మో “బ్రతికిన క్షణాలు” లో కొన్ని..

ఆరేళ్ళో అరవై ఏళ్ళో బ్రతుకుతాం.  ఆరేళ్ళముందెలా పుట్టామో ఎవడికి తెలీదు.  అరవై తర్వాత ఎలా చస్తామో మనకి తెలీదు.  తీసుకు తీసుకుని తడిసిన నులక మంచానికి తప్ప ఆరు నుంచి అరవైదాక ఈలోపల బేరామాడ్తాం. చివరకు గిట్టుబాటవుతుంది తప్పక.

ఒకే కవితకు ఆరు అర్థాలు ఒస్తాయని ఒకడు అమ్మ చూపుతాడు.  ఆరూ అనర్థాలే.  అసలు అర్థం అమ్మేవాడికే తెలీదు. కొనేవాడు నూరర్థాలు అడుగుతాడు – ఓ శతాధిక గ్రంధకర్తని.  శతపత్ర సుందరిని అరవై ఏళ్ళ ఆంధ్ర కవిత్వాన్ని ఆరు రూపాయలకే అచ్చెయ్యమంటాడు అరసున్నాలకి అమ్ముడు పోయేవాడు.

మో వీటిని ‘పద మూర్చన’ లన్నాడు. చచ్చిన తర్వాత చెప్పే మొదటి మాటలంట!  పైగా అంటాడు..”వాస్తవాన్ని అధివాస్తవికంగా మలుచుకునే ప్రయత్నంలో వచనం విరిగి ముక్కలయ్యి ఆ గాజు పెంకులు పద్యానికి గుచ్చుకొంటాయి”ట.

“ప్రతి నేనుకి ఒక మేనుంటుంది.  నేను లోంచి మేము, మనం అవటానికే ఏ రచన అయినా.  తారీఖులూ, దస్తావేజులూ ఏమిలేని అనామక స్వీయ జీవన చిత్రణ ఈ ‘బతికిన క్షణాలు‌’.  దృశ్యం అదృశ్యంగాను శబ్దం నిశ్శబ్దంగానూ రంగులు పులుముకుని మాటలుగా మ్రోగుతాయ్.

అంతాలో ఎంతో కొంత యిది.

ఎక్కువ మాట్లాడే వాడు ఏది చెప్పడు.

నిశ్శబ్ద క్షణంలో శాశ్వత శబ్దాన్ని పట్టుకోవాలని

ఈ నూత్న యత్నం”.

వెతకండి..ఎక్కడన్నా దొరికితే, దొరకబుచ్చుకుని చదవండి. చదివి ఆ “బతికిన క్షణాలు” మళ్ళీ బతకడానికి ప్రయత్నించండి.

ఎందుకంటే “మో” ఆ “బతికిన క్షణాలు” అన్నింటిని ఐదు వందల ప్రతులకి మాత్రమే పరిమితం చేసాడు..అది ఒక దశాబ్దం క్రితం!

మో “బ్రతికిన క్షణాలు” తొలి ముద్రణ 1990 – మలి ముద్రణ  2000

అశాశ్వత సత్యం; శాశ్వతం

కవిత నుండి కొన్ని పంక్తులు:

ఎన్ని బాడిలు అన్ని జన్మలు ఎన్నిక్షణాలు

నిల్చి సాగి తూలి జారి రాలి

నిలూనా చీలుస్తాయి నిన్నూ నన్నూ

రక్తాక్షరాలలో ఏ కవి రాసుకుంటాడు ఎన్నని

ఇన్ని సత్యాల్ని ఇన్ని ప్రేగుల్ని

బొమికెల్ని చర్మపు నునుపుల్ని

సౌందర్యపుటుంగరాల్ని కేశపాశపు మోహపు మెలికల్ని

మమతా మైత్రి పాశాలెన్నని తెంచుకుంటాడు

ఎన్ని రంగుల్ని ఉడుపుల్నిఒల్చుకుంటాడు

ఆయాసంతో

ఏ అసఫలీకృత కాంక్షల్ని

పాపం! ఎన్నిటినని పేర్చుకుంటాడు

దేహం గొప్పది దేహమే గొప్పదనకుండా!

ఆత్మలేదు

శరీరం అనాత్మ.

 చితిచింత లోని ఒక కవితలోని పై పంక్తులు “మో” వి.

మో ఇక లేరు.

‘మో’ ఎవరు?

అని నిన్న నన్నొకరు అడిగారు.

ఎక్కడ?

రవీంద్రభారతి, భాగ్యనగరం.

సందర్భం:

తనికెళ్ళ భరణి సాహితి పురస్కార ప్రదానం.

కూర్చోడానికి ఖాళీ కుర్చీ కనపడక అడిగినట్టున్నాడు.  అడిగిందెవరా అని వెనక్కి తిరిగి చూసాను.  కళ్ళజోడు. నెరిసిన జుత్తు. “సభ మొదలైన తరువాత తెలుస్తుందండి మీకు”, అని  మళ్ళీ నా దృష్టిని వేదిక మీదకి సారించాను.

అవధానం జరుగుతున్నది. అప్రస్తుత ప్రశ్న ; ” అత్యంత లోభి కూడ దానం చెయ్యలేనిది ఏది?”.  అవధాని గారు జవాబిచ్చే లోపే, నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ” కాలధర్మం” అని ఘొల్లుమన్నారు.

అధ్యక్షుడు సి. నారాయణ రెడ్డి గారు, నిషాదం అంటే సంగీతంలో సప్తమ స్వరం అని  వివరిస్తూ.. మో పుస్తకం నిషాదం చదవడం మొదలుపెట్టినప్పుడు..”ఏమో‌” అని అనుకున్నానని కాని “అమ్మో” అని అనిపిస్తుందని అన్నారు.

గవర్నమెంట్ ఎలిమెంటరి స్కూల్ళో చదువుకున్న తనకు, “మో‌” నిషాదం మీద మాట్లాడేంత పరిజ్ఞానం లేదని, నటుడు భరణి ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేసారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య.

ఇక తెలుగు భాష బోధకుడిగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, చలన చిత్ర నటుడుగా బ్రహ్మాండంగా సాగిపోతున్న బ్రహ్మానందం,

“అది గది

దాని అద్దె పది”

అనే కవితలోస్తూన ఈ రోజుల్లో, మో నిషాదం చదివి, అర్ధం చేసుకుని, జీర్ణం చేసుకునే అవకాశం ఆ భగవంతుడు తనకివ్వలేదని, తన ఫేసుకి ఆయన ఒక స్టఫ్ ని ఇచ్చి ప్రజలని రంజింపజెయ్యమన్నాడని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులతో పాటూ గా కూర్చోవలసిన తనను, వేదిక మీద కూర్చోపెట్టిన భరణి, తన అభిమానాన్ని చాటుకున్నాడే కాని తనకి ఆ అర్హత లేదని, వినమ్రంగా విన్నవించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘మో‌’ మీద కోపం వచ్చింది.  ఔను, దర్శకుడు శ్రీనివాసే! ‘మో‌’ చదివినంత తను చదవలేదు కాబట్టి, తన కోపం.  ఆ కోపంతో ఆ సాహిత్యం అంతా చదివేస్తానంటాడియన.  అసలు తనకి రవింద్ర భారతి కార్ పార్కింగ్‌లో నిలబడే అర్హత కూడా లేదని కాని భరణి మాట తీసెయ్యలేక వేదిక మీద దాక్కోడం కుదరక కూర్చున్నాని నవ్వుల మధ్య చెప్పాడు.

న్యాయనిర్ణేతలు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆచార్య మృణాళిని, కవి శివారెడ్డి.  తాము ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కవితా సంపుటి “నిషాదం” అని తమకు అందిన 108 కవితా సంపుటాలలో దానిని ఎన్నుకోవడానికి గల కొన్ని కారణాలని వివరించారు, కవి శివారెడ్డి.

తనికెళ్ళ భరణి, చక్కని చామరం క్రింద ‘మో‌’ అని  మనం పిలుచుకునే వేగుంట మోహన ప్రసాద్ ని సుఖాసీనుడిని చేసి, వేద పండితుల మంత్రోచ్హారణల మధ్య  స్వర్ణ పుష్పాభిషేకం చేసారు. వేదికనలంకరించిన పెద్దలలో చలన చిత్ర కథకులు, సంభాషణ కర్త పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వేంకటేశ్వర రావు గారితో సహా అందరూ ‘‌మో’ కి తమ శుభాకాంక్షలు అందజేసారు.

‘మో‌’ తన దైన శైలిలో..ముందే వ్రాసుకుని తెచ్చుకున్న పాఠం నుంచి కొంత మేరకు చదివి వినిపించారు.

బర్త్ డే బాయ్ భరణికి కొంత మంది మిత్రులు తమ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.

జాతీయ గీతం జనగణ మణతో సభ ముగిసింది.

ఎటువంటి హడావిడి లేకుండా, వెకిలి ప్రసంగాలు, అనవసరపు డప్పాలు లేకుండా సాఫీగా, హాయిగా జరిగిన గొప్ప సాహిత్య సభ ఇది.  తెలుగు కవి కి తెలుగు కవిత్వానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ రోజులకి ఇది తొలి రోజు మాత్రమే.

భరణి తన మాటల్లో చెప్పిన “గద్వాల్ సంస్థానం వారి ఆచారం” మళ్ళీ మొదలవ్వాలని..తెలుగు భాష బ్రతకడానికి ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు విరివిగా జరగాలని మనమందరం కోరుకోవాలి.

వీలైతే ‘మో‌’ ప్రసగం పూర్తి పాఠం, అలాగే మితృడు నరేశ్ నున్న ‘మో‌’ మీద వ్రాసి, అచ్చొత్తంచి, ఉచితంగా పంచిన ఒక చిన్న పుస్తకాన్ని మీకు ఇక్కడ అందించడానికి ప్రయత్నిస్తాను.

ఈ తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం జరిగినది కళా ఫౌండేషన్ ఆధ్యర్యంలో..కనకధార వెంచర్స్ సహాయంతో..

కినిగె.కాం లో

తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ  ..  ‘మో’ నిషాదం ఇక్కడ  లభ్యం.