నాలుగు అక్షరాలు – మూడు కథలు

ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని.
ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని.
మరొకరిని అడిగాను.  “అయ్ ఆమ్ ఎక్స్‌ప్రెసివ్” అని జవాబు.
ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”.
సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది.  దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు.  భాష అయ్యింది అది.  కథలు చెప్పుకోవడం మొదలయ్యింది.  అనుకుందాం! సరే మౌఖికంగా కథలు చెప్పుకుంటున్ననాటి నుంచి బూతులు, అసభ్యపదజాలం వాడుక దేశ కాల పరిస్థితులని బట్టి మారుతునే ఉన్నవి.  రోజు ఇంటా బయటా వింటున్నవేకదా?
ఫ్రీడ్‌మన్ అన్నట్టు,  డాల్ఫిన్స్ కి , వేల్స్ కీ కూడా భాష ఉంది.  మాట్లాడుకుంటాయి.  ఏనుగులు, కాకులు, కుక్కలు, పిల్లులు, పాములు అన్నింటికి ఒక భాష వుంది.  అన్ని ప్రేమించుకుంటాయి, కాట్లాడు కుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి అన్ని పనులు చేసుకుంటాయి.
“దిద్దుబాటు” తెలుగులో తొలి కథ అని అన్నారు. అబ్బే లేదు..ఇంకా చాలా కథలున్నవి  (దాదాపు ఒక తొంభై దాకా అని ఒక అంచనా!) దానికి ముందే అని తెల్ఛేసారు. రేపో, మాపో అవి మనచేతుల్లోకి రానున్నవి. (బహుశ ఈ  2014 లోనే రావచ్చు).దిద్దుబాటు ని షార్ట్‌ఫిల్మ్‌గా కూడా తీసాడు అట్టాడ అప్పల్నాయుడు గారి అబ్బాయి సృజన్.
సరే, దిద్దుబాటుతోనే మొదలు పెడదాం.
మరి ఆ రోజే సాని కొంపలున్నవిగా?
మగాడు తిరుగుతునే ఉన్నాడుగా?  ఆవిడ ఇంట్లోనే ఉందిగా?
“కన్యాశుల్కం” నుంచి, ఈ రోజు “వాడి పాకేజి నాకంటే తక్కువలేవే..వాడ్ని నేనెలాచేసుకుంటానే మమ్మీ?” అని ఈ రోజు చదువుకుని,ఉద్యోగంచేసుకున్న యువతి గారాలు పోతోంది.దిద్దుబాటు వెలువడిన సాంఘిక నేపధ్యం ఏమిటి?  దేశ కాల పరిస్థితులేమిటి?  ఈ రోజు దేశ కాల  పరిస్థితులేమిటి?  ఎరుపు రోజుల్లో కథకి ఒక సాంఘిక బాధ్యత ఉంది అని అనుకుని వాళ్ళు కథలు, నవలలు, కవితలు, నాటికలు గట్రా వ్రాసుకున్నారు.  అవి “గర్జించు రష్యా” రోజులనుకుంటే ఇవి “గాండ్రించు అమెరికా ” రోజులనుకోవచ్చు.  మరి మార్పు రాలేదా?మూలింటామె లో లాగా పందొసంత లాంటి వ్యక్తులు లేరా? అంటే ఉన్నారు! ఇప్పుడు కాదు..అనగనగా అప్పుడెప్పుడోనే ఉన్నారు.  ఈ రోజు బయటికి వచ్చిందా?  కాదే?  పల్లెటూళ్ల లో పాలేర్లు, రైతులు, రైతు కూలీలు అయితే, పట్టణాలలో సేల్స్ గరల్స్, ఆఫీసులో క్లెర్క్‌లు వాళ్ళ రాసలీలల మీద ఎన్ని కథలు రాలేదు!
మరి “అరుంధతి” (ఉన్నంతలో – రాజారామ్మోహనరావు – 2012 స్వాతి మాస పత్రికలో) రామారావు పక్కలోకి వెళ్ళలేదేం? (కథ 2012 సంకలనం – సం:  వాసిరెడ్డి నవీన్, శివశంకర్ పాపినేని)
కాబట్టి ఆ మార్పుని ఒప్పుకున్నవాళ్ళు ఈ మార్పులని కూడా అంగీకరించాలి.
అలాగే చదవతగ్గ రచన ఏదైనా సరే చదువుతారు.  దానికి భాష అడ్డం రాకూడదు.  కాని వచ్చేసిందిగా?!
భాషే కాదు.  వస్తువులో కూడా మార్పులు వచ్చేసినవి.

* * *

ఈ మధ్య వచ్చిన కథ ఒకటి.
ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ ని వ్రాసింది కాశీభట్ల వేణుగోపాల్.
ఈయన “F” నాలుగు అక్షరాల పదాన్ని ఆంగ్లంలోనే అయినా వాడారు.  (ఈ నాలుగు అక్షరాల ఎఫ్ పదం ఏమిటని అడగేవారి కోసం కాదు ఇది వ్రాస్తుంట!)  అందులో ఎబినేజర్ పాత్రకి కళ్ళలో ఒక దానికి శుక్లం వచ్చింది.  శుక్లాన్ని ఆంగ్లంలో కాటరాక్ట్ అంటారు. కాటరాక్ట్‌ని కొన్ని ప్రాంతలలో కొంత మంది “కన్ను పూసింది” అని అంటారు. శుక్లం ని “కన్ను లో పూత” అని కూడ చెప్పుకుంటారు.   అంటే ఈ కథలో ఎబినీజర్ అనే పాత్ర కన్నుపూచింది.  కన్నులో పూవు.    కన్నులో పూవు ఉంది కాబట్టి ఆ వ్యక్తికి  *పూకంటోడు అనే మారుపేరు (నిక్‌నేమ్) ఎగతాళిగా పిలుచుకునే పేరు పెట్టారు.ఆ మారుపేరు తన పాఠకులకు అమోదయోగ్యంకాదని ఒకరో ఇద్దరో సంపాదకులు అభిప్రాయపడ్డారు.  ఆ మారుపేరులో వారికి బూతు వినపడింది.  అంతే కాదు వారికి అసభ్యంగాను అభ్యంతరకరంగాను తోచింది.  రచయితకి ఒక సూచన చేసారు.  ఎబినేజర్ “మారుపేరు” (nickname) మార్చండి. ఆ కథని మేము ప్రచురిస్తామని.  రచయిత ఒప్పుకోలేదు.  రచయిత “మా ప్రాంతంలో అలా కన్నులో పూత అంటే శుక్లాలున్నవాడిని అదే పేరుతో పిలుస్తారు.  అది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది కాబట్టి నేను మీ సూచనను అంగీకరించను.  మీరు కథని ప్రచురించకపోయినా ఫరవాలేదు” అంటూ వివరణ ఇచ్చారు.
ఆ పత్రిక సంపాదకులు అంగీకరించలేదు.  కాబట్టి ఆ కథని అచ్చులో చదువుకునే అదృష్టం కొంత మంది పాఠకులకి దక్కలేదు.  కొంతమంది జాలపాఠకులకి (online readers)  ఆ దురదృష్టం కలిగింది.  అవును,  ఎవరు దీన్ని గురించి మాట్లడుకున్నట్టు కనపడలేదే!?

 F word and Telugu stories
నాలుగు అక్షరాలు – మూడు కథలు

మరో కథ

వాకిలి *వెబ్‌జైన్ లో పునీత కథ.
ఇందులో లచ్చుమమ్మ మొగుడు కామేశ్వరరావు.  ఆ లచ్చుమమ్మ వయసు  దాదాపు 39 ఏళ్ళు.  కాలేజిలో చదువుకునే సరయు ఈ దంపతుల కూతురు. మురళి లచ్చుమమ్మ మేనల్లుడు. డాక్టరి చదువుకుంటున్నాడు.  వాడి దృష్టి తన మీదకు “మళ్ళించుకోవడానికి సరయు తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు.” అని ఆ తల్లి స్వగతం.  మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా?  మురళీ తన మేనత్త తో గడపటానికే వాళ్ళింటికి  వెళ్ళడం. ఎందుకని అంటే ఆమెకి “చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది” అనుకుంటుంది. లచ్చుమమ్మ  మళ్ళీ మరో మాట కూడా అనుకుంటుంది “అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అని.
ఎబనీజర్ పాత్ర వాడి పూకంటోడు అనే పేరు 2014 లోదే.
అరుంధతి పాత్ర 2012 లోదే
పునీత పాత్ర 2014 లోదే.
ఈ మూడు కథలని చదువుకున్నవారు ఉన్నారు.
మరో కథ
కీమో ఈ కథ వ్రాసింది వంశీధర్ రెడ్డి.  వైద్యుడు.
“కీమో” కథలో ఆరు చోట్ల *F* పదం వాడారు రచయిత. అది ఆంగ్ల పదం అయినా సంభాషణలు ఇంగ్లిష్‌లో కాబట్టి ట్రాన్స్‌లిటరేటేడ్ పదం అది. మరి ఇందాక భాష అనుకున్నామే?!  మరి ఇక్కడ ఇది కూడా వచ్చేసిందిగా?!

మరో సందర్భం;
ఈ సారి ఏకంగా ఒక వెబ్‌జైన్ సంపాదకుడే వాడేసుకున్నారు F పదాన్ని!
ఆయన మాటల్లోనే “I fucked up so many relationships. I want us to be a success“.
మరి దీనికేమంటారు ?

మరి మంచుపూవు లోని కావేరి కూతురు ప్రియ లో భార్యని చూసుకున్న తండ్రి ఆలోచనలని వెలికి తెచ్చిన రచయిత ని ఏంచెయ్యాలి?మొన్న వేదిక సమావేశం లో ఒక ఆంగ్ల కధని పరిచయం చేసాను.  Ba-Boon – థామస్ పియర్సన్ వ్రాసిన కథ అది. 2014 లొనే వచ్చిందా కథ.  అన్ని తనే అయిన సోదరుడు ఒకానొక దుర్ఘటనకి గురైన తరువాత అతని చెల్లెలు అతనికి తోడై ఉండాల్సిన పరిస్థితి.  తన బాయ్‌ఫ్రెండ్‌తో ఒకానొక సందర్భంలో ఒక compromising situation లో వీడియో షూట్ లో పాల్గొంటుంది.  ఆ టేప్ తెచ్చుకోవాలి.  కొన్ని వందల వీడియో టేపులన్నింటిని చూస్తేగానీ ఏది తనది అన్నది తెలియదు.  మరి సొంత అన్నతోనే ఆ వీడియో చూడాలా?  ఈ అంశాన్ని ప్రంపంచంలోని ప్రతి ఆంగ్ల పాఠకుడు అంగీకరిస్తాడా?
కొవ్వలి నవలలని  జాకెట్లలలో, లంగాలలో, ఓణీలలో దాచుకుని చదువుకునే వారు ఒకనాటి చదువుకున్న స్త్రీలు. అలాగే మధు పుస్తకాలని కూడా దాచుకుని చదువుకునేవారు ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద,  ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద  కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది.  కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి  బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాలం లోనే వెబ్‌జైన్‌లలోనే వెలువడ్డవి. అంతర్జాలానికి ఎల్లలు లేవు.  అలాగే అక్కడ స్వేచ్చమీద కట్టడి లేదు.కా రా మాస్టారు అన్నట్టు:  ”  చీకటిలో ఉన్నా కొందరందులో వెలుగుని గురించి రాస్తారు.  వెలుగులో ఉంటూ జీవితం లోని చీకటి గురించి రాస్తారు.  వెలుగే తప్ప చీకటిని ఎరుగని వారు అందులోని నీలి నీడలనే చీకటిగాను, మరి కొందరు చీకటి చీకటి కాదని, వెలుగే చీకటి, చీకటే వెలుగని రాస్తారు”          ( కా రా రచనలు పుట 379).
ఆయన వ్రాసిన సందర్భం వేరైనా ఈనాటి కథకులకి, పాఠకులకి తెలియాల్సి ఉంది.

ఆంక్షలు పెట్టకండి.వచ్చేవి ఎలాగు వస్తాయి.  పొయ్యేవి ఎలాగూ పోతాయి.
మంచి ముత్యాలని ఏరుకోవడమే మీరు చేయగలిగింది!
ఏది మంచి?  మీకు ఏది మంచి అని తోస్తే అదే మంచి!!

డేంజరస్ కథకుడు

నిండా డేంజరస్ మనుషులుండారు ఈ ప్రపంచంలో. అతి ప్రమాదకారులు వీరు.  మాటలతో మనల్ని మాయజేస్తారు.  ఇదిగో అంటారు.  అదిగో అంటారు.  వీళ్ళు మన నోటికి వినిపిస్తారు.  చెవులకి చూపిస్తారు. చొంగ కారుతుంటుంది ఒక పక్క. చేతులూపుకుంటూ, కళ్ళు తెరుచుకుని వాళ్ల మాయమాటల దారెంట వెళ్ళిపోయి వాళ్ళు చూపించే ఆ మరో ప్రపంచాన్ని కంటాం! చిన్నపిల్లల్లగా!!

Sa Vem Ramesh
సా వెం రమేశ్

డబల్ ఢమాకా అంటారనుకుంటా..ఒక కథతో మొదలుపెడతాడు, మరో కథ మొదలుపెడతాడు.  వాటి చుట్టూ మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు.  ఆ మూడింటీతో పాటు మరో కొత్త అంశం ప్రవేశపెడతాడు. త్రీ డి అంటారే.  అలా! కళ్ళు తిరుగుతాయి.  ఆ సుడిగుండంలో పడిపోతాం.  గిరా గిరా తిరుగుతాం,  పడి కొట్టుకుపోతాం.  మన లోపలికి నీళ్ళేళ్ళిపోతాయి. మరో కొత్త భాష! మరో కొత్త కోణం.  మరో కొత్త మూలం అవిష్కరింపజేస్తాడు.  ఎక్కడో తెల్తాం.  అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది..కాని ఉండలేం కదా! ఒక జీవితం ఉంది కదా?  ఒక జీవనం చెయ్యాలి కదా?  ఒక జీవిక కావాలి కదా?

కాని అతనికి అదే జీవితం, అదే జీవనం, అదే జీవిక అయ్యింది. సిగ్గు ఎవరికి ఉండాలో మరి?

భగ, భగా, ధగ ధగా మెరుస్తూ కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంది., సిడిమొయిలు.  అలాంటి లోకం ఒకటి ఉందా?  తెలుసుకోవాలంటే వివరాలకు కథ 2013 ని కొనుక్కుని చదువుకోండి! కథకి అద్భుతమైన బొమ్మ గీసినవారు ఏలే లక్షణ్.

sidimoyilu katha
Illustraton by Lakshman Aelay

ఈబుక్స్‌కి లేవా సమీక్షకు అర్హతలు!

పిలల్ల నామకరణానికి నేమ్స్ కోసం నెట్‌ని ఆశ్రయిస్తాం.
వాళ్ళ సందేహలు తీర్చడానికి జాలంలో జవాబులు వెదుక్కుంటాం.
అర్ధాలు చెప్పడానికి ఆన్‌లైన్ డిక్షనరీలు చూసుకుంటాం.
ఆ పిల్లల పరిక్షా ఫలితాలని ఇంటర్నెట్ ‌లో తెలుసుకుంటాం.
ఉద్యోగాలకి ఇంటర్నెట్‌లో అప్ప్లై చేసుకుంటాం.
ప్రేమలేఖలు, ఊస్టింగ్ ఆర్డర్లు, గ్రీంటిగ్‌లు ఆన్‌లైన్‌లో అందుకుంటాం.
ఫేస్‌బుక్కు‌లోను, జీప్లస్సు‌లోను స్నేహాలు చేస్తాం.
కోడల్లని, అళ్ళుళ్ళని నెట్‌లో వెతుక్కుంటాం.
బస్సు టికెట్లు, రైలు టికెట్లని, సినిమా టికెట్లని ఇంటర్‌నెట్‌లో కొనుక్కుంటాం.
పాన్ కార్డ్లు, వోటర్ కార్డులకి ఫారాలు ఆన్‌లైన్లో నింపుతాం.
RTI రా భయ్, అని వాడ్ని ఆన్‌లైన్‌లో నిలదీస్తాం.
పత్రికలని, కథలని, కవితలని ఆన్‌లైన్‌లో చదువుకుంటాం.
స్టోరిని, ఫీచర్‌ని, కవరింగ్‌ని, ఐటంని ఈమైల్‌లో పంపుకుంటాం.

EBook

ప్రింట్ బుక్ ని, డి‌వి‌డిని, ఈబుక్ ని ఆన్‌లైన్‌లో కొనుక్కుంటాం.
కొనుక్కున్న ఈబుక్‌ని కిండిల్ లోను, ఐపాడు లోను అందరూ గమనించేలా చూసుకుంటాం.  లాప్‌టాప్‌లోనూ, డెస్క్‌టాప్‌లోను అప్పుడప్పుడూ చదువుకుంటాం.

ఉచితం  గా పుస్తకాలని అందుకుంటాం, స్వీకరిస్తాం, రివ్యూ చేస్తాం, సమీక్షిస్తాం. పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో దొరుకుతుంది అని కూడ పాఠకులకి చెబుతాం. తన ఈ బుక్ గురించి రచయిత తెలియజేస్తే, అది మాకూ తెలుసన్నట్టుగా బుర్ర ఊపుతాం.

కాని..
కాని
ఈబుక్ గా వెలువడిన సాహిత్యాన్ని గుర్తించం. ఒకవేళ గుర్తించినా స్వీకరించం. స్వీకరించినా రివ్యూ చెయ్యం, సమీక్షించం, ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరుకుతుందో అని కూడా పాఠకుడికి తెలియజేయం. అదేమిటంటే ఈబుక్స్ గురించి అందరికి తెలిదుగా అని అనేస్తాం. స్పేసు లేదండి అని అంటాం. పైగా మిగతావాళ్ళేవరూ, ఈ భాషలోను చెయ్యటం లేదుగా అని కూడా అనేస్తాం. మరీ ఐతే, టెక్ని‌కల్ సమస్యలున్నాయని దాటేస్తాం.

అదే మా వాడేతే భుజాలమీదకెక్కించుకుని ఊరేగిస్తాం.

కాని మా సాహిత్యాభిమాన్నాన్ని శంకింస్తే మాత్రం ఊరుకోం!

కొసమెరుపు ప్రాసారమధ్యమాలలో పనిచేస్తున్నవారి పుస్తకాలు కూడా kinige.com లో ఉన్నవి.  కనీసం ఇప్పుడైనా ఈ సాహిత్యాన్ని ఈ ప్రసార మాధ్యమాలు గుర్తిస్తాయని, దానికి సముచిత స్థానాన్ని కలిపిస్తుందని ఆశిస్తాను.