వేనరాజు “ఖూనీ”

“ఆంధ్రా బెర్నాడ్ షా త్రిపురనేని” అని అన్నది కట్టమంచి రామలింగారెడ్డి.  ఆయన అనడానికి ఒక కారణం ఉంది.  “కవిరాజు” త్రిపురనేని రామస్వామి తన రచనలకి సుధీర్ఘమైన పీఠికలు వ్రాసాడు, ఐరిష్ రచయిత జార్జ్ బెర్నాడ్ షా లాగ. పీఠికలు ఎందుకు వ్రాస్తారు?  తను చెప్పదలుచుకున్నదానికి ఉపోధ్ఘాతం.  ఆ రచనకి పూర్వాపరాలు.  నేపధ్యం.  ఎందుకు వ్రాయవలసి వచ్చింది.  రచనకి ఉపయోగపడ్డ వస్తు సామగ్రి గురించి. ఇత్యాదులన్నింటి గురించి.  ఒక వివరణ అని అనుకోవచ్చు.  పీఠిక చదవడం మూలంగా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు చెప్పదలుచుకున్నాడు అన్నది పాఠకుడికి కొంత తెలుస్తుంది.  తరువాత రచయిత రచనలోకి ప్రవేశించవచ్చు.  ఆ రచయిత ఆలోచన తెలుసు కాబట్టి ఆ దారంటే ఆ రచనని చదవవచ్చు.  చదివిన తరువాత తనకి తెలిసిన దానితో బేరీజూ వేసుకోవచ్చు. తనకి తెలియని అంశం మీద ఐతే  కొత్తది తెలుసుకుంటాడు. రచన వస్తు సామగ్రి గురించి ముందే తెలిసినవాడు మరొక పాఠకుడు.  అతను దాని మీద అభిరుచి ఉంటే చదువుతాడు.  లేక పోతే ఈ గోల నా కేల అని ఆ పుస్తకాన్ని అవతల పడే అవకాశం ఉంది.

కవిరాజు“కి తను వ్రాయలి అని తెలుసు.  ఎందుకు వ్రాయలో కూడా తెలుసు.  ఎవరికోసం వ్రాయలో కూడా తెలుసు.  తన రచనలు చదివే వారి గురించి కూడా తెలుసు.  తన పాఠకుడుని ఆయన గౌరవించాడు.  కాబట్టే అంత పెద్ద ముందుమాటలు, పీఠికలు వ్రాసాడు. తనతో పాటు తన కాలంలో ఉన్న తన సమకాలీనుల కోసం కూడా వ్రాసాడు.  వాటిని తన కోసం వ్రాసుకోలేదు. తను నమ్మిన “లోక కళ్యాణార్ధం”  వ్రాసాడు.

'కవిరాజు" త్రిపురనేని రామస్వామి రచించిన నాటకం "ఖూనీ"కాలం పరిగెడుతోంది. దానితో పాటు మనిషి పరుగెడుతున్నాడు.  ఆ పరుగు క్రమంలో మార్పుకి లోనవుతున్నాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నవి.  మార్పు సహజం కదా!  వేష, భాషలు, సంస్కృతి అన్ని ఎంతో కొంత మార్పుకి లోనవుతున్నాయ్.  ఆ నేపధ్యం లో 1980 ప్రాంతాలలో మళ్ళీ కవిరాజు రచనల ని చదవడం మొదలు పెట్టాను.  నా తోటి వాళ్ళు “కవిరాజు” రచనలను చదివిన వారు చాల తక్కువమందే కనపడ్డారు.  కారణం భాష.  త్రిపురనేని రామస్వామి చక్కని తెలుగులో వ్రాసినా,  ఆ తెలుగు వీళ్ళకి పాషాణ పాకం లాగా కనపడుతుండేది. పైగా ఆయన మీద ఆయన రచనల మీద ఒక అభిప్రాయం. ఆయన దేముళ్ళని తిట్టాడు. నేను దేముడ్ని నమ్ముతాను కాబట్టి ఆయన దేముడిని నమ్మడు కాబట్టి ఆయన పుస్తకాలని నేను చదవవలసిన అవసరం లేదని వీరి భావన.

అప్పుడనిపించింది నాకు.  ఈ తరానికి కూడా త్రిపురనేని రచనలు అందాలి.  వాటిని మళ్ళీ మూలాలు చెడకుండా, ఈ నాటి యువత కి అందజెయ్యాలి అని.  మద్రాసులో (చెన్నై ఇప్పడు) ” ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి ఫౌండేషన్” ని స్థాపించడం జరిగింది.  ఆ ఫౌండేషన్ ఉద్దేశాలలో ఇది కూడ ఒకటి.  కవిరాజు రచనలని యువతరానికి వారికి అర్ధమయ్యేరీతిలో వారు వాడుతున్న “తెలుగు” లోనే అందించాలని.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత “కవిరాజు” త్రిపురనేని రామస్వామిని అభిమానించిన కీ శే బొడ్డు రామకృష్ణ, కవిరాజు “సూతపురాణం” రెండు భాగాలని వచనం చేసారు.  2011 లో ఆ వచన “సూతపురాణం” రెండు భాగాల్ని తెనాలి లోని కవిరాజు త్రిపురనేని ఫౌండేషన్ వెలవరించి ఉచితంగానే ఆ పుస్తకాలని పదిమందికి పంచింది.  ఆ “సూతపురాణం” రెండు భాగాల్ని,  పీకాక్ క్లాసిక్స్ , హైద్రాబాదు ప్రచురించింది.

సూతపురాణం వెలువడింది.  మరి మిగతా రచనల సంగతి ఏమిటి?  వాటిని ఎలా ఈ పాఠకులకి అందించాలి?

ఈ నేపధ్యం లో  నేను సంప్రదించిన వారిలో గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఉద్యోగవిరమణ చేసిన, తెలుగు భాషాభిమాని, కవిరాజు త్రిపురనేని రామస్వామి ఆశయాలని నమ్మి ఆచరిస్తూన్న రావెల సాంబశివరావు గారు ఒకరు.  వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిసినవి. త్రిపురనేని వేనరాజు మీద వ్రాసిన “ఖూనీ” నాటిక ని “మన మాటలు” లో ఈ తరానికి అందిద్దాం అని ముందుకువచ్చారు.  వారే దానిని ఈ నాటి తెలుగు చదవగలిగిన వారికి అర్ధమయ్యేరీతిలో, పీఠికలతో సహా వ్రాసారు.  2013 జనవరి లో రామస్వామి జయంతి రోజునే దీనిని ప్రచురించాల్సింది.  కారణాంతరాల వల్ల 2014 జనవరిలో “కవిరాజు” త్రిపురనేని రామస్వామి 127 జయంతి నాడు దీనిని ఈబుక్ రూపంలో మీకు అందజేస్తున్నాను.

బహుశ ఫిబ్రవరి, మార్చి నాటికి అచ్చులో కూడ ఈ పుస్తకాన్ని వెలువరిద్దామని అనుకుంటున్నాము.

మీకు అర్ధమయ్యే తెలుగులో, సుమారు 42 పేజీలూ మాత్రమే ఉన్న ఈ “ఖూనీ” ని చదవండి.  మీకు నచ్చితే పదిమంది కి చెప్పండి. దీని మీద మీ అభిప్రాయాలు ఇక్కడే వ్యాఖ్యల ద్వారా తెలియజేయవచ్చు.
కినిగె.కామ్ లో ఈ కవిరాజు త్రిపురనేని రామస్వామి “ఖూనీ”  ఈబుక్‌ని ఈ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
http://kinige.com/kbook.php?id=2482&name=khooni

కొన్ని వేల ప్రతులని కినిగె తన పాఠకులకి అందించింది.  ఐనా డౌ‌న్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు కాని, చేసుకున్న తరువాత గాని ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ లింక్స్‌ని చదవండి.
http://kinige.com/help.php
ఇంకా అవసరం ఐతే [email protected] కి ఈమైల్ చెయ్యండి.  వారు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు.

ఉంటాను.
అనిల్

3 Replies to “వేనరాజు “ఖూనీ””

  1. నేను పాత “ఖూనీ”నే చదివానండి . పీఠికల విషయంలో మీతో ఏకీభవిస్తున్నాను . ఆ పీఠిక చదవటం వల్ల ఏ అపోహలు లేకుండా చదవగలిగాను నేను .

      1. “కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం -సాహిత్యం” అని త్రిపురనేని సుబ్బారావు గారు రాసిన పుస్తకం ఒకటి చదువుతున్నాను అంతే .

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.