దెయ్యాల వంతెన

Devils' bridge

వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలని కాలువ వైపుకి తోలాడు. ఊళ్ళో వాళ్ళెవరూ ఆ కాలువ, ఆ వంతెన వైపుకి చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయెటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మఱ్ఱిచెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన తరువాత ఆ వంతెన మీదుగా ఆ కాలువని దాటి ఏ ప్రాణి అయినా ఆ మఱ్ఱిచెట్టు కిందగా వెళ్తే దాని మీదున్న దయ్యాలు చంపేసి, రక్తం తాగి, శవాన్ని ఆ కాలువలో పడేస్తాయన్న కధని తరతరాలుగా ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటు ఉంటారు.

కాని గోపాలుడు మేకలని తొందరగా ఇంటికి చేర్చాలనే ఆలోచనలో ఉండి, ఆ మఱ్ఱిచెట్టు కిందుగా వెళ్ళి, ఆ కాలువ వంతెన మీదుగా దాటిస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోయింది. మఱ్ఱిచెట్టు భయంకరమైన దయ్యంలాగా కనబడుతోంది. గాలి విసురుగా తగుల్తోంది. మేకలన్ని పరిగెడుతున్నాయి. ఆఖరు మేక వంతెన దాటి గట్టు మీదకి చేరింది. దాని వెనకే గోపాలుడు కుడి కాలు మోపాడు. ఎడం కాలు ముందుకు తీసుకుని అడుగు వేస్తున్నాడు… వేసేశాడు. ఇప్పుడు కాలువకి ఇవతలి గట్టు మీదున్నాడు. పేద్ద శబ్దం చేస్తూ వంతెన ముక్కలు, ముక్కలుగా విరిగిపోయి, ఆ కాలువలోకి భళ్ళున పడిపోయింది. భయంతో మేకలన్నీ ఇంటి వైపు పరుగెట్టడం మొదలు బెట్టినవి. పరుగో, పరుగు, ఒకటే పరుగు. ఆగితే దయ్యాలు తమని కూడా పట్టుకుంటాయని భయం.

సరిగ్గా అప్పుడే గోపాలుడికి భయంతో ఏడుస్తున్న మేక పిల్ల అరుపు వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు గోపాలుడు. ఆ కమ్ముకుంటున్న చీకట్లో అవతలి గట్టు మీద కనపడింది మేక పిల్ల. అది ‘మే… మే” అని భయంతో ఏడుస్తోంది. ఎర్రటి కళ్లతో దాని పీకని పట్టుకుని కనపడింది దయ్యం. చూడటానికే భయంకరంగా ఉంది ఆ దయ్యం.

“దాన్ని వదిలేయి, దయ్యమా. నువ్వేది అడిగితే అది ఇస్తాను, ” అని గోపాలుడు ఆ దయ్యాన్ని అడిగాడు. ఇవ్వను అన్నట్టుగా తలని అడ్డంగా అటూ, ఇటూ తిప్పింది దయ్యం.

గోపాలుడు మోకాళ్ళ మీద మోకరిల్లి, రెండు చేతులు కలిపి దణ్ణం పెడుతూ, “దయ్యం, దయ్యం దయచేసి నా మేకపిల్లని వదిలెయ్యవా?” అని మళ్ళీ అడిగాడు.

అప్పుడు దయ్యం, “సరే, వదిలేస్తాను. మరీ ఈ మేకపిల్ల నీ దగ్గిరకు ఎలా వస్తుంది?” అని అడిగింది.

గోపాలుడుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేసాడు. అప్పుడు దయ్యం “నువ్వు ఒప్పుకుంటే ఒక షరతు మీద ఈ మేక పిల్లని వదిలేస్తాను,” అని అంది.

“ఏమిటా షరతు?” అని అడిగాడు గోపాలుడు.

“నువ్వు రేపు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సరికొత్త వంతెన ఏర్పాటు చేస్తాను. కానీ…”.

“ఊ…కానీ..నేను ఏం చెయ్యాలో చెప్పు,” అని ఆదుర్దాగా అడిగాడు గోపాలుడు.

“ఆ వంతెన మీదుగా దాటి వచ్చిన మొదటి ప్రాణిని నాకు బలి ఇవ్వాలి,” అని అంది ఆ దయ్యం.

“ఆ…?” అని ఆలోచనలో పడ్డాడు గోపాలుడు.

“నువ్వు ఒప్పుకోకపోతే ఈ మేకపిల్లని ఇప్పుడే చంపేస్తాను. రేపు ఆ వంతెన కూడా ఉండదు,” అని అంది ఆ భయంకరమైన దయ్యం.

“వద్దు, ఆ మేకపిల్లని చంపకు. నువ్వు చెప్పింది నాకు అంగీకారమే. అలాగే చేస్తాను, ” అని అన్నాడు గోపాలుడు.

మరుసటి రోజు ఉదయం, తన సద్దిమూటతో మేకలని తోలుకుంటూ కాలువ దగ్గిరకి బయలుదేరాడు గోపాలుడు. ఆశ్చర్యం! కాలువ మీద కట్టెలతో కట్టిన సరికొత్త వంతెన సిద్దంగా ఉంది అక్కడ. కాలువ అవతల గట్టున వంతెన దగ్గిర దయ్యం నిలబడి ఉంది. కాలువ ఇవతల గట్టున, వంతెనకి ఇవతల గోపాలుడు, అతని వెనకే మేకలు. ఆ మేకలతో పాటు ఒక గజ్జి కుక్క. మేకలని గట్టు మీదే ఉండమని చెప్పి, తను ఆ వంతెన మీద కాలు బెట్టి గట్టిగా ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఈ లోపు దయ్యానికి తనకి ఉన్న ఒప్పందం గుర్తు వచ్చింది. అందుకని వంతెన మీద కాలుపెట్టకుండా ఇవతలే నిలబడ్డాడు.

భుజానికి ఉన్న సద్ది మూటని విప్పాడు. అందులో నుంచి తను విడిగా పెట్టుకున్న మాంసం ముక్కని బయటికి తీసాడు. తన మేకలతో పాటే వచ్చిన గజ్జి కుక్కకి దాన్ని వాసన చూపించాడు. తన బలం అంతా వినియోగిస్తూ కుడి చేత్తో ఆ మాంసం ముక్కని వంతెన మీదుగా దయ్యం నిలబడి ఉన్న గట్టు మీదకి విసిరాడు. ఆ మాంసం ముక్క అవతల గట్టు మీద పడేలోపు, గజ్జి కుక్క ఆ కాలువ మీదున్న వంతెన మీదుగా అటు వైపుకి దూకింది. అటు దూకడేమేమిటి, ఆ గట్టు మీద పడ్డ మాంసం ముక్కని నోటితో పట్టుకోవడం కూడా అయిపోయింది.

ఇదంతా చూస్తున్న దయ్యం ఆశ్చర్యంతో నిర్ఘాంత పోయింది. దాని పక్కనే ఉన్న మేకపిల్ల దయ్యం పట్టు విదిలించుకుని ఆ గట్టునుంచి ఇటు గట్టు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోపాలుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ దయ్యం వైపు చూశాడు.

దయ్యం బూడిదగా మారి కుప్పగా కూలిపోయింది.

ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మర్రిచెట్టు పైనకాని ఆ కాలువ గట్టున కానీ దయ్యాలు మళ్ళీ కనపడలేదు.

* * *
కధ పూర్వపరాలు

2017లో  మా అమ్మాయి, అల్లుడు తో కలిసి కొంత కాలం గదుపుదామని స్కాట్ లాండ్ వెళ్ళాను.  వాళ్ళింట్లో వాళ్లుంటున్న ఎడిన్ బరో నగర పురాతన చరిత్ర గురించిన ఒక పుస్తకం కూడా ఉంది.  ఎడిన్ బరో నగరంలో ఉన్న శిలా స్థూపాలు, ప్రతిమల గురించి కూడా కొంత వ్రాసి ఉంది.  సెల్టిక్ కధల ప్రస్తావన వచ్చినప్పుడు జాలంలో కొన్ని కధలు చదివినప్పుడు వచ్చిన ఆలోచన ఇది.  కధ వ్రాయడం మొదలుపెట్టిన తరువాత, ‘చిన్న పిల్లల కధ’ గా తయారయింది అనిపించింది. అప్పుడే చిన్న పిల్లలకి కూడా ఒక కధ వ్రాసానని, బాల సాహిత్యంలో కూడా వేలు పెట్టానని చెప్పుకోవచ్చు కదా అనిపించింది.  దాంతో చిన్న పిల్లలకి కధలాగానే వ్రాసేసాను.  చిన్న పిల్లల కధ గా రూపు దిద్దుకుంటునప్పుడు, పిల్లలకి దెయ్యలూ, భూతాలు, దేవుళ్ళు, దేవతలు  (నేను నమ్మనివి) హేతువాదానికి, తర్కానికి నిలబడనివి, హింసని చూపించేవి ఎంత వరకు సబబు అని కూడా అనిపించింది.  కానీ చందమామలో భేతాళ కధలు చదివిన నేను బాగానే ఉన్నానుకదా, నా పిల్లలూ బాగానే ఉన్నారు కదా , అని అనుకుని… దెయ్యాన్ని అలాగే ఉంచేసాను.  ఇక ప్రచురణకి పంపాలనుకున్నప్పుడు ఏ పత్రిక అన్న మీమాంస మొదలైంది.  సాహితీ మిత్రుడొకరు సాక్షిని సూచించారు.  సాక్షి ఫన్ డే కి పంపాను.  వారు ప్రచురించారు.  కాకపోతే కధకి బొమ్మ వేసినవారు పెద్దగా శ్రమ పడకుండా జాలం నుంచి దెయ్యం బొమ్మకి బదులు దొరల మాంత్రీకురాలు బొమ్మని దింపేసి వాడేశారు. 
సాక్షి ఫన్ డే సంపాదకులకి ధన్యవాదాలు.

ప్రచురణానంతరం…
కధ ప్రచురించిన తరువాత నేను పంచుకున్న మిత్రులలో ఒకరు, “నేనైతే పిల్లలకి దెయ్యాల భూతాల కధలు రాయనండి,” అని సున్నితంగా చెప్పారు. 
మరొకరు, “ఇమేజరి అంతా బాగుంది కాని పిల్లలకి దెయ్యం ఎందుకు…ఒక బాడ్ మాన్ తో వ్రాసి ఉండవచ్చు కదా?” అన్నారు. 
అది ఈ కధా నేపధ్యం. చి న
సాంఘిక మాధ్యమాలలో ఇంకా ప్రచురించలేదు.  చూడాలి అక్కడ చదివిన వాళ్ళేమంటారో! 
ద హ
 

పాద సూచి
సాక్షి, ఫన్ డే, ఆదివారం, ఆగస్ట్ 4 న సంచికలో వెలువడ్డ కధ పూర్తి పాఠం ఇక్కడ  (image)
Text link here.

 

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on whatsapp
WhatsApp
Share on email
Email

కథ 2014 … మరో ముగ్గురు కథకులు

katha 2014 book launch invitation

కథ 2014 కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది.  ఈ పాతిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెలువడింది.  కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో.  కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ.  ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి.  ఆ అధ్యక్షుల వారిది తెనాలి.  పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.

ఇక ఆ ముగ్గురు కథకులు ఎవరో చూద్దాం.

Author Patanjalisastry
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి తొలి కథ సీతన్న తాట.  ఇది 1962 లో ఆంధ్రప్రభ వారు ప్రచురించారు.  వీరి ఇతర కథలు, నవలలు గురించిన వివరాలు కథానిలయంలో
ఇక్కడ తెలుసుకోవచ్చు.

వాల్ పోస్టర్, సర్మా, గారడీ, రామేశ్వరం కాకులు ఇదివరలో ఆయా కథ వార్షిక సంకలనాలలో ప్రచురించారు.

వీటిలో వేదిక లో రామేశ్వరం కాకులు మీద చర్చ జరిగింది. ఆ కధని ఇక్కడ చదువుకోవచ్చు.

అద్దేపల్లి ప్రభు, కాకినాడ వాస్తవ్యులు.  వీరి తొలి కధ విలువలు 1984 లో అరుణతార మాస పత్రికలో వెలువడింది. వారి ఇతర సాహిత్యం కథానిలయంలో ఇక్కడ చూడండి.

     

Sunil Kumar P V - Author

1986 స్వాతి వార పత్రికలో ప్రచురించిన మూషికార్జునీయం కథకులు పి విసునీల్ కుమార్. లఘుచిత్రం గా వెలుగుచూసిన కథ దెయ్యం వీరిదే.  వేదిక లో వీరి తోక దెయ్యం చెప్పిన డిసిప్లి మీద 2015 మే నెలలో చర్చించుకున్నారు.   ఆ కథని ఇక్కడ చదువుకోవచ్చు.

వీరు ముగ్గురూ, నిన్న ముగ్గురు కధకులు మాత్రమే కాదు.  ఇంకా ఉన్నారండి.  వారిలో మరో ముగ్గురు కధకులని మీకు రేఫు పరిచయం చేస్తాను.

రానున్న ఆదివారం, సెప్టెంబరు 20, 2015 న తెనాలిలో  జరగనున్న ఆవిష్కరణ సభకి ఇదిగో ఆహ్వానం.katha 2014 book launch invitation