Monthly Archives: April 2013

నా కోసం

లక్షాలాది మంది ఆయన పాడగా వినాలని,
ఆయనతో ఒక కరచాలనం చెయ్యాలని,
వారి ఆశిస్సులుంటే చాలని కోరుకునేవారు.

ఆయనేమో అక్కడెక్కడో బెంగుళూరు బేకరిలో ఏ పాస్ట్రీ యో, బిస్కట్టో బాగుందని కొని తీసుకువచ్చేవారు.
నాకోసం.
అడయారు నుంచి  టీ నగర్ దాకా. (http://goo.gl/maps/6Z7xu ) దాదాపు ఓ పది కిలోమీటర్లు.  నన్ను గుర్తు పెట్టుకుని మరీ.  వారికి నేనేమి బంధువును కాను.  ఐనా.

ఆదివారం సాయంత్రాలు  ఆరు ఏడు ఆ ప్రాంతాల్లొను,  రాత్రి ఐతే 8 ఏ ప్రాంతాల్లొ వచ్చేవారు.    మేమిద్దరం ఆయన కారులో కూర్చునో, కారుకి ఆనుకునో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ గంటల కొద్ది కాలం గడిపేవారం.

“ఫరవాలేదు..నేనిమి అనుకోను..మీ స్మోకింగ్ మీది” అని ముందే అనేసేవారు. మాములుగా మా కబుర్లు సంగీతం, సాహిత్యం మీదే ఉండేది.ఘజల్స్ మీద వారికి ఆసక్తి మెండు.  కొత్తగా వ్రాసింది తీసుకువచ్చేవారు.  రాగయుక్తంగా చదివి వినిపించేవారు.  నాకు అర్థం కాని చోట వివరంగా విడమరిచి చెప్పేవారు.

P B Srinivas ( 22 Sept 1930 - 14 Apr 2013)

P B Srinivas
( 22 Sept 1930 – 14 Apr 2013)

ఆ జేబులో కనీసం ఒక ఐదారు పెన్నులు,  ఆ చేతిలో పుస్తకాలు లేకుండా కనపడేవారు కాదు.  తనని ఆహ్వానించిన ప్రతి సభకి హాజరయ్యేవారు.  ఒక ప్రశంసా పత్రమో, ఒక కవితో చదివి వినిపించి దాన్ని ఆ నాటి కర్త కి అందించి వెళ్ళేవారు. వాటిని సేకరించి ప్రచురిస్తే బాగుంటుంది.  కాని అదేమి సామాన్యమైన విషయం కాదు!  ఆయన అలా వ్రాసిచ్చింది తక్కువేమి కాదు.

వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంతో స్నేహంగా ఉండేవారు.  చెరగని చిరునవ్వు!
మొన్నామధ్య మద్రాసు వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను.  వెళ్ళి కలవాలని.
చాలమందిని కోల్పొయ్యాను.
కోల్పోతున్నాను కూడా!

పొద్దునే ప్లగ్ పీకారు!

నిన్న ఉగాది.  తెలుగు వారందరికి పండగే!
ఉగాది రోజు ఉదయం “ఉగాది పచ్చడి” తినడం తెలుగువాడికి ఉన్న ఒక అచారం.
ఈ ఆంధ్ర ప్రదేశ్ ని పరిపాలించేది..తెలుగు వారే!
వారు కూడ వారి ఇళ్ళల్లో ఉగాది బహుశ జరుపుకునే ఉండి ఉంటారు.

ఐనా పొద్దునే ప్లగ్ పీకారు!
వేలల్లో బిల్లులు పంపుతున్నారు!!

ఈ తెలుగు వాడిని ఎవరి రక్షిస్తారు?
ఏమైపోతుంది ఈ జాతి?
ఎవరిచ్చారు వీళ్ళకీ హక్కు? మన జీవితాలతో ఇలా అడుకుంటున్నారు?
ఈ రాష్ట్రం లో ఏముందని ఇక్కడ ఉండాలి?
ఎవరు సంతోషంగా ఉంటున్నారు?

మీ అందరికి విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో

ప్రతి ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసి తీసుకువెళ్ళేవారం  మా షాపుకి. అమ్మ చేసేది. నా వివాహం తరువాత నా శ్రీమతి కూడ చేసేది.  పిల్లకి తప్పకుండా పెట్టేవాళ్ళం.  ఆ ముందు రోజే కావాల్సినివి కొనుక్కునేవారం..రంగనాధం వీధిలోనో..లేదు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలోనో.  వేపపువ్వు మట్టుకు ఎవరిదో ఒకరి ఒకరి ఇంట్లో నుంచి వచ్చేది.
చిన్న స్టిలు గిన్నేలో.  అసలు ఆ ఆలోచన కూడ షాపుకి వచ్చైన విద్యార్ధి అన్న మాటతో మొదలైనది.  80 ప్రాంతంలో.  ఆ విద్యార్ధి ఎవరో వాపోయ్యాడు..”నేను ఇంటి దగ్గిర ఉంటే ఈ రోజు ఉగాది పచ్చడి తినేవాడిని,  ఈ మద్రాసు మహానగరంలో ఎవరండి మాకు పెట్టేది అని’.  ఆలోచన అక్కడ మొదలైనది.  అప్పట్లో   సి. ఎ చదువుకోవడానికి మద్రాసుకి ఎక్కువమంది వచ్చేవారు.  అలాగే కొంతమంది ఏదో వ్యాపారం నిమిత్తం వచ్చి ఉండిపోవాల్సి వచ్చేది పాపం ఆ రోజున ఇంటికి వెళ్ళే అవకాశం లేక.
షాపుకి వచ్చిన వాళ్ళకి ఈ ఉగాది పచ్చడి పెట్టే వాళ్ళం. వీళ్లల్లో విద్యార్ధులు, వ్యాపారార్ధం వచ్చిన వారే ఎక్కువ.  ఒకసారి మధ్యానానికి పచ్చడి ఐపోయింది.  సాయంత్రం వచ్చిన వారిని ఉత్త చేతులతో పంపేసేటప్పడికి ఉస్సురనిపించింది.
అప్పట్నించి కొంచెం ఎక్కువచేసి పెట్టేవారం.  చివరకు అది ఒక ఆనవాయితిగా..ఇళ్ళల్లో చేసుకున్నవారు కూడ పొద్దునే వచ్చి శుభాకాంక్షలు చెప్పి..ఒక చిన్న గరిటేడైన తీసుకుని వెళ్ళేవారు.  ఇప్పటికి కలిసినప్పుడు కొంత మంది దానిని గుర్తు చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది.
కాని ఈ రోజున నాకు ఉగాది పచ్చడి తినాలని ఉన్నా పెట్టే వారేవరు? ఉగాది పచ్చడి తిని ఎన్ని సంవత్సరాలైందో.  గుర్తు కూడ లేదు!