నాలుగు అక్షరాలు – మూడు కథలు

ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని.
ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని.
మరొకరిని అడిగాను.  “అయ్ ఆమ్ ఎక్స్‌ప్రెసివ్” అని జవాబు.
ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”.
సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది.  దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు.  భాష అయ్యింది అది.  కథలు చెప్పుకోవడం మొదలయ్యింది.  అనుకుందాం! సరే మౌఖికంగా కథలు చెప్పుకుంటున్ననాటి నుంచి బూతులు, అసభ్యపదజాలం వాడుక దేశ కాల పరిస్థితులని బట్టి మారుతునే ఉన్నవి.  రోజు ఇంటా బయటా వింటున్నవేకదా?
ఫ్రీడ్‌మన్ అన్నట్టు,  డాల్ఫిన్స్ కి , వేల్స్ కీ కూడా భాష ఉంది.  మాట్లాడుకుంటాయి.  ఏనుగులు, కాకులు, కుక్కలు, పిల్లులు, పాములు అన్నింటికి ఒక భాష వుంది.  అన్ని ప్రేమించుకుంటాయి, కాట్లాడు కుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి అన్ని పనులు చేసుకుంటాయి.
“దిద్దుబాటు” తెలుగులో తొలి కథ అని అన్నారు. అబ్బే లేదు..ఇంకా చాలా కథలున్నవి  (దాదాపు ఒక తొంభై దాకా అని ఒక అంచనా!) దానికి ముందే అని తెల్ఛేసారు. రేపో, మాపో అవి మనచేతుల్లోకి రానున్నవి. (బహుశ ఈ  2014 లోనే రావచ్చు).దిద్దుబాటు ని షార్ట్‌ఫిల్మ్‌గా కూడా తీసాడు అట్టాడ అప్పల్నాయుడు గారి అబ్బాయి సృజన్.
సరే, దిద్దుబాటుతోనే మొదలు పెడదాం.
మరి ఆ రోజే సాని కొంపలున్నవిగా?
మగాడు తిరుగుతునే ఉన్నాడుగా?  ఆవిడ ఇంట్లోనే ఉందిగా?
“కన్యాశుల్కం” నుంచి, ఈ రోజు “వాడి పాకేజి నాకంటే తక్కువలేవే..వాడ్ని నేనెలాచేసుకుంటానే మమ్మీ?” అని ఈ రోజు చదువుకుని,ఉద్యోగంచేసుకున్న యువతి గారాలు పోతోంది.దిద్దుబాటు వెలువడిన సాంఘిక నేపధ్యం ఏమిటి?  దేశ కాల పరిస్థితులేమిటి?  ఈ రోజు దేశ కాల  పరిస్థితులేమిటి?  ఎరుపు రోజుల్లో కథకి ఒక సాంఘిక బాధ్యత ఉంది అని అనుకుని వాళ్ళు కథలు, నవలలు, కవితలు, నాటికలు గట్రా వ్రాసుకున్నారు.  అవి “గర్జించు రష్యా” రోజులనుకుంటే ఇవి “గాండ్రించు అమెరికా ” రోజులనుకోవచ్చు.  మరి మార్పు రాలేదా?మూలింటామె లో లాగా పందొసంత లాంటి వ్యక్తులు లేరా? అంటే ఉన్నారు! ఇప్పుడు కాదు..అనగనగా అప్పుడెప్పుడోనే ఉన్నారు.  ఈ రోజు బయటికి వచ్చిందా?  కాదే?  పల్లెటూళ్ల లో పాలేర్లు, రైతులు, రైతు కూలీలు అయితే, పట్టణాలలో సేల్స్ గరల్స్, ఆఫీసులో క్లెర్క్‌లు వాళ్ళ రాసలీలల మీద ఎన్ని కథలు రాలేదు!
మరి “అరుంధతి” (ఉన్నంతలో – రాజారామ్మోహనరావు – 2012 స్వాతి మాస పత్రికలో) రామారావు పక్కలోకి వెళ్ళలేదేం? (కథ 2012 సంకలనం – సం:  వాసిరెడ్డి నవీన్, శివశంకర్ పాపినేని)
కాబట్టి ఆ మార్పుని ఒప్పుకున్నవాళ్ళు ఈ మార్పులని కూడా అంగీకరించాలి.
అలాగే చదవతగ్గ రచన ఏదైనా సరే చదువుతారు.  దానికి భాష అడ్డం రాకూడదు.  కాని వచ్చేసిందిగా?!
భాషే కాదు.  వస్తువులో కూడా మార్పులు వచ్చేసినవి.

* * *

ఈ మధ్య వచ్చిన కథ ఒకటి.
ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ ని వ్రాసింది కాశీభట్ల వేణుగోపాల్.
ఈయన “F” నాలుగు అక్షరాల పదాన్ని ఆంగ్లంలోనే అయినా వాడారు.  (ఈ నాలుగు అక్షరాల ఎఫ్ పదం ఏమిటని అడగేవారి కోసం కాదు ఇది వ్రాస్తుంట!)  అందులో ఎబినేజర్ పాత్రకి కళ్ళలో ఒక దానికి శుక్లం వచ్చింది.  శుక్లాన్ని ఆంగ్లంలో కాటరాక్ట్ అంటారు. కాటరాక్ట్‌ని కొన్ని ప్రాంతలలో కొంత మంది “కన్ను పూసింది” అని అంటారు. శుక్లం ని “కన్ను లో పూత” అని కూడ చెప్పుకుంటారు.   అంటే ఈ కథలో ఎబినీజర్ అనే పాత్ర కన్నుపూచింది.  కన్నులో పూవు.    కన్నులో పూవు ఉంది కాబట్టి ఆ వ్యక్తికి  *పూకంటోడు అనే మారుపేరు (నిక్‌నేమ్) ఎగతాళిగా పిలుచుకునే పేరు పెట్టారు.ఆ మారుపేరు తన పాఠకులకు అమోదయోగ్యంకాదని ఒకరో ఇద్దరో సంపాదకులు అభిప్రాయపడ్డారు.  ఆ మారుపేరులో వారికి బూతు వినపడింది.  అంతే కాదు వారికి అసభ్యంగాను అభ్యంతరకరంగాను తోచింది.  రచయితకి ఒక సూచన చేసారు.  ఎబినేజర్ “మారుపేరు” (nickname) మార్చండి. ఆ కథని మేము ప్రచురిస్తామని.  రచయిత ఒప్పుకోలేదు.  రచయిత “మా ప్రాంతంలో అలా కన్నులో పూత అంటే శుక్లాలున్నవాడిని అదే పేరుతో పిలుస్తారు.  అది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది కాబట్టి నేను మీ సూచనను అంగీకరించను.  మీరు కథని ప్రచురించకపోయినా ఫరవాలేదు” అంటూ వివరణ ఇచ్చారు.
ఆ పత్రిక సంపాదకులు అంగీకరించలేదు.  కాబట్టి ఆ కథని అచ్చులో చదువుకునే అదృష్టం కొంత మంది పాఠకులకి దక్కలేదు.  కొంతమంది జాలపాఠకులకి (online readers)  ఆ దురదృష్టం కలిగింది.  అవును,  ఎవరు దీన్ని గురించి మాట్లడుకున్నట్టు కనపడలేదే!?

 F word and Telugu stories
నాలుగు అక్షరాలు – మూడు కథలు

మరో కథ

వాకిలి *వెబ్‌జైన్ లో పునీత కథ.
ఇందులో లచ్చుమమ్మ మొగుడు కామేశ్వరరావు.  ఆ లచ్చుమమ్మ వయసు  దాదాపు 39 ఏళ్ళు.  కాలేజిలో చదువుకునే సరయు ఈ దంపతుల కూతురు. మురళి లచ్చుమమ్మ మేనల్లుడు. డాక్టరి చదువుకుంటున్నాడు.  వాడి దృష్టి తన మీదకు “మళ్ళించుకోవడానికి సరయు తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు.” అని ఆ తల్లి స్వగతం.  మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా?  మురళీ తన మేనత్త తో గడపటానికే వాళ్ళింటికి  వెళ్ళడం. ఎందుకని అంటే ఆమెకి “చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది” అనుకుంటుంది. లచ్చుమమ్మ  మళ్ళీ మరో మాట కూడా అనుకుంటుంది “అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అని.
ఎబనీజర్ పాత్ర వాడి పూకంటోడు అనే పేరు 2014 లోదే.
అరుంధతి పాత్ర 2012 లోదే
పునీత పాత్ర 2014 లోదే.
ఈ మూడు కథలని చదువుకున్నవారు ఉన్నారు.
మరో కథ
కీమో ఈ కథ వ్రాసింది వంశీధర్ రెడ్డి.  వైద్యుడు.
“కీమో” కథలో ఆరు చోట్ల *F* పదం వాడారు రచయిత. అది ఆంగ్ల పదం అయినా సంభాషణలు ఇంగ్లిష్‌లో కాబట్టి ట్రాన్స్‌లిటరేటేడ్ పదం అది. మరి ఇందాక భాష అనుకున్నామే?!  మరి ఇక్కడ ఇది కూడా వచ్చేసిందిగా?!

మరో సందర్భం;
ఈ సారి ఏకంగా ఒక వెబ్‌జైన్ సంపాదకుడే వాడేసుకున్నారు F పదాన్ని!
ఆయన మాటల్లోనే “I fucked up so many relationships. I want us to be a success“.
మరి దీనికేమంటారు ?

మరి మంచుపూవు లోని కావేరి కూతురు ప్రియ లో భార్యని చూసుకున్న తండ్రి ఆలోచనలని వెలికి తెచ్చిన రచయిత ని ఏంచెయ్యాలి?మొన్న వేదిక సమావేశం లో ఒక ఆంగ్ల కధని పరిచయం చేసాను.  Ba-Boon – థామస్ పియర్సన్ వ్రాసిన కథ అది. 2014 లొనే వచ్చిందా కథ.  అన్ని తనే అయిన సోదరుడు ఒకానొక దుర్ఘటనకి గురైన తరువాత అతని చెల్లెలు అతనికి తోడై ఉండాల్సిన పరిస్థితి.  తన బాయ్‌ఫ్రెండ్‌తో ఒకానొక సందర్భంలో ఒక compromising situation లో వీడియో షూట్ లో పాల్గొంటుంది.  ఆ టేప్ తెచ్చుకోవాలి.  కొన్ని వందల వీడియో టేపులన్నింటిని చూస్తేగానీ ఏది తనది అన్నది తెలియదు.  మరి సొంత అన్నతోనే ఆ వీడియో చూడాలా?  ఈ అంశాన్ని ప్రంపంచంలోని ప్రతి ఆంగ్ల పాఠకుడు అంగీకరిస్తాడా?
కొవ్వలి నవలలని  జాకెట్లలలో, లంగాలలో, ఓణీలలో దాచుకుని చదువుకునే వారు ఒకనాటి చదువుకున్న స్త్రీలు. అలాగే మధు పుస్తకాలని కూడా దాచుకుని చదువుకునేవారు ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద,  ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద  కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది.  కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి  బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాలం లోనే వెబ్‌జైన్‌లలోనే వెలువడ్డవి. అంతర్జాలానికి ఎల్లలు లేవు.  అలాగే అక్కడ స్వేచ్చమీద కట్టడి లేదు.కా రా మాస్టారు అన్నట్టు:  ”  చీకటిలో ఉన్నా కొందరందులో వెలుగుని గురించి రాస్తారు.  వెలుగులో ఉంటూ జీవితం లోని చీకటి గురించి రాస్తారు.  వెలుగే తప్ప చీకటిని ఎరుగని వారు అందులోని నీలి నీడలనే చీకటిగాను, మరి కొందరు చీకటి చీకటి కాదని, వెలుగే చీకటి, చీకటే వెలుగని రాస్తారు”          ( కా రా రచనలు పుట 379).
ఆయన వ్రాసిన సందర్భం వేరైనా ఈనాటి కథకులకి, పాఠకులకి తెలియాల్సి ఉంది.

ఆంక్షలు పెట్టకండి.వచ్చేవి ఎలాగు వస్తాయి.  పొయ్యేవి ఎలాగూ పోతాయి.
మంచి ముత్యాలని ఏరుకోవడమే మీరు చేయగలిగింది!
ఏది మంచి?  మీకు ఏది మంచి అని తోస్తే అదే మంచి!!

ఒక జ్నాపకం

అప్పట్లో  దేవ భాష అన్నారు. గ్రాంధికం అన్నారు.  వ్యావహారికం అన్నారు.  మాండలీకం అన్నారు.  నుడి అన్నారు.  ప్రాంతీయం అన్నారు.  యాస అన్నారు. ఇదే మా బాస అంటున్నారు.  భాషకి బాసకి తేడా తెలియకుండా పోయింది.   వెల్లు,  (వెళ్ళు అని అర్ధం చేసుకోవాలి). ఇలా కోకొల్లల్లు.  జ్నానమా..జ్ఞానమా?  ఇదే ప్రామాణికామా?
jnaప్రతి ప్రాంతానికి, ఒక భాష, ఒక మాండలికం ఉన్నట్టు,  ప్రతి రచయితకి ఒక స్పెల్లింగ్ స్టైల్ ఉంటుందా?  భాష కి ఎల్లలు లేవు.  ఉండకూడదూ కూడా! రచయితకి అచ్చుతప్పులుండవా?  అసలు తప్పులేకుండానే వ్రాస్తున్నాడా?  ఆ రచయిత వ్రాసినదే ప్రామాణికమా?   జ్నానమా..జ్ఞానమా?  ఏది ఒప్పు?  ఏది తప్పు?

కంప్యూటరులో టైపింగ్, టైము లేదనడం సరికాదు.  అంత అర్జంటు గా ఆ సెండ్ బటని నొక్కకపోతే ఏమయ్యింది?  ఎందుకని ఈ అసహనం? ఇది అడిగినవాడు చాందసుడా, సనాతన వాదా?  అది మీకే తెలియాలి!

వ్రాసేవాడికి చదివేవాడంటే లోకువ! మరి అంతలోకువా? పాఠకుడంటే అంత నిర్లక్షమా?  తాను ఏది వ్రాసినా, చదివేసే గాడిదా?  అంత అహంకారమా?  మనకొక సామెత ఉంది.  అన్ని ఉన్న ఆకు, అణిగి మణిగి ఉంటుంది అని! ఎదిగిన కొద్ది, తగ్గి ఉండటం అంటే అదే మరి!

ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు

మొన్న ఎలక్షన్‌లో గెలిచిన నరేంద్రమోడి గెలుపుకి పుస్తకాలకి సంబంధం ఏమిటా?  అంతర్జాలం.  సోషల్ మిడియా!

తొలి ముద్రణ 2013.  మలి ముద్రణ 2013.  అమ్మకాలు దాదాపు ముప్పై ఐదు వేలు.  పుస్తకం ఆవిష్కరణ సభ భాగ్యనగరం లో పెద్ద హోటలు. ఐదువందల రూపాయలు నోట్లు ఇచ్చిన వారు, చేతికి అందిన ప్రతులు అందుకున్నారు. చిల్లర అడగలేదు.  తెలుగు పుస్తకమే.  ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు..

మరో మంచి హోటల్ లో పుస్తక ఆవిష్కరణ.  తొలి ముద్రణ ఆగస్టు 2013.  అమ్మకానికి ప్రతులు లేవు. మలి ముద్రణ డిసెంబరు 2013. కథకుడు మరో ముద్రణ గురించి ఆలోచిస్తున్నాడు.

తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.

మరో పుస్తకం. మూడవ ముద్రణ.  కొన్ని వేల ప్రతులు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.

పైన నేను ఉదహరించిన తెలుగు పుస్తకాలన్నింటిని చదవాలని, కావాలని పాఠకులు కొనుకున్నారు.

మూడు పుస్తకాలు తెలుగులోనే ఐనా వాటిలోని విషయాలు విభిన్నమైనవి.  ఒకటి కధా సంకలనం.  ఒకటి జీవిత చరిత్ర. మరొకటి సాహిత్య పురస్కారం అందుకున్నది.

మొన్న ఏప్రిల్ లో నెల్లూరులో మరో పుస్తకం ఆవిష్కరణ.  వేదిక దగ్గిర ప్రతులు అమ్ముడైపోయినవి.  పుస్తకాలు కావాలి.  ప్రతులు లేవు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు…కొనుక్కున్నారు.  కొంతమంది పదుల ప్రతులు కొనుకున్నారు.

నేనిక్కడ ఉదహరించినవి నా దృష్టికి వచ్చిన వాటిల్లో మూడో నాలుగో పునర్ముద్రణలు మాత్రమే!  ఇవి కాక ఇతర ప్రాంతాల్లో పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకాలు అనేకం! ఇవికాక ప్రచురణకర్తలు పునర్ముద్రించుకుంటున్నవి అనేకం ఉన్నవి!  ప్రవాసాంధ్రుల ప్రచురణలు?

అనంతరామ్ పేరు విన్నారా?  మొన్నామధ్య ఏప్రిల్‌లో పెళ్ళి చేసుకున్న అనంతరామ్ కొంతమంది బ్లాగర్లకి మాత్రమే తన బ్లాగు ద్వారా పరిచయం. రెండువేల పదమూడులో రామ్@శ్రుతిడాట్‌కామ్ అనే శీర్షికతో ఈ నవ యువ రచయిత  తన తొలి ప్రేమకధా నవలని ఈబుక్ గా ప్రచురించుకున్నాడు.  తొలుత అది ఈబుక్‌గానే వెలువడింది. ఆ  నవల తొలుత అచ్చులో వెలువడలేదు.  ఈబుక్‌ అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో తన పుస్తకం అచ్చువేసుకున్నాడు.  తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు. కొనుక్కున్నారు.  (పాఠకమహాశయా! ఈ యువ నవ రచయితని ఈ వ్యాసకర్త ఇప్పడిదాక కలవలేదు.  కనీసం ఆ రచయిత వివాహానికి ఆహ్వాన పత్రిక అందుకున్న గుర్తు కూడా లేదు).

ఒకప్పుడు రచయితలకి సిగరెట్ల పాకెట్టిచ్చి,  తేనిరు పోసి, హ్విస్కి లు తాగించి, పుస్తకాలు వ్రాయించి, డబ్బు పెట్టుబడి పెట్టి, ఆ పుస్తకాన్ని ప్రచురించి, లాభాలార్జించి , భవంతులు కట్టుకున్న ప్రచురణకర్తలున్నకాలం తెలిసినవారుండేవుంటారు మీ పాఠకులలో.  అవి ఆ రోజులు.

తన పుస్తకాల అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో పిల్లలకి చదువులు చెప్పించుకుంటూ, విదేశాలలో ఉద్యోగాలకు పంపించుకుంటూ, భవంతులు కట్టించుకుని, కారులలో షికారులు చేస్తూన్నాడు ఈ రోజు రచయిత. ఇవి ఈ రోజులు.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాక.. అదిలాబాదు నుండి తిరుపతి దాక ఉన్న తెలుగు రచయితల సాహిత్యం ఈ రోజు అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చింది.  ఆక్‌లాండ్ నుండి, ఆసియా నుండి, ఆఫ్రికానుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల దాక కాక వాటిమధ్యనున్న దేశాలలోని తెలుగు పాఠకుడు ఈ రోజు తెలుగు పుస్తకాలు కొనుక్కుంటున్నాడు.  చదువుకుంటున్నాడు.  లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాడు.  ఏటా, అనధికార గణాంకాల ప్రకారం సుమారు గా పదిహేను కోట్ల రూపాయల విలువగల పుస్తక క్రయ విక్రయాలు జరుగుతున్నవీ.  ఈ లెఖ్ఖలలో జాలం ద్వార అమ్మిన అచ్చు పుస్తకాలు కాని డిజిటల్ పుస్తకాలు కాని కలపలేదు.  అలాగే విదేశాలలో ముద్రిణపొంది అమ్ముడవుతున్న పుస్తకాల గణాంకాలు లేవు!  ఐనా ఇవన్నీ తెలుగు భాషవి మాత్రమే సుమా!  తెలుగు వారెంతమంది?  ఆ మధ్య పదిహేను / పదహారు కోట్లమంది ఉన్నారని అన్నారుగా.  ఆ మాటే ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం ఒక రూపాయి వెచ్చించినట్టే!

ఎన్నికల లెక్కల్లో కొంచెం అటు ఇటుగా ఎనిమిది కోట్ల మంది అని తేలిందా?  పోని అదే లెఖ్ఖ వేసుకుందాం!  ఆ లెఖ్ఖన సగటున ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం రెండు రూప్యంబులు వెచ్చించెనన్నమాట!  ఇప్పుడు చెప్పమనండి..తెలుగు ఎలా చచ్చిపోతుందో, తెలుగు భాష ఎలా చచ్చిపోతుందో, తెలుగు పుస్తకం ఎలా అవసాన దశకి చేరుకుందో రుజువు చెయ్యమనండి!! చూసే వాడి చూపులో ఉంటుంది అందం అన్న చందానా,.పచ్చ కామెర్లవాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది.

అది నేటి సాహిత్యం పరిస్థితి.  ఇక తెలుగు చచ్చిపోయింది. చచ్చి పోతోంది.  ఇక తెలుగు చదివేవారు లేరు అనేది ఎవరో మీరే నిర్ణయించుకోండి.

ఒక యువ నవ కథా రచయిత, ఒక సాయంత్రం ఒక సాహిత్య సభ దగ్గిర నా బుర్ర తిని (తినిపించుకునేవాడుంటే బుర్రలు తినడం నాకు చాలా ఇష్టం) ఒకటో రెండో సంవత్సరాలు ఆలోచించుకుని మొన్నిమధ్య అచ్చు పత్రికలలో వెలువడ్డ తన కధలన్నింటిని గుదిగుచ్చి ఒక సంకలనంగా వెలువరించాడు.  ఆవిష్కరణ సభకు ముందే తనకు తెలిసిన పుస్తకాల దుకాణాలలో పాఠకులకు అవి అందుబాటులో ఉండే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే జాలంలో ఈబుక్‌గా దేశవిదేశాలలో అవిష్కరణ సమయానికి వెలువడేటట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడు.  అంతర్జాలంలో అంటే ఆన్‌లైనులో  సాహిత్యానికి, తెలుగు భాషకి, తెలుగుకి సంబంధించిన దాదాపు ప్రతి సమూహంలోను తన పుస్తక ఆవిష్కరణ గురించి పదిమందికి తెలిసేటట్టు ముఖపత్రాల రూపురేఖలు, రంగులు, అక్షరాల ఎంపిక  దగ్గిరనుండి ప్రచారం చేసాడు.

పది పత్రికల కార్యాలయా మెట్లు, లిప్ట్‌లు ఎక్కాడు.  తెలిసిన పదిమంది పాత్రికేయ మిత్రులని తన పుస్తకం గురించి సమీక్షో, పరిచయమో, స్వీకారమో, కనీసం ఒక వాక్యమో, ఏదో ఒకటి వ్రాయమని అడగడమో, బతిమాలడమో చేస్తూ తలా రెండు ప్రతులు అందించాడు. తెలియని వారిని పరిచయం చేసుకుని వారి చేతికి తన ప్రతిని అందించి సవినయంగా మరీ అడిగాడు.

నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా తనకు తెలిసిన బ్లాగర్లని, జాలపత్రికల సంపాదకులని, తోటి రచయితలని అందరిని తన పుస్తకం గురించి తమ పత్రికలలో, బ్లాగులలో, పేజిలలో, కాలంలలో, వెబ్‌సైటులలో వెబ్‌జైనలలో వ్రాయమని అడిగాడు.

ముందే నిర్ణయించుకున్న ఒకానొక సాయంత్రాన ఆవిష్కరణ సభ కావించాడు. సభ పేలింది. అమ్మకానికి ఆవిష్కరణ సభలోనే కొన్ని ప్రతులని అందుబాటులో ఉంచాడు.  అమ్మినవి అమ్మగా..ఉచితంగా ఇచ్చినవి కూడ ఉన్నవి.  (నాకు ఇంకా ప్రతి ఇంకా అందిలేదు. పైగా నేను ఆ ఆవిష్కరణ సభలో పాల్గొనలేదు. అది వేరే విషయం). ఇంత వివరంగా మీకు ఎందుకు తెలియజేయవలసి వచ్చినదంటే..దమ్ముంటే నా పుస్తకం అమ్ముడవుతుంది అని అనుకోరాదని.  ఆ రోజులు చెల్లిపోయినవని మీకు తెలియజేయడానికే.  బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి!

పొద్దున లేచినప్పటినుంచి ఫోను‌లో ఎస్ ఎమ్ ఎస్‌లు, దినపత్రికలు తెరిస్తే వార్తల సంగతి తరువాత, ముందు ప్రకటనలు.  దిన పత్రికల వారు సొమ్ము పుచ్చుకుని వేసే ప్రకటనల మధ్య మళ్ళీ లీఫ్‌లెట్లు, కరపత్రాలు.  ఇంటి గేటుకి ప్లేటులు, కారు బంపర్ మీద స్టికరు, బైకు నెంబరు ప్లేటు మీద ప్రకటన, బస్సు సీటు మీద ప్రకటన, రహాదారికి అటూ, ఇటూ హోర్డింగులు. ఇది గాక స్కూలు ఫీజులు, ఫేర్‌వెల్ పార్టి చందాలు, హాస్పిటల్ బిల్లులు,  కట్టవలసిన కిస్తీలు, ఈఎమ్‌ఐలూ ఇలా సవాలక్ష సమస్యలు ఈ జీవికి.  వీటన్నింటి మధ్య మీ పుస్తకం కనపడాలి.  కుదిరే పనేనా?

అందుకనే అనేది ఇందాక చెప్పానే ఈ నవశకం యువ రచయిత చేసిన పనులన్ని చెయ్యాలి!  నా పుస్తకం దమ్ముంది అనుకుంటే చాలదు.  దమ్ముంది అని ఆ చదువరికి చెప్పాలి.  ఉన్నది లేనిది పాఠకుడు నిర్ణయిస్తాడు.

కాబట్టి ఓ రచయితా, నీ డబ్బుతో ప్రచురించుకున్న నీ పుస్తకం పదిమందికి అందాలంటే ముందు దానిని గురించి వారికి తెలియజేయి.  అంతేగాని ఉచితంగా ఇచ్చేయ్యకు.  అదేదో సామెతుంది.  ఉచితంగా వస్తే ఫినాయిలు కూడా తాగే మనుషులుంటారని!

గెస్ట్‌కాలం – ఈ రీడింగ్

ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్
ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక,  ఫామిలీ లో మొదలైన గెస్ట్‌కాలం లో వచ్చింది.  పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు.  ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది.  అన్నట్టు ఈ గెస్ట్‌కాలం ప్రతి బుధవారం వస్తుంది.  ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు.  ఇక వ్యాసం ఇది.  స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది.  పూర్తి పాఠం తరువాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇక్కడే పోస్ట్ చేస్తాను.

సూచన: బొమ్మ మీద క్లిక్ చెయ్యండి.  సులభంగా చదువుకోవచ్చు

e reading easy reading

I found Telugu literature dead

ఏప్రిల్ నెలలో విడుదలైన మిసిమి లో వెలగా వెంకటప్పయ్య గారు ఒక వ్యాసం వ్రాసారు.  దాని మకుటం “విదేశీయులు ప్రచురించిన తెలుగు గ్రంధాలు“.  (పుట 58 – 62).  అందులో బ్రౌన్ దొర గారి ప్రస్తావన కూడా ఉంది.  1825 లోనే దొర ” I found  Telugu literature dead ” అని వ్యాఖ్యానించాడు.  దాదాపు 30 సంవత్సరాల తరువాత ” In thirty years raised it to life” అని కూడా అన్నాడు.

Charles Philip Brown

చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, ఒక ఇంగ్లిష్ దొర మన భాష కోసం పడ్డ కష్టం ముందు, మనదెంత.  మనకున్న వనరుల ముందు ఆ దొరకున్నదెంత?  ఆయన చేయగాలేనిది, మనం ఈ రోజున ఉమ్మడిగా నైనా చెయ్యలేమా?

కినిగె లో మిసిమి ని ఇక్కడ కొనుక్కోవచ్చు, లేదా అద్దెకి చదువుకోవచ్చు!

ఈబుక్స్‌కి లేవా సమీక్షకు అర్హతలు!

పిలల్ల నామకరణానికి నేమ్స్ కోసం నెట్‌ని ఆశ్రయిస్తాం.
వాళ్ళ సందేహలు తీర్చడానికి జాలంలో జవాబులు వెదుక్కుంటాం.
అర్ధాలు చెప్పడానికి ఆన్‌లైన్ డిక్షనరీలు చూసుకుంటాం.
ఆ పిల్లల పరిక్షా ఫలితాలని ఇంటర్నెట్ ‌లో తెలుసుకుంటాం.
ఉద్యోగాలకి ఇంటర్నెట్‌లో అప్ప్లై చేసుకుంటాం.
ప్రేమలేఖలు, ఊస్టింగ్ ఆర్డర్లు, గ్రీంటిగ్‌లు ఆన్‌లైన్‌లో అందుకుంటాం.
ఫేస్‌బుక్కు‌లోను, జీప్లస్సు‌లోను స్నేహాలు చేస్తాం.
కోడల్లని, అళ్ళుళ్ళని నెట్‌లో వెతుక్కుంటాం.
బస్సు టికెట్లు, రైలు టికెట్లని, సినిమా టికెట్లని ఇంటర్‌నెట్‌లో కొనుక్కుంటాం.
పాన్ కార్డ్లు, వోటర్ కార్డులకి ఫారాలు ఆన్‌లైన్లో నింపుతాం.
RTI రా భయ్, అని వాడ్ని ఆన్‌లైన్‌లో నిలదీస్తాం.
పత్రికలని, కథలని, కవితలని ఆన్‌లైన్‌లో చదువుకుంటాం.
స్టోరిని, ఫీచర్‌ని, కవరింగ్‌ని, ఐటంని ఈమైల్‌లో పంపుకుంటాం.

EBook

ప్రింట్ బుక్ ని, డి‌వి‌డిని, ఈబుక్ ని ఆన్‌లైన్‌లో కొనుక్కుంటాం.
కొనుక్కున్న ఈబుక్‌ని కిండిల్ లోను, ఐపాడు లోను అందరూ గమనించేలా చూసుకుంటాం.  లాప్‌టాప్‌లోనూ, డెస్క్‌టాప్‌లోను అప్పుడప్పుడూ చదువుకుంటాం.

ఉచితం  గా పుస్తకాలని అందుకుంటాం, స్వీకరిస్తాం, రివ్యూ చేస్తాం, సమీక్షిస్తాం. పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో దొరుకుతుంది అని కూడ పాఠకులకి చెబుతాం. తన ఈ బుక్ గురించి రచయిత తెలియజేస్తే, అది మాకూ తెలుసన్నట్టుగా బుర్ర ఊపుతాం.

కాని..
కాని
ఈబుక్ గా వెలువడిన సాహిత్యాన్ని గుర్తించం. ఒకవేళ గుర్తించినా స్వీకరించం. స్వీకరించినా రివ్యూ చెయ్యం, సమీక్షించం, ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరుకుతుందో అని కూడా పాఠకుడికి తెలియజేయం. అదేమిటంటే ఈబుక్స్ గురించి అందరికి తెలిదుగా అని అనేస్తాం. స్పేసు లేదండి అని అంటాం. పైగా మిగతావాళ్ళేవరూ, ఈ భాషలోను చెయ్యటం లేదుగా అని కూడా అనేస్తాం. మరీ ఐతే, టెక్ని‌కల్ సమస్యలున్నాయని దాటేస్తాం.

అదే మా వాడేతే భుజాలమీదకెక్కించుకుని ఊరేగిస్తాం.

కాని మా సాహిత్యాభిమాన్నాన్ని శంకింస్తే మాత్రం ఊరుకోం!

కొసమెరుపు ప్రాసారమధ్యమాలలో పనిచేస్తున్నవారి పుస్తకాలు కూడా kinige.com లో ఉన్నవి.  కనీసం ఇప్పుడైనా ఈ సాహిత్యాన్ని ఈ ప్రసార మాధ్యమాలు గుర్తిస్తాయని, దానికి సముచిత స్థానాన్ని కలిపిస్తుందని ఆశిస్తాను.

మో “బ్రతికిన క్షణాలు” లో కొన్ని..

ఆరేళ్ళో అరవై ఏళ్ళో బ్రతుకుతాం.  ఆరేళ్ళముందెలా పుట్టామో ఎవడికి తెలీదు.  అరవై తర్వాత ఎలా చస్తామో మనకి తెలీదు.  తీసుకు తీసుకుని తడిసిన నులక మంచానికి తప్ప ఆరు నుంచి అరవైదాక ఈలోపల బేరామాడ్తాం. చివరకు గిట్టుబాటవుతుంది తప్పక.

ఒకే కవితకు ఆరు అర్థాలు ఒస్తాయని ఒకడు అమ్మ చూపుతాడు.  ఆరూ అనర్థాలే.  అసలు అర్థం అమ్మేవాడికే తెలీదు. కొనేవాడు నూరర్థాలు అడుగుతాడు – ఓ శతాధిక గ్రంధకర్తని.  శతపత్ర సుందరిని అరవై ఏళ్ళ ఆంధ్ర కవిత్వాన్ని ఆరు రూపాయలకే అచ్చెయ్యమంటాడు అరసున్నాలకి అమ్ముడు పోయేవాడు.

మో వీటిని ‘పద మూర్చన’ లన్నాడు. చచ్చిన తర్వాత చెప్పే మొదటి మాటలంట!  పైగా అంటాడు..”వాస్తవాన్ని అధివాస్తవికంగా మలుచుకునే ప్రయత్నంలో వచనం విరిగి ముక్కలయ్యి ఆ గాజు పెంకులు పద్యానికి గుచ్చుకొంటాయి”ట.

“ప్రతి నేనుకి ఒక మేనుంటుంది.  నేను లోంచి మేము, మనం అవటానికే ఏ రచన అయినా.  తారీఖులూ, దస్తావేజులూ ఏమిలేని అనామక స్వీయ జీవన చిత్రణ ఈ ‘బతికిన క్షణాలు‌’.  దృశ్యం అదృశ్యంగాను శబ్దం నిశ్శబ్దంగానూ రంగులు పులుముకుని మాటలుగా మ్రోగుతాయ్.

అంతాలో ఎంతో కొంత యిది.

ఎక్కువ మాట్లాడే వాడు ఏది చెప్పడు.

నిశ్శబ్ద క్షణంలో శాశ్వత శబ్దాన్ని పట్టుకోవాలని

ఈ నూత్న యత్నం”.

వెతకండి..ఎక్కడన్నా దొరికితే, దొరకబుచ్చుకుని చదవండి. చదివి ఆ “బతికిన క్షణాలు” మళ్ళీ బతకడానికి ప్రయత్నించండి.

ఎందుకంటే “మో” ఆ “బతికిన క్షణాలు” అన్నింటిని ఐదు వందల ప్రతులకి మాత్రమే పరిమితం చేసాడు..అది ఒక దశాబ్దం క్రితం!

మో “బ్రతికిన క్షణాలు” తొలి ముద్రణ 1990 – మలి ముద్రణ  2000

ఫైర్‌ఫాక్స్ లో తెలుగులో టైప్ చెయ్యడానికి ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్‌టెన్షన్

ఫైర్‌ఫాక్స్ (Firefox) ని మరింత శక్తిమంతమైన విహరిణిని (browser) చేసేవి,  దానికి వాడే ప్లగ్‌ఇన్ / ఆడ్ఆన్ లు /  ఎక్స్‌టెన్షన్‌లు (Plug-ins, Add-on, extensions). తెలుగులో వీటిని ఉపకరణములు అని పిలుచుకోవచ్చు.  ఈ ఉపకరణాలలో తెలుగు భాషలో టైప్ చేయ్యాలనుకునే వారికి ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ అతి ముఖ్యమైనది. తెలుగు పదాన్ని ఇంగ్లిష్ భాషలో టైప్ చేస్తే,  ఈ ఉపకరణం మీ విహరిణి లో తెలుగు పదాలను చూపిస్తుంది.

హాట్‌మైల్, జీమైల్, యహూ మైల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆర్కుట్ మొదలైన సోషల్ మెడియాలలో తెలుగు ని అంగ్లంలో బదులు, మన తెలుగు భాషలోనే టైపు చేసుకోవడం ఎలా అన్నది ఈ టపా ఉద్దేశం.  తెలుగులో టైప్ చేసుకోవడానికి చాల పద్ధతులున్నవి.  వాటిలో ఇది ఒకటి.

ఉదాహరణ: నా పేరు: అనిల్. దీనికి ఇంగ్లిష్ స్పెల్లింగ్ Anil.  ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ (Indic Input Extension) అనే అడ్‌ఆన్‌ని స్థాపించుకుని (install) ఇంగ్లిష్ లో Anil అని టైప్ చేస్తే అది అనిల్ అని తెలుగులో చూపిస్తుంది.

మరొక ఉదహరణరాముడు మంచి బాలుడు అని మీరు తెలుగులో టైప్ చెయ్యాలనుకుంటే Raamudu maMci baaludu అని ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే అది తెలుగులో రాముడు మంచి బాలుడు గా మార్చి చూపిస్తుంది.

దీనికి మీరు చేయ్యవలసినవి:
మొదటి సోపానం (First step)     మంట నక్క (Firefox) విహరిణి (browser) నిMozialla Firefox Browser - మంటనక్క విహరిణి

ఇక్కడ నుండి దిగుమతి (download) చేసుకుని మీ కంప్యూటర్ మీద స్థాపించుకోండి.

రెండవ సోపానం (Second step) మీ మంటనక్క విహరిణి ని డబల్ క్లిక్ చేసి మొదలుబెట్టండి.  ప్రసాద్ సుంకరి గారి  ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ ని ఇక్కడ నుండి దిగుమతి (download) చేసుకోవాలి.

Prasad Sunkari's Indic Input Extension. You can choose from any one of the 26 options.

మూడవ సోపానం (Third step)ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ (Indic Input Extension) ఇన్‌స్టల్ చేసిన తరువాత మళ్ళీ మంటనక్క ని మొదలు పెడుతుంది.  ఇప్పుడు మీ విహరిణి లో క్రింద నున్న స్టేటస్ బార్ మీద కుడి చేతి వైపు మీకు ఒక చిన్న భారత దేశ పతాక చిహ్నం కనపడుతుంది.  దానిమీద మళ్ళీ క్లిక్ చెయ్యండి.  భారత దేశ భాషలు కొన్ని కనబడుతాయి.

ఆ ఆప్షన్స్ లో (options) తెలుగు – RTS ని ఎన్నుకోండి.

ప్రసాద్ సుంకరి గారి ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ (Indic Input Extension)

ఇక మీరు తెలుగులో టపాయించడానికి తయారైనట్టే!
మొదలు బెట్టండి ఇక తెలుగులో టైప్ చెయ్యడం.

ఉద్యోగవకాశాలు – మార్పులు

రిసెషన్ (recession = ఆర్ధిక మాంద్యం వచ్చింది) ..ఉద్యోగాలు ఊడాయి.  రిసెషన్ వచ్చింది..ఇస్తున్న జీతాలు

ఆర్ధిక మాంద్యం: తిరోగమనం - పురోగమనం

తగ్గించారు.  జీతం పెంచమని అడిగితే, ‘ఏం? ఇంటికి వెళ్ళాలని ఉందా?’ అన్నట్టు గా ఒక కోర చూపు విసిరిన అధికారుల సంఖ్య పెరిగింది.

Continue reading “ఉద్యోగవకాశాలు – మార్పులు”

విన్నవి – కన్నవి

వ్యాసం  ఆంధ్రప్రభ వార పత్రిక లో (౧౯౬౯) ప్రచురితం

34. విన్నవి – కన్నవి

వివిధ జీవిత రంగాలమీద వ్యాఖ్యానిస్తూ, విమర్శలు చేస్తూ తెలుగులో చాలా సాహిత్యం వచ్చింది. అయితే మన బుక్ పబ్లిషర్లు ఇలాంటి సాహిత్యాన్ని పుస్తక రూపంలో వెలువరించటానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. దానికి మార్కెట్ లేదని వారి ఉద్దేశం కావచ్చు. అలా అయితే అది అపోహే. కిందటి నెల విడుదలయిన చిత్రాలు చాలా భాగం ఈ నెలలో నామరూపాలు లేకుండా పోయినట్టే, కిందటేడు విడుదల అయిన కల్పనా సాహిత్యం కొంత ఈ ఏటికి కనుచూపుమేరలో లేకుండా పోతున్నది. కాని పుస్తకరూపంలో వెలువడిన వ్యాసావళి – ప్రత్యేకించి
‘కన్నవీ – విన్నవీ’ లాటిది ఎంతకాలమేనా బతికి ఉంటుంది.

అందుకు వేరే నిరద్శనం అవసరం లేదు. ఈ చిన్న పుస్తకంలో తరిచిన అనేక విషయాలు విస్మృత చరిత్రా, విస్మృత సంఘటనలూను. అయినా వాటి మీద పిచ్చేశ్వరరావు వ్యాఖ్యానాలు అశోకుడి శిలాశాసనాల్లాగా ఎంతకాలమైనా నిలిచేవిగా ఉన్నాయి.

ఈ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని విషయాలు :
♦ ఈనాడు రచయితకీ, పఠితలకీ ఉండవలసిన సంబంధం.
♦ మనిషికీ, జంతువులకూ ఉన్న(లేక, లేని) తేడా.
♦ అభ్యుదయ నిరోధకులకు మంచి సాహిత్యం పట్ల ఉండే ద్వేషం.
♦ ఈనాడు వెలువడే చౌకబారు సాహిత్యం.
♦ విద్యార్థులూ, రాజకీయాలూ (!)
♦ చార్లీ చాప్లిన్ పట్ల అమెరికా వైఖరి.

పుస్తకంలో ఉన్నవి 11 వ్యాసాలే అయినా అందులో ఇన్ని విషయాలు చర్చించబడ్డాయి.  ఆ చర్చలో ఈ నాటికీ మనం గ్రహించవలిసిన విషయాలు ఎన్నయినా ఉన్నాయి.

“ముక్కుపచ్చలారని నవ్యాంధ్ర రాష్ట్ర శిశువు మూలుగుతూ మూలనున్న ముసలాడి వధువు అవుతూంటే, చూస్తూ ఊరుకుని కీటక సన్యాసుల్లాగా….. గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న కొంతమంది…” ఈనాడు లేరా ?

“భడవల దారిన పోయేందుకే బ్రహ్మాండ శక్తులూ అవసరం లేదు” అన్నది మనం నిత్యమూ స్మరించదగిన విషయం కాదా?

“ఇండియా ఇంకా (1954 జనవరి 26 నాటికి) కామన్వెల్తులోనే ఉంది. వెల్త్ గూడ కొద్ది మంది అనే కామన్ మనుష్యుల గుప్పెట్లోనే ఉంది!” అన్నదానికి ఈ 15 సంవత్సరాలలో మార్పేమన్నా వచ్చిందా?

“ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని రచయిత, వాళ్ళ సమస్యల్నీ, వాళ్ల పోరాటాల్నీ, అనుభవాల్ని పత్రికల్లో చదివి, ఎంతో సానుభూతితో ఆలోచించుతున్నాను అనుకునే రచయిత ఎంతవరకు ప్రజాసాహిత్యాన్ని సృష్టించగలుగుతాడు? అనేది ఒక పెద్ద ప్రశ్న ” – ఇప్పటికీ, ఎప్పటికీని.

“పోరాటం లేనిదే పురోగమనం లేదు – ఇంటా, బయటా కూడా.” అయినా మనం పురోగమనాన్ని ఇంకా శాంతిలోనే వెతుకుతున్నాం!

సాహిత్య వ్యాసాలు
పుట – 559

“ఫ్రాంకో, హిట్లర్, గోబెల్స్, ముసోలినీలూ…….. ఈ డాలరుమార్కు ప్రజాస్వామ్యం కంటే ముందే ఈ ఘనకార్యాన్ని ( ఉత్తమ సాహిత్యాన్ని నిషేధించటాన్ని) కొనసాగించాలని చూశారు. ” డాలరు మార్కు ప్రజాస్వామ్యం ఈనాడు ఇంకా వెర్రితలలు వేస్తున్నది.

“చాప్లిన్ అమెరికాలో ఆడుగుపెట్టేందుకు అర్హుడౌనా ? కాదా? అనేది సమస్య కానే కాదు చాప్లిన్ లాంటి ఉత్కృష్ట కళాకారులు ఉండదగిన దేశమేనా అమెరికా?’ చాప్లిన్ అనంతరం మరికొందరు ప్రముఖులకు అమెరికాలో చోటు లేకుండా పోయింది.

“విద్యార్థి ఉద్యమాలు ప్రజాచైతన్యానికి చూపుడు వ్రేలు లాంటివి. ప్రభుత్వ దమన నీతికి థర్మామీటర్లు” – ఇవాళ కూడాను.

“ప్రభుత్వం ఎవరిదైనా – 1857 లో గద్దె మీద ఉన్నవారికి పట్టిన గతే, 1953 లో గద్దెమీద కూర్చున్న వారికి కూడా తప్పదని గడచిన చరిత్రతో బాటు, నడిచే చరిత్రగూడ సూచిస్తుంది.” ఈనాడు నడిచే చరిత్ర ఈ మాటను మరింత బాగా రుజువు చేస్తున్నది.  “అమెరికా నుంచి ఎగుమతై, వందలకొద్దీ థియేటర్లలో ప్రదర్శితమయ్యే తుక్కు చిత్రాల మాటేమిటి? ఈ చిత్రాలన్నీ తుక్కు అనీ, బూతుల పుట్టలనీ ఈ మంత్రులే అన్నారే.” “తుక్కు – బూతు” చిత్రాలు దేశవాళీ పరిశ్రమగా రూపొందటం కళ్లారా చూసి అనందించటానికి పిచ్చేశ్వర్రావు బ్రతికి ఉండవలిసింది.

అతను 40 ఏళ్లకే అకాలమరణం పాలుకాకుండా ఉన్నట్టయితే ఈనాటి జీవితాన్ని ఎలా విమర్శించి, తూర్పారబట్టి ఉండేవాడో! దేశంలో అభ్యుదయ భావాలూ, అభ్యుదయ దృక్పథమూ గలవారు చాలా మంది ఉన్నారు. కాని “కసిస్టెంటుగా ”తాను తరిచే ప్రతి విషయంలోనూ ఒక తప్పటడుగు లేకుండా నిజాన్ని అందరికీ అవగాహన అయేటట్టు చూపటం గొప్ప ప్రతిభ. అంతేకాదు. పిచ్చేశ్వర్రావు ప్రతి ప్రత్యక్ష సమస్యలోనూ శాశ్వతత్వం
కూడిన నిజాన్ని ఇట్టే పట్టెయ్యగల శక్తిని ప్రదర్శించాడు. అది చాలా అరుదైన శక్తి. తాను ప్రకటించే నిజాన్ని పదిమంది నోటా విని ఆమోదించటంతో తృప్తిపడక, తనకు తానుగా చాలా దీర్ఘంగా ఆలోచించేవాడు; ఇతరులతో చర్చించేవాడు. అదే అతనిలో బలం. ముందు చెప్పిన 11 వ్యాసాలు గాక ఈ పుస్తకంలో రెండు కథానువాదాలూ, బెర్టోల్ బ్రెస్ట్
నాటక సిద్ధాంతం మీద ఒక వ్యాసమూ ఉన్నాయి. కథానువాదాలను గురించి ప్రత్యేకంగా చెప్పకోవలిసిందేమీ లేదు.

గాని, బ్రెస్ట్ గురించి పిచ్చేశ్వరరావు ఏనాడో రాసి ఉండటం గమనార్హం. ఎందుచేతంటే నా టక తత్వమూ, నాట్యకళా విప్లవ పూరితమైనవి. అతని సిద్ధాంతాలు అన్ని దేశాలవారినీ ఆకర్షించాయి. మన దేశంలో కూడా కొందరు మేధావులు బ్రెస్ట్ నాటకాలను హిందీలోకి అనువదించి ప్రదర్శిస్తున్నారు. బ్రెస్ట్ విషయం తెలుగు పాఠకులకోసం పిచ్చేశ్వర్రావు వేసిన బాటను ఇతరులు నడవకపోవటం శోచనీయమే.

ఆంధ్రప్రభ, వారపత్రిక, 18-6-1969
560
కొకు వ్యాసప్రపంచం – 5