పదండి ముందుకు..

హేమాంబరధర రావు కి వివాహమయ్యింది.  భార్య పేరు లక్షీకాంతం.  వారికి ఇద్దరు పిల్లలు.  సుభ్రమణ్యేశ్వ రావు పెద్దవాడు.  రెండవ సంతానం కూతురు. కామాక్షి. వాళ్ళుండేది ఆరంతస్థుల మేడ. అంతస్థుకి నాలుగు పోర్షన్లు.  హేమాంబరధర రావు కుటుంబం ఉండేది మూడవ అంతస్థులోని రెండవ పోర్షను. అది లిఫ్ట్‌కి ఎడంగా ఉంటుంది.  దానికి నెలకి అద్దే ఆరు వేల రూపాయలు. మూడు నెలలు అడ్వాన్సు.  మెయింటనెన్స్‌కి ఒక ఐదువందలు.  సుమారుగా ఒక వెయ్యి రూపాయలు నీళ్ళకి అదనంగా కట్టుకుంటారు.

హేమాంబరధర రావు కి ఒక ద్విచక్రవాహనం ఉంది.  హోండా యూనికార్ణ్.  లక్షీకాంతం కట్నంతో పాటు ఆవిడ తండ్రి దాన్ని కూడా అతనికి సమర్పించుకున్నాడు. లక్షీకాంతానికి కాలేజికి వెళ్ళడానికని ఒక ఆక్టివా స్కూటర్ని కూడ ఆయన కొనిచ్చాడు.  అదికూడా ఆమెతోపాటు హేమాంబధరరావు గూటికి చేరింది. ఇక సుభ్రమణ్యేశ్వ రావుకి ఒక బి‌ఎస్‌ఎ స్పోర్ట్స్ మాడల్ సైకిలూ,  కామాక్షి కి ఒక ఏవన్ వారి లేడిస్ సైకిలు హేమాంబరధర రావు తన జీతం డబ్బులతోనే కొన్నాడు. అన్నట్టు హేమాంబరధర రావు అకవుంట్స్ ఎక్జిక్యూటివ్ గా ఇంపెక్స్ కంపెనిలో ఉద్యోగస్తుడు.  తృప్తి సూపర్ మార్కెట్‌లో లక్షీకాంతం ఫ్లోర్ మేనేజరుగా ఉద్యోగం చేస్తోంది.

ఆ నాలుగు అంతస్థులవారికి గ్రవుండ్ ఫ్లోర్‌లోనే పార్కింగ్.  కొంచెం ఫ్రీగా ఉండటానికి భవంతి ముందు రోడ్డు మీద ఆపుకోవచ్చు కాని ఇరుకైనా  అందులోనే పార్కింగ్ చేసుకోవడం వాళ్ళందరికి అలవాటైపోయింది.  ఈ మధ్య ఎవరో జెనరల్ మోటార్స్ వాడి బీట్ కారుని కూడ కొనుక్కున్నారు.   దాంతో పాటే హ్యుండాయి వారి ఎల్ 10 కూడ ఆ పార్కింగ్‌లోకి చేరింది.  అన్ని పోటీలు పడుతునే ఉన్నవి ఆ పార్కింగ్ లో స్థలం కోసం.

సాయంత్రం పూట హేమాంబరధర రావు ఇంటికి చేరేటప్పడికి ఆరు లేదా ఏడు గంటలవుతుంది.  గేట్లు తెరిచే ఉంటవి.  తన బండి దిగకుండానే లోపలికి పోనిస్తాడు హేమాంబరధర రావు.  ఎడమచేతివైపు గోడకి వారగా ,కిటికి క్రింద బండి దిగకుండానే, ఎడమ పాదంతో సైడ్ స్టాండ్ దింపుతాడు.  అదే వూపులో బండి టాంక్ మీద ఉన్న లంచ్ బాగ్‌ని ఎడమచేత్తో అందుకుని కుడిచేత్తో లాక్‌చేసి గిర్రున తిరుగుతూ బండి మీద నుంచి దిగుతాడు. ఒకొక్కసారి ఆ గోడకి ఉన్న కిటికిలోనుంచి మాంచి మసాలా వాసనలు, లేదు తాళింపుల ఘాటు అతనికి అహ్వానం పలుకుతాయి.  కిటికి ఉన్న గోడకి అవతలి వైపు వంట గది.  అందులో సింవాచలం అతని ఆడలేడిసుంటారు. ఆ ఆడలేడిసు గొంతుని ఎప్పుడు హేమాంబరధర రావు విన్నది లేదు.  కాని ఒకొక్కరోజు ఆ గరిటేలు, గిన్నేలు, పళ్లేలు చేసే శబ్దాని బట్టి ఆడలేడిసు సింవాచలంకి ఏంచెబుతున్నారనేది అర్ధం అయ్యేది.  ఆ వంట గది ఆనుకుని ఒక చిన్న గది.  ఆ గదికి ఆనుకుని లిఫ్టు.  ఆ లిప్టుని అల్లుకుంటు పైకి సాగిపొయ్యే మెట్లు.  ఆ మెట్ల క్రింద ఇస్త్రీ బల్ల.  ఆ పార్కింగ్ లాట్‌కి ఏం ఖర్మ మొత్తం ఆ భవంతికే అది కమాండ్ సెంటర్.  సింవాచలం దానికి అధికారి.  పాలు, పళ్ళు, కొరియర్లు, కరెంటు వాళ్ళు, డైనేజి వాళ్ళు, వాటర్ వాళ్ళూ, ఒక్కరేమిటి ఆ భవంతి యజమానితో సహా అందరికి సింవాచలం అక్కడే కనిపిస్తాడు..కలుస్తాడు..చూస్తాడు..మాట్లాడతాడు.

కాని ఆ రోజు సింవాచలం గేటు దగ్గిరే కనపడ్డాడు.  కాని హేమాంబరధర రావు తన యూనికార్ణ్ ని పార్క్ చేసేటప్పుడు అన్నాడు.  “సారు గారు..మీ బండి ని కాస్త ఆ ఎదర పార్క్ చేసుకోండి” అని.  హేమాంబరధర రావుకి అర్ధం కాలేదు ముందు.  అర్ధం ఐన తరువాత ఎందుకన్నట్టు ప్రశ్నార్ధకంగా చూసాడు.  సింవాచలం చిరునవ్వు నవ్వుతూ ” మా బండి వస్తోంది సారు.  మా అబ్బాయి కూడా బైకు కొనుక్కున్నాడండి” అని అన్నాడు.  అతని మాటల్లో అహంకారం కాని మరే కారం లేదు. నేను కూడ మీ అంతస్థుకి ఎదిగాను అని చెప్పక చెప్పడం తప్ప.

హేమాంబరధర రావు మొఖం ఒక్క క్షణం కళ తప్పింది.  అకవుంట్స్ మనిషి కదా! కనపడనీయకుండా నవ్వేసి బండి ని దాదాపు కమాండ్ సెంటర్ దగ్గిరకి తీసుకువెళ్ళి పార్క్ చేసి వెనక్కి తిరిగి సింవాచలం వైపు “చాలా?” అన్నట్టు చూసాడు.  చాలు సార్ అని అనకుండానే మొఖంతో తన అభిప్రాయాన్ని పలికించాడు సింవాచలం.

ఇది జరిగిన మూడో నెలకల్లా మూడవ అంతస్థులోని రెండవ పోర్షన్ ఖాళీ ఐయ్యింది.  అందులోనే హేమాంబరధర రావు ఉండేవాడు.

#ghatana

2 Replies to “పదండి ముందుకు..”

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.