పబ్లిక్కుగా బాగానే జరిగింది..ఐనా

ఏదో వెలితి.

తలిశెట్టి రామారావు గారి పేరు విన్నారా?
లేదా?

The first Telugu Cartoonist Talisetty Ramarao

ఆ మహాను భావుడే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు (అంటే కార్టూనిస్ట్) అని తెలుగు వ్యంగ చిత్రకారులు నిర్ణయించేసారు.  పబ్లిక్కుగానే.  ప్రసార మాధ్యమాలకి ప్రకటనలు, పత్రికలలో వ్రాతలు వగైరా అన్ని ఐపోయినవి. ఆయనే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు అని వూరుకున్నారా?  లేదు.  ఆయన పుట్టిన మే 20వ తారీఖుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవం గా కూడా నిర్ణయించేసారు.  పబ్లిక్కుగానే.  అలా అనేసి వూరుకున్నారా?  లేదు. ప్రకటించేసారు! ఎలా? పబ్లిక్కుగానే.  ప్రసారమాధ్యమాల వారందరూ కూడ తమ తమ శ్రోతలకి, పాఠకులకి, వీక్షకులకి, ఇతరులకి ఆ వార్తని బట్వాడా చేసేసారు.  ప్లబిక్కుగానే ఇదంతా!

పైగా ఈ తెలుగు ఈ వ్యంగ చిత్రకారులందరూ కలిసి, ఆయన..ఎవరూ? ఆ తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడి పేరు మీద ఒక “తలిశెట్టి రామారావు అవార్డు కార్టూన్‌ ల పోటి” ని కూడా ఘనంగా నిర్వహించారు.  పబ్లిక్కుగానే నండీ!  బహుమతులిచ్చారు ఆ పోటీలలో. పబ్లిక్కు గానే!  ఎవరు ఇచ్చారండి బహుమతులు. తనికెళ్ల భరణి..చలనచిత్ర వ్యంగ నటుడు (అందామా)!  ఎక్కడ? భాగ్యనగరం లోనే!ఎప్పుడూ?  ఆ తేదినే!  మే 20వ తారీఖునే!! అది కూడ పబ్లిక్కుగానే.  పబ్లికే కదండీ నేను, అందుకనే హాజరయ్యానండి, దానికి కూడా!

Tanekella Bharani, MVR Sastry, Sanku on dais and Sudhama at the podium

అయ్యా అది ఐపోయింది.

మొన్న అంటే, 28 న మొదలుబెట్టి, 29, 30 న కూడ మన కార్టూనిష్టు మిత్రులు కార్టూనోత్సవ్ పబ్లిక్కుగా,పబ్లిక్కుకి అందుబాటులో ఉండే పబ్లిక్ గార్డెన్స్‌లో జరుపుకున్నారు.నరేంద్ర లూథర్ గారు, పొత్తూరి వేంకటేశ్వరావు గారు, మరి కె.వి రమణా చారి గారు లాంటి  పెద్దల సమక్షంలో 30 వ తారిఖున తమ పెద్దలని ఘనంగా సన్మానించుకున్నారు. పబ్లిక్కు గానే నండోయి!

Cartoonotsav 2012, held between 28th and 30th October, 2012 at Public Gardens, Hyderabad.

అందులో ఒక కొత్త ప్రతిపాదన చేసారు.  పబ్క్లిక్ గానే నండి.  అదేమిటంటే, తమకి గురుతుల్యులైన మరో పెద్ద “కార్టూనిష్టు”  పుట్టిన రోజుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవంగా పరిగణించాలని.  వారు ఎంచుకున్న “కార్టూనిష్టు” గారి గురించి ఏ ఒక్కరికి అభ్యంతరంలేదు. వారికి జరగవలసిన సన్మానాలు, పురస్కారాలు భవిష్యత్తు లో చేయవలసిని కార్యక్రమాలు చాలానే ఉంటవి. అటువంటి సందర్భంలో ఇటువంటి “ప్రతిపాదన” ఎంత వరకు సమంజసమన్నదే ప్రశ్న!  పైగా ఆ “గురువు” గారికి అసలు ఈ విషయం తెలుసా అన్న సందేహం కూడా కలుగుతుంది. తెలిసుంటే వారు సున్నితంగా తిరస్కరించే మనస్తత్వమున్నవారే అని కూడా నా బోటి వారి అభిప్రాయం.    ఆ “గురువు” గారే తన “గురువు” గా భావించే మరొ “పెద్ద గురువు” గారు హటాత్తుగా ఆ సభకి వచ్చివుంటే, అప్పుడు గౌరవం వారికే దక్కేదేమో?! పబ్లిక్కుగా అన్నా, అనకపోయీనా నిన్న “కార్టూనోత్సవ్” కి హాజరైన కొంతమంది మిత్రులు ప్రైవేటుగా నాతో తమ అభిప్రాయాన్ని వెల్లడి చేసుకున్నారు.

ఒకరికి తగిలించిన కిరీటాన్ని లాక్కుని మరొకరిని దానిని ధరింపజెయ్యబూనడం ఎంత వరకు సమంజసం?

అందులోను  పబ్లిక్కుగా!

తలిశెట్టి వ్యంగ చిత్రాలు ఇక్కడ కినిగె.కాం లో

అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను!

మొన్నామధ్య ఒక పెద్ద రసపోషకుడిగారిని కలిసాను. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే..దురదుంది కదా..సాహిత్య దురద..పుట్టింది. గోక్కుంటూ అలనాటి భారతి గురించి, ఆ నాటి ఆంధ్రభూమి గురించి, అప్పటి అభ్యుదయ గురించి, ఆ రోజుల్లో కాగడ గురించి. కృష్ణాపత్రిక గురించి, సంవేదన, కళ ఈ నాటి సృజన గురించి ఆయన ఒక పది మాటలు మాట్లాడితే నేను ఒక పదం వొదుల్తు..పుసిక్కిన మిసిమి అని అన్నాను.

Misimi
మిసిమి Misimi One of the finest Telugu literary monthly magazine

ఆయన చాల లాఘవంగా దాన్ని ఒడిసి పట్టుకుని, దాన్నీ తిప్పి మళ్ళీ నా మీదకు వదిలాడు, “మిసిమి..సెక్‌సు పత్రికా అది..దాని పేరు వినలేదే ఎప్పుడూ?!” అంటూ. మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది..అక్కడ నా పక్కన ఉన్నట్టైయితే..మీ అందరి ఆరోగ్య భీమా పధకాలన్నింటిని పరీక్షకి పంపాల్సి వచ్చేది. అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను! టపా కట్టేసి ఉంటే ఇక్కడ ఈ టపా ఉండేది కాదు కదా!

మిసిమి మాస పత్రిక ఇక్కడ లభిస్తుంది.

నాకు దేముడంటే ఇష్టం

“ఏవిటి మాస్టారు..చాలా రోజులకి.  ఎలా ఉన్నారు?”
“బాగానే ఉన్నానండి”.
“ఎలా వున్నవి సాహిత్య సభలు, మీ ఊళ్ళో”.
“బాగానే జరుగుతున్నవి”
“నేను ఇప్పుడు మీ ఊళ్ళోనే ఉన్నాను”
“ఈ రోజున ఫలానా చోట “@#$%‌” వాళ్ళ సభ ఉందంట. అక్కడికి  రారాదు.  మనం అక్కడ కలుసుకుందాం”.

తేనీరు
“నాకు దేముడంటే ఇష్టం”

“నేను రాలేనండి”.
“ఏందుకని?  పండితులున్నారంటకదా?”
“ఉన్నారండి..కాని నాకు దేముడంటే ఇష్టం అండి.”
“ఐతే..”
“వాళ్ళు దేముడ్ని తిడతారండి.  నాకది ఇష్టం ఉండదు.  పనిమాలా వెళ్ళి ఆవన్ని వినడం ఎందుకు?  కలవాలనుకుంటే  నేనే మీదగ్గిరకు వస్తాను. కాసేపు కబుర్లు చెప్పుకుందాం”
“రండి.  ఐతే చక్కగా టీలు తాగుతూ కబర్లు చెప్పుకుందాం”.

మంచి మిత్రుడితో స్నేహాం మరోక శిఖరం చేరింది.

చిల్లర

రెండు పదుల నోట్లు ఇచ్చినప్పుడు  చాకలి..’చిల్లర‌’ అని గొణుకున్నప్పుడు మంగళ రావు దృష్టి బట్టల ఇస్త్రీ లెక్ఖల మీద పడింది.  ఈ లోపు అతను చిల్లర తేవడానికి పూరి పాకలోని గది లోపలికి వెళ్ళాడు.

మూడు షర్ట్లూ.  ఒకొక్క దానికి నాలుగు రూపాయలు. మూడు నాలుగులు పన్నెండు రూపాయలు.  తను ఒక పది రూపాయల నోటు, ఒక రెండు రూపాయల బిళ్ళ ఇస్తే సరి పోయేది అనుకుంటూ, పాంటు జేబులో చెయ్యి పెట్టి చూసుకున్నాడు.  నాణేలు లేవు.  తన దగ్గిర అవి ఉండవు కదా!
రెండు నిముషాలు ఐనవి.

చిల్లర

చాకలి వెతుక్కుంటున్నట్టు న్నాడు.

చిల్లర లేదేమో..ఉంచుకోమని అందామనేలోపు అతను చిల్లరున్న కుడి జేతిని జాపుతూ ముందుకి వచ్చాడు. “ఉంచుకో తరువాత తీసుకుంటాలే,”  అని అంటూ మంగళరావు చెయ్యి జాపాడు. “ఉన్నాయ్ సారు”, అంటూ అతను మూడు నాణేలు మంగళరావు చేతిలో బెట్టాడు.  “నేన్నది చిల్లర..డబ్బులు కాదు”, అంటు మంగళరావు డబ్బు అందుకున్నాడు.లెక్ఖబెట్టకుండానే పాంట్ జేబులోకి వదిలాడు వాటిని.

#ghatana

భారతి

శివయ్య, పద్మావతి కి కలిగిన సంతానమే భారతి.  ఆమె చిన్నప్పుడే తండ్రి తాగుడికి అలవాటు పడి అనారోగ్యం తో చనిపోయాడు.  భారతికి అప్పుడు ఐ దారు ఏళ్లు ఉంటాయేమో.   పద్మావతి కూలీ నాలీ చేసుకుంటూ బ్రతికుని వెళ్ళదీసుకుందామనుకునేది.  ఒంటరి ఆడది.  కడుపు మాడ్చుకోవడం కష్టం గా ఉండేది.  దానికి తోడు పిల్లదాని కడుపు కూడా చూడాలి.  సూరి దృష్టి లో ఆమె పడింది.  మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు వేసిన తప్పటడుగు ఆమె జీవితాన్ని మార్చేసింది.  సూరి చేతులు మార్చుకున్నాడు.  పద్మావతి ఇప్పుడు డబ్బుతో సుఖం కొనుకోవచ్చు అనే ఆలోచనతో డబ్బు వెమ్మట పరిగెత్తడం మొదలయ్యింది.  ఆ క్రమంలో భారతిని నిర్లక్షం చేసింది.

తల్లి చేసిన తప్పులన్నింటిని భారతి చెయ్యలేదు.

(ఈ బొమ్మలోని వ్యక్తి భారతి కాదు)

చదువుకుంది. కాపీలు కొట్టింది. మార్కులు సంపాదించింది. మాల్సుకెళ్ళింది. ఉద్యోగాలు చేస్తూన్న షాపులలోనే దొంగతనాలు చేసింది. బస్సులెక్కింది. మగవాడి బలహీనతతో  ఆడుకోవడం నేర్చింది. స్కూటర్లెక్కింది. బైకులెక్కింది. కారులెక్కింది.  సుఖమయ జీవితాన్ని ప్రేమించింది.  సుఖాలు లేని జీవితాన్ని అసహ్యించుకుంది. లేమిని చూసి భయపడింది.  డబ్బుకోసం వెంపర్లాడింది.  కొత్త అలవాట్లు నేర్చుకుంది.  తన విలువలంటు కొత్త భాష్యాలు చెప్పుకుంది.  వాటినే ఆచరించండం మొదలు పెట్టింది.

బస్ స్టాపులో కనపడింది.  స్టేషన్ ప్లాట్ ఫారం మీద వల విసురుతూ కనపడింది.  చివరకు నా ఆఫీసుకే ఉద్యోగం అంటూ వచ్చింది.  ఉద్యోగం కోసం ఏ పనైనా చేస్తానని నొక్కి వక్కాణించింది.

తాడుని తెగేదాకా లాగింది. కట్టు తెగింది. మరి ఇప్పుడు ఏమయ్యిందో? ఎక్కడుందో?

* ఇది వ్రాస్తున్నప్పుడు..ఓ హెన్రి కథ ది గిల్టీ పార్టీ  లో లిజ్జీ గుర్తోస్తోంది.

పదండి ముందుకు..

హేమాంబరధర రావు కి వివాహమయ్యింది.  భార్య పేరు లక్షీకాంతం.  వారికి ఇద్దరు పిల్లలు.  సుభ్రమణ్యేశ్వ రావు పెద్దవాడు.  రెండవ సంతానం కూతురు. కామాక్షి. వాళ్ళుండేది ఆరంతస్థుల మేడ. అంతస్థుకి నాలుగు పోర్షన్లు.  హేమాంబరధర రావు కుటుంబం ఉండేది మూడవ అంతస్థులోని రెండవ పోర్షను. అది లిఫ్ట్‌కి ఎడంగా ఉంటుంది.  దానికి నెలకి అద్దే ఆరు వేల రూపాయలు. మూడు నెలలు అడ్వాన్సు.  మెయింటనెన్స్‌కి ఒక ఐదువందలు.  సుమారుగా ఒక వెయ్యి రూపాయలు నీళ్ళకి అదనంగా కట్టుకుంటారు.

హేమాంబరధర రావు కి ఒక ద్విచక్రవాహనం ఉంది.  హోండా యూనికార్ణ్.  లక్షీకాంతం కట్నంతో పాటు ఆవిడ తండ్రి దాన్ని కూడా అతనికి సమర్పించుకున్నాడు. లక్షీకాంతానికి కాలేజికి వెళ్ళడానికని ఒక ఆక్టివా స్కూటర్ని కూడ ఆయన కొనిచ్చాడు.  అదికూడా ఆమెతోపాటు హేమాంబధరరావు గూటికి చేరింది. ఇక సుభ్రమణ్యేశ్వ రావుకి ఒక బి‌ఎస్‌ఎ స్పోర్ట్స్ మాడల్ సైకిలూ,  కామాక్షి కి ఒక ఏవన్ వారి లేడిస్ సైకిలు హేమాంబరధర రావు తన జీతం డబ్బులతోనే కొన్నాడు. అన్నట్టు హేమాంబరధర రావు అకవుంట్స్ ఎక్జిక్యూటివ్ గా ఇంపెక్స్ కంపెనిలో ఉద్యోగస్తుడు.  తృప్తి సూపర్ మార్కెట్‌లో లక్షీకాంతం ఫ్లోర్ మేనేజరుగా ఉద్యోగం చేస్తోంది.

ఆ నాలుగు అంతస్థులవారికి గ్రవుండ్ ఫ్లోర్‌లోనే పార్కింగ్.  కొంచెం ఫ్రీగా ఉండటానికి భవంతి ముందు రోడ్డు మీద ఆపుకోవచ్చు కాని ఇరుకైనా  అందులోనే పార్కింగ్ చేసుకోవడం వాళ్ళందరికి అలవాటైపోయింది.  ఈ మధ్య ఎవరో జెనరల్ మోటార్స్ వాడి బీట్ కారుని కూడ కొనుక్కున్నారు.   దాంతో పాటే హ్యుండాయి వారి ఎల్ 10 కూడ ఆ పార్కింగ్‌లోకి చేరింది.  అన్ని పోటీలు పడుతునే ఉన్నవి ఆ పార్కింగ్ లో స్థలం కోసం.

సాయంత్రం పూట హేమాంబరధర రావు ఇంటికి చేరేటప్పడికి ఆరు లేదా ఏడు గంటలవుతుంది.  గేట్లు తెరిచే ఉంటవి.  తన బండి దిగకుండానే లోపలికి పోనిస్తాడు హేమాంబరధర రావు.  ఎడమచేతివైపు గోడకి వారగా ,కిటికి క్రింద బండి దిగకుండానే, ఎడమ పాదంతో సైడ్ స్టాండ్ దింపుతాడు.  అదే వూపులో బండి టాంక్ మీద ఉన్న లంచ్ బాగ్‌ని ఎడమచేత్తో అందుకుని కుడిచేత్తో లాక్‌చేసి గిర్రున తిరుగుతూ బండి మీద నుంచి దిగుతాడు. ఒకొక్కసారి ఆ గోడకి ఉన్న కిటికిలోనుంచి మాంచి మసాలా వాసనలు, లేదు తాళింపుల ఘాటు అతనికి అహ్వానం పలుకుతాయి.  కిటికి ఉన్న గోడకి అవతలి వైపు వంట గది.  అందులో సింవాచలం అతని ఆడలేడిసుంటారు. ఆ ఆడలేడిసు గొంతుని ఎప్పుడు హేమాంబరధర రావు విన్నది లేదు.  కాని ఒకొక్కరోజు ఆ గరిటేలు, గిన్నేలు, పళ్లేలు చేసే శబ్దాని బట్టి ఆడలేడిసు సింవాచలంకి ఏంచెబుతున్నారనేది అర్ధం అయ్యేది.  ఆ వంట గది ఆనుకుని ఒక చిన్న గది.  ఆ గదికి ఆనుకుని లిఫ్టు.  ఆ లిప్టుని అల్లుకుంటు పైకి సాగిపొయ్యే మెట్లు.  ఆ మెట్ల క్రింద ఇస్త్రీ బల్ల.  ఆ పార్కింగ్ లాట్‌కి ఏం ఖర్మ మొత్తం ఆ భవంతికే అది కమాండ్ సెంటర్.  సింవాచలం దానికి అధికారి.  పాలు, పళ్ళు, కొరియర్లు, కరెంటు వాళ్ళు, డైనేజి వాళ్ళు, వాటర్ వాళ్ళూ, ఒక్కరేమిటి ఆ భవంతి యజమానితో సహా అందరికి సింవాచలం అక్కడే కనిపిస్తాడు..కలుస్తాడు..చూస్తాడు..మాట్లాడతాడు.

కాని ఆ రోజు సింవాచలం గేటు దగ్గిరే కనపడ్డాడు.  కాని హేమాంబరధర రావు తన యూనికార్ణ్ ని పార్క్ చేసేటప్పుడు అన్నాడు.  “సారు గారు..మీ బండి ని కాస్త ఆ ఎదర పార్క్ చేసుకోండి” అని.  హేమాంబరధర రావుకి అర్ధం కాలేదు ముందు.  అర్ధం ఐన తరువాత ఎందుకన్నట్టు ప్రశ్నార్ధకంగా చూసాడు.  సింవాచలం చిరునవ్వు నవ్వుతూ ” మా బండి వస్తోంది సారు.  మా అబ్బాయి కూడా బైకు కొనుక్కున్నాడండి” అని అన్నాడు.  అతని మాటల్లో అహంకారం కాని మరే కారం లేదు. నేను కూడ మీ అంతస్థుకి ఎదిగాను అని చెప్పక చెప్పడం తప్ప.

హేమాంబరధర రావు మొఖం ఒక్క క్షణం కళ తప్పింది.  అకవుంట్స్ మనిషి కదా! కనపడనీయకుండా నవ్వేసి బండి ని దాదాపు కమాండ్ సెంటర్ దగ్గిరకి తీసుకువెళ్ళి పార్క్ చేసి వెనక్కి తిరిగి సింవాచలం వైపు “చాలా?” అన్నట్టు చూసాడు.  చాలు సార్ అని అనకుండానే మొఖంతో తన అభిప్రాయాన్ని పలికించాడు సింవాచలం.

ఇది జరిగిన మూడో నెలకల్లా మూడవ అంతస్థులోని రెండవ పోర్షన్ ఖాళీ ఐయ్యింది.  అందులోనే హేమాంబరధర రావు ఉండేవాడు.

#ghatana