స్థిత ప్రజ్ఞులు – శివలెంక రాజేశ్వరీ దేవి

“కలిసారా వీరిని?  ఈవిడే శివలెంక రాజేశ్వరి దేవి, మంచి కవితలు వ్రాస్తుంది” అని తొలిసారి పరిచయం చేసినప్పుడు, “…అలాంటిదేమి లేదండి” అంటూ నేను నమస్కరించే లోపు…అలా వెళ్ళిపోయి ఒక జ్జ్ఞాపకంగా మిగిలిపోయింది.  ఆ తరువాత అప్పుడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి ఆవిడ కవితని చదువుకునే వాడిని.  నాకు మళ్ళీ ఆ మనిషి భౌతికంగా కనపడలేదు.  ఆవిడ పోయిన తరువాత, ఆమె బతికి ఉన్నప్పుడు ఫోనులు (ఆమే తన సొంత ఖర్చుతో చేసినా మాట్లాడలేని వారు, అందరూ కాదులెండి కొంత మంది) భోరున విలపించి సోషల్ మీడియాని చీదేసి, కాగితం రుమాళ్ళతో కన్నీళ్ళని పిండి మరి ముంచేసారు. ఈ కింది కవిత చదివినప్పుడు అదంతా గుర్తు వచ్చింది.  అందుకే ఇక్కడ ఇలా…

అనంతు  చెప్పాడు. కవితలన్నింటిని ఒక పుస్తకంగా వేస్తున్నాము అని.  ఇదిగో ఇలా నామాడి శ్రీధర్ సంపాదకత్వంలో వెలువడింది.  వాళ్ళిద్దర్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టున్నాను…పుస్తకం కావాలని.  చివరికి కత్తి మహేశ్ మొన్న విశాఖలొ యువతరంతో నవతరం కోసం వచ్చినప్పుడు ఈ పుస్తకం ఇచ్చి వెళ్ళాడు.

స్థిత ప్రజ్ఞులు

వాళ్ళు గొప్పవాళ్ళు సుమా నిజంగా
వాళ్ళకి బంధాలు వుండవు ఋణాలు వుండవు
ఋణానుబంధాలసలే వుండావు
కాపలలుంటాయి ముళ్ళకంచె కాపలాలు
అక్షరాలా మన మంచే మనకి కాపలా ఇక్కడ
మనకనేక ఋణాలు అనేక బంధాలూ
అనేక ఆపేక్షలూ అనేక బాధలూ అనేకానేక చిక్కుముళ్ళు
మనం ఇస్తాం తీసుకుంటాం
వాళ్ళు ఇవ్వరు తీసుకోరు
ఇస్తాం గానీ తీసుకోం అంటారు బడాయిగా
వాళ్ళు స్థితప్రజ్ఞులు
ఒఖ్క  టీ ఇచ్చి కూచోపెట్టి
ఎన్నెన్ని స్టేట్‌మెంట్లయినా వినిపిస్తారు
అప్పటికప్పుడు అక్కడికక్కడ
రెడీమేడ్ తీర్పులు చెపుతారు
వారు సర్వజ్ఞ సింగభూపాలురు
వాళ్ళకి కుటుంబం అంటే
‘మొగుడు పెళ్ళాం పిల్లాడూ’ నిర్వచనం
స్నేహితులు శాశ్వతంగా ఉంటారుటండి
మీ పిచ్చిగానీ అనేస్తే
మనం దిమ్మతిరిగి దిక్కులు చూడాల్సిందే

మనకేమో
ఒక సంతోషం ఇటొచ్చి ఒక దిగులు
అటొచ్చి ఒక నవ్వు ఇటొచ్చి ఒక మాట
నవ్వొస్తే పకపకా ఏడుపొస్తే వలవలా
నీ పిచ్చిగాని నీ మిణుగురులుమీంచి సైతం
వెలుగు చూస్తానంటే నవ్విపోతారమ్మా

స్థిత ప్రజ్ఞులు
స్థిత ప్రజ్ఞులు

ప్రతి మనిషి రెండు వైపులుంటాయండీ
అటో చెంపా ఇటో చెంపా
పైకి కనిపించేది కాదు అసలూ…
అంటూ వెర్రి పీనుగుల్ని చేసి
ఎంతైనా చెప్పగలరు ఎరిక్ ఫ్రామ్ లెవల్లో
గూడలు పడిపోయి నవ్వీ నవ్వలేక ఏడ్చీ ఏడ్వ‌లేక
తల ఎటుకేసి వూపుతున్నమో మనకే తెలీని స్థితిలో
సరైన టైమ్‌ అంటే వాళ్ళకి కలిసివచ్చినట్లు
కాలజ్ఞానం తెలిసినట్లు మాటల్ని మాయామయంగా కలిపేస్తారు.
” ఆ( ఇంత చేసి సొంతానికంటూ ఏమీ లేకపోయింది”
సాక్షాత్తు మదర్‌ కే
సానుభూతి చూపే గుండె ధైర్యం వాళ్ళకి
కంకరరాళ్ళు శబ్దం వినీవినీ
మస్తిష్కం మొద్దుబారిపోయింది
ఆ స్థిత ప్రజ్ఞుల వైపు వెళ్లకు
సిక్ సొసైటి మనుషులు వాళ్ళు

నువ్వేమో అమ్మలూ! సేన్ సొసైటి పాపాయివి
అటు పోకమ్మ ‘ఇన్నొసెన్స్’ పోగొట్టుకుని
‘ఇంటలిజెంట్’ అయిపోతావు
చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అనేస్తావు
ఆ ముదిరిపోయి గిడసబారిన ‘ఇంటలిజెన్స్‌’
మనకి వద్దులే తల్లీ!
ఏదో మన మానాన మనం
రాత్రి వర్షాన రాలిన పున్నాగపూలని
చేతుల్లోకి తీసుకుంటూ!

  • శివలెంక రాజేశ్వరి దేవి, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, 31.08.1998 లో ప్రచురితం.

ప్రతులకు / for copies
Namadi Sridhar
Door No: 3-129, Ambajipeta,
East Godavari district, Andhra Pradesh
PIN 533 214
Phone: 93968 07070

సర్వ హక్కులు ప్రకాశకులవే.

వర్క్‌ప్లేస్‌లో ఎలా గెలవ్వోచ్చు…ఇలా

Win At Workplace - a book by Suresh Veluguri

కొత్త ఉద్యోగానికి వెళ్ళేముందు అనే తొలి అధ్యాయంతో  మొదలైన ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం కొత్తగా  కాలేజీలనుంచి బయటికొచ్చి విశాల ప్రపంచలోకి అడుగుపెడుతున్న లక్షలాదిమందిలో మీరు ఒకరు”  అనే వాక్యంతో మొదలవుతుంది.  దాన్నిబట్టి ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ని ఎవరిని  దృష్టిలో పెట్టుకుని మొదలు పెట్టాడో ఈ రచయిత అర్ధం అవుతుంది.  అలా అని ఇది విద్యార్ధులకి మాత్రమే కాదని గుడ్డిగా ఈ పుస్తకం మధ్యలో ఎక్కడ తలదూర్చినా తెలిసిపోతుంది.  ఒహో ఇది IT industry లోని టెకీ గాళ్ళకా అంటే…కాదు బోయ్స్ అండ్ గరల్స్.  ఇది అందరికీను.  అంటే ముఖ్యంగా ఉద్యోగస్థులందరికి…కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టేవారికి, వేసేసిన వారికి, అలా ముందుకు సాగి పోతున్నవారికి కూడా!

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ని తను ఎంచుకున్న అంశాలను 36 చాప్టర్స్‌‌గా వర్గీకరించి, సుమారుగా 160 పేజిలలో పొందుపరిచి అందజేసాడు సురేశ్.

సోషల్ మీడియా (పేజి 76) గురించి ప్రస్తావిస్తూ, వర్క్‌ప్లేస్ లోనే కాదు ఉద్యోగం రావడానికి, పోవడానికి కూడా అదే కారణం అంటూ సోదాహరణంగా చెప్పాడు.

ఈ పుస్తకం పాఠకులకి బహుశ బోనస్ ఇవ్వాలనుకున్నట్టున్నడు రచయిత.  సంపాదనకి సేఫ్టి అనే పేరుతో ఒక అధ్యాయం (చాప్టర్ 33)ఇచ్చాడు.  చాలమంది కొత్తవారికి, ఉద్యోగంలో ఉన్నా పూర్తిగా తెలియని వారికి ఇందులో ఇచ్చిన వివరాలు బోనస్సే!

139 వ పేజి నుంచి 146 పేజీ వరకు కేవలం మహిళల కొరకే వినియోగించి వారికి బాగా పనికివచ్చే సమచారాన్ని క్లుప్తంగా ఇచ్చడు. స్మార్ట్ ఫోన్లు వాడే వారికీ కొన్ని సేఫ్టీ ఆప్స్‌ గురించి తెలియజేసాడు.
 
169 పేజిలో టొస్ట్‌మాస్టర్స్ ని పరిచయంచేసాడు.  వెబ్‌లింక్ ఇచ్చాడు కాబట్టి పాఠకులకి సులువుగానే అదనపు సమాచారం అందే అవకాశం కల్పించాడు.    

67 వ పేజిలో 5W’s & 1H ఫార్ములా గురించి ప్రస్తావించాడు కాని ఆ ఫార్ములా ఏమిటో చెప్పలేదు.  ప్రసారమాధ్యామాలలో అనుభవజ్ఞులకు తెలిసే అవకాశం ఉంది కాని ఉద్యోగస్తులకి మరీ ముఖ్యంగా తను ఎంచుకున్న రీడర్ ప్రొఫైల్ ఉన్నవారికి ఆ ఫార్ములా తెలిసిఉండే అవకాశం తక్కువ.  కాకపోతే అదే ఫార్ములాని 155 వ పేజిలో మరో విధంగా పరిచయం చేసాడు…ఇలా ఫైవ్ డబ్ల్యూస్ అండ్ వన్ హెచ్ (ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఎలా?) అని వివరించాడుకూడా!.

కాకపొతే పూనే ఉద్యోగస్తుడి ఆపసోపాలు చెబుతూ, మళ్ళీ  అతని కధే (?) 122 వ పేజిలో కూడా చెప్పాడు.  తన ముందుమాట (11 వ పేజిలో) కంటెట్ రిపీట్ అయినట్టు ముందే చెప్పినా, రిపీట్ కాకుండా చెప్పే అవకాశం కూడ ఉంది.  

తెలుగు చదువుకున్న వారికే ఈ పుస్తకం అనుకున్నప్పుడు కొత్తగా ఉద్యోగరంగంలోకి అడుగు పెడుతున్నవారికి పింక్ స్లిప్ గురించి తెలుస్తుందా అనే సందేహం కలిగింది.  పేజి 132.
 
కనీసం ఇటువంటి వాటికోసమైనా పాద సూచికలు అంటే ఫుట్‌నోట్స్ / ఫర్దర్ రీడింగ్‌ అంటే ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలనుకునేవారికి పుస్తకం చివర్న ఒక చిన్న బిబ్లియోగ్రఫి (bibliography) ని ఇచ్చి ఉంటే బాగుండేది.

ఆఫిస్ కాదు రచయిత మాటల్లో వర్క్‌ప్లేస్ అనుకుంటే ఆ వర్క్‌ప్లేస్ ఎటికెట్ గురించి కూడా చెప్పిఉంటే ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఇంకొంచెం సమగ్రంగా తయారైఉండేది.

Win At Workplace - a book by Suresh Veluguri
వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి – సురేశ్

“పుస్తకం రాస్తున్నాను సార్,”  అన్నప్పట్నుంచి దీని కోసం ఎదురుచూస్తునే ఉన్నాను.  ఆసక్తిగా!  గతంలో నేను ఆంధ్రజ్యోతి పత్రిక వారి దిక్సూచి‌కి కెరీర్ కార్నర్ కాలం ఒకటి వ్రాసాను. అదొక పక్క, మరో పక్కన అప్పట్లో ఒక HR సంస్థకి CEO గా ఉండటం మూలంగా కలిగిన ఆసక్తి, అంతే కాదు people management మీద నాకున్న ఉత్సుకత…సురేశ్ ఈ తరం వాడు ఏం వ్రాస్తాడు, ఎలా రాస్తాడు అని.  పైగా నేను కూడ గత అయిదారేళ్ళుగా వ్రాద్దామని అనుకుంటూ…తాత్సారం చేస్తూ వస్తున్నాను.  అది కొంత కుతూహలం.  ఇక ఆ సొంత గోల ఆపితే…ఈ పుస్తకం అవసరమా అని నన్ను అడిగితే… ఈ విషయలా మీద ఇదే తొలు పుస్తకం …కాబట్టి తెలుగు వరకే పరిమితమైనవారికి  ఇది ఉపకరిస్తుంది.   మనకి తెలుగులో పర్సనాలిటి డెవలప్‌మెంట్ పుస్తకాలు చాలా వచ్చినవి కాని  ఆఫీసు లో ఇలా గెలవండి అన్న పుస్తకం వచ్చినట్టు లేదు.  కాబట్టి ఈ పుస్తకం అవసరమైనదే  ఉద్యోగస్తులకి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చిన్న యాజమాన్యాలకి కూడా!  

ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎందుకంటే వారికి కూడా  ఒక చాప్టర్‌ని కేటాయించాడు రచయిత.

ఇక చిన్న చిన్న యాజమాన్యాలకి ఎందుకంటే, ఉద్యోగస్తుడు కుక్కలాగ విశ్వాసంతో పడిఉండే వాడు కాదు, అలాగే గాడిద చాకిరికి మాత్రమే పనికి వచ్చేవాడు కాదని, వాడుకూడా మనిషేనని సంస్థమేలుకోసం ఆరాట పడే ప్రాణమని…అలాంటి వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం ఇస్తే, తమ సంస్థ కూడా బాగుపడి మరో పదిమందికి చేయుత నిస్తే వ్యాపారం కూడ అభివృద్ధి చెందుతుంది, సమాజానికి ఆ మేర కొంత మేలు జరుగుతుంది.  

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఇంగ్లిష్ లో కూడా తయారవుతున్నది.  

ప్రస్తుతం తెలుగులో 176 పేజీల వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం ధర 199.00 రూపాయలు.  పుస్తకం ధర తక్కువే.
Brahmam (Bhavana Graphix) కవర్ పేజి డిజైన్ చేసారు.
Charitha Impressions వాళ్ళ ముద్రణ.
అప్పుతచ్చులైతే పంటికింద పడలేదు మరి!

పుస్తకంలో ఏముందో చూద్దామనుకుంటే ఇక్కడ కొన్ని చాప్టర్స్ ప్రీవ్యూగా ఫ్రీగా చదువుకోవచ్చు.

 ఆ తరువాత వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకాన్ని ఇక్కడ కొనుక్కోవచ్చు:

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి – సురేశ్ వెలుగూరి

VMRG International
6-3-596 / 79 /4, Naveen Nagar,
Hyderabad – 500 004
Phone:  +91 (40) 2332 6620, Mob:  98499 70455
www.vmrgmedia.com

అమెజాన్ (Amazon) లో వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కినిగె (Kinige) లో వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఈ బుక్ ఇక్కడుంది.

దిద్దుబాటలు – దిద్దుబాటుకు ముందు కథలు 92

దిద్దుబాటు తొలి తెలుగు కథ అని అనుకున్నాం.  కాదు ఇంకా ముందే కథలున్నాయి అని అన్నారు.  సరే, దిద్దిబాటు కన్నా ముందు కథల సంగతి తేల్చుకుందాం అని అనుకున్నారు, వి వి న మూర్తి గారు.  ఇదేదో బాగానే ఉంది కదా?  రానున్న తరాల వారికి ఈ పుస్తకం ద్వారా ఆ కథలు వాటి నేపధ్యం గురించి తెలియజేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన నచ్చింది జంపాల చౌదరి గారికి.  జంపాల గారు తానా ప్రచురణ లకి అధ్యక్షులు.

కొన్ని ప్రశ్నలు – కొన్ని ఆలోచనలు
ప్ర:  ఏది కథ?
వ్రాసిన రచయిత గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులు గాని కథ అనడం.
ప్ర:  ఇంకా మన దృష్టికి రాని కథలు ఉండవచ్చా?
భవిష్యత్తులో బయటపడవచ్చు.
ప్ర:  తొలి కథ?
చిలక గురించిన సంభాషణ 1879 జనవరి జనవినోదిని
ప్ర:  తొలి కధా సంపుటం?
చిత్రమంజరి 1902 మే.  రచయిత రాయసం వెంకటశివుడు.
అయ్యా,  ఇంకా చాలా వివరాలున్నవి.  ప్రస్తుతానికి ఈ వివరాలు ఈ సేకరణ కి మాత్రమే పరిమితం.  ఇందాక అన్నట్టు.. మరి కొన్ని వివరాలు భవిష్యత్తులో బయటపడవచ్చు.

రచయిత , సాహితీవేత్త , కథానిలయం సారధి - వి వి న మూర్తి.
రచయిత, సాహితీవేత్త , కథానిలయం నిర్వాహకులలో ఒకరు – వి వి న మూర్తి.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లక్షాలలో ప్రముఖమైనది తెలుగు భాష, సంస్కృతులను పోషించి, పరిరక్షించుకోవడం.  దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా ఈ పని చేస్తూన్నది తానా.  అందులో ఒక పాత్రని పోషిస్తున్నది తానా ప్రచురణలు.  ప్రచురణలో లేని, ప్రచురణ కాని ముఖ్యమైన తెలుగు పుస్తకాలను ఉత్తమ ప్రమాణాలతో, ప్రచురించి  సాహిత్యాభిమానులకు అందుబాటులోఉండే ధరలకు అందిచడం తానా ఉద్దేశం.

రానున్న జూన్‌లో జంపాల చౌదరి 2015 జూన్ లో, తానా (TANA) కి అధ్యక్షుడిగాకూడా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఇప్పుడు తానా ఆ పుస్తకాన్ని ప్రచురిస్తోంది.

Dr Jampala Choudaray - President Elect TANA
Dr. Jampala Chowdary, President – Elect TANA

రేపు అంటే శుక్రవారం, జనవరి 2, 2015 న విజయవాడ లో జరగనున్న తెలుగు పుస్తకాల పండుగ లో, దీనిని ఆవిష్కరించనున్నారు.  ఆవిష్కరించనున్నది ఆచార్య కడియాల రామ మోహన్ రాయ్ గారు.

Kadiyala Rama Mohan Roy
మే 1 న, విజయవాడలో కవిత 2012 ని (కీ శే. సి సుబ్బారావు గారు), కడియాల రామ మోహన్ రాయ్ గారు ఆవిష్కరించిన సందర్భం.

చిత్రకారుడు చంద్ర వేసిన ముఖచిత్రం తో వెలువడున్నది ఈ దిద్దుబాటలు.

దిద్దుబాటలు - diddubaaTalu
దిద్దుబాటలు – దిద్దుబాటకు ముందు కథలు 92. సంపాదకులు వి వి న మూర్తి
కధానిలయం, శ్రీ కాకుళం సౌజన్యంతో

496 పేజీలు, ధర 300.00 రూపాయలు. US $ – 25.

ప్రచురణ కర్తల కృతజ్ఞతలు
” శ్రీ కొడవళ్ళ హనుమంత రావు వితరణ, శ్రీ ‘నవోదయ’ రామ్మోహనరావు, శ్రీ వాసిరెడ్డి నవీన్ సహృదయత, శ్రమదానం, తానా కార్యవర్గం, తానా ఫౌండేషన్, మరెందరో హితోభిలాషుల సహకారం తో…”  ఈ పుస్తకం వెలువడుతోంది.

పుస్తకానికి ప్రూఫులు చూసిన ఎ.వి రమణమూర్తి గారికి, పుస్తకాన్ని అందంగా రూపొందించడంతో పాటు చదవడానికి వీలుగా పదవిభజన చేసిన అక్షర సీత గారికి అచ్చువేసిన చరిత ప్రెస్ పరుచూరి సుబ్బయ్య గారికి”  కూడా.

ఆంధ్రజ్యోతి లో వి వి న మూర్తి గారి దిద్దుబాటలు కి ముందు మాటలు ప్రచురించారు.  వాటిని మీరు ఇక్కడ చదువుకోవచ్చు.

ఒక చిన్న విషయం చెప్పుకోవాలి.  నా స్వార్ధం మరి.  తానా వారి ప్రచురణలు ప్రచురించిన కథ నేపధ్యం తొలి సంకలనం ఆవిష్కరణ 2012 జనవరి 3 న ఇదే విజయవాడలో అదే వేదిక మీద జరిగింది.  వేదిక మీద శ్రీమతి సత్యవతి పోచిరాజు, శ్రీరమణ, శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, శ్రీ ‘నవోదయ’  రామ్మోహన రావు, శ్రీ తోటకూర ప్రసాద్ (అధ్యక్షులు తానా), తానా ప్రచురణల అధ్యఖులు శ్రీ జంపాల చౌదరి.  వారందరితోను నేను.

కథ నేపధ్యం 1 - katha - nepadhyaM 2012
కధ – నేపధ్యం. తొలి సంపుటి 2012. తానా ప్రచురణ

దయచేసి మీ ప్రతులకోసం వీరిని సంప్రదించండి.
ఇండియా లో:
AG – 2, ‘A’ Block, Mathrusri Apartments,
Hyderguda, Hyderabad 500029
Phone – 040 – 2324 4088.

USA
TANA Publications,20374, Buckthorn Court, Mundelein, Illinois 60060 USA

ప్రధాన విక్రేతలు;
ఆంద్ర ప్రదేశ్:
విశాలాంధ్ర ప్రబ్లిషింగ్ హవుస్, విజయవాడ (ఫోను 0866 -2572949) వారి బ్రాంచీలన్నింటిలోను.
నవోదయ పబ్లిషర్, ఏలూరు రోడ్డు, విజయవాడ – ఫోను 0866 – 2573500, 9849825204
ప్రభవ బుక్ సెంటర్, No- 16-2-157, Near Vijaya Hospital, Pogathota, Nellore, Andhra Pradesh 524 001 ఫోను:  ౦861- 2323 167 / 232 9567

తెలంగాణ:
నవచేతన పబ్లిషింగ్ హవుస్, హైదరాబాద్ వారి బ్రాంచీలన్నింటిలోను.
ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, Viveknagar, Chikkadpally, Chikkadpally, Hyderabad, Telangana 500020. ఫోను: 040 2760 8107
నవోదయ బుక్ హౌస్, 3, Kachiguda Station Road, Chappal Bazar, Kachiguda, Hyderabad, Telangana 500027 – 040 2465 2387

eBook:kinige.com /  కినిగె.కాం

వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను.  చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం.  అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది.  శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

Dr Velaga Venkatappaiah, Tenali
డా. వెలగా వెంకటప్పయ్య (1930 – 29 Dec 2014)

సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు.  ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.

తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.

కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం.  కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను.  మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.

ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.

Seminar on Kaviraju Tripuraneni Ramaswamy
The invitation to the seminar on ‘Kaviraju’ Tripuraneni Ramaswamy.

వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.

రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి  ముఖచిత్రాలు ఇక్కడున్నవి.  సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082

“అమ్మ” ఉంది, జాన్!

ఆయనతో నాకు పరిచయం లేదు. సుమారుగా బ్లాగ్‌లోకం రోజులనుండి తెలుసు.  అయినా  మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నది లేదు. ఒకసారి ఎక్కడో పలకరించుకున్న గుర్తు. అయితే ఏం? ఆయన మంచితనం గురించి తెలుసు.  ఈయన పేరు జాన్ హైడ్ కనుమూరి.  నిన్న రాత్రి హటాత్తుగా హృద్రోగం తో వెళ్ళిపొయ్యాడు.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/JphnHydeKanymuri.jpg? w=656" alt="amma" originalw="255" width="300" height="291" scale="2">
జాన్ హైడ్ కనుమూరి – తెలుగు బ్లాగర్ ( ? – 7th Dec 2014 )

ఆయన సంపాదకత్వాన తెలుగులో ఒక ఈ బుక్ వెలువరించాడు.  బహుశ అది తెలుగువారికి రెండవ ఈబుక్ అవుతుందేమో! ఈ మనిషిలో ప్రేమ పొంగినట్టే ..ఆ ఈబుక్ కూడ “అమ్మ” ప్రేమతోనే నిండింది. ఆమే ప్రేమతోను, అమ్మ మీద ప్రేమను వెలిబుచ్చిన  సుమారు 15 మంది బ్లాగర్ల కవితలతోను “అమ్మ”ని కూర్చాడు.  కవితలు కూర్చడానికి కారణం ..కవిత్వం అంటే వల్లమాలిన ప్రేమ జాన్‌కి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/ammaAcompilationByJohnHydeKanumuri_AnilAtluri.jpg? w=656" alt="amma" originalw="584" width="775" height="300" scale="2">
“amma” is a compilation of poetry by a few Telugu bloggers. John compiled them.

జాన్  అమ్మ ఈబుక్ ని తనే డిజైన్ చేసాడు.  డిటిపి మొత్తం అంతా తనే చేసుకున్నాడు.  దానికి ముందు మాటలు వ్రాసాడు.  ఆ ముందు మాటల్లో రెండు వాక్యాలు.
“జన జీవనం వస్తూవుంటుంది, పోతూ వుటుంది, నేను ప్రవహిస్తునేవుంటాను
జాన్ లేడు..కాని …”అమ్మ” ఉంది, జాన్!
ఏందుకో..జాన్ అలా వెళ్ళిపొయ్యాడు అంటే బాధగా ఉంది.

జాన్ సంపాదకత్వాన్న వెలువడిన కొందరి తెలుగు బ్లాగర్ల కవితల సంకలనాన్ని –  “అమ్మ” ఈబుక్ ని ఇక్కడ్నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జాన్ హైడ్ కనుమూరి బ్లాగులు:
http://johnhaidekanumuri.blogspot.in/
http://telugubible.blogspot.in/
http://alalapaikalatiga.blogspot.in/

నేనైన నీకు నీవైన నేను

“నేనైన నీకు నీవైన నేను”  అని  2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను.
రాయడం ఒక దురద,” అని కూడ అన్నాడు.
“ఆ మాట చాలా చీప్ గా ఉంది,” అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య.
“నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు,” అని నిన్న అన్నాడు.
ఇంకా ఆరుపదులకి ఆమడ దూరంలోనే ఉన్నా..ఒక ఆరుపదులవరకు రాసేసాడు, కథలు.
ట్విన్నవలలు.  అసలు ఆ మాట విన్నారా? ఇవిగో ఇక్కడున్నవి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/TwinnavalaluByAnaamakuduRamasastri_Anil_Atluri.jpg?w=656" alt="ట్విన్నవలలు " originalw="656" width="808" height="1220" scale="2">
ట్విన్నవలలు – రాతగాడు అనామకుడు

పోయినేడాది…దాదాపు ఇవే రోజుల్లో…వాళ్ళిద్దరు కలిసి ఒకొళ్ళపుస్తకాన్ని మరొకరికి అంకితం ఇచ్చుకున్నారు.
పరిణయం చేసుకుని పాతికేళ్ళే..కాని అంతకుముందే పరిచయం అనొచ్చా?  అనకూడదేమో! బంధుత్వం ఉందిగా మరి.

మరి విముక్తి మూలంగా ఈ ప్రత్యేకత వచ్చిందో..లేక విముక్తి కి జనార్ధన మహర్షి, నవ్య సంయుక్తంగా ఇచ్చిన బహుమతి వల్లవచ్చిందో కాని నవ్య కళ్ళకి ఇతని రూపు ప్రత్యేకం గా కనపడింది.  ఆ ప్రత్యేకం ఇక్కడ చదువుకోండి.

చాలా మందికి తెలియని మరొక విషయం.  ఇతను ఆంగ్లంలో కూడ కథలు వ్రాసాడు. ఇదిగో ఇక్కడుంది ఒకటి చదువుకోండి.

నవ్య వార పత్రిక. తేది డిసెంబరు 10, 2014.  పుటలు 15 నుంచి 20 దాకా.

అలికిడి

అతను ముందు గదిలో తన కేన్ చెయిర్ లో కూర్చుని ఆ నాటి దినపత్రిక చదువుకుంటున్నాడు.  ఏదో అలికిడి.  పేపర్లోనుంచి తలెత్తి చప్పుడైన వైపు చూసాడు.  గుమ్మంలో నుంచి వీస్తున్న గాలికి హాలులోనుంచి లోపలి గదిలోకి వెళ్లే గుమ్మానికి వెళ్ళాడుతున్న కర్టెన్లు కదులుతున్నవి.  అతను మళ్ళీ తన తలని పేపర్లోకి దూర్చేసాడు.

మళ్ళీ అలికిడి.
అతను పట్టించుకోలేదు.

మళ్ళీ అలికిడి. ఈ సారి గుర్తు పట్టాడు.  తనెరిగిన శబ్దమే. నవ్వుకుంటూ పేపర్లోనుంచి తలెత్తాడు. ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు.

తన కూతురు.  అక్కడ నిలబడి ఉంది.  గుమ్మం పక్కనే.  గుమ్మాన్ని తన కుడిచేత్తో పట్టుకుని.  నవ్వుతోంది. నవ్వుతూ తన వంక చూస్తోంది.

Annaమరో రెండు అడుగులు.
అతను పేపర్ని పక్కన పడేసాడు.
చేతులు చాపాడు.
గబ, గబ, గబ, గబ వచ్చి చేతుల్లో వాలిపోయింది.

ఒక జ్నాపకం

అప్పట్లో  దేవ భాష అన్నారు. గ్రాంధికం అన్నారు.  వ్యావహారికం అన్నారు.  మాండలీకం అన్నారు.  నుడి అన్నారు.  ప్రాంతీయం అన్నారు.  యాస అన్నారు. ఇదే మా బాస అంటున్నారు.  భాషకి బాసకి తేడా తెలియకుండా పోయింది.   వెల్లు,  (వెళ్ళు అని అర్ధం చేసుకోవాలి). ఇలా కోకొల్లల్లు.  జ్నానమా..జ్ఞానమా?  ఇదే ప్రామాణికామా?
jnaప్రతి ప్రాంతానికి, ఒక భాష, ఒక మాండలికం ఉన్నట్టు,  ప్రతి రచయితకి ఒక స్పెల్లింగ్ స్టైల్ ఉంటుందా?  భాష కి ఎల్లలు లేవు.  ఉండకూడదూ కూడా! రచయితకి అచ్చుతప్పులుండవా?  అసలు తప్పులేకుండానే వ్రాస్తున్నాడా?  ఆ రచయిత వ్రాసినదే ప్రామాణికమా?   జ్నానమా..జ్ఞానమా?  ఏది ఒప్పు?  ఏది తప్పు?

కంప్యూటరులో టైపింగ్, టైము లేదనడం సరికాదు.  అంత అర్జంటు గా ఆ సెండ్ బటని నొక్కకపోతే ఏమయ్యింది?  ఎందుకని ఈ అసహనం? ఇది అడిగినవాడు చాందసుడా, సనాతన వాదా?  అది మీకే తెలియాలి!

వ్రాసేవాడికి చదివేవాడంటే లోకువ! మరి అంతలోకువా? పాఠకుడంటే అంత నిర్లక్షమా?  తాను ఏది వ్రాసినా, చదివేసే గాడిదా?  అంత అహంకారమా?  మనకొక సామెత ఉంది.  అన్ని ఉన్న ఆకు, అణిగి మణిగి ఉంటుంది అని! ఎదిగిన కొద్ది, తగ్గి ఉండటం అంటే అదే మరి!

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

అక్షరాలకి ఐదు లక్షలు

నడుస్తున్న పోటీలు - గడువు తేదీలు
 నది సినిమా కథల పోటీ – 31 జనవరి 2014
 స్వాతి సరసమైన కథల పోటీ – 1 ఫిబ్రవరి 2014
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, భాషా సాంస్కృతిక శాఖ, నవల-నాటక రచన పోటీ – 28 ఫిబ్రవరి 2014
 అమెరికా తెలుగు సంఘం రచనల పోటీ (కథ, కవిత, వ్యాసం మొ..) - 30 మార్చి 2014
 ఆటా నవ్య నవలల పోటీ – 12 ఏప్రియల్ 2014
 కినిగె (http://kinige.com/) అక్షర లక్షల నవలా పోటీ – 6 జూన్ 2014
 తెలుగు రచయితలకి స్వర్ణయుగమే! పోటీలూ, పురస్కారాలు, బహుమతుల జల్లుల్లో తడిసి ముద్దైపోతున్నారు. ఒకానొక అంచనా ఒక "ల"కారం అటూ, ఇటుగా దాదాపు ఐదు లక్షలు బహుశ ఈ ఒక్క సంవత్సరమేలోనే వారు గెలుచుకొనబోతున్నారు!
 నిన్న ఎవరో అంటున్నారు..ఒక నవలకి ఐదు లక్షల బహుమతి ఇద్దామా అని!
 ఏమో నవలకి ఐదు లక్షలే ఖర్మ, పది లక్షలు కూడా ఇవ్వోచ్చు!

తాజా కలం: అప్పుడెప్పుడో వ్రాద్దామని మొదలుపెట్టి వదిలేసిన చిత్తు ప్రతి ఇది.   
ఇప్పుడు ఇలా మీ ముందు!