స్థిత ప్రజ్ఞులు – శివలెంక రాజేశ్వరీ దేవి

“కలిసారా వీరిని?  ఈవిడే శివలెంక రాజేశ్వరి దేవి, మంచి కవితలు వ్రాస్తుంది” అని తొలిసారి పరిచయం చేసినప్పుడు, “…అలాంటిదేమి లేదండి” అంటూ నేను నమస్కరించే లోపు…అలా వెళ్ళిపోయి ఒక జ్జ్ఞాపకంగా మిగిలిపోయింది.  ఆ తరువాత అప్పుడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి ఆవిడ కవితని చదువుకునే వాడిని.  నాకు మళ్ళీ ఆ మనిషి భౌతికంగా కనపడలేదు.  ఆవిడ పోయిన తరువాత, ఆమె బతికి ఉన్నప్పుడు ఫోనులు (ఆమే తన సొంత ఖర్చుతో చేసినా మాట్లాడలేని వారు, అందరూ కాదులెండి కొంత మంది) భోరున విలపించి సోషల్ మీడియాని చీదేసి, కాగితం రుమాళ్ళతో కన్నీళ్ళని పిండి మరి ముంచేసారు. ఈ కింది కవిత చదివినప్పుడు అదంతా గుర్తు వచ్చింది.  అందుకే ఇక్కడ ఇలా…

అనంతు  చెప్పాడు. కవితలన్నింటిని ఒక పుస్తకంగా వేస్తున్నాము అని.  ఇదిగో ఇలా నామాడి శ్రీధర్ సంపాదకత్వంలో వెలువడింది.  వాళ్ళిద్దర్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టున్నాను…పుస్తకం కావాలని.  చివరికి కత్తి మహేశ్ మొన్న విశాఖలొ యువతరంతో నవతరం కోసం వచ్చినప్పుడు ఈ పుస్తకం ఇచ్చి వెళ్ళాడు.

స్థిత ప్రజ్ఞులు

వాళ్ళు గొప్పవాళ్ళు సుమా నిజంగా
వాళ్ళకి బంధాలు వుండవు ఋణాలు వుండవు
ఋణానుబంధాలసలే వుండావు
కాపలలుంటాయి ముళ్ళకంచె కాపలాలు
అక్షరాలా మన మంచే మనకి కాపలా ఇక్కడ
మనకనేక ఋణాలు అనేక బంధాలూ
అనేక ఆపేక్షలూ అనేక బాధలూ అనేకానేక చిక్కుముళ్ళు
మనం ఇస్తాం తీసుకుంటాం
వాళ్ళు ఇవ్వరు తీసుకోరు
ఇస్తాం గానీ తీసుకోం అంటారు బడాయిగా
వాళ్ళు స్థితప్రజ్ఞులు
ఒఖ్క  టీ ఇచ్చి కూచోపెట్టి
ఎన్నెన్ని స్టేట్‌మెంట్లయినా వినిపిస్తారు
అప్పటికప్పుడు అక్కడికక్కడ
రెడీమేడ్ తీర్పులు చెపుతారు
వారు సర్వజ్ఞ సింగభూపాలురు
వాళ్ళకి కుటుంబం అంటే
‘మొగుడు పెళ్ళాం పిల్లాడూ’ నిర్వచనం
స్నేహితులు శాశ్వతంగా ఉంటారుటండి
మీ పిచ్చిగానీ అనేస్తే
మనం దిమ్మతిరిగి దిక్కులు చూడాల్సిందే

మనకేమో
ఒక సంతోషం ఇటొచ్చి ఒక దిగులు
అటొచ్చి ఒక నవ్వు ఇటొచ్చి ఒక మాట
నవ్వొస్తే పకపకా ఏడుపొస్తే వలవలా
నీ పిచ్చిగాని నీ మిణుగురులుమీంచి సైతం
వెలుగు చూస్తానంటే నవ్విపోతారమ్మా

స్థిత ప్రజ్ఞులు
స్థిత ప్రజ్ఞులు

ప్రతి మనిషి రెండు వైపులుంటాయండీ
అటో చెంపా ఇటో చెంపా
పైకి కనిపించేది కాదు అసలూ…
అంటూ వెర్రి పీనుగుల్ని చేసి
ఎంతైనా చెప్పగలరు ఎరిక్ ఫ్రామ్ లెవల్లో
గూడలు పడిపోయి నవ్వీ నవ్వలేక ఏడ్చీ ఏడ్వ‌లేక
తల ఎటుకేసి వూపుతున్నమో మనకే తెలీని స్థితిలో
సరైన టైమ్‌ అంటే వాళ్ళకి కలిసివచ్చినట్లు
కాలజ్ఞానం తెలిసినట్లు మాటల్ని మాయామయంగా కలిపేస్తారు.
” ఆ( ఇంత చేసి సొంతానికంటూ ఏమీ లేకపోయింది”
సాక్షాత్తు మదర్‌ కే
సానుభూతి చూపే గుండె ధైర్యం వాళ్ళకి
కంకరరాళ్ళు శబ్దం వినీవినీ
మస్తిష్కం మొద్దుబారిపోయింది
ఆ స్థిత ప్రజ్ఞుల వైపు వెళ్లకు
సిక్ సొసైటి మనుషులు వాళ్ళు

నువ్వేమో అమ్మలూ! సేన్ సొసైటి పాపాయివి
అటు పోకమ్మ ‘ఇన్నొసెన్స్’ పోగొట్టుకుని
‘ఇంటలిజెంట్’ అయిపోతావు
చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అనేస్తావు
ఆ ముదిరిపోయి గిడసబారిన ‘ఇంటలిజెన్స్‌’
మనకి వద్దులే తల్లీ!
ఏదో మన మానాన మనం
రాత్రి వర్షాన రాలిన పున్నాగపూలని
చేతుల్లోకి తీసుకుంటూ!

  • శివలెంక రాజేశ్వరి దేవి, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, 31.08.1998 లో ప్రచురితం.

ప్రతులకు / for copies
Namadi Sridhar
Door No: 3-129, Ambajipeta,
East Godavari district, Andhra Pradesh
PIN 533 214
Phone: 93968 07070

సర్వ హక్కులు ప్రకాశకులవే.

కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు

katha 1990 to 2009

2014 లో సెప్టెంబరు నెలలో రెండవ ఆదివారం తేది14 అయ్యింది.  ఆ రోజున మధురాంతకం నరేంద్ర గారి  కథని వేదిక – సాహితీ సమావేశం సభ్యులు చర్చించుకున్నారు. ఆ కథ ని కధా సాహితి సంపాదకులు తమ కధ 2014 సంకలనంలో చేర్చుకున్నారు.  మధురాంతకం నరేంద్ర సాహిత్యం గురించి మరి కొన్ని వివరాలు కథానిలయం లో ఇక్కడ చూడండి.

రచయిత మధురాంతకం నరేంద్ర

పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం వారి చేతుల మీదుగానే అందుకుంటున్న మధురాంతకం నరేంద్ర.  వీరిద్దరూ అధ్యాపకులే!  తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారిని కూడా ఇందులో చూడవచ్చు.

ఇవి కాక ఆంగ్లంలో The Hans India ఆంగ్ల దిన పత్రికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద నరేంద్ర వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. నరేంద్ర గారి కథలలో కొన్ని; అత్యాచారం (991), నిత్యమూ నిరంతరమూ (1993), అస్తిత్వానికి అటూ – ఇటూ – (2001), నమ్మకం (2008), చిత్రలేఖ (2010), చివరి ఇల్లు (2013)  ఇదివరలో కథాసాహితి వారి కధ సంపుటాలలో చోటు చేసుకున్నవి.

ఇందులో చెప్పుకోవలిసిన అంశం ఏమిటంటే 1992 లో  కధ 1991ని ఆవిష్కరించింది కీ.శే మధురాంతకం రాజారాం.  వారి తనయుడు మధురాంతకం నరేంద్ర.

ఇక కథా సారంగ లో (July 9, 2015) 3456GB వ్రాసిన కొట్టం రామకృష్ణారెడ్డి తొలి కధ – తీర్పు.  ఇది 1991 ఫిబ్రవరిలో రచన మాస పత్రికలో వచ్చింది.  వీరి కథ కూడ ఈ కథ 2014 సంపుటిలో ఉంది. వివరాలకు  సంకలనాన్ని చూడండి.

బంధం కధ 2013 లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురించింది.  ఆ కథ వ్రాసింది బోడపాటి హరితాదేవి.  కలం పేరు రాధిక. సంపాదకులు ఎన్నుకున్న కధని మీరు కథ 2014 లోనే చూసుకోవాలి మరి.  🙂

2014 అక్టోబరులో రెండవ ఆదివారం 12 వ తేది అయ్యింది.  ఆ రోజు సాయంత్రం డా. వి చంద్రశేఖర రావు గారి నవల నల్లమిరియం చెట్టు మీద వేదిక సాహితీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వినిపించారు కన్నెగంటి రామారావు. మరో సాహిత్య పిపాసి 🙂 డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఆ రోజు సాయంత్రం వేదిక సమావేశంలో పాల్గొన్నారు.  వీరిద్దరూ అమెరికాలో ఉంటారు.  చెప్పొచ్చేదేమిటంటే యాజి కూడా అమెరికాలోనే ఉంటారు.
కథకుడు యాజి తన కధకు ఎన్నుకున్న అంశం మీద సాహిత్యలోకంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది.  యాజి కథకూడ కధ 2014 లో చోటుచేసుకుంది.  విశేషం ఏమిటంటే యాజి స్వస్థలం తెనాలి.  😎

Author Yajiకధ 2014 – కధాసంపుటిలోని ఒక ముగ్గురు కథకులను గురించి, ఇక్కడేమో మరో ముగ్గురు కధకులు గురించి తెలియచేసాను.  రేపు … ఆ మిగతా కథకుల గురించి.  😎   అన్నట్టు తెనాలి కి వస్తున్నారుగా! తెనాలి లో కవిరాజు ఉద్యావనం (పార్క్) ఇక్కడుంది.

రెండు దశాబ్దాలు
కథ 1990 – 2009
౩౦ కధలతో రెండు దశాబ్దాల ఉత్తమ కధల సంకలనం

ప్రతులకు
164, Ravi Colony, Tirumalagherry, Secunderabad 500 015, India  Ph: +91 2779 7691
ధర: రూ 150.00 / US $ 25.00
పోస్ట్ / కొరియర్ ఖర్చులు అదనం.