చెప్పండయ్యా! చెప్పండి! అమ్మాలారా చెప్పండి! బంగారు తల్లూలారా చెప్పండి!!

మీ సర్వెంట్ మెయిడ్‌కి, రిక్షా అంకుల్‌కి, బెగ్గర్ అంకులుకి, మిల్క్‌మాన్‌కి, గాసబ్బాయికి, పేపర్‌బోయికి, పూలమ్మికి, వాచీమేన్‌కి, అతని పెళ్ళానికి,  వాళ్ళ బాబులకి, అమ్మలకి, టైర్ పంక్చరోడికి, మిఠాయోడికి, సోడాఅబ్బికి..అందరికి చెప్పండి.  చెవులు తూట్లూ పడేలాగా చెప్పండి.  పాకి వాడికి చెప్పండి.
కమ్మాడికి చెప్పండి.
కూలోడికి చెప్పండి.
కాపోడికి చెప్పండి.
బెపనాడినికి చెప్పండి.
రాజుకి చెప్పండి.
మాదిగోడికి చెప్పండి.
మాలోడికి చెప్పండి.

Use NOTA for Voting
ఈ బొమ్మ మీద హాక్కులు ఎవరివో వారివే. అంతేకాదు అవి నావి కాదు. ఇక్కడీ బొమ్మ తీసెయ్యమంటే తీసేస్తాను.

రెడ్డి కి చెప్పండి.
మతంపుచ్చుకున్నవాడికి చెప్పండి.
పుచ్చుకోని వాడికి చెప్పండి.
రిక్షావోడికి చెప్పండి.
జట్కావోడికి చెప్పండి.
పూలోడికి చెప్పండి.
నల్లోడికి చెప్పండి.
ఎర్రోడికి చెప్పండి.
గుడ్డోడికి చెప్పండి.
కుంటోడికి చెప్పండి.
చెవిటోడికి చెప్పండి.
పొట్టొడికి చెప్పండి.
పొడుగోడికి చెప్పండి.
తాగిన వాడికి చెప్పండి.
తాగని వాడికి చెప్పండి.
సాలీకి చెప్పండి.
సాయిబుకి చెప్పండి.
దూదేకుల సాయిబుకి చెప్పండి.
అడగనివాడికి చెప్పండి.
అడిగినవాడికి చెప్పండి.
అందరికి చెప్పండి.
మళ్ళీ చెప్పండి.
కనపడినప్పుడల్లా చెప్పండి.
విసుగెత్తినా చెప్పండి!
వినేవాళ్ళకి విసుగెత్తినా చెప్పండి.
నోరు నొప్పి పుట్టేదాకా చెప్పండి!
చెవి తూట్లు పడేదాకా చెప్పండి.
రోజూ కనీసం ఒక్కరికైనా చెప్పండి!
కనీసం ఈ సారైనా గాడిదలకి, గాడిదకొడుకులకి, కుక్కలకి, నక్కలకి, పురుగులకి, పుట్రలకి ..
వోటు వెయ్యద్దని చెప్పండి.
ఇష్టం లేక పోతే NOTA బటన్ని నొక్క మని చెప్పండి!

బాలూ..వెండితెర మీద మరో కోకిల

నాకు గుర్తున్న బాలు మహేంద్ర ఈ క్రింది బొమ్మలో ఉన్నట్టు ఉండేవాడు.అప్పటికే మూండ్రాం పిరై విడుదలై పోయింది.  సఫైర్ కాంప్లెక్స్ లోని ఎమరాల్డ్ లో చూసాను ఆ సినిమాని.  సెకండ్ షో.  తరువాత సత్యం ధియేటర్స్‌లో చూసాను.  శివం లో అనుకుంటాను. తెలుగు సినిమాలలో కెమరా ఒకటి ఉంది, దానితో సినిమాని మనకి చూపించేవాడు కెమరమెన్ అని తెలియజేసిన అద్బుతమైన కెమరామెన్ వి ఎస్ ఆర్ స్వామి అని అనుకునేవాళ్లం నేను నా స్నేహితులం.  అలాగే తమిళ సినిమాలకి బాలు.

Balu Mahendra, the cinematographer
Balu Mahendra, the cinematographer

కూర్చుని ఏదో చదువుకుంటున్నాను.  నీడ, తరువాత అలికిడి.  చదువుతున్న పుస్తకంలోనుండి తలెత్తి చూస్తే పొడుగ్గా  ..నాకంటే ఎత్తు.. అదిగో ఆ బొమ్మలో లాగా ఆలివ్ గ్రీన్ కాప్ తో బాలు.  నవ్వుతూ.  మామూలుగా సినిమా రంగం వాళ్ళతో వాళ్ల సినిమా గురించి పబ్లిక్ గా ప్రస్తావించేవాడిని కాదు.  ఆ రోజున మేమిద్దరమే ఉన్నాం.  “మూండ్రాం పిరై బాగుంది.  మీ కెమరా అద్భుతం”, అని అన్నాను.  చిరునవ్వు తో సమాధానమిచ్చాడాయన.  “నేను కూడా చాలా హాపి.  అందరికి నచ్చింది.  నాకూ నచ్చింది” అన్నాడాయన. తెలుగులో అదే “వసంత కోకిల” గా విడుదలైనది.

One of the best films of Balu Mahendra.
One of the best films of Balu Mahendra.

ఒక రెండు నిముషాలు అవి ఇవి మాట్లాడుకున్న తరువాత.. “తెలుగు లో గొప్ప సాహిత్యం ఉందంట కదా?  ఏమైన మంచి పుస్తకాలు సజెస్ట్ చెయ్యండి అన్నాడాయన.  “మీకు తెలుగు చదవడం వచ్చా?” అని ఆశ్చర్యంగా అడిగాను.  “ఏం తెలుగు చదవడం నాకు రాకపోతే ఏం?  ఎవరితోనైనా చదివించుకుంటానుగా!”  అని అన్నాడాయన”.

అలా తెలుగు సాహిత్యం తో ఆయనకి పరిచయం.  తెలుగు సాహిత్యం ద్వారా నాకు పరిచయం.  ఆయన సినిమాలు అన్ని చూసాను.  గొప్ప కెమెరామెన్.  నిన్న #pepperspray కథ లేకుండా ఉంటే..బహుశ మన మిడియా వాళ్ళూ ఆయన క్లిప్‌లతో మోత మోగించేవారనుకుంటా!

ఏమైనా మరో మంచి కళాకారుడు వెళ్ళిపొయ్యాడు.

పాఠకుడే రారాజు

కా రా మాస్టారు ని అడిగాను, “చదవగలుగుతున్నారా?” అని. “ఇబ్బందిగానే ఉంది.  ఇదివరకటిలాగా ఏకధాటిగా చదవలేక పోతున్నాను.  ఐనా మధ్య మధ్య ఆపి కళ్ళకి కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను. చదవకపోతే ఎలా? ఊపిరి ఆడదుగా?! మీకు తెలియందేముంది ?” అని అన్నారు.  అప్పటికి వారికి సుమారు 86 ఏళ్ళు అనుకుంటాను.  ఐనా చిన్న స్టూలు లాక్కుని దానిమీద కెక్కి నిలబడి, అటక మీదున్న కొన్ని పుస్తకాలని అందుకుని, దిగి తీసుకువచ్చి మీరు చదవాలని నాకు అందజేసారు.  చదవడం మీద ప్రేమ అది.

“అదిగో, దానితో చదువుతున్నాను” అంటూ టేబుల్ మీదున్న భూతద్దాన్ని చూపించారు త్రిపుర, అదే ప్రశ్నని వారిని అడిగినప్పుడు.    అది చూసినప్పుడు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” కోసం భూతద్దం తో కుస్తీపడుతున్న  ఆరుద్ర గుర్తు వచ్చారు.  “చెక్కుల మీద సంతకాలు పెట్టగలుగుతున్నారా?” అని అడిగాను.  “నా కోడి కెలుకుడిని మా బాంక్ వాళ్ళు సంతకం క్రిందే భావిస్తున్నారు.  ఐ యాం థాంక్‌ఫుల్ టు దెం” అని అన్నారు త్రిపుర నవ్వుతూ. చదవకుండా, రాయకుండా ఎలా ఉండగలరు ఎవరైనా అన్నది వారి ప్రశ్న. చదవడం మీద ప్రేమ అది.

“నేను బయటకు వెళ్లడం తగ్గింది.  కాని మీ బోటి మిత్రులు,  నాకు పుస్తకాలని అందజేస్తున్నారు.  ఇంకా చదవగలుగుతున్నాను.  మనకి అంతకంటే కావాల్సిందేముంది” అన్నారు పెద్దిభొట్ల గారు. చదవడం మీద ప్రేమ అది.”స్క్రిఫ్ట్‌ని స్కాన్ చేసి పంపిస్తున్నాను.  నా దస్తూరి కాని నేను వాడిన పదం కాని అర్ధం కాక పొరబాటున మరో పదం కంపోజ్ చేసే సందర్భాలు వచ్చేస్తున్నవి.  ఇక నా రచనలని నేనే తెలుగులో టైప్ చేసుకోవడం   తప్పదు.  మనకి తెలిసిందే రాయడం, చదవడం!  అవి రెండూ లేకపోతే పిచ్చెక్కిపోదు? ” అని అన్నారు అశేష ఆంద్రపాఠకుల అభిమాన రచయిత , షాడో సృష్టికర్త మధుబాబు. చదవడం మీద ప్రేమ అది.

“ప్రతిరోజు నెట్ ని ఎప్పుడో ఒకప్పుడు చూస్తూనే ఉంటాను.  కంప్యూటర్ మీద, నా రచనలన్నింటిని నేనే టైప్ చేసుకుంటాను   నాకు ఇబ్బంది ఏమి లేదు.  ఇంటర్నెట్‌ లో చదువుకుంటాను కూడా”, అని అన్నారు మొన్న “పెద్ధిభొట్ల సాహితీ పురస్కారం” అందుకున్న రచయిత్రి సత్యవతి పోచిరాజు.  చదవడం మీద ప్రేమ అది.

“టాంక్ బండ్ మీద వెళ్తున్నప్పుడు వచ్చింది..ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన.  బండి అపేసి, పక్కనే లాన్‌లో కూర్చుని లాప్‌టాప్ మీద అప్పటికప్పుడు వ్రాసిన కధ “వర్డ్ కాన్సర్‌” అని తెలియజేసిన పాత్రికేయురాలు – వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు. వ్రాయడం, చదవడం మీద ప్రేమ అది.

తెలుగు ఆచార్యులు. మల్లీశ్వరి గారు ఆన్‌లైన్‌లో వ్రాసుకున్న బ్లాగులను ఏర్చి కూర్చి “జాజిమల్లి” బ్లాగు కథలు గా ప్రచురించింది పర్‌స్పెక్టివ్ ప్రచురణ సంస్థ.

ఆ మధ్య ఒక పుస్తక ఆవిష్కరణ సభకి హైద్రాబాదు నుండి సకాలంలో అచ్చు పుస్తకాలు అమెరికాలో  అందకపోతే,  “ప్రింట్ ఆన్ డిమాండ్”  సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడే తెలుగు పుస్తకాలన్ని అచ్చొంతించి ఆ ఆవిష్కరణ సభని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించుకున్నారు.

కేంద్ర సాహిత్య అకాడెమి లాంటి ప్రచురణ సంస్థలు కూడా ఈ నాడు రచయితలు తమకు పంపే రచనలను సాఫ్ట్‌కాపీలుగానే పంపమని కోరుతున్నవని గమనించాలి.

ఈ రోజు అదిలాబాదు లో తను రాసిన రచన ని ఆన్‌లైన్‌లో తన లాప్‌టాప్‌నుండే  ఈపబ్లిష్ చేసుకుంటున్నాడు తెలుగు రచయిత.

అది ఈ రోజు రచనా వ్యాసంగంలో ఉన్న తెలుగు రచయితలు, వారి రచనలు, ప్రచురణల పరిస్థితి.
Logo of Rani Book Centre - courtesy Chalasani Prasada Rao - Eenaduఒకప్పుడు హైద్రాబాదులోని కోఠీలోనో, కాచీగూడాలోనో, వైజాగు గుప్తా బ్రదర్స్‌లోనో, విజయవాడ ఏలూరు రోడ్డులోని నవోదయలో నో, మద్రాసు పాండి బజారులోని రాణి బుక్ సెంటర్‌ లోనో, తెలుగు పుస్తకాలు కొనుక్కుని, మద్రాసు ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టు నుంచి వెళ్ళే వారు ప్రవాసాంధ్ర పాఠకులు.   కాని ఇప్పటి పరిస్థితి వేరు.

ఇల్లినాయ్‌లో ఉంటున్న అన్నయ్య, అదిలాబాదులో తన తమ్ముడికి కావల్సిన పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో ఈబుక్ రూపంలో కొని ఈమైల్ ద్వారా పంపిస్తే  దానిని డవు‌న్‌లోడ్ చేసుకుని చదువుకుంటున్నాడు ఆ విద్యార్ధి.  ఫ్రాన్స్ లో తెలుగు పదాన్ని ఉపయోగించడంలో సంధిగ్ధం ఎదురైతే ఆన్‌లైన్ లో ఆంధ్రబారతికి వెళ్ళి అర్ధం తెలుసుకుంటున్నాడు తెలుగు భాషాభిమాని.

ఇంటర్నెట్ పుణ్యామా అని పుస్తకాలకోసం ఇది వరకటిలాగా గంటల సేపు ప్రయాణాలు, రోజుల తరబడి  విలువైన సమయాన్ని  వెచ్చించి వెతుక్కోవడం తగ్గింది.  ఆన్‌లైన్ లో ఈబుక్స్ మాత్రమే కాదు, అచ్చు పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు, బంగారం, బస్సు, టికెట్లు లాగా.  కొనుక్కోవడమే కాదు, అద్దెకి కూడా తీసుకోవచ్చు.  ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల మీద దాడికి అమెరికా ఉపయోగించిన “డ్రోన్‌‌” ల గురించి మీకు తెలిసే ఉంటుంది.  ఆ సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న నవతరం “డ్రోన్‌” తో పాఠకుడు కోరుకున్న అచ్చు పుస్తకాన్ని అతని ఇంటికే అతి తక్కువ ఖర్చుతో  అందే ఏర్పాట్లు చక చకా సాగుతున్నవి.

మనవడితో మాట్లాడుకోవడానికి బామ్మ “టాబ్‌లెట్” తో కుస్తీ పడుతోంది.  మనవరాలికి తెలుగు నేర్పడానికి “స్మార్ట్‌ఫోన్” ఆప్స్‌ని ఆశ్రయిస్తున్నాడు తాత గారు.  సీరియల్స్ వచ్చి తెలుగు పుస్తకాలని పక్కకి నెట్టేసింది అనడం ఫాషన్ అయి’పోయింది‌’.

ఈ రోజున సాంకేతిక ప్రగతి విద్యుత్‌స్థంభాల చెయ్యి పట్టుకుని గ్రామాలలోకి వ్యాపిస్తున్నది.  లేని చోట మొబైల్ టెలిఫోని వాడుకుంటున్నది.  ఇంటర్నెట్, మొబైల్ టెలిఫోన్, టెలివిజన్ పరస్పర కరచాలనం చేసుకుంటూ నేటి పాఠకుడికి, ‘చదువు‌’ ని ఒక అద్బుతమైన దృష్టికోణం నుండి ఆవిష్కరించి చూపుతున్నది.  అచ్చు, దృశ్య, శ్రవణ మాధ్యమాల అనుసంధానం ద్వారా ఒక “ఇమ్మెర్స్‌వ్ రీడింగ్” ని పాఠకుడి అనుభవంలోకి తెస్తున్నది నేటి చదువు.వేనవేల ఘనపు చదరపు అడుగులలో నిర్మించిన పుస్తక భాండాగారాలలోని లక్షల పుస్తకాలని ఈ రోజ పాఠకుడుకి తన డెస్క్‌టాప్ కంప్యూటర్ లో, లాప్‌టాపు, టాబ్లెట్, ఈబుక్‌రీడర్, స్మార్ట్‌పోన్ ద్వారా కాక అంతర్జాల విహరిణి (ఇంటర్నెట్ బ్రౌజర్) ద్వారా చదువుకునే వీలు కలిపిస్తున్నది ఈ ఆధునిక విజ్ఞానం.  ఈ సాంకేతిక పరికరాలు అభివృద్దిచెందిన పాశ్చ్యాత దేశాలలోనే ఉందన్న భ్రమ వద్దు.  ఇది మన తెలుగు పాఠకుడికికూడా అందుబాటులో ఈ రోజున వుంది.  వాటి రూపమే నేటి మన వెబ్‌జైన్ (వెబ్+(మాగ) జైన్)లు.  అక్షరాలతో స్క్రోలింగ్ వార్తలతో పాటు, టెలివిజన్ క్లిప్పులను ప్రదర్శిస్తున్నవి నేటి వార్తాపత్రికల జాలగూళ్ళు (వెబ్‌సైట్లు).ఈ రోజున సగటు తెలుగు పాఠకుడికి విస్తారమైన తెలుగు సాహిత్య సంపద అతని అరచేతిలొ పెడుతున్నది ఈ ఆధునిక విజ్ఞానం. పురాణాల నుంచి, ఇతిహాసలనుంచి నేటి తెలుగు హైకూల వరకు.  చదువుకున్న వాడికి చదువుకున్నంత మహదేవా అన్నట్టు!  ఐతే పాఠకుడు చదవడం కోసం వెచ్చించే వ్యవధిలోను మార్పులు వచ్చినవి.  వేయి పేజీల నవలలు చదివే సమయం అతనికి లేదు.  కాబట్టి నవల పరిమాణం ఇప్పుడు 200 లేదు 300 పేజిల పరిమాణానికి కుంచించుకుపోయింది.  నవలికలు పెరిగినవి.  కథలు పెరిగినవి.  స్వకీయ ప్రచురణలు కూడ ఎక్కువైనవి.
మొన్నటికి మొన్న తమ వైవాహిక జీవితం పాతిక వసంతాలు చూసిన సందర్భాన ఆ భార్య భర్తల రచయితల ద్వయం తమలో తామే ఒకరి పుస్తకాన్ని ఒకరికి ఆన్‌లైన్‌లో అంకితమిచ్చుకున్నారు!  వారే “అనామకుడు” రామశాస్త్రి, డా. గాయత్రీదేవి దంపతులు.  రచయితలు, పాఠకులు దగ్గిరవుతున్న సందర్భం ఇది.  పాఠకులు, రచయితల మధ్య గీత చిన్నదవుతున్న నేపధ్యం ఇది.  ప్రచురణకర్త, రచయిత మధ్య ఉన్న భేదం తగ్గిపోతున్న కాలం ఇది.

తెలుగు పాఠక ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతున్నది.  అంది పుచ్చుకోవలసిన వారు, రచయితలు, ప్రచురణ కర్తలే!  వారిదే ఆలస్యం! పాఠకుడే రారాజు, ఈ రోజున!