బాలాంత్రపు – గోపీచంద్

ఈ బాలాంత్రపు గోపీచంద్ ఎవరు?  
బాలాంత్రపు రజనీకాంతరావు గారంటే తెలుగువారిని తన లలిత సంగీతంతో అలరించినవాడు.  గేయకర్త.  స్వరకర్త.  ఇన్ని మాటలెందుకు, బహుముఖ ప్రజ్ఞాశాలి.  

Tripuareneni Gopichand
(8 September 1910 – 2 November 1962)

గోపీచంద్ అంటే సినిమాల్లో హీరో వేశాలేస్తుంటాడు. అతనేగా?  కాదు.  మరి?
ఈయన ఇంటిపేరు త్రిపురనేని.   కవి, సంఘసంస్కర్త, హేతువాది ‘కవిరాజు‘ బిరుదాంకితుడు, బార్-ఎట్‌-లా చదివినవాడు, త్రిపురనేని రామస్వామి కుమారుడు, ఈ త్రిపురనేని గోపీచంద్
తెలుగువారికి తొలి మనోవైజ్ఞానిక నవల అసమర్ధుని జీవయాత్ర  ని అందించి తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయినవాడు.  చలన చిత్ర దర్శకుడు.  కొన్నింటికి కధలు కూడా అందించిన వాడు.  

మరి ఈ బాలంత్రపు వారికి, ఈ గోపిచంద్ కి ఏమిటి సంబంధం?  చలనచిత్రాలలో సంగీతం ఉంటుందిగా!  మరీ ముఖ్యంగా మన భారతీయ చలన చిత్రాలలో నృత్యాలు కూడా ఉంటాయికదా!  అలా…గోపీచంద్ కి బాలాంత్రపు వారికి సంబంధం ఉంది.  వారిద్దరు మిత్రులు.  గోపీచంద్ సినిమాలలో పాటలకి స్వరకర్త, బాలాంత్రపు.  

Balantrapu Rajanikanta Rao
బాలాంత్రపు రజనీకాంతరావు

 

వారిద్దరిమధ్య జరిగిన ఒక హాస్య సంఘటనే ఈ బ్లాగ్ పోస్ట్ కి నేపధ్యం.  బాలంత్రపు రజనీకాంతరావు గారి కుమారుడు హేమచంద్ర నాకు మంచి మిత్రుడు.  ఆ మధ్యేప్పుడో, ఫేస్ బుక్ లో తన తండ్రిగారికి, గోపీచంద్ కి మధ్య జరిగిన ఒక సున్నితమైన హాస్య సంఘటన గురించి తెలియజేసాడు.   రజనీకాంతరావు గారు మద్రాసులో మా అమ్మ స్థాపించి నిర్వహించిన రాణీ బుక్ సెంటర్ కి వచ్చిన గుర్తు నాకుంది.  ఆయనికి  గోపీచంద్ కి ఉన్న సాన్నిహిత్యం తెలిసి ఉండటం వల్ల వారివురి మధ్య జరిగిన ఆ హాస్య సంఘటనని తెలుగువారి సాంస్కృతక చరిత్రలో పొందుపరిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను.  


Hemachandra Balantrapu
బాలాంత్రపు హేమచంద్ర

 సాక్షి దిన పత్రికలో  ప్రతి సోమవారం సాహిత్యానికంటూ ఒక పుటని కేటాయిస్తుంది.  అందులో మరమరాలు  మకుటంతో, సంగీత, సాహిత్యమనే కాకుండా ఇతర కళకారుల జీవితాలలోని ఆసక్తికరమైన సంఘటనలని ప్రచురించడం తెలుసు.  మొన్న గురువారం అంటే మే 8 న, హేమచంద్రతో కొన్ని చిన్న చిన్న సందేహాలుంటే తీర్చుకుని, ఈ కధనం ప్రచురించడానికి (వీలుంటే ఏదేని పత్రికలో) అనుమతి తీసుకుని, రాసి, శుక్రవారం మే 9న, సాక్షి దినపత్రిక కి పంపాను.  వాళ్ళు కూడా ప్రచురిస్తామని తెలియజేసారు. 



సాక్షి పత్రికకి పంపిన కధనానికి  నేను  కాలక్షేపం – బఠాణీలు అని పేరు పెట్టాను.  దానికి ఒక కారణం ఉంది.  దాసు వామనరావు గారనే హాస్య రచయిత ఒకాయన ఉండేవారు.  ఆయన ఆ రోజుల్లో ఒక కాలం రాసేవారు. దానిపేరు ‘కాలక్షేపం‘ అన్నట్టు గుర్తు. ఆయన్ని నేను గుర్తు  చేసుకున్నట్టూ ఉంటుందని ఆ పేరుతో  పంపాను.  (ప్రస్తుతం మద్రాసు, టీ. నగర్ లో దండపాణి వీధిలో ఉంటున్న ష్రైన్ వేలాంగణ్ణి సీనియర్ సెకండరీ స్కూల్, ఆ రోజుల్లో వామనరావు గారిదే!  )అంతే కాదు, హేమచంద్ర జ్ఞాపకాన్ని, నా మాటల్లో చెప్పానని కూడా సాక్షి వారికి తెలియజేసాను.  కాని ఏం లాభం!  రాసిన వారికే బైలైన్ క్రెడిట్ ఇవ్వటం వారి సాంప్రదాయమనుకుంటాను, అలానే చేసారు. 

ఇక కధలోకి వెళ్దాం!

రచయిత త్రిపురనేని గోపీచంద్ ‌– చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు చిత్రాలకు కథ, మాటలు అందించారు; పేరంటాలు, లక్షమ్మ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గాయకుడు, స్వరకర్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్‌ మంచి స్నేహితులు. మద్రాసులో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. గోపీచంద్‌ తీయబోతున్న చిత్రానికి బాలాంత్రపు గేయ రచన, సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఒకానొక ఘట్టంలో కావల్సిన పాటకి కావాల్సిన మాటల కోసం ఆలోచనలో పడ్డారు గోపీచంద్‌. ఆ పాటకి సంగీతం గురించి ఆలోచిస్తున్న రజనీకి కాలుమీద దురద పుట్టి, పరధ్యానంగా గోక్కోవడం మొదలుపెట్టిన కాసేపటికి గాభరా పడుతూ, ‘‘నా కాలు స్పర్శ కోల్పోయింది. నేను గోక్కుంటుంటే తెలీటం లేదు. అర్జంటుగా డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలి’’ అన్నారు. తలతిప్పి ఆయన వంక చూసిన గోపీచంద్, ‘‘డాక్టరు, గీక్టరు అక్కర్లేదు. ఇందాకటి నుంచి మీరు గోక్కుంటున్నది మీ కాలు కాదు, నా కాలు’’ అన్నారు. దాంతో అసలు విషయం అర్థమై ఇద్దరు మిత్రులు పగలబడి నవ్వుకున్నారు.
అనిల్‌ అట్లూరి

సాక్షి సాహిత్యం పేజికి లంకె ఇక్కడ
ఇక ఆ సాహిత్యం పేజిలో కధనం జెపెగ్ ఈ దిగువునః

Sakshi LIterature page Gopichand and Balantrapu by Hemachandra and Anil Atluri
బాలాంత్రపు – గోపిచంద్ హాస్యం

ఎంజాయ్ చేసారా?  చి న

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.