ఒకటి, యండమూరి వీరేంద్రనాధ్ కామెంట్ నా దృష్టికి రాకపోతే ఈ పుస్తకాని అంత త్వరగా చూసేవాడిని కాదు. రెండు దాసరి అమరేంద్ర గారు ఈ అనువాదకుడికి ‘వాగ్దానం’ చెయ్యకపోయినా ఈ పుస్తకాన్ని ఒక్క రాత్రి పూట చదివి ముగించేవాడిని కాదు. మూడు ఈ పరిచయం ఇక్కడ ఉండటానికి కారణం విజయవాడలో పుస్తక ప్రదర్శన.
పైగా జనవరి 28 ఆదివారం ఉదయం హైద్రాబాదు చలిలో ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాల్సిరావడం. అబ్బే, వేదిక తరఫున కాదు. ఆలంబన దీనికి సభాస్థలి. కార్యక్రమం డా వింజమూరి సూర్యప్రకాశ్ గారి Spreading Lights లో ఒక భాగం.
ఇక పోతే ఈ పుస్తకం లో 70 వ పేజిలో ఒక చిన్న పిట్ట కథ ఉంది. ఆ కథ విపించింది సూఫీ బాబా.
“అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ ని చూడలేదతడు. తన అనుమానాన్ని వెలిబుచ్చుతూ, ఆమె గుండెలకేసి చూపించి, తామిద్దరిమధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు.
అమాయకమైన ప్రశ్నకి ఆ తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మొదటిసారి తమ ప్రపంచంలోకి వచ్చిన బౌద్ధసన్యాసి అని అతడికి తెలుసు. తేడా గురించి చెపుతూ, ‘తల్లి అయిన తరువాత, పిల్లల్ని పోషించ వలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ప్రకృతి ఆ బాలికకు ఆ విధమైన అవయవాలను ఇచ్చింద’ని వివరణ ఇచ్చాడు.
ఆమాటలకు సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆరోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజులదినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరికి చేరుకున్నాడు.
ఇలా ఎందుకు చేశావని అడిగాడు గురువు.“
ఇందాక యండమూరి షేర్ చేసారు అని ఉదహరించింది ఈ పై కథనే.
ఇది ఈ పోస్ట్‌కి నేపధ్యం. నేను అభిమానించే పారిశ్రామికవేత్త “జే” ( టాటా సన్నిహితులు ఆయన్ని ఆ పేరుతో పిలుచుకునేవారు) కి ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాడు అజిత్ సింఘాని. అది మరొక కారణం ఈ పుస్తకాని చదవడానికి.
ఒక్క మాట. ఇది పుస్తక పరిచయం మాత్రమే.
ఇక వివరాలలోకి వెడదాం. పుస్తకం పేరు ఇంగ్లీష్ లో One life to ride. రచయిత Ajit Harisinghani.
ఇక దీనిని తెలుగులో కి అనువదించింది కొల్లూరి సోమశంకర్. తెలుగులో ఈ పుస్తకానికి పెట్టిన పేరు ప్రయాణానికే జీవితం .
ప్రయాణానికే జీవితం – తెలుగు అనువాదం కొల్లూరి సోమశంకర్
మూలం – ఆంగ్లం – అజిత్ సింఘాని
కోలా శేషాచలం నీలగిరి యాత్ర లో ఒక ప్రకరణం మాకు ఫిఫ్త్ ఫార్మ్ లో అనుకుంటాను పాఠంగా ఉండేది. మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ వీరాచారి గారు మాకు దానిని చెప్పారు. అప్పటికే తెలియని తెలుగు పదాలని ఆ పాఠం తో పాటు వారి ద్వారా నేర్చుకున్నాం.
ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్ర , మల్లాది వ్రాసిన రెండు పుస్తకాలు – ట్రావెలాగ్ అమెరికా, ట్రావెలాగ్ యూరోప్ లాంటివి, నేను చూసిన అమెరికా అని అక్కినేని వ్రాసిన పుస్తకాలు వగైరాలు ప్రయాణాలు, యాత్రలు చేసిన వారి స్వీయానుభావాలే. ఈ మధ్యే మధురాంతకం నరేంద్ర గారు అమ్‌స్టర్‌డామ్ లో అద్భుతం నవలని అందించారు. ఈ నవలకి వారి విదేశి యాత్ర ఒక ప్రేరణ.
ఇవి కాక మరో రకం పుస్తకాలున్నవి. వాటిల్లో వీసాలు, మోసాలు, పాస్‌పొర్ట్లు, టికెట్లు, హోటళ్లు, తిండి, తిప్పలు వగైరాలు మాత్రమే ఉంటాయి.
సోమశంకర్ అనువదించిన ప్రయాణానికే జీవితం లో ఇవేమి ఉండవు. మరేవో ఉంటాయి కాబట్టి ఈ పుస్తకం చదివిన తరువాత కూడ పాఠకుడ్ని వెన్నంటి వేటాడుతుంది అని అంటున్నాను.

Richard David Bach పుస్తకం ఒకటి 70 లలో పాఠకులని ఒక కుదుపు కుదిపింది. ఆ పుస్తకం పేరు Jonathan Livingston Seagull .
ప్రయాణానికే జీవితం చదువుతుంటే నాకు ఆ పుస్తకం జ్ఞాపకం వచ్చింది. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడైన పుస్తకం అది.
ప్రయాణానికే జీవితం పుస్తకంలో వీసాలు, మోసాలు, పాస్‌పోర్ట్లు, ట్రైయిన్ టైంటేబుల్స్ గాని అజిత్ ప్రయాణానికి ఉపయోగించుకున్న బుల్లెట్ గురించి వివరాలు కాని ఉండవు. లోలోన, పొరలలో దాగి ఉన్న మనిషి మనసుని అది ఆవిష్కరింపచేస్తుంది. గమ్యం మొక్కటే కాదు ముఖ్యం అజిత్ లాంటి యాత్రికులకు. మనసును తెలుసుకోవడం కూడ ముఖ్యమే!
54 వ పేజిలో ఒక జీవిత గాధ ఉంది. జరిగిన కథ అది. ఒక భారతీయుడు అతని కుటుంబం, ఒక పాకిస్థాని అతని కుటుంబం. ఒక కుటుంబాన్ని రక్షించిన మరో కుటుంబం ఏమైంది అన్నది చదివితే మనసు ద్రవించిపోతుంది.
157 పేజిలో మరాఠ యువకులు పదాతి దళంలో చేరి, తమ కుటుంబానికి, స్నేహితులకి బంధువులకి దూరంగా, శత్రువులకి అత్యంత సమీపంగా జీవిస్తూ… ప్రతి క్షణం ప్రాణభీతితో ఎలా జీవిస్తున్నారో చదువుతుంటే అజిత్ తో పాటు మనం కూడ కన్నీరు పెడతాం.
అంత ఒడుపుగా ఆంగ్లలోనుంచి తెలుగులోకి అనువదించి పాఠకుడ్ని కూడ ఉద్వేగానికి లోను చేసేటంత గొప్పగా అనువదించాడు ఈ అనువాదకుడు – కొల్లూరి సోమశంకర్.
బుల్లెట్ బండి మీద సవారి కాదా ఈ పుస్తకం? కాదు. అంతేకాదు. ఈ పుస్తకం విపశ్యన (విపాసన)గురించి కూడా మీకు చెబుతుంది.
అచ్చు తప్పులున్నాయి కాని పంటి కింద రాయిలాగా అడ్డుపడవు. ముద్దకి ముద్దకి రాళ్ళని వెతుక్కోనక్కర్లేదు. భాష సాఫీగానే ఉంది.
చదవతగ్గ పుస్తకమే! సందర్భం ఏదైనా బహుమతిగా కూడ ఇవ్వొచ్చు .
ప్రతులకు:
K. Soma Sankar
1-30-28, Tirumalanagar,
Kanajiguda, Secunderabad 500 015.
మొబైల్ ఫోను: +91 99484 64365
ధర : రూ: 120.00
ప్రముఖ పుస్తక విక్రేతలందరి దగ్గిర దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే వారిని తెప్పించి పెట్టమని అడగండి. కుదరకపోతే రచయిత ఉండనే ఉన్నాడు. ఆర్డర్ పెట్టండి.
Thank you Anil garu for the nice introduction.
The book can be ordered online from kinige.com as well.
The link is http://kinige.com/book/Prayananike+Jeevitam
“వెంటాడుతుంది ఈ పుస్తకం” కి మీరిచ్చిన పరిచయం ఒక ఉత్సుకతని కలిగించింది , సహజం ఆ పుస్తకం కోసం వెతుకులాట , వెతుకుతాం సంపాదిస్తాం చదువుతాం , మనసుకి నచ్చితే మనసులో పెట్టుకుంటాం , బాగా నచ్చితే , మళ్ళీ చదవాలి అనిపించినప్పుడల్లా చదువుకుంటాం . ఈ రోజు మంచి లింక్ దొరికింది , లింక్దిన్ వల్ల.
నేను రాసుకున్న కధలలో నాకు నచ్చిన కధ లింక్ కిందన ఇచ్చాను చదివి ( మీకు వీలైతే) అభిప్రాయం చెబితే ధన్యుడను .
http://www.acchamgatelugu.com/2017/10/mrutyunjayudu-story.html