పిచ్చేశ్వరరావు – ‘‘జీవచ్ఛవాలు’’

APR anthology boo cover page

‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’ మీద సమీక్ష ఇది.

మెదడుకు పదును పెట్టే మంచి కథలను కోరుకునే పాఠకులు పిచ్చేశ్వరరావును మరిచిపోలేరనుకుంటాను. తెలుగు కథ ఏపుగా ఎదిగి మంచి పువ్వులు పూస్తున్న తొలిరోజులలో ఎర్రటి మందార మాలను అందంగా గుదిగుచ్చిన జాతి కథకుడు పిచ్చేశ్వరరావు. అతని సమకాలీన కథలను చాలామంది పోల్చి చూస్తే పిచ్చేశ్వరరావు వ్రాసిన కథలు బహుకొద్ది మాత్రమే. కానీ కాల ప్రవాహానికి నిలబడి అతనిని ‘చిరంజీవి’గా చేసే కథలవి. ‘‘అతను కథలు రాయాలని కనిపెట్టుకుని ఏ కథా వ్రాయలేదు. సద్యః ప్రయోజనాన్ని మటుకే మనసులో పెట్టుకుని కథలు వ్రాశాడు’’ అంటూ కొడవటిగంటి కుటుంబరావు గారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని చదివితే రచయితగా అతడిలోని నిజాయితీ అర్థం అవుతుంది.

పిచ్చేశ్వరరావు కథా ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి వాతావరణం, స్వాతంత్ర్య సమరం, తెలంగాణ పోరాటం, స్వాతంత్ర్యానంతరం ఉపన్యాసాల విన్యాసాలలో నేతి బీరకాయలా మిగిలిపోయిన ప్రగతి, సామ్రాజ్యవాదం చెప్పిన పాఠాలను అవగతం చేసుకుని – కొత్త వేషాలతో, మార్చుకున్న రంగులతో జనాన్ని పీక్కు తింటున్న పర పీడనా ప్రకృతి – ఇవన్నీ బహుముఖంగా దర్శనమిస్తాయి. పిచ్చేశ్వరరావు నావికులు, రైతులు, స్త్రీలు, బర్మా కాందిశీకులు, ఎవరి గురించి చెప్పినా సరే వాళ్ళకు జరిగిన అన్యాయానికి ఆక్రందిస్తాడు. ఆవేశంతో ఊగిపోతాడు. ‘‘కలాన్ని ఇంకు బుడ్డిలో ముంచినప్పుడల్లా తన శరీరంలోని ఒక్కో మాంసం ముక్కను అందులో వదిలిపెట్టగలిగినప్పుడు మాత్రమే రచన చేసేందుకు ఉపక్రమించాలి’’ అనే లియో టాల్‌స్టాయ్ పలుకులు జ్ఞాపకం వస్తున్నాయి ఇది వ్రాస్తుంటే. పిచ్చేశ్వరరావు కథలు చదువుతున్నప్పుడు ఒకనాటి చరిత్ర అంతా కళ్ల ముందు కదులుతుంది. లేకుంటే కుటుంబరావు గారు ‘నెత్తురు కథ’ గురించి చెబుతూ ‘‘అయిదు పేజీలు పూర్తిగా లేని ఈ కథలో ఒక జీవితమే కాదు ఎంతో చరిత్ర ఉన్నది’’ అని అంటారా?

ఈ కథలోని ఎర్రజెండా మామూలు రాజకీయ జెండా కాదని నెత్తురు జెండా అని ఆ కథ పాఠకులకు జ్ఞాపకం వుందనే అనుకుంటాను. ఒక నల్లవాడు శాంతి, భద్రతలను కాపాడడం కోసం కాల్చిన తుపాకీ చిందించిన రక్తం వెనుక ఎంతో కథ ఉంది. గాంధీజీని కొలిచి స్వాతంత్ర్యం కోసం భర్తను తెల్లవాడి తుపాకీకి బలి ఇచ్చిన వీరపత్ని కథ వున్నది. స్వాతంత్ర్యం వస్తుంది, రామరాజ్యం వస్తుంది అని పెట్టుకున్న కలలు, కట్టుకున్న ఆశలు వున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినా ఆకలి తీరక, ఆవేదనతో అలమటించిన దయనీయ గాథ వున్నది.
‘‘ప్రేమతో పొంగి, దుఃఖంతో కరిగి, క్షోభతో కుమిలి, కోపంతో కమిలిని నెత్తురు’’ కథ ఇది.

ఈ కారణం చేతనే పిచ్చేశ్వరరావు ఓ ‘ఆగస్టు 15న కొట్ల మీద, కాఫీ హోటళ్ల మీద మూడు రంగుల జెండాలు ముచ్చటగా రెపరెపలాడుతూ వుంటే… ‘‘పొట్ట కదిలింది. పొట్ట మీద ఇనుప చువ్వల మొనలు మొలిచాయి. మొనల మధ్య నడిబొడ్డు ద్వారం విచ్చుకుంది. చీకటి వెనుక కారుచీకట్లు తారట్లాడుతున్నవి. టోపీలు, లాఠీలు, బాయ్ నెట్ లు, తుపాకులు…’’ అంటూ సర్రియలిస్టు ధోరణిలో కథలు వ్రాశాడు. (ఆగస్టు 15న కథలో)

పిచ్చేశ్వరరావు ఆకలి దారిద్ర్యాలతో నిండిన ‘నేడు’ ను ‘నిన్న’గా మార్చాలని వున్న తపన – అతను రాసిన నా ‘గడవని నిన్న’ కథ చదివితే తెలుస్తుంది. ఈ కథలో ‘విన్నీ’ ఒక వ్యభిచారిణి కావచ్చు.(పోర్చుగీసు వాళ్లు ‘సినోరిటా’ అని, అమెరికన్లు ‘జానీ’ అని, మరికొంతమంది ‘హసీనా’ అని పిలవ వచ్చు. అది వేరే విషయం) కాని – అమెకీ ఓ మనసుంది. అయినా, మార్స్ చాక్లెట్ నములుతూ హాయిగా కూర్చోక అతనికి ‘విన్నీ’ గొడవ ఎందుకు? విమానాల మీద వెళ్ళే వాళ్ళని బాంబులు వెయ్యొద్దని, సింహాసనం మీద కూర్చున్న వాళ్ళను ఉపన్యాసాలు దంచొద్దని చెప్పడం పిచ్చి కాదూ? ఇవన్నీ మారిన నాడు నేను కనిపించను అంటుంది ‘విన్నీ’. అలా మారిన దేశాలకు అదంతా ‘నిన్న’ – మరి మనకు ‘నిన్న’ గడిచేదెప్పుడు?

ఈ ‘గడవని నిన్న’ గురించిన తాపత్రయం పిచ్చేశ్వరరావు నావికుల జీవితాలను నేపథ్యంగా తీసుకుని వ్రాసిన ‘చిరంజీవి’ వంటి కథల్లో కూడా కనబడుతుంది. తెలుగులో నేవి వాతావరణంతో వచ్చిన కొద్ది కథల్లో పిచ్చేశ్వరరావు కథలు ముఖ్యంగా పేర్కొనదగ్గవి. ‘చిరంజీవి’ కథలోని చిరంజీవి రంగూన్ నుంచి పారిపోయి వచ్చేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. మంటల్లో బూడిద అయిపోతున్న ఇంటినీ, చచ్చిపోయిన చెల్లెల్నీ, విడిచిపెట్టి జపాన్ విమానాన్ని తప్పించుకుంటూ పరిగెత్తాడు. జపాన్ వాళ్ళమీద కసితో ఇండియాలో ‘నేవీ’లో చేరాడు. కానీ, సామ్రాజ్యవాదుల కథ ఎక్కడైనా ఒకటే. చిరంజీవిలో ఉన్న అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వాన్ని అధికారులు అణగదొక్కుదామని విశ్వప్రయత్నం చేశారు. పాకీ పని చేయించారు. చివరికి తుపాకీ గుండుతో పొట్టన పెట్టుకున్నారు. కానీ కథ చివర్లో ఉప్పెనలాగా గోడలు దూకి వస్తున్న జనసమూహాన్ని చూస్తూ డాక్టర్ అన్నట్టు ‘‘చిరంజీవి చనిపోలేదు. వీళ్లంతా చిరంజీవులు కాదూ? ఈ జనమంతా చిరంజీవులే’’.

పిచ్చేశ్వరరావు కథల్లో కనపడే మరొక ముఖ్యమైన విషయం ‘వ్యక్తి వాదం’ పట్ల సెటైరు. ‘‘నాకు కావలసింది నేనే. చచ్చినా నేనే బ్రతికినా నేనే’’ అనే ఒక అపోహే – ‘‘నా ముందు మీరెత్తగలిగిన మాట వ్యక్తి స్వాతంత్ర్యం. ఈ వ్యక్తి స్వాతంత్ర్యం ముందు మీరంతా గడ్డిపరకలు. ఈ విశాల విశ్వం అంతా ఆ వ్యక్తి స్వాతంత్ర్యం పుక్కిలించి వూసే వెలుగులో ఓ పెద్ద ‘నీడ’’’ అని అంటాడు పిచ్చేశ్వరరావు వ్రాసిన ఓ కథలో. (‘వెర్రి కాదు వేదాంతం’ అనే కథలో) ‘వ్యక్తి స్వాతంత్ర్యం’ ముసుగులో సమసమాజాన్ని అవరోధించే పెద్దమనుషుల కుహనా విలువల పట్ల వైముఖ్యమే పిచ్చేశ్వరరావు చేత ఇలా వ్రాయించింది. అమెరికన్ బ్రాండ్ ‘వ్యక్తి స్వాతంత్ర్యా’న్నే కాదు… అమెరికా స్వేచ్ఛాదేవతను కూడా పిచ్చేశ్వరరావు హేళన చేశాడు.

జీవచ్చవాలు’ కథ జ్ఞాపకం ఉందా?
ఈ కథకు నేపథ్యంలో అమెరికా దేశ సంస్కృతి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దర్శనమిస్తాయి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పేరు చెప్పేసరికి న్యూయార్క్ ఓడరేవులో బానిసత్వపు చీకట్లను చీలుస్తూ, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల ఊపిరిని వెదజల్లుతున్నట్లుగా దర్శనమిచ్చే ఓ అపురూపమయిన దేవతా శిల్పం స్మృతి పథంలో మొదలుతుంది. అంతో ఇంతో చారిత్రక జ్ఞానం ఉన్న వాళ్లకు ఆ శిల్పాన్ని తీర్చిదిద్దిన ఫ్రెంచ్ శిల్పకారుడు ఆగస్టు బార్డోల్టీ, ఆ శిల్పం మీద చెక్కబడిన ‘ఎమ్మా లాజరస్’ వాక్యాలు కూడా జ్ఞాపకానికి రావచ్చు. అది వేరే విషయం. పిచ్చేశ్వరరావు కథకూ ఈ బాపతు ‘వ్యవహారానికి’ సంబంధం లేదు.

ఒకానొక రేవు పట్టణంలో ‘టొవెడో’ అనే ఒక అపురూపమైన ఓడ వచ్చిందని విని ఇద్దరు మిత్రులు చూడడానికి వెడదామనుకుంటారు. ఓడను చూడటం అవకపోయినా, ఆ ఓడ నావికుడు ‘డిక్’ పరిచయం అయింది. అదీ ఓ వే సైడ్ ఇన్ లో బుడ్డీ మీద బుడ్డీ బీరు పట్టిస్తుండగా.  ‘మీ స్వాతంత్ర్య దేవతను చూడాలని వుందండీ’ అంటాడు ‘అమెరికా పిచ్చి’ ఉన్న సుబ్రహ్మణ్యం. అదిగో అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అయింది. స్వాతంత్ర్య దేవతను తలుచుకుంటూ అమెరికన్ జీవన విధానం కోసం లొట్టలు వేసే సుబ్రహ్మణ్యం ‘‘దివ్య మాతృ విగ్రహం… మీ దేశంలోని తల్లులందరిలోనూ…’’ అంటే సెయిలర్ డిక్ అంటాడు కదా…‘‘నాకు తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. పక్షిలా పెరిగాను. నేను డబ్బు సంపాయిస్తేనే గొప్పవాణ్ణట. లేకపోతే కొడుకునే కాదు పొమ్మంది. డాలరు తెస్తే ముద్దు, లేకుంటే మొట్టు’’ అని.  ఆగస్ట్ బర్థోల్డి తన కన్నతల్లిని నమూనాగా తీసుకొని స్వేచ్ఛా దేవత శిల్పాన్ని చెక్కాడంటారు. ఇంతకూ ఆ తల్లి అమెరికన్ తల్లి అయినా, బర్థోల్డి కన్నతల్లి మాత్రం ‘తల్లి’కుండవల్సిన లక్షణాలు కానీ, స్వేచ్ఛా దేవత శిల్పంలో మనం ఊహించుకునే ఉదాత్త లక్షణాలు కానీ లేవు అని, కేవలం కొడుకుకు తల్లి హోదాగల ‘లిబిడివల్ ఎటాచ్ మెంట్’ వల్ల మాత్రమే ఆమెను నమూనాగా తీసుకోవడం జరిగిందని అంటారు కొందరు)

అమెరికాలో మాతృత్వమే డబ్బుతో కొలిచే వస్తువు అయినప్పుడు ఇక, స్నేహితుల సంగతి చెప్పాలా? ‘‘మా దేశంలో స్నేహం లేదు. వున్నా స్నేహంలో లోతు లేదు. ఎవరూ ఎవరికీ స్నేహితులు కారు’’ అంటూ ఉస్సూరంటాడతడు.  ఇక, ఓడ పనిలో ఎందుకు చేరావంటే ‘చావడానికి’ అని అంటాడు. ‘‘నాకు చావాలని ఉంది. చచ్చిపోలేను. ఎవరయినా చంపుతారేమోనని అనుకుంటాను… యుద్ధంలో చేరితే ఎవళ్ళో ఒకళ్ళు చంపుతారు’’ అనే మాటలు చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  రాత్రిళ్ళు రోడ్డమ్మట తిరిగేటప్పుడు ‘‘ఎంతమంది పెళ్ళాల మెడల్లో చేతులు వేసుకుని నిద్ర పోతున్నారో అని ఆలోచిస్తా – అప్పుడు బార్ లో దూరతా’’ అనే మాటల్లో ‘ఎనక్లిటిక్ డిప్రెషన్’ కనబడుతుంది. ‘డిక్’ అనబడే ఈ సెయిలర్ కథ కల్పితమే కావచ్చు. అమెరికన్ల కుహనా విలువల పట్లగల వైముఖ్యంతోనే పిచ్చేశ్వరరావు ఈ కథను వ్రాసి ఉండవచ్చు. కానీ, మెటీరియలిస్ట్ ధోరణలు పెచ్చు పెరిగిపోతున్న దేశాలలో ప్రతిదానినీ డబ్బుతో మాత్రమే కొలిచే సంస్కృతిలో – అది అమెరికా కానివ్వండి, మరొక దేశం కానివ్వండి, ఒక సగటు మనిషి హృదయ ఆవేదన ఎలా వుంటుందో ఈ కథ చెబుతుంది.

‘డెమొక్రసీ అండ్ సైంటిఫిక్ టెక్నిక్’ అనే రచనలో బెట్రాండ్ రస్సెల్ ‘‘పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆకలి భయం మనిషికి ‘ఇన్సెంటివ్’గా పనిచేస్తుంది. కమ్యూనిస్టు వ్యవస్థలో పోలీసులు విధించిన శిక్షలు ఇన్సెంటివ్ గా పని చేస్తాయి’’ అని చెబుతూ… ఈ రెండు తరహాల ఇన్సెంటివ్ లు మనిషిని యంత్రంలోని మరలాగా మర్చేస్తాయి అని అంటాడు. ఈ కథలోని ‘డిక్’ యంత్రంలోని మరలాగా మారిపోయానని గగ్గోలు పడడం పోటీ ఆర్థిక వ్యవస్థ ఇచ్చిన విష ఫలితమే.

మనిషిని ఒక బోల్టుగానో, స్క్రూగానో చూడక అతనినొక సజీవ పదార్థంగా చూడగలగాలంటే మన విలువల్లో, నమ్మకాల్లో మార్పు రావడం ఎంతైనా అవసరం. ఆ విలువలు భారతీయమైనవా, రష్యన్లవా, అమెరికన్లవా అనేది కాదు ప్రశ్న. మనిషికి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్నది మాత్రమే ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు దొరికితే ‘జీవచ్ఛవాలు’ ఉండవు. ప్రాణంతో మనుషులు కళకళలాడుతూ కనబడతారు. పిచ్చేశ్వరరావు కోరుకున్న స్వర్గం ఇదే అనుకుంటాను.

ఆంధ్రజ్యోతి దినపత్రిక , మార్చి 16, 1987 సోమవారం సంచికలో కోడూరి శ్రీరామమూర్తి రాసిన సమీక్ష ఇది.

*  దీన్ని నాకు అందించిన వారు మిత్రుడు సతీష్. తన విశ్రాంత సమయంలో మనసు ఫౌండేషన్ వారి కోసం చేకూరి రామారావు సాహిత్యం సేకరణలో  మరొక  సాహితి మిత్రుడు జి ఎస్ చలం తో  కలిసి పనిచేస్తున్నాడు. 
అట్లూరి పిచ్చేశ్వర రావు కథలు

ఈ క్రింది పుస్తకాల దుకాణాలలో కూడా లభిస్తుంది. పుస్తకం ధర: 250.00 రూపాయలు
పుటలు : 280
బరువు : 220 గ్రాములు

ఈ   పుస్తకానికి:
Sole Distributors:
Navodaya Book House,
Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad – 500 027,
Mobile: +91 – 90004 13413
వీరిదే ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.
https://bit.ly/APRinNavodayaOnLine


 Amazon లో:
Analpa Books ద్వారాకూడా తీసుకోవచ్చు:
Analpa Books,
35-69/1 2nd Floor GK COLONY (bus stop)
near Neredmet Cross Road, Saptagiri Colony,  Sainikpuri, Secunderabad, Telangana – 500 094
Mob: +91 70938 00678
https://amzn.to/3mnKBKN

గుంటూరులో :
Logili Book House,
Guntur – 522 007
Mobile: +91 95501 46514
వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ తీసుకోవచ్చు:
https://bit.ly/APRonLogili



 

…అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది!

“బెర్నాడ్  షా వ్రాసిన ‘సీజర్ అండ్  క్లియోపాట్రా’ నాటకంలో థియోడాటస్ అనే అతను అలెగ్జాండ్రియా లైబ్రెరి తగలబడిపోతుంటే చూడలేక సీజర్ దగ్గిరకి వెళ్ళి బ్రతిమాలాతాడు. సైనికులని పంపి మంటలార్పమనీ, పుస్తకాలని కాపాడమనీ.  సీజరు ససేమిరా అంటాడు.

‘అక్కడాహుతౌతున్నది వట్టి కాగితాల కట్టలు కాదు.  మానవజాతి కష్టించి ఆర్జించుకున్న సంస్కృతీ, సంస్కార, సంప్రదాయాలు దగ్ధమౌతున్నాయి.  మానవజాతి సంపాదించుకున్న మధుర స్మృతులన్నీ మసైపోతున్నాయి’ అని అక్రోశిస్తాడు ధియోడాటస్.

‘నువ్వేమి చెయ్యకుండా కూర్చుంటే రాబొయ్యే తరాలవారు నిన్ను పుస్తకాల విలువ కూడా తెలుసుకోలేని మూర్ఖుడిగాను, ఆటవిక సైనికుడిగాను జమ కడతారు సుమా!’ అని సీజర్ని హెచ్చరిస్తాడు.

అలాంటి  సీజర్లింకా యీ యిరవయ్యో శతాబ్దంలో కూడా ఉన్నారా?  అని మనం సందేహించవల్సిన అగత్యం లేకుండా పోయింది: ‘ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వాతంత్యానికి పట్టుకొమ్మ అని, భూతలస్వర్గం (God’s own country) అని పేరు మోసిన అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది.’ “
అట్లూరి పిచ్చేశ్వర రావు వ్రాసిన విన్నవి – కన్నవి లో నుంచి.
నిన్న జరిగిన సంఘటన నాకు మా నాన్న వ్రాసిన పై పేరాగ్రాఫ్‌ని గుర్తు చేసింది.

కానీ దాని నేపధ్యం వేరు.

నిన్న సాయంత్రం యువ సాహితీ మిత్రుడు అనిల్ బత్తుల  (అతను ఈ భూమ్మిద పడకముందే ప్రచురించబడ్డ సోవియట్ పుస్తకాలు అతి ముఖ్యంగా వాటి తెలుగు అనువాదాలని ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ లో ఉచితంగానే అందరికి అందజేయాలనే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నవాడు) నాకు ఫోన్ చేసి, “సార్, పారిస్ పతనం మీ నాన్నగారే కదా అనువదించింది?  ఒక పాత ప్రతి ఒకటి ఈ హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఎక్కడో ఉందట!  ఇందాక ఫలానా వారు ఫోన్ చేసారు.  ఒక్కసారి మిమ్మల్ని కనుక్కుని కన్ఫర్మ్ చేసుకుందామని చేసాను సార్,” అని అన్నాడు.

అతను అడిగింది నిజమే!  The Fall of Paris ని వ్రాసింది  ఇల్యా ఎహ్రెన్‌బర్గ్ (Ilya Ehrenburg).  ఆంగ్లంలో తొలి ప్రచురణ 1940 ప్రాంతాలలో.

Ilya Ehrenburg
Ilya Ehrenburg Soviet writer, journalist, translator.

దాని తెలుగులో కి అనువదించింది అట్లూరి పిచ్చేశ్వర రావు.  సుమారు 840 పేజిలు.  తెలుగులో ప్రచురణ కాలం మార్చ్ 1960.

సరే, ఇక బుక్ ఫైయిర్ లో పారిస్ పతనం దొరకడానికి, మీ నాన్న వ్రాసిన దానికి, సీజర్ కి ఆ లైబ్రేరి తగలబెట్టడానికి సంబంధం ఏవిటి అనే దానికి వస్తున్నాను.

పారిస్ పతనం
పారిస్ పతనం – తెలుగు
“ఫాల్ ఆఫ్ పారిస్” కి అనువాదం

1980  ప్రాంతాలలో తానా సభలకి వెళ్ళారనుకుంటాను డి. వి. నరసరాజు గారు.  తానా పత్రిక లో ఏదో వ్యాసం కోసం వారికి ఫోను చేసినప్పుడు “ఇస్తాను, రండి ఇంట్లోనే ఉన్నాను,” అని అన్నారు.  ఆ సందర్భాన్ని కూడ గుర్తు చేసింది నిన్నటి అనిల్ బత్తుల ఫోన్ కాల్.

నరసరాజు గారు అన్నారు కదా, “అనిల్, పుస్తకాలు మన దగ్గిరే ఉంటే లాభం ఏమి ఉంది?  అవి ముద్రించింది పది మంది చదవాలనే కదా! మీరు తీసుకు వెళ్లండి.  చదవండి.  మీ పని అయిపోయిన తరువాత  నాకు తెచ్చి ఇవ్వండి.  మీరు నాకు ఇవ్వక పోయినా ఫరవాలేదు.  ఇంకేవరైనా చదువుతానంటే వారికివ్వండి,” అని.

పదిమంది చదవడానికి పుస్తక భాండాగారాలు అంటే లైబ్రేరిలు ఏర్పడ్డాయి.  ఆ భాండాగారాలలోని పుస్తకాలు ఇప్పుడు పదిమందికి అందుబాటులోకి వెళ్లకుండా దొడ్డి గుమ్మంద్వారా ఇలా బజారులోకి వస్తున్నాయ్యా?  అది హర్షణీయమా అన్న ప్రశ్న తలెత్తింది నాలో.

మా నాన్న గారి సాహిత్యం పునర్ముద్రణ కోసం నాకు ప్రస్తుతం అందుబాటులోలేని పుస్తకాలకోసం వెతుక్కుంటున్నప్పుడు సాహిత్యాభిమానులలో ఒకరిద్దరు తాము చూసామని దొరికిన రెండు మూడు పుస్తాకాలు సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రచురితమైన వాటి ప్రతులు కొని పంపారు.

840 పుటల పారిస్ పతనం, 1960 మార్చి ప్రచురణ, (బవుండ్ ఎడిషన్ అనేవారు) ప్రతి ధర 10 రూపాయలు.  ఈ రోజు అదే పుస్తకాన్ని బహుశ ఏ 250/- కో 300/- కో అమ్మినా కొనుక్కునే వారున్నారు. ఎందుకంటే అంత ధర పెట్టి ఆ ప్రతిని కొన్నవారిని నేనెరుగుదును.

మనకి తెలుసో, తెలియకో ఇలాంటి అరుదైన పుస్తకాలని ఏదో ఒక విధంగా సంపాదించి ఇలా అమ్ముకోవడాన్ని మనం సమర్ధించాలా అన్నది నా ప్రశ్న.  ఏదో ఒక పుస్తకమే కదా అని సరిపుచ్చుకోమంటారా?  అలా ఒక పుస్తకంతో మొదలైనది మరి రేపు లైబ్రేరిలను కొల్లగొడితే?  పది మంది కి అందాల్సిన పుస్తకాలు ఏ ఒక్కరి అలమారకో పరిమితమైతే అప్పుడేమంటారు?

దయచేసి మీ అభిప్రాయాల్ని క్రింది వ్యాఖ్యలలో తెలియజేయగోర్తాను.

తా. కలంహైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రతి అమ్ముడైపోయింది !  చి న.