మీ అందరికి విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో

ప్రతి ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసి తీసుకువెళ్ళేవారం  మా షాపుకి. అమ్మ చేసేది. నా వివాహం తరువాత నా శ్రీమతి కూడ చేసేది.  పిల్లకి తప్పకుండా పెట్టేవాళ్ళం.  ఆ ముందు రోజే కావాల్సినివి కొనుక్కునేవారం..రంగనాధం వీధిలోనో..లేదు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలోనో.  వేపపువ్వు మట్టుకు ఎవరిదో ఒకరి ఒకరి ఇంట్లో నుంచి వచ్చేది.
చిన్న స్టిలు గిన్నేలో.  అసలు ఆ ఆలోచన కూడ షాపుకి వచ్చైన విద్యార్ధి అన్న మాటతో మొదలైనది.  80 ప్రాంతంలో.  ఆ విద్యార్ధి ఎవరో వాపోయ్యాడు..”నేను ఇంటి దగ్గిర ఉంటే ఈ రోజు ఉగాది పచ్చడి తినేవాడిని,  ఈ మద్రాసు మహానగరంలో ఎవరండి మాకు పెట్టేది అని’.  ఆలోచన అక్కడ మొదలైనది.  అప్పట్లో   సి. ఎ చదువుకోవడానికి మద్రాసుకి ఎక్కువమంది వచ్చేవారు.  అలాగే కొంతమంది ఏదో వ్యాపారం నిమిత్తం వచ్చి ఉండిపోవాల్సి వచ్చేది పాపం ఆ రోజున ఇంటికి వెళ్ళే అవకాశం లేక.
షాపుకి వచ్చిన వాళ్ళకి ఈ ఉగాది పచ్చడి పెట్టే వాళ్ళం. వీళ్లల్లో విద్యార్ధులు, వ్యాపారార్ధం వచ్చిన వారే ఎక్కువ.  ఒకసారి మధ్యానానికి పచ్చడి ఐపోయింది.  సాయంత్రం వచ్చిన వారిని ఉత్త చేతులతో పంపేసేటప్పడికి ఉస్సురనిపించింది.
అప్పట్నించి కొంచెం ఎక్కువచేసి పెట్టేవారం.  చివరకు అది ఒక ఆనవాయితిగా..ఇళ్ళల్లో చేసుకున్నవారు కూడ పొద్దునే వచ్చి శుభాకాంక్షలు చెప్పి..ఒక చిన్న గరిటేడైన తీసుకుని వెళ్ళేవారు.  ఇప్పటికి కలిసినప్పుడు కొంత మంది దానిని గుర్తు చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది.
కాని ఈ రోజున నాకు ఉగాది పచ్చడి తినాలని ఉన్నా పెట్టే వారేవరు? ఉగాది పచ్చడి తిని ఎన్ని సంవత్సరాలైందో.  గుర్తు కూడ లేదు!