కతల గంప – స వెం రమేశ్

ఇప్పుడే అందింది.  రమేశ్ పంపాడు.
ముఖచిత్రం చూస్తే ‘రయికముడి ఎరగని బతుకు’ (భూమిక, డిసెంబరు 2012) గుర్తు వచ్చింది.
అట్టమీద బొమ్మ వేసింది బి కిరణ్ కుమారి.  బాగుంది.  చూడగానే చేతిలోకి పుస్తకాన్ని తీసుకుని చదవాలనిపిస్తుంది…రమేశ్ ఎవరో,  రమేశ్ కతలేమిటో తెలియని వారికి కూడా!
ఆ నలుపు, తెలుపు రంగులలో ఒక అందం ఉంది.

పుస్తకం వెనుక తిప్పిచూస్తే…కొన్ని స్కెచెస్ ఉన్నాయి.  నలుపులో తెలుపు. అక్షరాలు కూడా తెలుపులో.
ఆ అక్షరాలతో మనం కూడ పరుగెడతాం!

రమేశ్ కళ్ళెదుట నిలిచిన కల లో కొన్ని మాటలు:
మళ్ళా ‘కతలమ్మో కతలు’ అనే నా గొంతు తెరువులో ఉలివింది.
తిరిగినాను, తిరిగినాను, తెరువంతా తిరిగినాను.  అది బాగా రూకలుండే తెరువే.  అంతకు ముందు నా కతల్ని అబ్బురంగా తీసుకున్నవాళ్ళు ఉండే తెరువే.  కాని నా కతలు వెలపోలేదు.
. . .
ఒక్కటీ నచ్చలేదు వాళ్లకు, ఒక్కటీ కతగా తోచలేదు వాళ్ళకు.
. . .
నాకు దిగులు కలిగింది.
. . .
అప్పుడు తిరుపతి ఉమన్న చెప్పినాడు, ‘పెద్దతెరువులోనే బండిని తిప్పితే ఎట్టాసామీ, సన్న సందుల్లో కూడా మణుసులు ఉంటారు.  అక్కడకూడ కతలంటే ఊపిరిచ్చేవాళ్ళు ఉంటారు.  ఒకసారి ఆ తట్టుకు పోయిరా పో’ అని.

పుస్తకాన్ని పూదోట శౌరీలు, మల్లవరపు విజయమరియదాస్ లకు అంకితం ఇచ్చాడు రమేశ్.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/KathalaGampaBySaVeMRamesh_Anil_Atluri13thDec2014.jpg?w=808" alt=" kathala gaMpa" originalw="808" width="225" height="300" scale="2">
కతల గంప – తెలుగు కతలు కతకుడు స. వెం రమేశ్

పుస్తకం లో ఉన్న కతలు వాటి క్రమం:

తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప
మీసర వాన
ఊడల్లేని మర్రి
పదిమందికి పెట్టే పడసాల
ఆ అడివంచు పల్లె
కాకికి కడవడు పిచిక్కి పిడికిడు
రయికముడి ఎరగని బతుకు
చెట్లు చెప్పిన కత
సిడిమొ‌యిలు
బడకొడితి
వాడు గోపాలకృష్ణ కొటాయి
ఒంటినిట్టాడి గుడిసె
ఎందుండి వస్తీవి తుమ్మీదా
అబ్బిళింత
కతలగంప
మాదిగపుటక కాదు
మొ‌యిలు నొగులు
పాంచాలమ్మ పాట

ప్రతి కథ చివర అందులో తను వాడిన కొన్ని పదాలకి…మీకు, మీకేంటి నాకు కూడ అర్ధం అయ్యే తెలుగు పదాల అర్ధం ఇచ్చాడు.

ప్రతులకు మీరు పుస్తకం ధర రెండు వందలు పంపవలసింది ఇక్కడికి:
1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180
ఫోను: +91 90101 53505

గమనిక  పుస్తకంలో  ప్రతులకు “అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు” అని ఉన్నా  అవి ఈ విషాదాంధ్రలో కాని, ప్రజాశ్రేయస్సులో కాని దొరుకుతాయన్న నమ్మకం లేదు.  కాబట్టి పై ప్రచురణకర్తలకి రొక్కం పంపండి.  అనుమానాలుంటే వారికి ఫోను చెయ్యండి.  చెబుతారు మీకు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో.  వీలైతే వాళ్ళకి కొరియరు / పోస్ట్ ఖర్చులు పంపండి.  మరో పుస్తకం వాళ్ళు ప్రచురిస్తే మనకి మరో పుస్తకం అందుబాటులోకి వస్తుంది మరి!

డేంజరస్ కథకుడు

నిండా డేంజరస్ మనుషులుండారు ఈ ప్రపంచంలో. అతి ప్రమాదకారులు వీరు.  మాటలతో మనల్ని మాయజేస్తారు.  ఇదిగో అంటారు.  అదిగో అంటారు.  వీళ్ళు మన నోటికి వినిపిస్తారు.  చెవులకి చూపిస్తారు. చొంగ కారుతుంటుంది ఒక పక్క. చేతులూపుకుంటూ, కళ్ళు తెరుచుకుని వాళ్ల మాయమాటల దారెంట వెళ్ళిపోయి వాళ్ళు చూపించే ఆ మరో ప్రపంచాన్ని కంటాం! చిన్నపిల్లల్లగా!!

Sa Vem Ramesh
సా వెం రమేశ్

డబల్ ఢమాకా అంటారనుకుంటా..ఒక కథతో మొదలుపెడతాడు, మరో కథ మొదలుపెడతాడు.  వాటి చుట్టూ మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు.  ఆ మూడింటీతో పాటు మరో కొత్త అంశం ప్రవేశపెడతాడు. త్రీ డి అంటారే.  అలా! కళ్ళు తిరుగుతాయి.  ఆ సుడిగుండంలో పడిపోతాం.  గిరా గిరా తిరుగుతాం,  పడి కొట్టుకుపోతాం.  మన లోపలికి నీళ్ళేళ్ళిపోతాయి. మరో కొత్త భాష! మరో కొత్త కోణం.  మరో కొత్త మూలం అవిష్కరింపజేస్తాడు.  ఎక్కడో తెల్తాం.  అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది..కాని ఉండలేం కదా! ఒక జీవితం ఉంది కదా?  ఒక జీవనం చెయ్యాలి కదా?  ఒక జీవిక కావాలి కదా?

కాని అతనికి అదే జీవితం, అదే జీవనం, అదే జీవిక అయ్యింది. సిగ్గు ఎవరికి ఉండాలో మరి?

భగ, భగా, ధగ ధగా మెరుస్తూ కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంది., సిడిమొయిలు.  అలాంటి లోకం ఒకటి ఉందా?  తెలుసుకోవాలంటే వివరాలకు కథ 2013 ని కొనుక్కుని చదువుకోండి! కథకి అద్భుతమైన బొమ్మ గీసినవారు ఏలే లక్షణ్.

sidimoyilu katha
Illustraton by Lakshman Aelay