ఇలా అర్ధాంతరంగా వెళ్ళి పోతే ఎలా?

రాంకీ గారి మాటలతో సభ మొదలైనది.

ఎన్ వేణుగోపాల రావు,  వీక్షణం సంపాదకుడు , సభకు అధ్యకత వహించారు.  63 ఏళ్ళకే రోహిణి ప్రసాద్ గారి ఆకస్మిక నిష్క్రమణ విచారం కలిగిస్తున్నది. ఆయన ఒక అణు విజ్ఞాన శాస్త్రవేత్త. కాని తన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చూపించలేదేమోనని అభిప్రాయపడ్డారు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ
వేదిక మీద వక్తలు: ఎడమ నుండి కుడికి
దివికుమార్ (ప్రజాసాహితి), నటుడు కాకరాల, ఎన్. వేణుగోపాల రావు, సభకు అధ్యక్షుడు..(సంపాదకుడు వీక్షణం మాస పత్రిక), వరవర రావు (సృజన సంపాదకుదు, విరసం సభ్యుడు) గీతా రామస్వామి ( హైద్రాబాద్ బూక్ ట్రస్ట్ సభ్యురాలు)

దివికుమార్, ప్రజాసాహితి.
“నేను టెలిఫోను డిపార్ట్‌మెంట్ వాడిని కనుక ఎవరితోనైనా మాట్లాడడానికి అవకాశం ఉండేది. అలాగే రోహిణి ప్రసాద్ గారితో నా మొదటి పరిచయం. వారు విజయవాడ వచ్చినప్పుడు వారి చెబితే కాని తెలియలేదు చందమామలో వారి తండ్రిగారి సమకాలీకులు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని.  ఉద్యోగ విరమణాంతరం విజయవాడలోనే ఉంటున్నారని.అలాగ దాసరి గారిని కలవడానికి రోహిణి  ప్రసాద్ గారు కారణం.

రోహిణీ ప్రసాద్ గారు హైద్రాబాద్ వచ్చిన తరువాత తరచూ కలుస్తూ ఉండే వారం.  ‘మీరు వ్రాయాలి.  ఈ దిన పత్రికలలో కూడా మీ వ్యాసాలు అచ్చులో చూడాలి’ అని అనేవారు ఆయన.   ‘నా పేరు కనపడితేనే వెయ్యటం లేదండి’, అని అన్నప్పుడు, ‘మరో పేరుతో వ్రాసి పంపండి..ఏదో కలం పేరు పెట్టి పంపేయ్యండి’ అని అన్నారు.  ఆ పనే చేసాను.  విజ్ఞానాన్ని పది మందికి పంచాలి అన్నది రోహిణీ ప్రసాద్ గారి ప్రధానమైన ఆశయంగా ఉండేది.

కోపం వచ్చింది!
గీత రామస్వామి – హైద్రాబాద్ బుక్ ట్రస్ట్
”  ఆయన చాలా అర్ధాంతరంగా వెళ్ళిపొయ్యారు.  హైద్రాబాదు బుక్ ట్రస్ట్ తరఫున వారివి ఒక మూడు పుస్తకాలు ప్రచురించాము.  మరి కొన్ని పుస్తకాలకి ప్రణాళికలు కూడా వేసుకున్నాము.  కాని ఇలా వెళ్ళి పోతారని ఊహించనైనా ఊహించలేదు.

వారిలో ఒక గొప్ప సుగుణం ఉంది.  అది తెలుగులో వ్రాసేటప్పుడు తెలుగులో ఆలోచించేవారు.  ఇంగ్లిష్‌లో వ్రాసేటప్పుడు ఇంగ్లిష్‌లో వ్రాసేవారు.  అందుకనే వారి సైన్సు వ్యాసాలు సరళమైన తెలుగు లో అందరికి అర్ధమయ్యేవిధంగా ఉండేవి.  ఇప్పుడు ఆ వ్యాసాలు ఆ పుస్తకాలని ఏం చెయ్యాలి అన్నది ఆలోచించి చెయ్యవలసిఉంది. “

గోగినేని బాబు
“ఆయన మీద ఒక హీరో వర్షిప్ ఉండేది నాకు.
“పది మంది ఉంటే చాలు.  మనం కార్యక్రమం చెయ్యాలి. మన పిల్లలకి సైంటిఫిక్ టెంపర్  ఉండాలి. రావాలి. కావాలి.  ఈ మూఢ నమ్మకాలు కాదు. వీరిని చైతన్యవంతులని చెయ్యాలంటే మనం ముందుండి వారికి తెలియజెయ్యాలి. మీరు కార్యక్రమాలు చేపట్టండి.  నా ఖర్చులతో నేను వస్తాను’ అని అనేవారు.  ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతారని ఊహించలేదు. ఇక్కడందరితో పాటు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను”, అని గోగినేని బాబు అన్నారు.

కాకరాల
” నిజానికి నాకు రోహిణి ప్రసాద్ గారితో పరిచయం చాల తక్కువ.  కుటుంబరావుగారి కుటుంబంతో ఎక్కువ. కాని కుటుంబరావు గారితో ఇంకా చాలా ఎక్కువ.  కాబట్టి రోహిణో ప్రసాద్ గారితో నాది గొప్ప పరిచయం కాదు.

ఇదేమిటి ఈ మనషి ఇలా మాట్లాడేస్తాడు.  ఇలా ఉరుకులు, పరుగులు పెట్టేస్తున్నాడు ఈయన.  వారి తండ్రిగారు కుటుంబ రావు గారు. నాలుగైదు దశాబ్దాల పాటు వ్రాసింది, ఈయన అంతకంటే త్వరలో ముగించేటట్టు ఉన్నాడు.  ఇదేదో ఆమెరికా జీవన సరళిని ఈయన  ఇక్కడ కూడా నడిపిస్తున్నట్టున్నాడు, కాని అది సరి కాదు అని అనుకునే వాడిని. అది ఆయన బ్రతికుండగా వున్న అభిప్రాయం.

Kakarala sharing his experiences with Rohini Prasad
నటుడు కాకరాల రోహిణీ ప్రసాద్‌తో తన అనుభవాలాను పంచుకుంటూ..

ఐనా వారు హైద్రాబాదు వచ్చిన తరువాతే వారితో పరిచయం పెరిగింది.  వారి జీవితంలోని వేగం, వారు పోయిన తరువాత అర్ధం అయ్యింది. తండ్రి గారి లాగే ఒక ప్రణాళిక ప్రకారం వారు తన జీవితాన్ని, తన రచనా వ్యాసంగాన్నీ, తన సాహిత్య ప్రస్థానాన్ని, తన సంగీతానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నారు.  బహుశ వారికి తెలిసే ఉంటుంది ..వెళ్ళే లోపు చెయవలసిన పనులు చాల ఉన్నవి, అవన్నీ కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని.

వారి తల్లి గారికి కూడా ఫో‌న్ చేసి చెప్పాను. అమ్మా రోహిణీ ప్రసాద్ గారి గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను.  ఆయన ఎన్నుకున్న దారే సరైనది.  మీరుకూడా మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాను”.

వరవర రావు
“సంగీతం గురించి నాకు అసలు తెలియదు. కానీ రోహిణి ప్రసాద్ సితార్ వాయిద్యం వినాలని పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్ళాను. బహశ అదేనేమో నేను సంగీతం కోసం ఒకరి ఇంటికి వెళ్ళి వినడం.
విరసం సభ్యుడు, వరవర రావు, సృజన సంపాదకుదు
వైజాగ్‌లో శ్రీశ్రీ  షష్టి పూర్తికి మేము మొదటి సారి కలిసాము.  కొ కు, చలసాని ప్రసాద్ రోహిణి ప్రసాద్ మరికొందరు మిత్రులు అక్కడ కలిసాము.  ఆ సభకి ఒక ప్రత్యేకత ఉంది.  విరసం ఆవిర్భావినికి అక్కడే కదా జరిగింది. ఆ నేపధ్యం లో ఆలోచిస్తే రోహిణి ప్రసాద్ చెయ్యవలసింది ఇంకా చాల ఉన్నా..ఇలా వెళ్ళిపోవడం చింతించవలసిన సందర్భమే.  వారిని గురించి నేను ఒక వ్యాసం ఆంధ్రజ్యోతి లో వ్రాసాను.  గడగడా మాట్లాడుతాడు అని.  ఆయన నొచ్చుకున్నాడేమో తెలీయదు కాని ఇప్పుడు అనిపిస్తున్నది అలా రాయాల్సింది కాదేమోనని.  ఆయన అలా మాట్లాడక పోతే పదిమందికి ఆయన అభిప్రాయాలు తెలియపరిచగలిగే వారు కాదు.

వారి పుస్తకానికి నన్ను ముందు మాట కూడ వ్రాయమని అడిగారు.  రాసాను.  అవి సైన్సు వ్యాసాలు. నాకు సైన్స్ గురించి కూడా పెద్ద తెలియదు.  తన పుస్తకం కాబట్టి చదివి కొంత సైన్స్ గురించి తెలుసుకుంటానన్న ఉద్దేశం తో నన్ను ఆయన రాయమని ఉంటాడు అని అనుకుంటున్నాను. ఆయనది ఒక ఆకస్మిక నిష్క్రమణ. చింతించవలసిన విషయం కూడా!”

Kodavati Ganti Rohini Prasad
Kodavati Ganti Rohini Prasad

** ఒక రచయిత చనిపోయినప్పుడు ప్రచురణ కర్తలు ముందుకు వచ్చి ఇలాంటి సభని ఏర్ఫాటు చెయ్యడం హర్షించ దగ్గ విషయం.  కాకరాల గారు వక్తగా వేదికనెక్కితే చాలా ఆవేశంగా మాట్లాడేవారు.  ఈ సభలో ఇదివరకున్న ఆవేశం లేదు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

మరో తరం వెళ్ళిపోవడం మొదలయ్యింది.

మద్రాసులో బాల్యంలో మా నాన్న గారితో వారింటికి వెళ్ళడం కుటుంబరావు గారు, నాన్న గారు సాహిత్యం, రాజకీయం మీద చర్చోపచర్చలు కబుర్లు చెప్పుకుంటూవుంటే ప్రసాద్ గారితో ఏదో కాలక్షేపం చెయ్యడం లీలగా గుర్తుంది.

వారి సాహిత్యం గురించి, వారి సంగీతం గురించి, వారి శాస్త్రీయ రచనల గురించి నా కంటే వివరంగా చెప్పేవాళ్ళూ, విశదీకరించే వారున్నారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్లడం లేదు.

దాసరి సుబ్రహ్మణ్యం గారు ఒకరోజు సాయంత్రం  ప్రసాద్‌గారిని తీసుకునివచ్చి “మిమ్మల్నీ కలవడానికి వచ్చాడు’,  అని మా అమ్మకి పరిచయం చెయ్యడం నుంచి బాగా గుర్తు ఉంది. అప్పటికి ఆయన అమెరికాలోనే ఉన్నారు. దాదాపు ఒక గంట ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తరువాత..ఇంకేదో పనిమీద వెళ్ళిపొయ్యారు.  చాలా సీదాసాదాగా, సరదగా నవ్వుతూ ఉండేవారు.Kodavati Ganti Rohini Prasad

మా నాన్నగారిని బాగా అభిమానించేవారు. వారి రచనలన్నింటిని ఈ తరానికి పరిచయం చెయ్యాలని అంటూ ఉండేవారు.
I still remember his cheerful presence in our house and how badly my father took his untimely demise.
I feel your father’s excellent works should be reintroduced to today’s generation. If you have no objection you can get them posted in pranahita.org or prajakala.org and poddu.net. with introductory remarks. In case you are not familiar with typing in Unicode etc I can tell you.”

ఆ మధ్య డెట్రాయిట్‌లో త్రిపురనేని గోపిచంద్ జ్ఞాపకార్ధం జరిగిన సాహితీ సభలలో కూడా త్రిపురనేని సాయిచంద్ ని కలిసినప్పుడు:
In the Detroit meeting I requested Saichand to say a few words about Pitcheswara Rao garu after the discussion on Gopichand garu“, అని చెప్పాను అని కూడా అన్నారు.

అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృత్యర్ధం విజయవాడ సభకి వెడుతున్నాను., అనగానే వారిమీద వ్రాసిన వ్యాసాన్ని పంపుతూ “మీరు అక్కడే ఎవరితోనైనా చదివించి వినిపించండి, ప్లీజ్“, అంటు కోరారు.  ప్రజాసాహితి రవిబాబు గారు ఆ సభలో దానిని చదివి వినిపించారు.
స్నేహాశీలి..చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అందరితోను కలివిడిగా ఉండేవారు.  చేతనైన సహాయం చేసేవారు.

తరచూ ఈమైల్స్ తో పలకరించే వారు.

నా బాల్యం – సాహిత్యం – మద్రాసుకి ఒన్న మరో గుర్తు కాలగర్భంలో కి జారిపోయింది.

వారి బ్లాగులు:
http://rohiniprasadk.blogspot.in/
http://rohiniprasadkscience.blogspot.in/
కినిగెలో వారి పుస్తకాలు ఇక్కడ:
http://kinige.com/kbrowse.php?via=author&name=Kodavatiganti+Rohini+Prasad&id=122

అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను!

మొన్నామధ్య ఒక పెద్ద రసపోషకుడిగారిని కలిసాను. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే..దురదుంది కదా..సాహిత్య దురద..పుట్టింది. గోక్కుంటూ అలనాటి భారతి గురించి, ఆ నాటి ఆంధ్రభూమి గురించి, అప్పటి అభ్యుదయ గురించి, ఆ రోజుల్లో కాగడ గురించి. కృష్ణాపత్రిక గురించి, సంవేదన, కళ ఈ నాటి సృజన గురించి ఆయన ఒక పది మాటలు మాట్లాడితే నేను ఒక పదం వొదుల్తు..పుసిక్కిన మిసిమి అని అన్నాను.

Misimi
మిసిమి Misimi One of the finest Telugu literary monthly magazine

ఆయన చాల లాఘవంగా దాన్ని ఒడిసి పట్టుకుని, దాన్నీ తిప్పి మళ్ళీ నా మీదకు వదిలాడు, “మిసిమి..సెక్‌సు పత్రికా అది..దాని పేరు వినలేదే ఎప్పుడూ?!” అంటూ. మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది..అక్కడ నా పక్కన ఉన్నట్టైయితే..మీ అందరి ఆరోగ్య భీమా పధకాలన్నింటిని పరీక్షకి పంపాల్సి వచ్చేది. అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను! టపా కట్టేసి ఉంటే ఇక్కడ ఈ టపా ఉండేది కాదు కదా!

మిసిమి మాస పత్రిక ఇక్కడ లభిస్తుంది.

నాకు దేముడంటే ఇష్టం

“ఏవిటి మాస్టారు..చాలా రోజులకి.  ఎలా ఉన్నారు?”
“బాగానే ఉన్నానండి”.
“ఎలా వున్నవి సాహిత్య సభలు, మీ ఊళ్ళో”.
“బాగానే జరుగుతున్నవి”
“నేను ఇప్పుడు మీ ఊళ్ళోనే ఉన్నాను”
“ఈ రోజున ఫలానా చోట “@#$%‌” వాళ్ళ సభ ఉందంట. అక్కడికి  రారాదు.  మనం అక్కడ కలుసుకుందాం”.

తేనీరు
“నాకు దేముడంటే ఇష్టం”

“నేను రాలేనండి”.
“ఏందుకని?  పండితులున్నారంటకదా?”
“ఉన్నారండి..కాని నాకు దేముడంటే ఇష్టం అండి.”
“ఐతే..”
“వాళ్ళు దేముడ్ని తిడతారండి.  నాకది ఇష్టం ఉండదు.  పనిమాలా వెళ్ళి ఆవన్ని వినడం ఎందుకు?  కలవాలనుకుంటే  నేనే మీదగ్గిరకు వస్తాను. కాసేపు కబుర్లు చెప్పుకుందాం”
“రండి.  ఐతే చక్కగా టీలు తాగుతూ కబర్లు చెప్పుకుందాం”.

మంచి మిత్రుడితో స్నేహాం మరోక శిఖరం చేరింది.

చిల్లర

రెండు పదుల నోట్లు ఇచ్చినప్పుడు  చాకలి..’చిల్లర‌’ అని గొణుకున్నప్పుడు మంగళ రావు దృష్టి బట్టల ఇస్త్రీ లెక్ఖల మీద పడింది.  ఈ లోపు అతను చిల్లర తేవడానికి పూరి పాకలోని గది లోపలికి వెళ్ళాడు.

మూడు షర్ట్లూ.  ఒకొక్క దానికి నాలుగు రూపాయలు. మూడు నాలుగులు పన్నెండు రూపాయలు.  తను ఒక పది రూపాయల నోటు, ఒక రెండు రూపాయల బిళ్ళ ఇస్తే సరి పోయేది అనుకుంటూ, పాంటు జేబులో చెయ్యి పెట్టి చూసుకున్నాడు.  నాణేలు లేవు.  తన దగ్గిర అవి ఉండవు కదా!
రెండు నిముషాలు ఐనవి.

చిల్లర

చాకలి వెతుక్కుంటున్నట్టు న్నాడు.

చిల్లర లేదేమో..ఉంచుకోమని అందామనేలోపు అతను చిల్లరున్న కుడి జేతిని జాపుతూ ముందుకి వచ్చాడు. “ఉంచుకో తరువాత తీసుకుంటాలే,”  అని అంటూ మంగళరావు చెయ్యి జాపాడు. “ఉన్నాయ్ సారు”, అంటూ అతను మూడు నాణేలు మంగళరావు చేతిలో బెట్టాడు.  “నేన్నది చిల్లర..డబ్బులు కాదు”, అంటు మంగళరావు డబ్బు అందుకున్నాడు.లెక్ఖబెట్టకుండానే పాంట్ జేబులోకి వదిలాడు వాటిని.

#ghatana

భారతి

శివయ్య, పద్మావతి కి కలిగిన సంతానమే భారతి.  ఆమె చిన్నప్పుడే తండ్రి తాగుడికి అలవాటు పడి అనారోగ్యం తో చనిపోయాడు.  భారతికి అప్పుడు ఐ దారు ఏళ్లు ఉంటాయేమో.   పద్మావతి కూలీ నాలీ చేసుకుంటూ బ్రతికుని వెళ్ళదీసుకుందామనుకునేది.  ఒంటరి ఆడది.  కడుపు మాడ్చుకోవడం కష్టం గా ఉండేది.  దానికి తోడు పిల్లదాని కడుపు కూడా చూడాలి.  సూరి దృష్టి లో ఆమె పడింది.  మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు వేసిన తప్పటడుగు ఆమె జీవితాన్ని మార్చేసింది.  సూరి చేతులు మార్చుకున్నాడు.  పద్మావతి ఇప్పుడు డబ్బుతో సుఖం కొనుకోవచ్చు అనే ఆలోచనతో డబ్బు వెమ్మట పరిగెత్తడం మొదలయ్యింది.  ఆ క్రమంలో భారతిని నిర్లక్షం చేసింది.

తల్లి చేసిన తప్పులన్నింటిని భారతి చెయ్యలేదు.

(ఈ బొమ్మలోని వ్యక్తి భారతి కాదు)

చదువుకుంది. కాపీలు కొట్టింది. మార్కులు సంపాదించింది. మాల్సుకెళ్ళింది. ఉద్యోగాలు చేస్తూన్న షాపులలోనే దొంగతనాలు చేసింది. బస్సులెక్కింది. మగవాడి బలహీనతతో  ఆడుకోవడం నేర్చింది. స్కూటర్లెక్కింది. బైకులెక్కింది. కారులెక్కింది.  సుఖమయ జీవితాన్ని ప్రేమించింది.  సుఖాలు లేని జీవితాన్ని అసహ్యించుకుంది. లేమిని చూసి భయపడింది.  డబ్బుకోసం వెంపర్లాడింది.  కొత్త అలవాట్లు నేర్చుకుంది.  తన విలువలంటు కొత్త భాష్యాలు చెప్పుకుంది.  వాటినే ఆచరించండం మొదలు పెట్టింది.

బస్ స్టాపులో కనపడింది.  స్టేషన్ ప్లాట్ ఫారం మీద వల విసురుతూ కనపడింది.  చివరకు నా ఆఫీసుకే ఉద్యోగం అంటూ వచ్చింది.  ఉద్యోగం కోసం ఏ పనైనా చేస్తానని నొక్కి వక్కాణించింది.

తాడుని తెగేదాకా లాగింది. కట్టు తెగింది. మరి ఇప్పుడు ఏమయ్యిందో? ఎక్కడుందో?

* ఇది వ్రాస్తున్నప్పుడు..ఓ హెన్రి కథ ది గిల్టీ పార్టీ  లో లిజ్జీ గుర్తోస్తోంది.

పదండి ముందుకు..

హేమాంబరధర రావు కి వివాహమయ్యింది.  భార్య పేరు లక్షీకాంతం.  వారికి ఇద్దరు పిల్లలు.  సుభ్రమణ్యేశ్వ రావు పెద్దవాడు.  రెండవ సంతానం కూతురు. కామాక్షి. వాళ్ళుండేది ఆరంతస్థుల మేడ. అంతస్థుకి నాలుగు పోర్షన్లు.  హేమాంబరధర రావు కుటుంబం ఉండేది మూడవ అంతస్థులోని రెండవ పోర్షను. అది లిఫ్ట్‌కి ఎడంగా ఉంటుంది.  దానికి నెలకి అద్దే ఆరు వేల రూపాయలు. మూడు నెలలు అడ్వాన్సు.  మెయింటనెన్స్‌కి ఒక ఐదువందలు.  సుమారుగా ఒక వెయ్యి రూపాయలు నీళ్ళకి అదనంగా కట్టుకుంటారు.

హేమాంబరధర రావు కి ఒక ద్విచక్రవాహనం ఉంది.  హోండా యూనికార్ణ్.  లక్షీకాంతం కట్నంతో పాటు ఆవిడ తండ్రి దాన్ని కూడా అతనికి సమర్పించుకున్నాడు. లక్షీకాంతానికి కాలేజికి వెళ్ళడానికని ఒక ఆక్టివా స్కూటర్ని కూడ ఆయన కొనిచ్చాడు.  అదికూడా ఆమెతోపాటు హేమాంబధరరావు గూటికి చేరింది. ఇక సుభ్రమణ్యేశ్వ రావుకి ఒక బి‌ఎస్‌ఎ స్పోర్ట్స్ మాడల్ సైకిలూ,  కామాక్షి కి ఒక ఏవన్ వారి లేడిస్ సైకిలు హేమాంబరధర రావు తన జీతం డబ్బులతోనే కొన్నాడు. అన్నట్టు హేమాంబరధర రావు అకవుంట్స్ ఎక్జిక్యూటివ్ గా ఇంపెక్స్ కంపెనిలో ఉద్యోగస్తుడు.  తృప్తి సూపర్ మార్కెట్‌లో లక్షీకాంతం ఫ్లోర్ మేనేజరుగా ఉద్యోగం చేస్తోంది.

ఆ నాలుగు అంతస్థులవారికి గ్రవుండ్ ఫ్లోర్‌లోనే పార్కింగ్.  కొంచెం ఫ్రీగా ఉండటానికి భవంతి ముందు రోడ్డు మీద ఆపుకోవచ్చు కాని ఇరుకైనా  అందులోనే పార్కింగ్ చేసుకోవడం వాళ్ళందరికి అలవాటైపోయింది.  ఈ మధ్య ఎవరో జెనరల్ మోటార్స్ వాడి బీట్ కారుని కూడ కొనుక్కున్నారు.   దాంతో పాటే హ్యుండాయి వారి ఎల్ 10 కూడ ఆ పార్కింగ్‌లోకి చేరింది.  అన్ని పోటీలు పడుతునే ఉన్నవి ఆ పార్కింగ్ లో స్థలం కోసం.

సాయంత్రం పూట హేమాంబరధర రావు ఇంటికి చేరేటప్పడికి ఆరు లేదా ఏడు గంటలవుతుంది.  గేట్లు తెరిచే ఉంటవి.  తన బండి దిగకుండానే లోపలికి పోనిస్తాడు హేమాంబరధర రావు.  ఎడమచేతివైపు గోడకి వారగా ,కిటికి క్రింద బండి దిగకుండానే, ఎడమ పాదంతో సైడ్ స్టాండ్ దింపుతాడు.  అదే వూపులో బండి టాంక్ మీద ఉన్న లంచ్ బాగ్‌ని ఎడమచేత్తో అందుకుని కుడిచేత్తో లాక్‌చేసి గిర్రున తిరుగుతూ బండి మీద నుంచి దిగుతాడు. ఒకొక్కసారి ఆ గోడకి ఉన్న కిటికిలోనుంచి మాంచి మసాలా వాసనలు, లేదు తాళింపుల ఘాటు అతనికి అహ్వానం పలుకుతాయి.  కిటికి ఉన్న గోడకి అవతలి వైపు వంట గది.  అందులో సింవాచలం అతని ఆడలేడిసుంటారు. ఆ ఆడలేడిసు గొంతుని ఎప్పుడు హేమాంబరధర రావు విన్నది లేదు.  కాని ఒకొక్కరోజు ఆ గరిటేలు, గిన్నేలు, పళ్లేలు చేసే శబ్దాని బట్టి ఆడలేడిసు సింవాచలంకి ఏంచెబుతున్నారనేది అర్ధం అయ్యేది.  ఆ వంట గది ఆనుకుని ఒక చిన్న గది.  ఆ గదికి ఆనుకుని లిఫ్టు.  ఆ లిప్టుని అల్లుకుంటు పైకి సాగిపొయ్యే మెట్లు.  ఆ మెట్ల క్రింద ఇస్త్రీ బల్ల.  ఆ పార్కింగ్ లాట్‌కి ఏం ఖర్మ మొత్తం ఆ భవంతికే అది కమాండ్ సెంటర్.  సింవాచలం దానికి అధికారి.  పాలు, పళ్ళు, కొరియర్లు, కరెంటు వాళ్ళు, డైనేజి వాళ్ళు, వాటర్ వాళ్ళూ, ఒక్కరేమిటి ఆ భవంతి యజమానితో సహా అందరికి సింవాచలం అక్కడే కనిపిస్తాడు..కలుస్తాడు..చూస్తాడు..మాట్లాడతాడు.

కాని ఆ రోజు సింవాచలం గేటు దగ్గిరే కనపడ్డాడు.  కాని హేమాంబరధర రావు తన యూనికార్ణ్ ని పార్క్ చేసేటప్పుడు అన్నాడు.  “సారు గారు..మీ బండి ని కాస్త ఆ ఎదర పార్క్ చేసుకోండి” అని.  హేమాంబరధర రావుకి అర్ధం కాలేదు ముందు.  అర్ధం ఐన తరువాత ఎందుకన్నట్టు ప్రశ్నార్ధకంగా చూసాడు.  సింవాచలం చిరునవ్వు నవ్వుతూ ” మా బండి వస్తోంది సారు.  మా అబ్బాయి కూడా బైకు కొనుక్కున్నాడండి” అని అన్నాడు.  అతని మాటల్లో అహంకారం కాని మరే కారం లేదు. నేను కూడ మీ అంతస్థుకి ఎదిగాను అని చెప్పక చెప్పడం తప్ప.

హేమాంబరధర రావు మొఖం ఒక్క క్షణం కళ తప్పింది.  అకవుంట్స్ మనిషి కదా! కనపడనీయకుండా నవ్వేసి బండి ని దాదాపు కమాండ్ సెంటర్ దగ్గిరకి తీసుకువెళ్ళి పార్క్ చేసి వెనక్కి తిరిగి సింవాచలం వైపు “చాలా?” అన్నట్టు చూసాడు.  చాలు సార్ అని అనకుండానే మొఖంతో తన అభిప్రాయాన్ని పలికించాడు సింవాచలం.

ఇది జరిగిన మూడో నెలకల్లా మూడవ అంతస్థులోని రెండవ పోర్షన్ ఖాళీ ఐయ్యింది.  అందులోనే హేమాంబరధర రావు ఉండేవాడు.

#ghatana

కోరిక

ఫోను మోగింది.  ఆరున్నరయ్యింది.  తెలియని నెంబర్.  బహుశ కాబ్ డ్రైవరే అయ్యుంటాడు.  కాబ్ డ్రైవరే! 43 ఈస్ట్ దగ్గిర్లోని ప్లాజా సెంట‌ర్‌లో ఉన్నాడంట. అతనికి ఫ్లాట్‌కి ఎలా చేరాలో డైరక్షన్స్ ఇచ్చాడు.

మళ్ళీ ఫోను.  కాబ్ డ్రైవరే.  క్రింద పార్కింగ్ లాట్ లో వెయిటింగ్.  పావుగంటలో చేరాడు. ఫరవాలేదు.  ప్లాను చేసుకున్న అరగంటలో దింపేస్తాడు. సాండల్స్ విడిచి షూస్ తగిలించుకున్నాయి పాదాలు.

కుడిచేతివేపు విండ్ షీల్డ్‌ని తుడుచుకుంటున్న డ్రైవర్, అతను తన కాబ్ వైపుకి రావడం చూసి చేతిలోని డస్టర్‌ని కారు ఫ్రంట్ డోర్‌ నుంచి జారవిడిచి, కారు ముందు నుంచి చుట్టూ తిరిగి, కెర్బ్ వేపునున్న రేర్‌డోర్ని ఎడమ చేత్తో తెరిచి పట్టుకున్నాడు.  అతను కారులోకి కూర్చుని సర్దుకున్న తరువాత తలుపు మూసేసి, కారు వెనుక నుంచి చుట్టూ తిరిగి ముందుకు వచ్చి డోర్ తెరిచి తన సీట్‌లోకి జారుకున్నాడు. కారు ఇంజెన్ ని స్టార్ట్ చేసాడు.

2012-mercedes-benz-e-class-sedan_14
కోరిక

జీ‌పీఅర్‌ఎస్ మీటర్న్ ఆన్ చేసినట్టు తెలుపుతూ వెల్‌కం మెసేజ్‌ని వినిపిస్తూ పికప్‌పాయింట్, డ్రాప్ పాయింట్‌ని షెఫియర్‌తో కన్ఫర్మ్‌ చేసుకోమని కోరింది గోనౌ డాట్ కాం వారి సర్వీసెస్ మానిటర్.

కారు కదిలింది.  అప్పుడు అడిగాడు డ్రైవర్, హెల్త్ సిటికే కదా అంటు.  ఔనన్నట్టుగా తలవూపుతూ యస్ అన్నాడు అతను.  రోజు వెడుతుంటారా అని మళ్ళీ ప్రశ్న. లోలొపలే నవ్వుకున్నాడు అతను. లేదు రోజు కాబ్‌లో వెళ్ళను అని కావాలనే జవాబిచ్చాడు. దానికి అర్ధం క్రింద పార్కింగ్‌లో ఆగిన ఈకాబ్ పక్కనే ఉన్న ఈక్లాస్ బెంజ్ తనదే నని చెప్పకుండా చెప్పడం

డ్రైవర్ ఆలోచన అతనికి అర్ధం అయ్యింది.  తనని అతను హెల్త్‌సిటీ లో ఉద్యోగం చేస్తున్న ఒక సీనియర్ ఎక్జిక్యుటివ్‌ అనో..డాక్టర్‌ అనో అనుకుంటూ ఉండి ఉంటాడు.  రోజు కాకపోయినా వారంలో ఒకటి రెండు సార్లు ఐనా తనని డ్రాప్ చేస్తే ఒక డ్రాప్ కి కనీసం ఐదువందలు సంపాదించుకోవచ్చని అతని కోరిక.  కాని తను ఒక పేషంట్ అని, డ్రైవింగ్ చేయ్యకూడదని సర్జన్ చెప్పాడు కాబట్టి ఆయనతో ఉన్న ఫాలో‌అప్ అపాయింట్‌మెంట్‌ని మీట్ అవ్వడానికి కాబ్‌ని బుక్ చేసుకున్నాడని అ డ్రైవర్‌కి తెలియదు కదా!

కవి స్వరాలు

మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో కిన్నెర వారి తెలుగు కవిత మహోత్సవాలు లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన ‘తెలుగు వెన్నెల‘ లో “అనువాద కవిత్వం – దశ – దిశ‘ అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.అంతే కాకుండా అంతకు క్రితం రోజున విశిష్ట కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రత్యేకత ఏమిటంటే వేదిక నెక్కిన ప్రతి కవి తన కవితని తనే చదివి సభకు వినిపీంచాలి.

వేదిక నెక్కిన కవులు, వారి కవితలు వారి గళాలలోనే, మీ కోసం ఇక్కడ.

అద్దేపల్లి రామమోహనరావు

ద్వా.నా.శాస్త్రి

శిఖామణి

ఆశారాజు

శ్రీమతి ఎన్. అరుణ

శ్రీమతి జ్వలిత

రామకృష్ణా రావు

ఫణీంద్ర

వెనిగళ్ళ రాంబాబు

దేవరాజు మహారాజు

ముకుంద రామారావు

వడ్డేపల్లి కృష్ణ

చిమ్మపూడి

ఆచార్య గోపి
రాళ్ళబండి కవితా ప్రసాద్