వర్క్‌ప్లేస్‌లో ఎలా గెలవ్వోచ్చు…ఇలా

Win At Workplace - a book by Suresh Veluguri

కొత్త ఉద్యోగానికి వెళ్ళేముందు అనే తొలి అధ్యాయంతో  మొదలైన ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం కొత్తగా  కాలేజీలనుంచి బయటికొచ్చి విశాల ప్రపంచలోకి అడుగుపెడుతున్న లక్షలాదిమందిలో మీరు ఒకరు”  అనే వాక్యంతో మొదలవుతుంది.  దాన్నిబట్టి ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ని ఎవరిని  దృష్టిలో పెట్టుకుని మొదలు పెట్టాడో ఈ రచయిత అర్ధం అవుతుంది.  అలా అని ఇది విద్యార్ధులకి మాత్రమే కాదని గుడ్డిగా ఈ పుస్తకం మధ్యలో ఎక్కడ తలదూర్చినా తెలిసిపోతుంది.  ఒహో ఇది IT industry లోని టెకీ గాళ్ళకా అంటే…కాదు బోయ్స్ అండ్ గరల్స్.  ఇది అందరికీను.  అంటే ముఖ్యంగా ఉద్యోగస్థులందరికి…కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టేవారికి, వేసేసిన వారికి, అలా ముందుకు సాగి పోతున్నవారికి కూడా!

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ని తను ఎంచుకున్న అంశాలను 36 చాప్టర్స్‌‌గా వర్గీకరించి, సుమారుగా 160 పేజిలలో పొందుపరిచి అందజేసాడు సురేశ్.

సోషల్ మీడియా (పేజి 76) గురించి ప్రస్తావిస్తూ, వర్క్‌ప్లేస్ లోనే కాదు ఉద్యోగం రావడానికి, పోవడానికి కూడా అదే కారణం అంటూ సోదాహరణంగా చెప్పాడు.

ఈ పుస్తకం పాఠకులకి బహుశ బోనస్ ఇవ్వాలనుకున్నట్టున్నడు రచయిత.  సంపాదనకి సేఫ్టి అనే పేరుతో ఒక అధ్యాయం (చాప్టర్ 33)ఇచ్చాడు.  చాలమంది కొత్తవారికి, ఉద్యోగంలో ఉన్నా పూర్తిగా తెలియని వారికి ఇందులో ఇచ్చిన వివరాలు బోనస్సే!

139 వ పేజి నుంచి 146 పేజీ వరకు కేవలం మహిళల కొరకే వినియోగించి వారికి బాగా పనికివచ్చే సమచారాన్ని క్లుప్తంగా ఇచ్చడు. స్మార్ట్ ఫోన్లు వాడే వారికీ కొన్ని సేఫ్టీ ఆప్స్‌ గురించి తెలియజేసాడు.
 
169 పేజిలో టొస్ట్‌మాస్టర్స్ ని పరిచయంచేసాడు.  వెబ్‌లింక్ ఇచ్చాడు కాబట్టి పాఠకులకి సులువుగానే అదనపు సమాచారం అందే అవకాశం కల్పించాడు.    

67 వ పేజిలో 5W’s & 1H ఫార్ములా గురించి ప్రస్తావించాడు కాని ఆ ఫార్ములా ఏమిటో చెప్పలేదు.  ప్రసారమాధ్యామాలలో అనుభవజ్ఞులకు తెలిసే అవకాశం ఉంది కాని ఉద్యోగస్తులకి మరీ ముఖ్యంగా తను ఎంచుకున్న రీడర్ ప్రొఫైల్ ఉన్నవారికి ఆ ఫార్ములా తెలిసిఉండే అవకాశం తక్కువ.  కాకపోతే అదే ఫార్ములాని 155 వ పేజిలో మరో విధంగా పరిచయం చేసాడు…ఇలా ఫైవ్ డబ్ల్యూస్ అండ్ వన్ హెచ్ (ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఎలా?) అని వివరించాడుకూడా!.

కాకపొతే పూనే ఉద్యోగస్తుడి ఆపసోపాలు చెబుతూ, మళ్ళీ  అతని కధే (?) 122 వ పేజిలో కూడా చెప్పాడు.  తన ముందుమాట (11 వ పేజిలో) కంటెట్ రిపీట్ అయినట్టు ముందే చెప్పినా, రిపీట్ కాకుండా చెప్పే అవకాశం కూడ ఉంది.  

తెలుగు చదువుకున్న వారికే ఈ పుస్తకం అనుకున్నప్పుడు కొత్తగా ఉద్యోగరంగంలోకి అడుగు పెడుతున్నవారికి పింక్ స్లిప్ గురించి తెలుస్తుందా అనే సందేహం కలిగింది.  పేజి 132.
 
కనీసం ఇటువంటి వాటికోసమైనా పాద సూచికలు అంటే ఫుట్‌నోట్స్ / ఫర్దర్ రీడింగ్‌ అంటే ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలనుకునేవారికి పుస్తకం చివర్న ఒక చిన్న బిబ్లియోగ్రఫి (bibliography) ని ఇచ్చి ఉంటే బాగుండేది.

ఆఫిస్ కాదు రచయిత మాటల్లో వర్క్‌ప్లేస్ అనుకుంటే ఆ వర్క్‌ప్లేస్ ఎటికెట్ గురించి కూడా చెప్పిఉంటే ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఇంకొంచెం సమగ్రంగా తయారైఉండేది.

Win At Workplace - a book by Suresh Veluguri
వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి – సురేశ్

“పుస్తకం రాస్తున్నాను సార్,”  అన్నప్పట్నుంచి దీని కోసం ఎదురుచూస్తునే ఉన్నాను.  ఆసక్తిగా!  గతంలో నేను ఆంధ్రజ్యోతి పత్రిక వారి దిక్సూచి‌కి కెరీర్ కార్నర్ కాలం ఒకటి వ్రాసాను. అదొక పక్క, మరో పక్కన అప్పట్లో ఒక HR సంస్థకి CEO గా ఉండటం మూలంగా కలిగిన ఆసక్తి, అంతే కాదు people management మీద నాకున్న ఉత్సుకత…సురేశ్ ఈ తరం వాడు ఏం వ్రాస్తాడు, ఎలా రాస్తాడు అని.  పైగా నేను కూడ గత అయిదారేళ్ళుగా వ్రాద్దామని అనుకుంటూ…తాత్సారం చేస్తూ వస్తున్నాను.  అది కొంత కుతూహలం.  ఇక ఆ సొంత గోల ఆపితే…ఈ పుస్తకం అవసరమా అని నన్ను అడిగితే… ఈ విషయలా మీద ఇదే తొలు పుస్తకం …కాబట్టి తెలుగు వరకే పరిమితమైనవారికి  ఇది ఉపకరిస్తుంది.   మనకి తెలుగులో పర్సనాలిటి డెవలప్‌మెంట్ పుస్తకాలు చాలా వచ్చినవి కాని  ఆఫీసు లో ఇలా గెలవండి అన్న పుస్తకం వచ్చినట్టు లేదు.  కాబట్టి ఈ పుస్తకం అవసరమైనదే  ఉద్యోగస్తులకి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చిన్న యాజమాన్యాలకి కూడా!  

ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎందుకంటే వారికి కూడా  ఒక చాప్టర్‌ని కేటాయించాడు రచయిత.

ఇక చిన్న చిన్న యాజమాన్యాలకి ఎందుకంటే, ఉద్యోగస్తుడు కుక్కలాగ విశ్వాసంతో పడిఉండే వాడు కాదు, అలాగే గాడిద చాకిరికి మాత్రమే పనికి వచ్చేవాడు కాదని, వాడుకూడా మనిషేనని సంస్థమేలుకోసం ఆరాట పడే ప్రాణమని…అలాంటి వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం ఇస్తే, తమ సంస్థ కూడా బాగుపడి మరో పదిమందికి చేయుత నిస్తే వ్యాపారం కూడ అభివృద్ధి చెందుతుంది, సమాజానికి ఆ మేర కొంత మేలు జరుగుతుంది.  

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఇంగ్లిష్ లో కూడా తయారవుతున్నది.  

ప్రస్తుతం తెలుగులో 176 పేజీల వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం ధర 199.00 రూపాయలు.  పుస్తకం ధర తక్కువే.
Brahmam (Bhavana Graphix) కవర్ పేజి డిజైన్ చేసారు.
Charitha Impressions వాళ్ళ ముద్రణ.
అప్పుతచ్చులైతే పంటికింద పడలేదు మరి!

పుస్తకంలో ఏముందో చూద్దామనుకుంటే ఇక్కడ కొన్ని చాప్టర్స్ ప్రీవ్యూగా ఫ్రీగా చదువుకోవచ్చు.

 ఆ తరువాత వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకాన్ని ఇక్కడ కొనుక్కోవచ్చు:

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి – సురేశ్ వెలుగూరి

VMRG International
6-3-596 / 79 /4, Naveen Nagar,
Hyderabad – 500 004
Phone:  +91 (40) 2332 6620, Mob:  98499 70455
www.vmrgmedia.com

అమెజాన్ (Amazon) లో వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కినిగె (Kinige) లో వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఈ బుక్ ఇక్కడుంది.

“అమ్మ” ఉంది, జాన్!

ఆయనతో నాకు పరిచయం లేదు. సుమారుగా బ్లాగ్‌లోకం రోజులనుండి తెలుసు.  అయినా  మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నది లేదు. ఒకసారి ఎక్కడో పలకరించుకున్న గుర్తు. అయితే ఏం? ఆయన మంచితనం గురించి తెలుసు.  ఈయన పేరు జాన్ హైడ్ కనుమూరి.  నిన్న రాత్రి హటాత్తుగా హృద్రోగం తో వెళ్ళిపొయ్యాడు.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/JphnHydeKanymuri.jpg? w=656" alt="amma" originalw="255" width="300" height="291" scale="2">
జాన్ హైడ్ కనుమూరి – తెలుగు బ్లాగర్ ( ? – 7th Dec 2014 )

ఆయన సంపాదకత్వాన తెలుగులో ఒక ఈ బుక్ వెలువరించాడు.  బహుశ అది తెలుగువారికి రెండవ ఈబుక్ అవుతుందేమో! ఈ మనిషిలో ప్రేమ పొంగినట్టే ..ఆ ఈబుక్ కూడ “అమ్మ” ప్రేమతోనే నిండింది. ఆమే ప్రేమతోను, అమ్మ మీద ప్రేమను వెలిబుచ్చిన  సుమారు 15 మంది బ్లాగర్ల కవితలతోను “అమ్మ”ని కూర్చాడు.  కవితలు కూర్చడానికి కారణం ..కవిత్వం అంటే వల్లమాలిన ప్రేమ జాన్‌కి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/ammaAcompilationByJohnHydeKanumuri_AnilAtluri.jpg? w=656" alt="amma" originalw="584" width="775" height="300" scale="2">
“amma” is a compilation of poetry by a few Telugu bloggers. John compiled them.

జాన్  అమ్మ ఈబుక్ ని తనే డిజైన్ చేసాడు.  డిటిపి మొత్తం అంతా తనే చేసుకున్నాడు.  దానికి ముందు మాటలు వ్రాసాడు.  ఆ ముందు మాటల్లో రెండు వాక్యాలు.
“జన జీవనం వస్తూవుంటుంది, పోతూ వుటుంది, నేను ప్రవహిస్తునేవుంటాను
జాన్ లేడు..కాని …”అమ్మ” ఉంది, జాన్!
ఏందుకో..జాన్ అలా వెళ్ళిపొయ్యాడు అంటే బాధగా ఉంది.

జాన్ సంపాదకత్వాన్న వెలువడిన కొందరి తెలుగు బ్లాగర్ల కవితల సంకలనాన్ని –  “అమ్మ” ఈబుక్ ని ఇక్కడ్నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జాన్ హైడ్ కనుమూరి బ్లాగులు:
http://johnhaidekanumuri.blogspot.in/
http://telugubible.blogspot.in/
http://alalapaikalatiga.blogspot.in/

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

గెస్ట్‌కాలం – ఈ రీడింగ్

ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్
ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక,  ఫామిలీ లో మొదలైన గెస్ట్‌కాలం లో వచ్చింది.  పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు.  ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది.  అన్నట్టు ఈ గెస్ట్‌కాలం ప్రతి బుధవారం వస్తుంది.  ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు.  ఇక వ్యాసం ఇది.  స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది.  పూర్తి పాఠం తరువాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇక్కడే పోస్ట్ చేస్తాను.

సూచన: బొమ్మ మీద క్లిక్ చెయ్యండి.  సులభంగా చదువుకోవచ్చు

e reading easy reading

వేనరాజు “ఖూనీ”

“ఆంధ్రా బెర్నాడ్ షా త్రిపురనేని” అని అన్నది కట్టమంచి రామలింగారెడ్డి.  ఆయన అనడానికి ఒక కారణం ఉంది.  “కవిరాజు” త్రిపురనేని రామస్వామి తన రచనలకి సుధీర్ఘమైన పీఠికలు వ్రాసాడు, ఐరిష్ రచయిత జార్జ్ బెర్నాడ్ షా లాగ. పీఠికలు ఎందుకు వ్రాస్తారు?  తను చెప్పదలుచుకున్నదానికి ఉపోధ్ఘాతం.  ఆ రచనకి పూర్వాపరాలు.  నేపధ్యం.  ఎందుకు వ్రాయవలసి వచ్చింది.  రచనకి ఉపయోగపడ్డ వస్తు సామగ్రి గురించి. ఇత్యాదులన్నింటి గురించి.  ఒక వివరణ అని అనుకోవచ్చు.  పీఠిక చదవడం మూలంగా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు చెప్పదలుచుకున్నాడు అన్నది పాఠకుడికి కొంత తెలుస్తుంది.  తరువాత రచయిత రచనలోకి ప్రవేశించవచ్చు.  ఆ రచయిత ఆలోచన తెలుసు కాబట్టి ఆ దారంటే ఆ రచనని చదవవచ్చు.  చదివిన తరువాత తనకి తెలిసిన దానితో బేరీజూ వేసుకోవచ్చు. తనకి తెలియని అంశం మీద ఐతే  కొత్తది తెలుసుకుంటాడు. రచన వస్తు సామగ్రి గురించి ముందే తెలిసినవాడు మరొక పాఠకుడు.  అతను దాని మీద అభిరుచి ఉంటే చదువుతాడు.  లేక పోతే ఈ గోల నా కేల అని ఆ పుస్తకాన్ని అవతల పడే అవకాశం ఉంది.

కవిరాజు“కి తను వ్రాయలి అని తెలుసు.  ఎందుకు వ్రాయలో కూడా తెలుసు.  ఎవరికోసం వ్రాయలో కూడా తెలుసు.  తన రచనలు చదివే వారి గురించి కూడా తెలుసు.  తన పాఠకుడుని ఆయన గౌరవించాడు.  కాబట్టే అంత పెద్ద ముందుమాటలు, పీఠికలు వ్రాసాడు. తనతో పాటు తన కాలంలో ఉన్న తన సమకాలీనుల కోసం కూడా వ్రాసాడు.  వాటిని తన కోసం వ్రాసుకోలేదు. తను నమ్మిన “లోక కళ్యాణార్ధం”  వ్రాసాడు.

'కవిరాజు" త్రిపురనేని రామస్వామి రచించిన నాటకం "ఖూనీ"కాలం పరిగెడుతోంది. దానితో పాటు మనిషి పరుగెడుతున్నాడు.  ఆ పరుగు క్రమంలో మార్పుకి లోనవుతున్నాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నవి.  మార్పు సహజం కదా!  వేష, భాషలు, సంస్కృతి అన్ని ఎంతో కొంత మార్పుకి లోనవుతున్నాయ్.  ఆ నేపధ్యం లో 1980 ప్రాంతాలలో మళ్ళీ కవిరాజు రచనల ని చదవడం మొదలు పెట్టాను.  నా తోటి వాళ్ళు “కవిరాజు” రచనలను చదివిన వారు చాల తక్కువమందే కనపడ్డారు.  కారణం భాష.  త్రిపురనేని రామస్వామి చక్కని తెలుగులో వ్రాసినా,  ఆ తెలుగు వీళ్ళకి పాషాణ పాకం లాగా కనపడుతుండేది. పైగా ఆయన మీద ఆయన రచనల మీద ఒక అభిప్రాయం. ఆయన దేముళ్ళని తిట్టాడు. నేను దేముడ్ని నమ్ముతాను కాబట్టి ఆయన దేముడిని నమ్మడు కాబట్టి ఆయన పుస్తకాలని నేను చదవవలసిన అవసరం లేదని వీరి భావన.

అప్పుడనిపించింది నాకు.  ఈ తరానికి కూడా త్రిపురనేని రచనలు అందాలి.  వాటిని మళ్ళీ మూలాలు చెడకుండా, ఈ నాటి యువత కి అందజెయ్యాలి అని.  మద్రాసులో (చెన్నై ఇప్పడు) ” ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి ఫౌండేషన్” ని స్థాపించడం జరిగింది.  ఆ ఫౌండేషన్ ఉద్దేశాలలో ఇది కూడ ఒకటి.  కవిరాజు రచనలని యువతరానికి వారికి అర్ధమయ్యేరీతిలో వారు వాడుతున్న “తెలుగు” లోనే అందించాలని.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత “కవిరాజు” త్రిపురనేని రామస్వామిని అభిమానించిన కీ శే బొడ్డు రామకృష్ణ, కవిరాజు “సూతపురాణం” రెండు భాగాలని వచనం చేసారు.  2011 లో ఆ వచన “సూతపురాణం” రెండు భాగాల్ని తెనాలి లోని కవిరాజు త్రిపురనేని ఫౌండేషన్ వెలవరించి ఉచితంగానే ఆ పుస్తకాలని పదిమందికి పంచింది.  ఆ “సూతపురాణం” రెండు భాగాల్ని,  పీకాక్ క్లాసిక్స్ , హైద్రాబాదు ప్రచురించింది.

సూతపురాణం వెలువడింది.  మరి మిగతా రచనల సంగతి ఏమిటి?  వాటిని ఎలా ఈ పాఠకులకి అందించాలి?

ఈ నేపధ్యం లో  నేను సంప్రదించిన వారిలో గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఉద్యోగవిరమణ చేసిన, తెలుగు భాషాభిమాని, కవిరాజు త్రిపురనేని రామస్వామి ఆశయాలని నమ్మి ఆచరిస్తూన్న రావెల సాంబశివరావు గారు ఒకరు.  వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిసినవి. త్రిపురనేని వేనరాజు మీద వ్రాసిన “ఖూనీ” నాటిక ని “మన మాటలు” లో ఈ తరానికి అందిద్దాం అని ముందుకువచ్చారు.  వారే దానిని ఈ నాటి తెలుగు చదవగలిగిన వారికి అర్ధమయ్యేరీతిలో, పీఠికలతో సహా వ్రాసారు.  2013 జనవరి లో రామస్వామి జయంతి రోజునే దీనిని ప్రచురించాల్సింది.  కారణాంతరాల వల్ల 2014 జనవరిలో “కవిరాజు” త్రిపురనేని రామస్వామి 127 జయంతి నాడు దీనిని ఈబుక్ రూపంలో మీకు అందజేస్తున్నాను.

బహుశ ఫిబ్రవరి, మార్చి నాటికి అచ్చులో కూడ ఈ పుస్తకాన్ని వెలువరిద్దామని అనుకుంటున్నాము.

మీకు అర్ధమయ్యే తెలుగులో, సుమారు 42 పేజీలూ మాత్రమే ఉన్న ఈ “ఖూనీ” ని చదవండి.  మీకు నచ్చితే పదిమంది కి చెప్పండి. దీని మీద మీ అభిప్రాయాలు ఇక్కడే వ్యాఖ్యల ద్వారా తెలియజేయవచ్చు.
కినిగె.కామ్ లో ఈ కవిరాజు త్రిపురనేని రామస్వామి “ఖూనీ”  ఈబుక్‌ని ఈ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
http://kinige.com/kbook.php?id=2482&name=khooni

కొన్ని వేల ప్రతులని కినిగె తన పాఠకులకి అందించింది.  ఐనా డౌ‌న్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు కాని, చేసుకున్న తరువాత గాని ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ లింక్స్‌ని చదవండి.
http://kinige.com/help.php
ఇంకా అవసరం ఐతే [email protected] కి ఈమైల్ చెయ్యండి.  వారు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు.

ఉంటాను.
అనిల్