రచయిత – రచన

రచయిత – రచన

జీవితం లో పాల్గొనే ప్రతి వ్యక్తి, ప్రజల్లో సజీవంగా మెలగుతున్న ప్రతి మనిషీ రచయిత కాగలడా? కాడు ! మానవ సమాజం తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రతి కళాసృష్టి లోనూ సమాజం అంతా పాల్గొనేది. అప్పుడు రచయితకీ ప్రజలకి భేదం లేదు. అలాంటి పరిస్థితుల్లో రచయిత స్వయం ప్రతిభ అనే ప్రశ్నే లేనేలేదు. అప్పుడు ఉత్పత్తి : కొనుగోలులకి భేదం ఉండేది కాదు ఆర్ధికరంగం లో, అదే సాహిత్యంలో కూడా ప్రతిబింబించేది.

అంచేతనే ఆనాటి సాహిత్యంలో అదంతా జానపద సాహిత్యమని జమకట్టవచ్చుచైతన్యం సున్నాగా కనిపించింది; వ్యక్తిత్వం గూడా కనిపించదు. ఐనా ఆ సాహిత్యం లో ఎకాగ్రతఅద్భుతంగా ఉండేది. ప్రకృతికి మనిషికీ జరిగే పోరాటంలోని పరస్పర వైరుధ్యాలు అన్నీ యెత్తిచూపుతూ మానవ యత్నానికి చక్కటి దోహదం యిచ్చేది.

కాని

ఇప్పుడో! రచయితకీ, పఠితకి ప్రత్యక్ష సంబంధం లేదు. రచయిత తాను రచించింది మార్కెట్‌లోకి పంపుతాడు. చదివేవాడు కొనుక్కుని తనగదిలో చదువుకుంటాడు. ఇప్పుడు గూడా మనిషికి ప్రకృతికీ పోరాటం జరుగుతునే ఉంటుంది. రచయిత ఇప్పుడు కూడా మనిషి కొమ్మే కాయాలి. పూర్వం జరిగిన ఫలితమే ఏకాగ్రత – ఇప్పుడు కూడా వ్యక్తులుగా విడిపోయిన పాఠకుల్లో కలగాలి. ఇందుకు పూర్వం సంఘానికి రచయితకి వున్న ప్రత్యక్ష సంబంధమూ , రచనలో ఉన్న సమిష్టి యత్నమూ, పాల్గొనే సమిష్టి ప్రజల స్వార్ధం లో ఉన్న సామ్యము యెక్కువగా సహకరించేవి. ఇదివరకున్న ఆ ప్రత్యక్ష సంబంధం , సమిష్తి యత్నాల స్థానాన్ని, రచయిత స్వయం ప్రతిభ స్వంతం చేసుకోవాలి. ఎవరన్నా ఇదే ఇంస్పిరేషన్‌అన్నా అభ్యంతరం లేదు; అలా అనే వాళ్ళు ఇంస్పిరేషన్‌కి పర్స్పిరేషన్‌ కి బేధం తెలిసినవాళ్ళయితే.

ఆదిమ సాహిత్యానికి పునాదులుగా నిలబడ్డ మంత్రశక్తి, జ్యోతిషమూ, ఆవేశమూ, దూరదృష్టీ, సమిష్టీ స్వార్ధమూ, పూలకం లాంటి ఆవేశమూ, యీనాటి రచయితకి అవసరమే! కాని ఆనాటి మానవుడు ఆదర్శం ప్రధానంగాకుక్షింభరత్వంమాత్రమే! అయితే మానవుడు పురోగమించుతూ అనేక విలువల్ని, గుణపాఠాల్ని నేర్చుకున్నాడు. ఈ అనుభవాలకీ, విలువలకీ, రచయిత వారసుడు కావాలి. కాగా ఆ రచయిత శాస్త్రజ్ఞానమూ, హేతువాదమూ, గతి తార్కిక భౌతిక జ్ఞానమూ, వర్తమానానికి భవిష్యత్తుకీ ఉన్న సంబంధ పరిచయమూ మూర్తీభవించాలీ. ప్రజలకీ నాయకుడికీ ఉన్న భేదమే రచయితలో వివిధ రూపాల్లో కనిపించుంతుంది.

ఒక సందర్భంలో ఇబ్సన్‌ అంటాడు; ప్రశ్నలడగటమ్వరకే నా కర్తవ్యం, వాటికి సమాధానాలు చెప్పడం నా పని గాదు. సమస్య్లని పరిష్కరించడం నా వల్ల అయ్యే పని గాదు. మనుష్యుల్ని, వాళ్ళకుండే విభిన్న గుణగణాల్ని, వీటన్నటిని నిర్ణయించే ఆధునిక సాంఘిక సంబంధాల్నీ, సిధ్హాంతాల్నీ చూపించగలిగితే నేను కృతకృత్యుణ్ణయినట్టే.

ఇంతగా నియమిత ఆదర్శాన్ని ముందుంచుకున్న ఇబ్సన్‌ ప్రముఖ రచయితల్లో ఒకడిగా పరిగణించబడ్డాడు. కాని యీ నాటికి రచయితలూ అదే ఆదర్శంతో రచనా యత్నానికి పూనుకుంటే పప్పులో కాలువేసిన వాళ్ళవుతారు.

ఎంచేతనంటే మనిషి ఇబ్సన్‌ ని వదిలిపెట్టి చాలా ముందుకి వచ్చాడు. ఇబ్సన్‌ రోజుల్లో గందరగోళాల బురదలో మినుకు మినుకు మంటు కనిపించిన సామాజిక సత్యాలూ, సిద్ధాంతాలూ, ఇవ్వాళ్ళ కాళ్ళుని నిలబడ్డాయి. ఇబ్సన్‌ రోజుల్లో మనిషి సాంఘిక సంబంధాలని మరింత గందరగోళం చేసుకుంటూ పురోగమించేవాడు. ఆ గందరగోళాలన్ని ఈ రోజు మురుగు కంపు కొడ్తున్నాయి. ఆధునిక రచయితలు కూడా ఈ గందరగోళం వెనుకవున్న సంఘాన్ని, సాంఘిక సంబంధాన్ని చూడలేక ఈ గందరగోళం సంఘమని, సాంఘిక సంబంధమనీ, వాస్తవమనీ మసక కళ్ళతో చూసి విశ్వసిస్తున్నారు. ఆధునిక రచయిత, అబివృద్ధయిన పరిణామ సిధ్హాంతాన్ని, హేతువాదాన్ని, గతితార్కిక భౌతికవాదాన్నీ కళ్ళజోడుగా పెట్టుకుని, చేయూతగా తీసుకుని, మసకలోనుమంచి, పొగలోనుంచి బయటపడగలగాలి.

ఇలా బయటపడుతున్న రచయితల్లో పరిఢవిల్లే ప్రకాశం, ఆ పొగను, మసకను భేదిస్తాయి. భేదించుతున్న ప్రకాశం మరింత పదునెక్కుతుంది. ఈ ప్రకాశం మృగ్యమైనప్పుడు రచయితకున్న ఇన్స్పిరేషన్ పెర్స్పిరేషన్‌గా తయారవుతుంది. ఇన్స్పిరేషన్ “వేడి” లాంటిది, అనుకుంటే ఆ రాగితీగలో ప్రవహించే సర్వమానవాభ్యుదయ వాంచ్హ అనే విద్యుచక్తి తనలోవున్న “వేడి” నంతటిని సేకరించుకుని అవిరామంగా తిరుగుతూవుంటుంది. తనకంటే బలంగావున్న ప్రకాశంతో కుస్తిపట్టేటప్పుడు అందరికీ ఉపయోగించే వెలుతురు పుట్టుకొస్తుంది. ఇదీ రచయితలలో కనిపించాల్సిన “స్వయంప్రతిభ…”

రచయితలకు పునాదులుగా వుండవల్సిన ఈ “ప్రతిభ” వస్తు నిర్ణయంలోను, సంవిధాన యత్నంలోనూ, కళ్ళకు కట్ట్టినట్లు కనిపించుతుంది. ఇందులో ఎక్కడ లోపమున్న అది రచనలో ఎక్కడో ఒక చోట పొక్కుతుంది.

ఈ స్వయం ప్రతిభని ఉపేక్షించే రచయితలునుద్దేశించేమో టీ.ఎస్.ఇలియట్ అంటాడు:

మేం బోలు మనుషులం

మేం గడ్డిబొమ్మలం

మా వంటి నిండా వరిగడ్డే

మేమేం చెయ్యం? మేమేం చెయ్యగలం?

మేం గుసగులం; మేం గునుస్తాం

మా గుసగుసల్లో, మా గునుకుల్లో వేగం లేదు:

వేడీ లేదు; అర్ధం సున్నా!

మా గొంతుల్లో పొడి

మా పదాలు పగిలిన అద్దాల మీద నడిచే యెలుకల చతుష్పాదాలు

మా పదాలు యెండుగడ్డి కదిపేగాలి పిల్లల కెరటాలు!

ఇలాంటి బోలు మనుష్యులు, గడ్డిబొమ్మలు కావల్సినంత మంది వున్నారు.వీళ్ళు పెద్ద పులుల్తో “సత్యాగ్రహాలు” చేయించగలరు.”స్వర్గానికి నిచ్చేనలు” వేయగలరు. వీళ్ళే సర్వమానవ నాశన కారణాలయ్యే “తుపాను” లు వీయించుతారు. కారణం?

స్వయంప్రతిభ సాధనంవల్ల కలిగేదని వీళ్ళు నమ్మరు. యీ ప్రతిభ, పుట్టుకతోనే కలుగుతుంది కాబట్టి ప్రపంచం యీ ప్రతిభని యీఇనాటికాక్కుంటే రేపటికైనా గుర్తిస్తుందని నమ్ముతారేమో! వీరికున్న ప్రతిభ విలక్షణమైనది. సాధన విపరీతమైనది. వర్తమానాన్ని అర్ధం చేసుకోలేక, భవిష్యత్తువైపు తేరిపారా చూడలేక గతంలో తలదూర్చి బ్రతుకుతుంటారు.

పుట్టుకకి ప్రతిభకి సాపత్యం లేదని, సంబంధం ఉండదని యెవరూ అనరు. కాని అంతటితోనే అది అంతమవుతుందంటే అభ్యంతరం వస్తుంది.

సాహిత్యం కూడ ఒక వృత్తి లాంటిదే. మిగతా వృత్తుల విలువలకి, యీ విలువలకి వ్యత్యాసముంది. నిజమే. కాని మిగతా వృత్తులలో, నైపుణ్యం సంపాదించటం ఎంత కష్టమో, యీ వృత్తిలో ఆరి తేరెందుక్కుడా అంత దీక్షా, సాధనా అవసరమే. ఈ సాధన గడిచిన చరిత్రని, భాషాబేషజాన్ని పరిశీలించి, సొంతం చేసుకున్నంత మాత్రాన సిద్దించేది కాదు. చరిత్ర వెనుకవున్న సత్యాన్ని, భాషకున్న చరిత్రనీ, ప్రయోజనాన్ని గూడా గుర్తించగలగాలి. ఇదంతా సమకూడాలంటే యెడతెగని కృషి వుండాలి.

ఇందుకు రచయితలందరు కృషికున్న విలువని గుర్తించాలి; కృషి అంటే వున్న చిన్నచూపుని సంస్కరించుకోవాలి. రచయిత కూడ కొన్ని హద్దులో కార్మికుడేనన్న విషయాన్ని మరిచిపోగూడదు. అప్పుడే కష్టజీవుల అండని నిలబడటంలో వున్న గౌరవం అర్ధమౌతుంది. అప్పుడు గాని ఈట్స్ అన్న మాటల్లోని యదార్ధం అవగతం కాదు; ” You must learn your trade.”

రచయిత – రచనలు
మీద కీ..శే అట్లూరి పిచేశ్వరరావు అభిప్రాయాలు

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.