ఆ ప్రాంతాల్లొను, రాత్రి ఐతే 8 ఏ ప్రాంతాల్లొ వచ్చేవారు. మేమిద్దరం ఆయన కారులో కూర్చునో, కారుకి ఆనుకునో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ గంటల కొద్ది కాలం గడిపేవారం.
“ఫరవాలేదు..నేనిమి అనుకోను..మీ స్మోకింగ్ మీది” అని ముందే అనేసేవారు. మాములుగా మా కబుర్లు సంగీతం, సాహిత్యం మీదే ఉండేది.ఘజల్స్ మీద వారికి ఆసక్తి మెండు. కొత్తగా వ్రాసింది తీసుకువచ్చేవారు. రాగయుక్తంగా చదివి వినిపించేవారు. నాకు అర్థం కాని చోట వివరంగా విడమరిచి చెప్పేవారు.
ఆ జేబులో కనీసం ఒక ఐదారు పెన్నులు, ఆ చేతిలో పుస్తకాలు లేకుండా కనపడేవారు కాదు. తనని ఆహ్వానించిన ప్రతి సభకి హాజరయ్యేవారు. ఒక ప్రశంసా పత్రమో, ఒక కవితో చదివి వినిపించి దాన్ని ఆ నాటి కర్త కి అందించి వెళ్ళేవారు. వాటిని సేకరించి ప్రచురిస్తే బాగుంటుంది. కాని అదేమి సామాన్యమైన విషయం కాదు! ఆయన అలా వ్రాసిచ్చింది తక్కువేమి కాదు.
వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంతో స్నేహంగా ఉండేవారు. చెరగని చిరునవ్వు!
మొన్నామధ్య మద్రాసు వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను. వెళ్ళి కలవాలని.
చాలమందిని కోల్పొయ్యాను.
కోల్పోతున్నాను కూడా!
ప్రతి ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసి తీసుకువెళ్ళేవారం మా షాపుకి. అమ్మ చేసేది. నా వివాహం తరువాత నా శ్రీమతి కూడ చేసేది. పిల్లకి తప్పకుండా పెట్టేవాళ్ళం. ఆ ముందు రోజే కావాల్సినివి కొనుక్కునేవారం..రంగనాధం వీధిలోనో..లేదు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలోనో. వేపపువ్వు మట్టుకు ఎవరిదో ఒకరి ఒకరి ఇంట్లో నుంచి వచ్చేది.
చిన్న స్టిలు గిన్నేలో. అసలు ఆ ఆలోచన కూడ షాపుకి వచ్చైన విద్యార్ధి అన్న మాటతో మొదలైనది. 80 ప్రాంతంలో. ఆ విద్యార్ధి ఎవరో వాపోయ్యాడు..”నేను ఇంటి దగ్గిర ఉంటే ఈ రోజు ఉగాది పచ్చడి తినేవాడిని, ఈ మద్రాసు మహానగరంలో ఎవరండి మాకు పెట్టేది అని’. ఆలోచన అక్కడ మొదలైనది. అప్పట్లో సి. ఎ చదువుకోవడానికి మద్రాసుకి ఎక్కువమంది వచ్చేవారు. అలాగే కొంతమంది ఏదో వ్యాపారం నిమిత్తం వచ్చి ఉండిపోవాల్సి వచ్చేది పాపం ఆ రోజున ఇంటికి వెళ్ళే అవకాశం లేక.
షాపుకి వచ్చిన వాళ్ళకి ఈ ఉగాది పచ్చడి పెట్టే వాళ్ళం. వీళ్లల్లో విద్యార్ధులు, వ్యాపారార్ధం వచ్చిన వారే ఎక్కువ. ఒకసారి మధ్యానానికి పచ్చడి ఐపోయింది. సాయంత్రం వచ్చిన వారిని ఉత్త చేతులతో పంపేసేటప్పడికి ఉస్సురనిపించింది.
అప్పట్నించి కొంచెం ఎక్కువచేసి పెట్టేవారం. చివరకు అది ఒక ఆనవాయితిగా..ఇళ్ళల్లో చేసుకున్నవారు కూడ పొద్దునే వచ్చి శుభాకాంక్షలు చెప్పి..ఒక చిన్న గరిటేడైన తీసుకుని వెళ్ళేవారు. ఇప్పటికి కలిసినప్పుడు కొంత మంది దానిని గుర్తు చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది.
కాని ఈ రోజున నాకు ఉగాది పచ్చడి తినాలని ఉన్నా పెట్టే వారేవరు? ఉగాది పచ్చడి తిని ఎన్ని సంవత్సరాలైందో. గుర్తు కూడ లేదు!
ఆ మహాను భావుడే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు (అంటే కార్టూనిస్ట్) అని తెలుగు వ్యంగ చిత్రకారులు నిర్ణయించేసారు. పబ్లిక్కుగానే. ప్రసార మాధ్యమాలకి ప్రకటనలు, పత్రికలలో వ్రాతలు వగైరా అన్ని ఐపోయినవి. ఆయనే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు అని వూరుకున్నారా? లేదు. ఆయన పుట్టిన మే 20వ తారీఖుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవం గా కూడా నిర్ణయించేసారు. పబ్లిక్కుగానే. అలా అనేసి వూరుకున్నారా? లేదు. ప్రకటించేసారు! ఎలా? పబ్లిక్కుగానే. ప్రసారమాధ్యమాల వారందరూ కూడ తమ తమ శ్రోతలకి, పాఠకులకి, వీక్షకులకి, ఇతరులకి ఆ వార్తని బట్వాడా చేసేసారు. ప్లబిక్కుగానే ఇదంతా!
పైగా ఈ తెలుగు ఈ వ్యంగ చిత్రకారులందరూ కలిసి, ఆయన..ఎవరూ? ఆ తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడి పేరు మీద ఒక “తలిశెట్టి రామారావు అవార్డు కార్టూన్ ల పోటి” ని కూడా ఘనంగా నిర్వహించారు. పబ్లిక్కుగానే నండీ! బహుమతులిచ్చారు ఆ పోటీలలో. పబ్లిక్కు గానే! ఎవరు ఇచ్చారండి బహుమతులు. తనికెళ్ల భరణి..చలనచిత్ర వ్యంగ నటుడు (అందామా)! ఎక్కడ? భాగ్యనగరం లోనే!ఎప్పుడూ? ఆ తేదినే! మే 20వ తారీఖునే!! అది కూడ పబ్లిక్కుగానే. పబ్లికే కదండీ నేను, అందుకనే హాజరయ్యానండి, దానికి కూడా!
అయ్యా అది ఐపోయింది.
మొన్న అంటే, 28 న మొదలుబెట్టి, 29, 30 న కూడ మన కార్టూనిష్టు మిత్రులు కార్టూనోత్సవ్ పబ్లిక్కుగా,పబ్లిక్కుకి అందుబాటులో ఉండే పబ్లిక్ గార్డెన్స్‌లో జరుపుకున్నారు.నరేంద్ర లూథర్ గారు, పొత్తూరి వేంకటేశ్వరావు గారు, మరి కె.వి రమణా చారి గారు లాంటి పెద్దల సమక్షంలో 30 వ తారిఖున తమ పెద్దలని ఘనంగా సన్మానించుకున్నారు. పబ్లిక్కు గానే నండోయి!
అందులో ఒక కొత్త ప్రతిపాదన చేసారు. పబ్క్లిక్ గానే నండి. అదేమిటంటే, తమకి గురుతుల్యులైన మరో పెద్ద “కార్టూనిష్టు” పుట్టిన రోజుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవంగా పరిగణించాలని. వారు ఎంచుకున్న “కార్టూనిష్టు” గారి గురించి ఏ ఒక్కరికి అభ్యంతరంలేదు. వారికి జరగవలసిన సన్మానాలు, పురస్కారాలు భవిష్యత్తు లో చేయవలసిని కార్యక్రమాలు చాలానే ఉంటవి. అటువంటి సందర్భంలో ఇటువంటి “ప్రతిపాదన” ఎంత వరకు సమంజసమన్నదే ప్రశ్న! పైగా ఆ “గురువు” గారికి అసలు ఈ విషయం తెలుసా అన్న సందేహం కూడా కలుగుతుంది. తెలిసుంటే వారు సున్నితంగా తిరస్కరించే మనస్తత్వమున్నవారే అని కూడా నా బోటి వారి అభిప్రాయం. ఆ “గురువు” గారే తన “గురువు” గా భావించే మరొ “పెద్ద గురువు” గారు హటాత్తుగా ఆ సభకి వచ్చివుంటే, అప్పుడు గౌరవం వారికే దక్కేదేమో?! పబ్లిక్కుగా అన్నా, అనకపోయీనా నిన్న “కార్టూనోత్సవ్” కి హాజరైన కొంతమంది మిత్రులు ప్రైవేటుగా నాతో తమ అభిప్రాయాన్ని వెల్లడి చేసుకున్నారు.
ఒకరికి తగిలించిన కిరీటాన్ని లాక్కుని మరొకరిని దానిని ధరింపజెయ్యబూనడం ఎంత వరకు సమంజసం?
ముందున్నది మూడు చెరువులు. ఒడ్డున్న ఉన్నది అప్పుడే వాటిల్లో మునిగి, ఈది, తేలి, గట్టుకు చేరిన సుశిక్షుతులైన గజ ఈతగాళ్ళు. ఆ చెరువులు చెరువులేనా?.. ద్రోహ వృక్షం, నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం. ఒడ్డున్న ఉండి మళ్ళీ దూకడానికి ఉద్యుక్తుడవుతున్న నవయువకుడు శివారెడ్డి..కానీండి ఇంకా చూస్తారే?..నేనైతే ‘జీవని’ లోకి దూకాను. ‘ఐదు హంసలు’ని కూడా చూసాను. దూకడమే..అలా ఒడ్డున నిలబడిపోతే మీ జీవితంలో ఒక ఎపిక్ ప్రపోర్షన్ లో ఒక అనుభవాన్ని కోల్పోతారంటాడు.
ఇందులో ద్రోహవృక్షం కథల సంపుటి. మిగతా రెండూ – నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు. రచయిత డా॥ వి. చంద్రశేకఖర రావు.
ఆ పుస్తకాల పేర్లు చూడండి. ఒక మార్మికత లేదూ వాటిల్లో?! చిన్నప్పుడు మా నాన్న తెచ్చి ఇస్తే పుస్తకాలు, ఏది ముందు చదవాలో అర్ధం అయ్యేది కాదు. అన్నింటిని ఒకే సారి చదవలేము. సరే, పుస్తక పరిచయ సభకి వెళ్ళాం కదా..ఆ మహామహుల మాటలు విన్నాం కదా? వాళ్ళందరూ ఏదో ఒక పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తే దాంతో మొదలు పెట్టవచ్చు. అసలు ఆ సాహితీవేత్తలు ఆ అవకాశం లేకుండా అన్నింటి గురించి చెప్పేసారు. అసలు ముందు వాళ్ళ మాటలు వింటుంటే ఒక అయోమయం.
నల్లమిరియం చెట్టు గురించి మాట్లాడుతూ, ఆకుపచ్చని దేశం లోకి వెళ్ళిపోతారు. పోనీ దాని గురించి మాట్లాడుతారా అంటే ఉహు మళ్ళీ ద్రోహవృక్షంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఉంటారా అంటే ఆబ్బే సుందరం అంట..ఆదెమ్మ అంట, చెంచులు అంట, నరసింహం ఆత్మహత్య, మొసళ్ళు వాటితో యుద్దమా లేదా తప్పించుకుని అవతలి ఒడ్డుకి చేరటమా అన్న ఆలోచనంట..ఇవేవి కావు అసలు ఈ చంద్రశేఖరం గారు కవిత్వం వ్రాస్తున్నాడంటున్నారు, నా దృష్టిలో అది కవిత్వం కాదు..ఈ రచయిత రచనల మీద నేను పరిశోధన చేస్తున్నాను అని మరో వక్త. సరే! వాళ్ళు పుస్తకాలు చదివారు కాబట్టి వేదిక మీద ఉన్నవాళ్ళందరికి రచయితతో సహా తాము ఏమి మాట్లాడుతున్నారో తెలుసు.
మరి పాఠకుడి పరిస్థితి.
సీరియల్‌ని చదివిన పెద్దాయన కవి శివారెడ్డి. ప్రతి వారం ఒక వార పత్రికని కొని..ఒక ముక్క చదివి..మళ్ళీ వచ్చేవారం కోసం ఎదురుచూస్తు..ముక్కలు ముక్కలుగా చదవటానికి విముఖుడు. అలా చదవాలంటే చెడ్డ చిరాకు ఈ కవికి. కాని ఆయన ప్రతివారం ముక్కలు ముక్కలుగానే చదువుకున్నాడంట సీరియల్‌ని. అంతగా ఆకర్షించింది ఆయన్ని. ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటి ఉంది. ఆయన కవి. కథకుడు కాదు. నవలా కారుడు అంతకంటే కాదు. అవంటే పెద్ద ప్రేమా, మోజు లేదాయనకి. ఆయనే చెప్పుకున్నాడా మాట ఆ వేదిక మీద నుంచి. ఏకంగా 22 పేజీల ముందుమాట వ్రాసేయించింది ఆ నవల ఆ కవితో.
ఎవరూ ఏ పుస్తకాన్ని ఒక్క సారి చదివి నమిలి పిప్పిని పారేసిన వారు కాదు, బెకన్ అన్నట్టుగా. మాట్లాడిన వారందరూ ఆ నవలలని..ఆ కథలని పరిచయం చేసిన వారందరు ప్రతి పుస్తకాన్ని ఆవాహన చేసుకున్నవారే. ఆ పుస్తకాలు వారందర్నీ తమ ప్రపంచంలోకి రమ్మనమని సాదరంగా ఆహ్వానించినవి. వీరు ఆ యా ప్రపంచాలలోకి వెళ్ళి ప్రతి పాత్రతోను పయనించి, వారి జీవితాలని స్పృశించి, ఆ లోకాలను అనుభవిస్తూ వెలికి వచ్చారు. మళ్ళీ అ సాహిత్యంలోకి వెళ్లాలనిపించి వెళ్ళారు. వదలలేదు. వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్లారు. రేపు మరోసారి మళ్ళీ వెడతారు. వారి మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ ఆ లోకాలలో విహరిస్తూనే ఉంటారనిపిస్తుంది.
నవీన్ వాసిరెడ్డి
సభకు అధ్యక్షుడు. నేను పోలీసుల చెకప్పులు, వినాయకుడి విగ్రహాలను తప్పించుకుంటూ హైద్రాబాదు ట్రాఫిక్కులోపడి ఈదుకుంటూ వెళ్ళేటప్పడికి ఆయన ఉపన్యాసం అయిపొయ్యి వక్తలను ఆహ్వానిస్తున్నారు.
జగన్నాధ శర్మ (నవ్య సంపాదకులు,) చాల క్లుప్తంగా మాట్లాడారు.
“సాహితీలోకంలో ఒక మాట ఉంది. 1910 నంచి 20/30 ల దాక తెలుగు సాహిత్యంలో అనువాద కాలం అని. కాని నేను ఇప్పుడు చెబుతున్నాను. 2010 నుంచి మళ్ళీ తెలుగు కధా సాహిత్యం, నవలా సాహిత్యం మొదలైనది. భారతదేశంలోని ఇతర భాషలు తెలుగు భాష వైపు తెలుసు సాహిత్యం వైపు చూస్తుండాల్సిన తరుణం వచ్చేసింది. దానికి కారణం చంద్రశేఖర రావు లాంటి రచయితలు. నవల రూపు చూడకండి. నవలలో వస్తున్న వస్తువుని చూడండి. గొప్ప తెలుగు సాహిత్యం ఈ దశాబ్దం తో మొదలయ్యింది మళ్ళీ. ఇంతకన్నా తెలుగు సాహిత్యం గురించి నేను చెప్పగలిగింది లేదు”.
కవి శివారెడ్డి
కవి శివారెడ్డి మూడు సార్లు చదివారు. ఆయన నల్ల మిరియం చెట్టు కి ముందుమాట(?) అందామా “ఒక గాధ గురించి” అని శీర్హిక పెట్టి..అంటారు కదా..తొలి వాక్యం లో.
” నేనిప్పుడో మహోపన్యాసం చెయ్యగలను డా॥ వి. చంద్రశేకఖర రావు గారి సాహిత్యం మీద”.
“Preconceived notions లేకుండా రచయిత దగ్గిరకు వెళ్ళే ఒక తరం పాఠకులొస్తారు. వచ్చారు. విమర్శకులే రావాల్సింది.
ఊర్వశి అంటుంది పురూరవుడి తో,’ప్రేమ కావాలా..నీ అలంకారాలన్ని, ఆభరణాలన్నీ పక్కన బెట్టి దిగంబరంగా నా దగ్గిరకు రా,’ అని. అలా పాఠకుడు అన్ని misconceived, wrong notions ని పక్కనబెట్టి – పరమ దిగంబరంగా వాచకం దగ్గిరకెళ్ళాలి – ఆ పాల సముద్రం లో మునగాలి.” అవి ఆయన మాటలు.
ఎ కె ప్రభాకర్ గారు
చంద్రశేఖర రావు సాహిత్యం గురించి సోదాహరణం గా వివరించారు. నల్ల మిరియం చెట్టుగురించి మాట్లాడుతూ వారి మిగతా సాహిత్యంలోకి సభికులను లాకెళ్ళారు. ప్రత్యేకంగా ఆ నవల ముగింపుని పాజిటివ్ దృక్పధంతో నే చూడవచ్చు అని అన్నారు.
సీతారాం
చంద్రశేఖర రావు వచనం కవిత్వం కాదు. ఆయన తన ఆవేదనని పరివేదని అలా వ్యక్తం చేస్తున్నాడు. It is his expression of agony. His form and content needs more critics. “ఆయన రచనలమీద పరిశోధన చేస్తున్నాను,” అని అన్నారు. అంతగా కదిలించినవి చంద్రశేఖర రావు గారి సృజనలు ఆయనలోని విమర్శకుడిని. నల్ల మిరియం చెట్టుగురించే తాను మాట్లాడు దాం అని అనుకున్నానని కాని..దాని పరిధి దాటి మాట్లాడారు.
గుడిపాటి
చంద్రశేఖర రావు గారి సాహిత్యం మీద చాల చర్చ జరగవలసి ఉంది. ఇక్కడ కలిసిన ఈ రెండు మూడు వందల సాహితీవేత్తల మధ్య జరిగినదే కాదు. ఇంకా జరగాలి. వేదికలెక్కాలి. పాఠకులు అందులో ఇన్వాల్ కావాలి. ఇది ఇక్కడితో ఆగిపోదు.
రచయిత
నా కాల పరిస్థితులే నా రచనలని రూపొందించినవి. ఈ వేదిక మీద ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడం బాగుండదు.
జరిగిన సభ గుఱించి నా మాటలు:
ఎవరూ కూడా రచయిత వ్రాసిన ఏ ఒక్క కథకో ఏ ఒక్క నవలకో పరిమితం కాలేకపొయ్యారు. కారణం రచయిత ఎన్నుకున్న వస్తువు, శిల్పం, శైలి, భాష. ఒకరు దండోరా గుఱించి మాట్లాడితే, మరొకరు తెలంగాణా నేపధ్యంతో వ్రాసిన హెచ్ నరసింహం అత్మహత్య గురించో లేక చెంచువుల గురించో..ఐదు హంసల గురించో మరో కథ గురించో మాట్లాడారు. మధ్యలో కొ కు ఫోర్త్ డైమన్షన్ ని లాకొచ్చారు.
సాహిత్యం, పోకడలు, చంద్రశేఖర రావు రచనలు వారిమీద వారి ఆలోచనల మీద, ఆయన రచనలు తమ బుర్రకు పెట్టిన పనిమీద, పదునెక్కించిన రీతి..ఆ యా నవలల సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఒకటేమిటి ఎన్నో అంశాలు..పరిపూర్ణమైన ఒక సాహితీ సభ అది.
కొత్త తరం పాఠకులు వచ్చారు!
కొత్త తరం పాఠకులు వచ్చారు. నేనంటున్నది కూడా అదే. నవ్య సంపాదకులు అంటున్నది అదే! కవి శివారెడ్డి అంటున్నది అదే. ప్రభాకర్ గారు అన్నది అదే! సీతారాం చెబుతున్నది అదే! గుడిపాటి చెప్పింది అదే! మీరందరూ చదవవలసిన పుస్తకాలు ఇవి.
చాలా రోజుల తరువాత సాహితీ మిత్రులను చాల మందిని కలుసుకున్నాను. చాల సంతోషమేసింది. ఎంత సాదరంగా అహ్వానించారో! ఆదరంగా పలుకరించారో అందరూ.
ఇక మీరు చెయ్యవలసింది.
ఈ బ్లాగ్ పోస్ట్ చూసి ఇక్కడి దాకా చదివారంటే..మీకు అంతర్జాలంతో పరిచయం ఉండే ఉండాలి. సాహిత్యం మీద అభిరుచు ఉండి ఉండాలి. కాబట్టి ఈ మూడు పుస్తకాలు ముందు సంపాదించండి.తరువాత వీటిని కూడా సంపాదించి చదువుకోండి.
జీవని
లెనిన్ ప్లేస్
మాయా లాంతరు
ద్రోహవృక్షం..ఈవన్నీ ఈ రచయిత కధా సంకలనాలు.
దిష్టి చుక్క:
తెలుగు ప్రసార మాధ్యమాల ఫోటోగ్రాఫర్‌లు. జరుగుతున్న సభ మధ్యలో దూరి, ఆ క్రమాన్ని ఆరాచకంగా ఆపేసి, తమ కెమరా ప్రలోభానికి కి లొంగనివాడెవ్వడూ లేడని చెప్పకుండా చెబుతూ దర్పంగా వచ్చినంత వేగంగా వెళ్ళిపోతారు. వాళ్ళు అడ్డం రావడం కారణంగా గుడిపాటి, నవీన్, ఎ కె ప్రభాకర్ బొమ్మల్లో కనిపించకుండా పొయ్యారు. తీసినవి సరిగ్గా రాలేదు. ఉన్నవి కాని ఇక్కడ పోస్ట్ చెయ్యలేదు.
గొప్ప సాహితీ సభ ఎందుకైనదంటే..ఎవరూ పక్కవారి చెవులు కొరకలేదు. గుస గుసలు లేవు. ఫోన్లు మోగలేదు. హాలు బయట కుహానా సాహితీవేత్తల అరుపులు, పెడబొబ్బలు లేవు. ఇక సభలో ఉన్నవారి సంగతంటారా! అందర్ని ఆ వేదిక మీద వక్తలు తమ మాటలతో కట్టి పడేసారు. ఇప్పుడు అర్థమయ్యిందా ఆ రచయిత డా॥వి. చంద్రశేఖర రావు రచనా పటిమ? పుస్తకాలు కొనుక్కుని చదువుకోండి. చదువుకుని మీ బ్లాగుల ద్వారానో మరొక వెబ్‌సైట్ ద్వారానో మీ అభిప్రాయాలని పది మందితో పంచుకోండి! ఇక మొదలెట్టండి!
ఎన్ వేణుగోపాల రావు, వీక్షణం సంపాదకుడు , సభకు అధ్యకత వహించారు. 63 ఏళ్ళకే రోహిణి ప్రసాద్ గారి ఆకస్మిక నిష్క్రమణ విచారం కలిగిస్తున్నది. ఆయన ఒక అణు విజ్ఞాన శాస్త్రవేత్త. కాని తన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చూపించలేదేమోనని అభిప్రాయపడ్డారు.
దివికుమార్, ప్రజాసాహితి.
“నేను టెలిఫోను డిపార్ట్‌మెంట్ వాడిని కనుక ఎవరితోనైనా మాట్లాడడానికి అవకాశం ఉండేది. అలాగే రోహిణి ప్రసాద్ గారితో నా మొదటి పరిచయం. వారు విజయవాడ వచ్చినప్పుడు వారి చెబితే కాని తెలియలేదు చందమామలో వారి తండ్రిగారి సమకాలీకులు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని. ఉద్యోగ విరమణాంతరం విజయవాడలోనే ఉంటున్నారని.అలాగ దాసరి గారిని కలవడానికి రోహిణి ప్రసాద్ గారు కారణం.
రోహిణీ ప్రసాద్ గారు హైద్రాబాద్ వచ్చిన తరువాత తరచూ కలుస్తూ ఉండే వారం. ‘మీరు వ్రాయాలి. ఈ దిన పత్రికలలో కూడా మీ వ్యాసాలు అచ్చులో చూడాలి’ అని అనేవారు ఆయన. ‘నా పేరు కనపడితేనే వెయ్యటం లేదండి’, అని అన్నప్పుడు, ‘మరో పేరుతో వ్రాసి పంపండి..ఏదో కలం పేరు పెట్టి పంపేయ్యండి’ అని అన్నారు. ఆ పనే చేసాను. విజ్ఞానాన్ని పది మందికి పంచాలి అన్నది రోహిణీ ప్రసాద్ గారి ప్రధానమైన ఆశయంగా ఉండేది.
కోపం వచ్చింది!
గీత రామస్వామి – హైద్రాబాద్ బుక్ ట్రస్ట్
” ఆయన చాలా అర్ధాంతరంగా వెళ్ళిపొయ్యారు. హైద్రాబాదు బుక్ ట్రస్ట్ తరఫున వారివి ఒక మూడు పుస్తకాలు ప్రచురించాము. మరి కొన్ని పుస్తకాలకి ప్రణాళికలు కూడా వేసుకున్నాము. కాని ఇలా వెళ్ళి పోతారని ఊహించనైనా ఊహించలేదు.
వారిలో ఒక గొప్ప సుగుణం ఉంది. అది తెలుగులో వ్రాసేటప్పుడు తెలుగులో ఆలోచించేవారు. ఇంగ్లిష్‌లో వ్రాసేటప్పుడు ఇంగ్లిష్‌లో వ్రాసేవారు. అందుకనే వారి సైన్సు వ్యాసాలు సరళమైన తెలుగు లో అందరికి అర్ధమయ్యేవిధంగా ఉండేవి. ఇప్పుడు ఆ వ్యాసాలు ఆ పుస్తకాలని ఏం చెయ్యాలి అన్నది ఆలోచించి చెయ్యవలసిఉంది. “
గోగినేని బాబు
“ఆయన మీద ఒక హీరో వర్షిప్ ఉండేది నాకు.
“పది మంది ఉంటే చాలు. మనం కార్యక్రమం చెయ్యాలి. మన పిల్లలకి సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. రావాలి. కావాలి. ఈ మూఢ నమ్మకాలు కాదు. వీరిని చైతన్యవంతులని చెయ్యాలంటే మనం ముందుండి వారికి తెలియజెయ్యాలి. మీరు కార్యక్రమాలు చేపట్టండి. నా ఖర్చులతో నేను వస్తాను’ అని అనేవారు. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతారని ఊహించలేదు. ఇక్కడందరితో పాటు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను”, అని గోగినేని బాబు అన్నారు.
కాకరాల
” నిజానికి నాకు రోహిణి ప్రసాద్ గారితో పరిచయం చాల తక్కువ. కుటుంబరావుగారి కుటుంబంతో ఎక్కువ. కాని కుటుంబరావు గారితో ఇంకా చాలా ఎక్కువ. కాబట్టి రోహిణో ప్రసాద్ గారితో నాది గొప్ప పరిచయం కాదు.
ఇదేమిటి ఈ మనషి ఇలా మాట్లాడేస్తాడు. ఇలా ఉరుకులు, పరుగులు పెట్టేస్తున్నాడు ఈయన. వారి తండ్రిగారు కుటుంబ రావు గారు. నాలుగైదు దశాబ్దాల పాటు వ్రాసింది, ఈయన అంతకంటే త్వరలో ముగించేటట్టు ఉన్నాడు. ఇదేదో ఆమెరికా జీవన సరళిని ఈయన ఇక్కడ కూడా నడిపిస్తున్నట్టున్నాడు, కాని అది సరి కాదు అని అనుకునే వాడిని. అది ఆయన బ్రతికుండగా వున్న అభిప్రాయం.
ఐనా వారు హైద్రాబాదు వచ్చిన తరువాతే వారితో పరిచయం పెరిగింది. వారి జీవితంలోని వేగం, వారు పోయిన తరువాత అర్ధం అయ్యింది. తండ్రి గారి లాగే ఒక ప్రణాళిక ప్రకారం వారు తన జీవితాన్ని, తన రచనా వ్యాసంగాన్నీ, తన సాహిత్య ప్రస్థానాన్ని, తన సంగీతానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. బహుశ వారికి తెలిసే ఉంటుంది ..వెళ్ళే లోపు చెయవలసిన పనులు చాల ఉన్నవి, అవన్నీ కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని.
వారి తల్లి గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. అమ్మా రోహిణీ ప్రసాద్ గారి గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను. ఆయన ఎన్నుకున్న దారే సరైనది. మీరుకూడా మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాను”.
వరవర రావు
“సంగీతం గురించి నాకు అసలు తెలియదు. కానీ రోహిణి ప్రసాద్ సితార్ వాయిద్యం వినాలని పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్ళాను. బహశ అదేనేమో నేను సంగీతం కోసం ఒకరి ఇంటికి వెళ్ళి వినడం.
వైజాగ్‌లో శ్రీశ్రీ షష్టి పూర్తికి మేము మొదటి సారి కలిసాము. కొ కు, చలసాని ప్రసాద్ రోహిణి ప్రసాద్ మరికొందరు మిత్రులు అక్కడ కలిసాము. ఆ సభకి ఒక ప్రత్యేకత ఉంది. విరసం ఆవిర్భావినికి అక్కడే కదా జరిగింది. ఆ నేపధ్యం లో ఆలోచిస్తే రోహిణి ప్రసాద్ చెయ్యవలసింది ఇంకా చాల ఉన్నా..ఇలా వెళ్ళిపోవడం చింతించవలసిన సందర్భమే. వారిని గురించి నేను ఒక వ్యాసం ఆంధ్రజ్యోతి లో వ్రాసాను. గడగడా మాట్లాడుతాడు అని. ఆయన నొచ్చుకున్నాడేమో తెలీయదు కాని ఇప్పుడు అనిపిస్తున్నది అలా రాయాల్సింది కాదేమోనని. ఆయన అలా మాట్లాడక పోతే పదిమందికి ఆయన అభిప్రాయాలు తెలియపరిచగలిగే వారు కాదు.
వారి పుస్తకానికి నన్ను ముందు మాట కూడ వ్రాయమని అడిగారు. రాసాను. అవి సైన్సు వ్యాసాలు. నాకు సైన్స్ గురించి కూడా పెద్ద తెలియదు. తన పుస్తకం కాబట్టి చదివి కొంత సైన్స్ గురించి తెలుసుకుంటానన్న ఉద్దేశం తో నన్ను ఆయన రాయమని ఉంటాడు అని అనుకుంటున్నాను. ఆయనది ఒక ఆకస్మిక నిష్క్రమణ. చింతించవలసిన విషయం కూడా!”
** ఒక రచయిత చనిపోయినప్పుడు ప్రచురణ కర్తలు ముందుకు వచ్చి ఇలాంటి సభని ఏర్ఫాటు చెయ్యడం హర్షించ దగ్గ విషయం. కాకరాల గారు వక్తగా వేదికనెక్కితే చాలా ఆవేశంగా మాట్లాడేవారు. ఈ సభలో ఇదివరకున్న ఆవేశం లేదు.
మద్రాసులో బాల్యంలో మా నాన్న గారితో వారింటికి వెళ్ళడం కుటుంబరావు గారు, నాన్న గారు సాహిత్యం, రాజకీయం మీద చర్చోపచర్చలు కబుర్లు చెప్పుకుంటూవుంటే ప్రసాద్ గారితో ఏదో కాలక్షేపం చెయ్యడం లీలగా గుర్తుంది.
వారి సాహిత్యం గురించి, వారి సంగీతం గురించి, వారి శాస్త్రీయ రచనల గురించి నా కంటే వివరంగా చెప్పేవాళ్ళూ, విశదీకరించే వారున్నారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్లడం లేదు.
దాసరి సుబ్రహ్మణ్యం గారు ఒకరోజు సాయంత్రం ప్రసాద్‌గారిని తీసుకునివచ్చి “మిమ్మల్నీ కలవడానికి వచ్చాడు’, అని మా అమ్మకి పరిచయం చెయ్యడం నుంచి బాగా గుర్తు ఉంది. అప్పటికి ఆయన అమెరికాలోనే ఉన్నారు. దాదాపు ఒక గంట ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తరువాత..ఇంకేదో పనిమీద వెళ్ళిపొయ్యారు. చాలా సీదాసాదాగా, సరదగా నవ్వుతూ ఉండేవారు.
మా నాన్నగారిని బాగా అభిమానించేవారు. వారి రచనలన్నింటిని ఈ తరానికి పరిచయం చెయ్యాలని అంటూ ఉండేవారు.
” I still remember his cheerful presence in our house and how badly my father took his untimely demise. I feel your father’s excellent works should be reintroduced to today’s generation. If you have no objection you can get them posted in pranahita.org or prajakala.org and poddu.net. with introductory remarks. In case you are not familiar with typing in Unicode etc I can tell you.”
ఆ మధ్య డెట్రాయిట్‌లో త్రిపురనేని గోపిచంద్ జ్ఞాపకార్ధం జరిగిన సాహితీ సభలలో కూడా త్రిపురనేని సాయిచంద్ ని కలిసినప్పుడు:
“In the Detroit meeting I requested Saichand to say a few words about Pitcheswara Rao garu after the discussion on Gopichand garu“, అని చెప్పాను అని కూడా అన్నారు.
అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృత్యర్ధం విజయవాడ సభకి వెడుతున్నాను., అనగానే వారిమీద వ్రాసిన వ్యాసాన్ని పంపుతూ “మీరు అక్కడే ఎవరితోనైనా చదివించి వినిపించండి, ప్లీజ్“, అంటు కోరారు. ప్రజాసాహితి రవిబాబు గారు ఆ సభలో దానిని చదివి వినిపించారు.
స్నేహాశీలి..చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అందరితోను కలివిడిగా ఉండేవారు. చేతనైన సహాయం చేసేవారు.
తరచూ ఈమైల్స్ తో పలకరించే వారు.
నా బాల్యం – సాహిత్యం – మద్రాసుకి ఒన్న మరో గుర్తు కాలగర్భంలో కి జారిపోయింది.
వారి బ్లాగులు:
http://rohiniprasadk.blogspot.in/
http://rohiniprasadkscience.blogspot.in/
కినిగెలో వారి పుస్తకాలు ఇక్కడ:
http://kinige.com/kbrowse.php?via=author&name=Kodavatiganti+Rohini+Prasad&id=122
మొన్నామధ్య ఒక పెద్ద రసపోషకుడిగారిని కలిసాను. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే..దురదుంది కదా..సాహిత్య దురద..పుట్టింది. గోక్కుంటూ అలనాటి భారతి గురించి, ఆ నాటి ఆంధ్రభూమి గురించి, అప్పటి అభ్యుదయ గురించి, ఆ రోజుల్లో కాగడ గురించి. కృష్ణాపత్రిక గురించి, సంవేదన, కళ ఈ నాటి సృజన గురించి ఆయన ఒక పది మాటలు మాట్లాడితే నేను ఒక పదం వొదుల్తు..పుసిక్కిన మిసిమి అని అన్నాను.
ఆయన చాల లాఘవంగా దాన్ని ఒడిసి పట్టుకుని, దాన్నీ తిప్పి మళ్ళీ నా మీదకు వదిలాడు, “మిసిమి..సెక్‌సు పత్రికా అది..దాని పేరు వినలేదే ఎప్పుడూ?!” అంటూ. మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది..అక్కడ నా పక్కన ఉన్నట్టైయితే..మీ అందరి ఆరోగ్య భీమా పధకాలన్నింటిని పరీక్షకి పంపాల్సి వచ్చేది. అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను! టపా కట్టేసి ఉంటే ఇక్కడ ఈ టపా ఉండేది కాదు కదా!