కధ 2014… కధకులు ముగ్గురూ…మరొకరు

Kadha 2013 volume 24

చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. వీటన్నింటికి       ఒకటే అర్ధం, తెలుగులో దారి అని.  తెరువు అనే పదాన్ని “అంద చెన్నై మానగరిత్తిలే,” వాళ్ళు వాడగా విన్నాను, నేను వాడాను.  వాళ్ళు ఇంకా వాడుతున్నారు.   రెండు వందల పదహారు పేజిల కతల గంప లో
18 కతలున్నాయి.  అందులోని ఆఖరి కతే, విశాలాక్షి మాస పత్రిక తమ అక్టోబర్ 2014 సంచికలో ప్రచురించింది.  ఆ కధే కథ 2014 లో కూడా చోటు చేసుకుంది.

Sa Vem Rameshఉత్తరపొద్దు (2003), ఊడల్లేని మర్రి (2006 ), రయికముడి ఎరుగని బతుకు(2012), సిడిమొయిలు (2013), ఇదిగో ఈ రెండువేల పద్నాలుగులో ఈ దారమ్మ చెప్పిన కత.  మొన్న అంటే రెండవ ఆదివారం సెప్టెంబరు 13 ఈ కథను గురించి కూడా వేదిక సభ్యులు చర్చించుకున్నారు.  కధానిలయంలో ఈ కథకుడి కథల పట్టిక ఇక్కడ చూడోచ్చు.

తొలికధ మీసర వాన. 2002 లో నడుస్తున్న చరిత్ర లో ప్రచురితం.  నడుస్తున్న చరిత్ర ఇప్పుడు అమ్మనుడి గా సామల రమేశ్ బాబు గారే మాస పత్రికగా ప్రచురిస్తున్నాను. చేతులు మారలేదు.

ఇక కధానిలయం లో  కల్పన రెంటాల కథలు మూడు మాత్రమే నమోదయ్యాయి.  తన తొలి బ్లాగ్ నవల తన్హాయి. కొంత అలజడిని, ఆసక్తిని కలిగించిన ఆ నవల గురించి ప్రస్తావన లేదు మరి ఎందుకనో.  వీరి తొలి కధ ఋతుభ్రమణం వార్త వారి ఆదివారం అనుబంధంలో 2003-12-14 లో ప్రచురించారు. కధ 2014 లోకి ఎన్నుకున్న ఈ కధ ప్రాతినిధ్య 2014 కధాసంపుటంలో కూడ ఉంది. వేదిక కూడ ఈ కధని చర్చించుకుంది.  కల్పన బ్లాగ్ ఇక్కడ.


Gorti SaiBrahmanandam
“ఇండియాకి వస్తున్నాను,” అని అనగానే వేదిక సభ్యులతో ఒక సాయంత్రం ఏర్పాటు చేస్తాను మీకు వీలుంటే అనగానే సంతోషంగా ఒప్పేసుకున్నారు ఈ కథకుడు. అలాగా ఏప్రిల్, 2015 లో ఒక ఆదివారం, 5వ తారిఖున గొర్తి సాయిబ్రహ్మానందంవేదిక కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

ఈ కధకుడి కధలు కొన్ని ఇదివరకు కధాసాహితి సంపుటిలో చేరినవి; అతను (2009), సరిహద్దు (2011), ఈ సారి కూడా.  కధకోసం ఆ సంపుటిని చూడాల్సిందే! 🙂

 

Author Vimala
1978 లో తొలి కధ ప్రచురించుకున్న కవి విమల. ఆ పత్రిక నూతన.  అవును కవి.
కధలు కూడా వ్రాస్తారు.

2015 మార్చ్ ఒకటిన, వేదిక నిర్వహించిన కధ నిన్న – నేడు – రేపు లో వీరు కూడ నిర్వాహకులుగా తమ సహాయాన్ని అందించారు.  వేదిక వీరి కధను కూడ చర్చకు తీసుకుంది.  ఆ కధే ఈ కధ 2014 లో కూడా ఉంది.

 

మొన్న ముగ్గురు కథకులు, మరో ముగ్గురు కధకులు గురించి చెప్పాను.  ఇక ఇంకో ముగ్గురు కాక ఇంకొకరు కధకుల గురించి తెలుసుకున్నారు.  ఈ టపాతో కధ 2014 లోని కధకులు ముగ్గురూ మరొకరు కధకులందరి గురించి కొంత చెప్పాను.  ఇక కధ 2014 వివరాలు రేపు కొన్ని చెప్తాను.

కధ 2013
ప్రతులకు
కధాసాహితి, 164, రవి కాలని, Tirumalgherry, Secunderabad 500 015.
ధర:  అరవై రూపాయలు / పది అమెరికన్ డాలర్లు
గమనిక: తపాల / కొరియర్ ఖర్చులు అదనం

 

 

 

 

కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు

katha 1990 to 2009

2014 లో సెప్టెంబరు నెలలో రెండవ ఆదివారం తేది14 అయ్యింది.  ఆ రోజున మధురాంతకం నరేంద్ర గారి  కథని వేదిక – సాహితీ సమావేశం సభ్యులు చర్చించుకున్నారు. ఆ కథ ని కధా సాహితి సంపాదకులు తమ కధ 2014 సంకలనంలో చేర్చుకున్నారు.  మధురాంతకం నరేంద్ర సాహిత్యం గురించి మరి కొన్ని వివరాలు కథానిలయం లో ఇక్కడ చూడండి.

రచయిత మధురాంతకం నరేంద్ర

పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం వారి చేతుల మీదుగానే అందుకుంటున్న మధురాంతకం నరేంద్ర.  వీరిద్దరూ అధ్యాపకులే!  తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారిని కూడా ఇందులో చూడవచ్చు.

ఇవి కాక ఆంగ్లంలో The Hans India ఆంగ్ల దిన పత్రికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద నరేంద్ర వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. నరేంద్ర గారి కథలలో కొన్ని; అత్యాచారం (991), నిత్యమూ నిరంతరమూ (1993), అస్తిత్వానికి అటూ – ఇటూ – (2001), నమ్మకం (2008), చిత్రలేఖ (2010), చివరి ఇల్లు (2013)  ఇదివరలో కథాసాహితి వారి కధ సంపుటాలలో చోటు చేసుకున్నవి.

ఇందులో చెప్పుకోవలిసిన అంశం ఏమిటంటే 1992 లో  కధ 1991ని ఆవిష్కరించింది కీ.శే మధురాంతకం రాజారాం.  వారి తనయుడు మధురాంతకం నరేంద్ర.

ఇక కథా సారంగ లో (July 9, 2015) 3456GB వ్రాసిన కొట్టం రామకృష్ణారెడ్డి తొలి కధ – తీర్పు.  ఇది 1991 ఫిబ్రవరిలో రచన మాస పత్రికలో వచ్చింది.  వీరి కథ కూడ ఈ కథ 2014 సంపుటిలో ఉంది. వివరాలకు  సంకలనాన్ని చూడండి.

బంధం కధ 2013 లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురించింది.  ఆ కథ వ్రాసింది బోడపాటి హరితాదేవి.  కలం పేరు రాధిక. సంపాదకులు ఎన్నుకున్న కధని మీరు కథ 2014 లోనే చూసుకోవాలి మరి.  🙂

2014 అక్టోబరులో రెండవ ఆదివారం 12 వ తేది అయ్యింది.  ఆ రోజు సాయంత్రం డా. వి చంద్రశేఖర రావు గారి నవల నల్లమిరియం చెట్టు మీద వేదిక సాహితీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వినిపించారు కన్నెగంటి రామారావు. మరో సాహిత్య పిపాసి 🙂 డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఆ రోజు సాయంత్రం వేదిక సమావేశంలో పాల్గొన్నారు.  వీరిద్దరూ అమెరికాలో ఉంటారు.  చెప్పొచ్చేదేమిటంటే యాజి కూడా అమెరికాలోనే ఉంటారు.
కథకుడు యాజి తన కధకు ఎన్నుకున్న అంశం మీద సాహిత్యలోకంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది.  యాజి కథకూడ కధ 2014 లో చోటుచేసుకుంది.  విశేషం ఏమిటంటే యాజి స్వస్థలం తెనాలి.  😎

Author Yajiకధ 2014 – కధాసంపుటిలోని ఒక ముగ్గురు కథకులను గురించి, ఇక్కడేమో మరో ముగ్గురు కధకులు గురించి తెలియచేసాను.  రేపు … ఆ మిగతా కథకుల గురించి.  😎   అన్నట్టు తెనాలి కి వస్తున్నారుగా! తెనాలి లో కవిరాజు ఉద్యావనం (పార్క్) ఇక్కడుంది.

రెండు దశాబ్దాలు
కథ 1990 – 2009
౩౦ కధలతో రెండు దశాబ్దాల ఉత్తమ కధల సంకలనం

ప్రతులకు
164, Ravi Colony, Tirumalagherry, Secunderabad 500 015, India  Ph: +91 2779 7691
ధర: రూ 150.00 / US $ 25.00
పోస్ట్ / కొరియర్ ఖర్చులు అదనం.

కథ 2014 … మరో ముగ్గురు కథకులు

katha 2014 book launch invitation

కథ 2014 కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది.  ఈ పాతిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెలువడింది.  కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో.  కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ.  ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి.  ఆ అధ్యక్షుల వారిది తెనాలి.  పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.

ఇక ఆ ముగ్గురు కథకులు ఎవరో చూద్దాం.

Author Patanjalisastry
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి తొలి కథ సీతన్న తాట.  ఇది 1962 లో ఆంధ్రప్రభ వారు ప్రచురించారు.  వీరి ఇతర కథలు, నవలలు గురించిన వివరాలు కథానిలయంలో
ఇక్కడ తెలుసుకోవచ్చు.

వాల్ పోస్టర్, సర్మా, గారడీ, రామేశ్వరం కాకులు ఇదివరలో ఆయా కథ వార్షిక సంకలనాలలో ప్రచురించారు.

వీటిలో వేదిక లో రామేశ్వరం కాకులు మీద చర్చ జరిగింది. ఆ కధని ఇక్కడ చదువుకోవచ్చు.

అద్దేపల్లి ప్రభు, కాకినాడ వాస్తవ్యులు.  వీరి తొలి కధ విలువలు 1984 లో అరుణతార మాస పత్రికలో వెలువడింది. వారి ఇతర సాహిత్యం కథానిలయంలో ఇక్కడ చూడండి.

     

Sunil Kumar P V - Author

1986 స్వాతి వార పత్రికలో ప్రచురించిన మూషికార్జునీయం కథకులు పి విసునీల్ కుమార్. లఘుచిత్రం గా వెలుగుచూసిన కథ దెయ్యం వీరిదే.  వేదిక లో వీరి తోక దెయ్యం చెప్పిన డిసిప్లి మీద 2015 మే నెలలో చర్చించుకున్నారు.   ఆ కథని ఇక్కడ చదువుకోవచ్చు.

వీరు ముగ్గురూ, నిన్న ముగ్గురు కధకులు మాత్రమే కాదు.  ఇంకా ఉన్నారండి.  వారిలో మరో ముగ్గురు కధకులని మీకు రేఫు పరిచయం చేస్తాను.

రానున్న ఆదివారం, సెప్టెంబరు 20, 2015 న తెనాలిలో  జరగనున్న ఆవిష్కరణ సభకి ఇదిగో ఆహ్వానం.katha 2014 book launch invitation

కథ 2014…ముగ్గురు కథకులు

గత పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా వెలువడుతున్న కధాసాహితి వారి 25 వార్షిక కథా సంకలనం కథ 2014 లో ఈ ముగ్గురి కథలున్నవి.

బత్తుల రమాసుందరి
మొదటి కథ ఇక్కడRamasundari Battula - Atuhor
చదువుకోవచ్చు; మనిద్దరమే ఉందాం అమ్మా!
ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం (01-09-2013లో ప్రచురితం)

 

 

 

Author Palagiri Viswa Prasada Reddy

ఇక రెండవ వారు పాలగిరి విశ్వప్రసాద్, వీరి  మొదటి కథ
బోలు మనుషులు  రచన మాస పత్రిక సెప్టెంబరు 1991లో
ప్రచురితం.  నేను వెతికినంతలో అది నాకు జాలంలో దొరకలేదు.

 

 

 

 

Author Bhagavantham
ఇక మూడవ కథకుడు భగవంతం.
వీరి మొదటి కథ వెయిటింగ్ ఫర్ యాద్గిరి.
ఈ కథ తొలిసారిగా 2006లో వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
చలన చిత్ర దర్శకుడు వంశీ, నా కెందుకు నచ్చిందంటే  అనే శీర్షికతో
గోతెలుగు డాట్ కాం
 లో ఈ కథని మెచ్చుకుంటూ పరిచయం చేసిన కథ.  భగవంతం పాడిన పాట ఇక్కడ వినొచ్చు.  సా.వెం.రమేశ్ స్వరం కూడా!

రానున్న ఆదివారం 20న, తెనాలి లో జరగనున్న  కథ 2014 ఆవిష్కరణ సభలో బహుశ వీరందరిని మీరు కలుసుకోవచ్చు.  వీరు ముగ్గురే కాదు ఇంకా ఉన్నారు.  వారిలో కొంతమంది గురించి రేపు చెబుతాను.

ఇదిగో కథ 2014 కి అహ్వాన పత్రిక.

katha 2014 book launch invitation

వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను.  చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం.  అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది.  శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

Dr Velaga Venkatappaiah, Tenali
డా. వెలగా వెంకటప్పయ్య (1930 – 29 Dec 2014)

సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు.  ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.

తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.

కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం.  కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను.  మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.

ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.

Seminar on Kaviraju Tripuraneni Ramaswamy
The invitation to the seminar on ‘Kaviraju’ Tripuraneni Ramaswamy.

వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.

రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి  ముఖచిత్రాలు ఇక్కడున్నవి.  సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082

కతల గంప – స వెం రమేశ్

ఇప్పుడే అందింది.  రమేశ్ పంపాడు.
ముఖచిత్రం చూస్తే ‘రయికముడి ఎరగని బతుకు’ (భూమిక, డిసెంబరు 2012) గుర్తు వచ్చింది.
అట్టమీద బొమ్మ వేసింది బి కిరణ్ కుమారి.  బాగుంది.  చూడగానే చేతిలోకి పుస్తకాన్ని తీసుకుని చదవాలనిపిస్తుంది…రమేశ్ ఎవరో,  రమేశ్ కతలేమిటో తెలియని వారికి కూడా!
ఆ నలుపు, తెలుపు రంగులలో ఒక అందం ఉంది.

పుస్తకం వెనుక తిప్పిచూస్తే…కొన్ని స్కెచెస్ ఉన్నాయి.  నలుపులో తెలుపు. అక్షరాలు కూడా తెలుపులో.
ఆ అక్షరాలతో మనం కూడ పరుగెడతాం!

రమేశ్ కళ్ళెదుట నిలిచిన కల లో కొన్ని మాటలు:
మళ్ళా ‘కతలమ్మో కతలు’ అనే నా గొంతు తెరువులో ఉలివింది.
తిరిగినాను, తిరిగినాను, తెరువంతా తిరిగినాను.  అది బాగా రూకలుండే తెరువే.  అంతకు ముందు నా కతల్ని అబ్బురంగా తీసుకున్నవాళ్ళు ఉండే తెరువే.  కాని నా కతలు వెలపోలేదు.
. . .
ఒక్కటీ నచ్చలేదు వాళ్లకు, ఒక్కటీ కతగా తోచలేదు వాళ్ళకు.
. . .
నాకు దిగులు కలిగింది.
. . .
అప్పుడు తిరుపతి ఉమన్న చెప్పినాడు, ‘పెద్దతెరువులోనే బండిని తిప్పితే ఎట్టాసామీ, సన్న సందుల్లో కూడా మణుసులు ఉంటారు.  అక్కడకూడ కతలంటే ఊపిరిచ్చేవాళ్ళు ఉంటారు.  ఒకసారి ఆ తట్టుకు పోయిరా పో’ అని.

పుస్తకాన్ని పూదోట శౌరీలు, మల్లవరపు విజయమరియదాస్ లకు అంకితం ఇచ్చాడు రమేశ్.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/KathalaGampaBySaVeMRamesh_Anil_Atluri13thDec2014.jpg?w=808" alt=" kathala gaMpa" originalw="808" width="225" height="300" scale="2">
కతల గంప – తెలుగు కతలు కతకుడు స. వెం రమేశ్

పుస్తకం లో ఉన్న కతలు వాటి క్రమం:

తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప
మీసర వాన
ఊడల్లేని మర్రి
పదిమందికి పెట్టే పడసాల
ఆ అడివంచు పల్లె
కాకికి కడవడు పిచిక్కి పిడికిడు
రయికముడి ఎరగని బతుకు
చెట్లు చెప్పిన కత
సిడిమొ‌యిలు
బడకొడితి
వాడు గోపాలకృష్ణ కొటాయి
ఒంటినిట్టాడి గుడిసె
ఎందుండి వస్తీవి తుమ్మీదా
అబ్బిళింత
కతలగంప
మాదిగపుటక కాదు
మొ‌యిలు నొగులు
పాంచాలమ్మ పాట

ప్రతి కథ చివర అందులో తను వాడిన కొన్ని పదాలకి…మీకు, మీకేంటి నాకు కూడ అర్ధం అయ్యే తెలుగు పదాల అర్ధం ఇచ్చాడు.

ప్రతులకు మీరు పుస్తకం ధర రెండు వందలు పంపవలసింది ఇక్కడికి:
1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180
ఫోను: +91 90101 53505

గమనిక  పుస్తకంలో  ప్రతులకు “అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు” అని ఉన్నా  అవి ఈ విషాదాంధ్రలో కాని, ప్రజాశ్రేయస్సులో కాని దొరుకుతాయన్న నమ్మకం లేదు.  కాబట్టి పై ప్రచురణకర్తలకి రొక్కం పంపండి.  అనుమానాలుంటే వారికి ఫోను చెయ్యండి.  చెబుతారు మీకు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో.  వీలైతే వాళ్ళకి కొరియరు / పోస్ట్ ఖర్చులు పంపండి.  మరో పుస్తకం వాళ్ళు ప్రచురిస్తే మనకి మరో పుస్తకం అందుబాటులోకి వస్తుంది మరి!

ఖూనీ

ఖూనీ – నాటకం

‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి గారి కుమార్తె చౌదరాణి. తల్లి అన్నపూర్ణ. జననం గురువారం, జూలై 25న. 1935 లో. తెనాలి లో. తండ్రి గతించిన నాటికి తనకి ఏడు సంవత్సరాలు. అందుకే తండ్రినుండి అంత ప్రేమకి నోచుకుందేమో.

అతి పిన్న వయసులోనే భర్త అట్లూరి పిచ్చేశ్వర రావు ని కోల్పోయింది. ఒంటరిగానే బతికింది. కాదు జీవించింది. జీవితంతో ధైర్యంగా యుద్దం చేసి మరీ జీవించింది. అవసరమైనప్పుడు రివాల్వర్ లైసెన్సు తీసుకోవడానికి కూడ వెరువలేదు. భర్త ఇచ్చిన ధైర్యమే. గెలిచింది. జీవితంలో వసంతాలు తక్కువే ఐనా అరవై వేసవులు చూసింది. నేటికి ఉంటే 80 పూర్తి అయ్యేవి.  ప్రపంచం మర్చిపోయినప్పుడు తన తండ్రిని ప్రపంచానికి గుర్తుచేసింది.

తనని గుర్తు చేసుకుంటూ తనకిచ్చే ఈ చిరుకానుక ఈ రోజున ఈ పుస్తకం ఖూనీ. తనుకోరుకున్నట్టుగా అందరికి అందుబాటులో. డిజిటల్ ఎడిషన్ గూగుల్ బుక్స్ ప్లే ద్వారా. ఇప్పుడు గూగుల్ బుక్స్ లో మీరు
అందుకుని చదువుకోవచ్చు.

మీకు సులభంగా అర్ధమయ్యే తెలుగు లో శ్రీ రావెల సాంబశివరావు గారికి కృతజ్ఞతలతో.

'Kaviraju' Tripuraneni Ramaswamy

పుస్తకం సాంకేతిక వివరాలు:
Full Title: Khooni, a play
Author: “Kaviraju” Tripuraneni Ramaswamy
Re-told:  Ravela Sambasiva Rao
Language: Telugu
Print Length: 45 Pages
Google Play GGKey:WKYHC48AABJ E
Publisher: Tripura Prachuranalu
Published: January 2014
Cover design: Giridhar

బెంగుళూరులో త్రిపురనేని గోపిచంద్ శతజయంతి

బెంగుళూరులో
త్రిపురనేని గోపిచంద్ శతజయంతి ఉత్సవాలు

జులై 31, 2010
సాయంత్రం 5 గం.లకు ప్రారంభం

శ్రీ కృష్ణ దేవరాయ రసజ్ఞ సమాఖ్య

వేదిక

శ్రీ కృష్ణ దేవరాయ కళామందిరం, తెలుగు విజ్ఞాన సమితి
నెం 29, గాయత్రి దేవి పార్క్ ఎక్సటెన్షన్
29, Gayatri Devi Park Extension
వయ్యలి కావల్,
Vayyali Kaval
బెంగుళూర్ 560 003
Bengaluru
ఫోన్: (080) 2331 7850
Location map

కార్యక్రమం వివరాలు

స్వాగతం
శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
గోపిచంద్ జీవన రేఖలు
ఆచార్య తంగిరాల సుబ్బారావు
(‘‌శ్రీ రస‌’ సంస్థాపక అధ్యక్షులు)
*
గోపిచంద్ కథలు, నవలలు, మానవతా సంబంధాలు
ముఖ్య అతిధి
ఆచార్య. కాత్యాయని విద్మహే
(తెలుగు శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు)
*
On Gopichand’s Writing
Dr. Gopichand Katragadda
*
తత్వవేత్తలు
డా. మన్నవ భాస్కర నాయుడు
*
పోస్టు చెయ్యని ఉత్తరాలు
డా. దివాకర్ల రాజేశ్వరి
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
మా నాన్న గారు
త్రిపురనేని సాయిచంద్
*
నాకు నచ్చిన గోపిచంద్ కథ
శ్రీమతి అంబిక అనంత్
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
మెరుపుల మరకలు (నవల)
డా. కె. ఆశాజ్యోతి
*
సమావేశానికి ముఖ్య అధ్యక్షులు – వారి పలుకులు

ఆచార్య: కవన శర్మ

*

వందన సమర్పణం

*

గోపిచంద్ రచన సర్వస్వం – 10 సంపుటాలు (ధర: రూ 1500/-)
సభా ప్రాంగణంలో లభ్యం
(అలకనంద వారి ప్రచురణ)

సౌజన్యం:

శ్రీమతి కాట్రగడ్డ రజని (త్రిపురనేని గోపిచంద్ కుమార్తె)   & శ్రీ కాట్రగడ్డ సుబ్రహ్మణ్యం
శ్రీమతి కాట్రగడ్డ సీమ & డాక్టర్ కాట్రగడ్డ గోపిచంద్

‘శ్రీ రస‌’
శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు
(సంస్థాపక అధ్యక్షులు)
శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి
(సంస్థాపక కార్యదర్శి)
శ్రీ మతి అంబికా అనంత్
(సంస్థాపక కార్యదర్శి)



స్వాతంత్ర్య స్వరూపం – రచన “శారద”

ఒకప్పుడు, ఒక పిల్ల దేశం ఇంకోపెద్దదేశం నించి నానా అవస్థలు పడి స్వతంత్రం సంపాయించింది.  ఆ పిల్లదేశంలో ప్రజలు స్వతంత్రం వొచ్చినందుకు గుర్తుగా ఓ స్వతంత్ర విగ్రహం చేయించి రాజధాని నగరంలో  ప్రతిష్టించుదామని తమ స్వతంత్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం కూడా తమ ప్రజల ఆలోచన బాగానే వుందని ఒప్పుకుని, ఒక శిల్పిని పిలిపించింది.  ఆ శిల్పి అఖండమైన కళోపాసకుడు.  అదివరకు చాలా విగ్రహాలు చేశాడు.  అతను చేసిన విగ్రహాలు జీవకళ వుట్టిపడుతూ ఉండేవి.  ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఆ శిల్పి ఒక సుముహుర్తంలో, మంచి చలువ రాయితో విగ్రహం చేసేందుకు వుపక్రమించాడు.                                                                                                                                            

 ”శారద” – ఎస్. నటరాజన్

స్వతంత్రాన్ని ప్రజలు పోరాడి తెచుకున్నారు గనుక, స్వతంత్ర విగ్రహం, తమ పోరాటాల చరిత్రని ఎల్లప్పుడు  జ్ఞప్తిచేస్తో, తమ సుఖవంతమైన స్వతంత్ర భవిష్యత్తును చూపుతూ వుండే ఒక మహా వీరుని విగ్రహంగా  చెక్కమని వాళ్ళు శిల్పికి తీర్మానాలు చేసి పంపారు.  శిల్పి అలాగేనని ఒక మహావీరుని విగ్రహం చెక్కడం ప్రారంభించాడు.

కాని మొదట్నుంచీ, సామాన్య ప్రజల పోరాటాలు చేసి స్వతంత్రం  సంపాయిస్తే తమ ప్రాబల్యం ఎట్టాగు మంటగలుస్తుందని భయపడుతూ వచ్చిన డబ్బు స్వాములు, తమ మీద అధికారం చెలాయిస్తున్న పరాయిదేశం డబ్బు స్వాములతో గుసగుసలూ, వికవికలూ చేసి, అధికారం తమ హస్తగతం చేసుకున్నారు.  ఈ  డబ్బుస్వాములు, “స్వతంత్ర విగ్రహం” ప్రజలకి నూతనంగా వచ్చిన స్వతంత్ర ప్రభుత్వం యెడ నమ్రత, విదేయతా నేర్పే చిహ్నంగాను, అల్లరి ఆగం చేయకూడదని బోధించే గురువు లాగుండాలి.  అందుకని ఆ విగ్రహం ఓ ప్రశాంత తపస్విలాగానో లేక సన్యాసిలాగో ఉండాలి” అని శిల్పిని అజ్ఞాపించారు.  శిల్పి “చిత్తం” అని మహావీరుడి విగ్రహం చెక్కినంతవరకు ఆపి, దాన్నే ఓ సన్యాసి రూపంలోకి చెక్కుతున్నాడు.

ఆ దేశంలోని డబ్బుస్వాములల్లోనే ఇంకా కొందరు మహత్ములు, దేశాన్ని, దాని ఆర్ధిక పరిస్థితిని తమ జేబుల్లోను,
భోషాణాల్లోను ఇరికించుకొని వున్నారు.  వాళ్ళకి ఈ సలహాలేవి నచ్చలేదు.  వాళ్ళందరు కలిసి, “ఆ విగ్రహం, మన విశాలమైన దేశం యొక్క స్వతంత్ర వ్యాపార ప్రతిపత్తిని విస్తరింపజేసేదిగా ఒక గొప్ప ఓడల వర్తకుని రూపంలో వుండాలి” అని ఆ శిల్పికి ఆదేశం పంపారు.  శిల్పి ఆ ఆదేశం వెనుక వుండే ఆర్ధిక బలాన్ని వూహించుకుని “అలాగే బాబు” అని తను తయారుచేస్తున్న సన్యాసి విగ్రహాన్నే గొప్ప వ్యాపారస్తుడి విగ్రహంగా మారుస్తున్నాడు.

కాని అసలు ప్రభుత్వంలో వుండే అ ప్రముఖులు ఇవన్నీ పనికిరావని రెండు మూడు సబ్ కమిటీలు, నాలుగైదు విచారణ సంఘాలువేసి, వాటి రిపోర్టులన్ని కలేసి చదివి, వాటనన్నిట్నీ తీసేసిం తర్వాత “ ‘స్వతంత్ర విగ్రహం’ ప్రభుత్వం ఎడ భక్తినీ, నమ్రతని నేర్పేట్టు వుండవలసిందే కాని అది సన్యాసి లాగు ప్రజలకి నీరసం బోధించేట్టు ఉండరాదు. అది ప్రజలకి ప్రభుత్వం యెడల భయము, భక్తిని, శ్రద్దా, గౌరవాల్ని నేర్పే సాయుధ సైనికుడి విగ్రహంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.  నిజమైన ప్రజాశాంతిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రభుత్వ సైన్యమే.  అదీ కాకుండా ప్రజలలో కొందరు ఎల్లప్పుడూ ఆకలని, గుడ్డలని అల్లర్లు చేస్తో ఆర్ధిక సమానత్వం అని లేనిపోని ప్రచారం చేస్తో, ప్రజల ప్రశాంత జీవితాల్నీ భగ్నం చేస్తున్నారు.  అటువంటి వాళ్ళకి స్వతంత్ర ప్రభుత్వంలోనైనా వాళ్ళ ఆటలు సాగవని హెచ్చరికలుతెల్పుతూ ‘స్వతంత్ర విగ్రహం’  ప్రభుత్వ సాయుధ సైనికుడి రూపంలో వుండాలి,” అని బహిరంగ ప్రకటన ఒకటి చేసి శిల్పికి హుకుం ఇచ్చారు, సైనికుని విగ్రహం చెక్కమని.  “అట్లానే,” అని శిల్పి తను ఇదివరలో చెక్కుతున్న వర్తకుడి రూపాన్నే సాయుధ సైనికుని రూపంలోకి మార్చుతున్నాడు.  ప్రభుత్వం సలహాని డబ్బు స్వాములు  హర్షించారు.  వ్యాపారస్తులు అహ్వానించారు.  అటూ ఇటూ మాట్లాడే పెద్దమనుషులు అమోదించారు.  ప్రజలు మాత్రం ప్రభుత్వ ధోరణికి ముక్కుమీద వేలేసుకున్నారు.

అయితే, శిల్పి మాత్రం ఎడతెరిపి లేకుండా శ్రమించి స్వాతంత్ర విగ్రహాన్ని తయారుచేసాడు.  ఒక సుదినమున స్వాతంత్ర విగ్రహాన్ని రాజధాని నగరంలో ప్రతిష్టించడానికి తీసుకువచ్చారు.  అదివరకే తయారైన శిలావేదికపై స్వాతంత్ర విగ్రహాన్ని వుంచారు.  ప్రభుత్వ అధ్యక్షుడు, స్వతంత్రాన్ని గూర్చి ఒక మహోపన్యాసం జేసింతర్వాత స్వతంత్ర విగ్రహానికి వున్న ముఖమల్ గుడ్డని  తొలగించాడు.  స్వాతంత్ర  విగ్రహం ఆధునిక ఆయుధాలతో సాక్షాత్కరించింది.  భయంకరమైన దయ్యం రూపంలో.
(జూలై 1948, విశాలాంధ్ర )

*

సూచిక:  ఇటీవలి కాలం లో “శారద” సాహిత్యం పునర్ముద్రణ కి నోచుకోలేదు.  “శారద” సాహిత్యాన్ని మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కధని ఇక్కడ ప్రచురించడం జరిగింది.  శ్రీ అరి సీతారామయ్య గారు ఇచ్చిన వివరాలతో, తెనాలి లోని  శ్రీ వర్ధనరావు గారిని (English Lecturer (Retd), V.S.R College, Tenali)  రక్తస్పర్శ  (“శారద” కధల సంకలనం) గురించి ఆరాతీస్తే వారికి కూడా వివరాలు తెలియవని అన్నారు.  చాలా మంది మిత్రులని, సాహిత్యాభిమానులని, ప్రచురణకర్తలని కూడ సంప్రదించడం జరిగింది.  సంప్రదించిన వారు ఎవరూ కూడ పూర్తి వివరాలు ఇవ్వలేక పొయ్యారు.    ప్రజాసాహితి మాసపత్రికలో (ఆగస్టు 2009) ఈ కధ ని ప్రచురించారు.  సంపాదకులు శ్రీ కొత్తపల్లి రవిబాబు గారి అనుమతితో ఈ కధని ఇక్కడ ఉంచడం జరిగింది.  దీనిమీద నాకు ఎటువంటి హక్కులు లేవు.
తాజా కలంః ఇటివలే శారద నటరాజన్ వారసుల గురించి సాక్షి దినపత్రిక (గుంటూరు) వార్తని ప్రచురించింది.  వివరాలు ఇక్కడ.
తెలుగు విలిలోః శారద

 

*
* ఈ కథను వ్రాసింది “శారద” ( ఎస్. నటరాజన్)::ప్రచురణ: :  విశాలాంధ్ర దిన పత్రిక ::జూలై, 1948
శారద చాయాచిత్రం: కీ.శే. ముమ్మనేని నాగేశ్వర రావు, తెనాలి