బాలూ..వెండితెర మీద మరో కోకిల

నాకు గుర్తున్న బాలు మహేంద్ర ఈ క్రింది బొమ్మలో ఉన్నట్టు ఉండేవాడు.అప్పటికే మూండ్రాం పిరై విడుదలై పోయింది.  సఫైర్ కాంప్లెక్స్ లోని ఎమరాల్డ్ లో చూసాను ఆ సినిమాని.  సెకండ్ షో.  తరువాత సత్యం ధియేటర్స్‌లో చూసాను.  శివం లో అనుకుంటాను. తెలుగు సినిమాలలో కెమరా ఒకటి ఉంది, దానితో సినిమాని మనకి చూపించేవాడు కెమరమెన్ అని తెలియజేసిన అద్బుతమైన కెమరామెన్ వి ఎస్ ఆర్ స్వామి అని అనుకునేవాళ్లం నేను నా స్నేహితులం.  అలాగే తమిళ సినిమాలకి బాలు.

Balu Mahendra, the cinematographer
Balu Mahendra, the cinematographer

కూర్చుని ఏదో చదువుకుంటున్నాను.  నీడ, తరువాత అలికిడి.  చదువుతున్న పుస్తకంలోనుండి తలెత్తి చూస్తే పొడుగ్గా  ..నాకంటే ఎత్తు.. అదిగో ఆ బొమ్మలో లాగా ఆలివ్ గ్రీన్ కాప్ తో బాలు.  నవ్వుతూ.  మామూలుగా సినిమా రంగం వాళ్ళతో వాళ్ల సినిమా గురించి పబ్లిక్ గా ప్రస్తావించేవాడిని కాదు.  ఆ రోజున మేమిద్దరమే ఉన్నాం.  “మూండ్రాం పిరై బాగుంది.  మీ కెమరా అద్భుతం”, అని అన్నాను.  చిరునవ్వు తో సమాధానమిచ్చాడాయన.  “నేను కూడా చాలా హాపి.  అందరికి నచ్చింది.  నాకూ నచ్చింది” అన్నాడాయన. తెలుగులో అదే “వసంత కోకిల” గా విడుదలైనది.

One of the best films of Balu Mahendra.
One of the best films of Balu Mahendra.

ఒక రెండు నిముషాలు అవి ఇవి మాట్లాడుకున్న తరువాత.. “తెలుగు లో గొప్ప సాహిత్యం ఉందంట కదా?  ఏమైన మంచి పుస్తకాలు సజెస్ట్ చెయ్యండి అన్నాడాయన.  “మీకు తెలుగు చదవడం వచ్చా?” అని ఆశ్చర్యంగా అడిగాను.  “ఏం తెలుగు చదవడం నాకు రాకపోతే ఏం?  ఎవరితోనైనా చదివించుకుంటానుగా!”  అని అన్నాడాయన”.

అలా తెలుగు సాహిత్యం తో ఆయనకి పరిచయం.  తెలుగు సాహిత్యం ద్వారా నాకు పరిచయం.  ఆయన సినిమాలు అన్ని చూసాను.  గొప్ప కెమెరామెన్.  నిన్న #pepperspray కథ లేకుండా ఉంటే..బహుశ మన మిడియా వాళ్ళూ ఆయన క్లిప్‌లతో మోత మోగించేవారనుకుంటా!

ఏమైనా మరో మంచి కళాకారుడు వెళ్ళిపొయ్యాడు.

వేనరాజు “ఖూనీ”

“ఆంధ్రా బెర్నాడ్ షా త్రిపురనేని” అని అన్నది కట్టమంచి రామలింగారెడ్డి.  ఆయన అనడానికి ఒక కారణం ఉంది.  “కవిరాజు” త్రిపురనేని రామస్వామి తన రచనలకి సుధీర్ఘమైన పీఠికలు వ్రాసాడు, ఐరిష్ రచయిత జార్జ్ బెర్నాడ్ షా లాగ. పీఠికలు ఎందుకు వ్రాస్తారు?  తను చెప్పదలుచుకున్నదానికి ఉపోధ్ఘాతం.  ఆ రచనకి పూర్వాపరాలు.  నేపధ్యం.  ఎందుకు వ్రాయవలసి వచ్చింది.  రచనకి ఉపయోగపడ్డ వస్తు సామగ్రి గురించి. ఇత్యాదులన్నింటి గురించి.  ఒక వివరణ అని అనుకోవచ్చు.  పీఠిక చదవడం మూలంగా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు చెప్పదలుచుకున్నాడు అన్నది పాఠకుడికి కొంత తెలుస్తుంది.  తరువాత రచయిత రచనలోకి ప్రవేశించవచ్చు.  ఆ రచయిత ఆలోచన తెలుసు కాబట్టి ఆ దారంటే ఆ రచనని చదవవచ్చు.  చదివిన తరువాత తనకి తెలిసిన దానితో బేరీజూ వేసుకోవచ్చు. తనకి తెలియని అంశం మీద ఐతే  కొత్తది తెలుసుకుంటాడు. రచన వస్తు సామగ్రి గురించి ముందే తెలిసినవాడు మరొక పాఠకుడు.  అతను దాని మీద అభిరుచి ఉంటే చదువుతాడు.  లేక పోతే ఈ గోల నా కేల అని ఆ పుస్తకాన్ని అవతల పడే అవకాశం ఉంది.

కవిరాజు“కి తను వ్రాయలి అని తెలుసు.  ఎందుకు వ్రాయలో కూడా తెలుసు.  ఎవరికోసం వ్రాయలో కూడా తెలుసు.  తన రచనలు చదివే వారి గురించి కూడా తెలుసు.  తన పాఠకుడుని ఆయన గౌరవించాడు.  కాబట్టే అంత పెద్ద ముందుమాటలు, పీఠికలు వ్రాసాడు. తనతో పాటు తన కాలంలో ఉన్న తన సమకాలీనుల కోసం కూడా వ్రాసాడు.  వాటిని తన కోసం వ్రాసుకోలేదు. తను నమ్మిన “లోక కళ్యాణార్ధం”  వ్రాసాడు.

'కవిరాజు" త్రిపురనేని రామస్వామి రచించిన నాటకం "ఖూనీ"కాలం పరిగెడుతోంది. దానితో పాటు మనిషి పరుగెడుతున్నాడు.  ఆ పరుగు క్రమంలో మార్పుకి లోనవుతున్నాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నవి.  మార్పు సహజం కదా!  వేష, భాషలు, సంస్కృతి అన్ని ఎంతో కొంత మార్పుకి లోనవుతున్నాయ్.  ఆ నేపధ్యం లో 1980 ప్రాంతాలలో మళ్ళీ కవిరాజు రచనల ని చదవడం మొదలు పెట్టాను.  నా తోటి వాళ్ళు “కవిరాజు” రచనలను చదివిన వారు చాల తక్కువమందే కనపడ్డారు.  కారణం భాష.  త్రిపురనేని రామస్వామి చక్కని తెలుగులో వ్రాసినా,  ఆ తెలుగు వీళ్ళకి పాషాణ పాకం లాగా కనపడుతుండేది. పైగా ఆయన మీద ఆయన రచనల మీద ఒక అభిప్రాయం. ఆయన దేముళ్ళని తిట్టాడు. నేను దేముడ్ని నమ్ముతాను కాబట్టి ఆయన దేముడిని నమ్మడు కాబట్టి ఆయన పుస్తకాలని నేను చదవవలసిన అవసరం లేదని వీరి భావన.

అప్పుడనిపించింది నాకు.  ఈ తరానికి కూడా త్రిపురనేని రచనలు అందాలి.  వాటిని మళ్ళీ మూలాలు చెడకుండా, ఈ నాటి యువత కి అందజెయ్యాలి అని.  మద్రాసులో (చెన్నై ఇప్పడు) ” ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి ఫౌండేషన్” ని స్థాపించడం జరిగింది.  ఆ ఫౌండేషన్ ఉద్దేశాలలో ఇది కూడ ఒకటి.  కవిరాజు రచనలని యువతరానికి వారికి అర్ధమయ్యేరీతిలో వారు వాడుతున్న “తెలుగు” లోనే అందించాలని.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత “కవిరాజు” త్రిపురనేని రామస్వామిని అభిమానించిన కీ శే బొడ్డు రామకృష్ణ, కవిరాజు “సూతపురాణం” రెండు భాగాలని వచనం చేసారు.  2011 లో ఆ వచన “సూతపురాణం” రెండు భాగాల్ని తెనాలి లోని కవిరాజు త్రిపురనేని ఫౌండేషన్ వెలవరించి ఉచితంగానే ఆ పుస్తకాలని పదిమందికి పంచింది.  ఆ “సూతపురాణం” రెండు భాగాల్ని,  పీకాక్ క్లాసిక్స్ , హైద్రాబాదు ప్రచురించింది.

సూతపురాణం వెలువడింది.  మరి మిగతా రచనల సంగతి ఏమిటి?  వాటిని ఎలా ఈ పాఠకులకి అందించాలి?

ఈ నేపధ్యం లో  నేను సంప్రదించిన వారిలో గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఉద్యోగవిరమణ చేసిన, తెలుగు భాషాభిమాని, కవిరాజు త్రిపురనేని రామస్వామి ఆశయాలని నమ్మి ఆచరిస్తూన్న రావెల సాంబశివరావు గారు ఒకరు.  వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిసినవి. త్రిపురనేని వేనరాజు మీద వ్రాసిన “ఖూనీ” నాటిక ని “మన మాటలు” లో ఈ తరానికి అందిద్దాం అని ముందుకువచ్చారు.  వారే దానిని ఈ నాటి తెలుగు చదవగలిగిన వారికి అర్ధమయ్యేరీతిలో, పీఠికలతో సహా వ్రాసారు.  2013 జనవరి లో రామస్వామి జయంతి రోజునే దీనిని ప్రచురించాల్సింది.  కారణాంతరాల వల్ల 2014 జనవరిలో “కవిరాజు” త్రిపురనేని రామస్వామి 127 జయంతి నాడు దీనిని ఈబుక్ రూపంలో మీకు అందజేస్తున్నాను.

బహుశ ఫిబ్రవరి, మార్చి నాటికి అచ్చులో కూడ ఈ పుస్తకాన్ని వెలువరిద్దామని అనుకుంటున్నాము.

మీకు అర్ధమయ్యే తెలుగులో, సుమారు 42 పేజీలూ మాత్రమే ఉన్న ఈ “ఖూనీ” ని చదవండి.  మీకు నచ్చితే పదిమంది కి చెప్పండి. దీని మీద మీ అభిప్రాయాలు ఇక్కడే వ్యాఖ్యల ద్వారా తెలియజేయవచ్చు.
కినిగె.కామ్ లో ఈ కవిరాజు త్రిపురనేని రామస్వామి “ఖూనీ”  ఈబుక్‌ని ఈ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
http://kinige.com/kbook.php?id=2482&name=khooni

కొన్ని వేల ప్రతులని కినిగె తన పాఠకులకి అందించింది.  ఐనా డౌ‌న్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు కాని, చేసుకున్న తరువాత గాని ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ లింక్స్‌ని చదవండి.
http://kinige.com/help.php
ఇంకా అవసరం ఐతే [email protected] కి ఈమైల్ చెయ్యండి.  వారు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు.

ఉంటాను.
అనిల్

కొత్త వంతెన

“కొత్త వంతెన”

నిన్న సాయంత్రం “కొత్తవంతెన” పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది.  “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక సంపాదకుడు.  కె.శ్రీనివాస్, ఈ వ్యాసాలను తొలుత “ప్రజాతంత్ర” పత్రికలో దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రచురించారు.  వాటన్నింటిని ఇప్పుడు మళ్ళీ ఒక సంకలనం కింద “అనేక పబ్లికేషన్స్” ప్రచురించింది.

ఘంటా చక్రపాణి నిర్వహించిన ఈ సభలో “కొత్తవంతెన‌” అచ్చు పుస్తకాన్ని టిజాక్ అధ్యక్షులు కోదండరామ్ ఆవిష్కరించగా,  “కినిగె‌” ఈబుక్ ని ఆచార్యులు జి హరగోపాల్ ఆవిష్కరించారు. రచయిత కె శ్రీనివాస్ కోరిక మేరకు “గొంతు బాగొలె”దంటునే “జై తెలంగాణ” పాటని పాడి ప్రముఖ గాయకుడు అందెశ్రీ సభికులను అలరించారు.

"కొత్త వంతెన‌" - కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ
“కొత్త వంతెన‌” – కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ

వేదికని అలంకరించినవారిలో షాజహాన, జూపాక సుభద్ర, “నమస్తే తెలంగాణ” సంపాదకుడు అల్లం నారాయణ ఉన్నారు.

విరసం సభ్యులు వరవరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభలో మరో విశేషం ఏమిటంటే, రచయిత శ్రీనివాస్ తండ్రి శ్రీ సింగరాచార్యులు పాల్గొని ప్రసంగించడం.

మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి

Malati and N R Chendur, Madras

మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని.  వారింట్లోనే.  కచేరి రోడ్డు లో, మైలాపూర్‌లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో.  వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది.  శ్యామలాంబ గారు వారి సోదరి.  నేను, ఆరుద్ర రామలక్షి గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్‌న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు.  దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి. సాహిత్య సభలు కానివ్వండి, సినిమా ప్రీవ్యూలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి మరొహటి కానివ్వండి.

చందూరు గారు వచ్చేవారు, హెరాల్డ్ కారులో. మాలతీ గారు కూడ వారితో బాటే. సినిమా సెన్సార్ బోర్డ్ కి వేసే సెన్సార్ షో కి నేను కూడ వెళ్ళేవాడిని. సినిమా నటుడు, ఛంద్రమోహన్ మామగారు, రచయిత్రి తులసి జలంధర గారి తండ్రి , డా గాలి బాలసుందర రావు గారు అద్దెకుండే ఇంట్లో ఒక పక్కగా ఖాళీ స్థలం ఉండేది. దానిలో సాహితీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వాటికి కూడా భార్యా భర్తలు ఇద్దరూ వస్తుండేవారు.

1996 లో మా అమ్మ చనిపోయిన తరువాత ఫోనులో పలకరించుకోవడమే గాని, నేను వెళ్ళి కలిసింది లేదు. కాని మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు కలిసాను. సాయంత్రం కలుద్దామనుకుంటే, మరుసరి రోజు ఉదయం కలుద్దామని అన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళాను. దాదాపు గంటో గంటన్నరో గడిపాను. మద్రాసులో తెలుగు వాతావరణం, తెలుగు సాహిత్య సభలు, సమావేశాలు, ఆ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రం లో సాహిత్యం, సాహిత్య రంగంలో రాజకీయాలు వగైరాలు సాహితి మిత్రుల గురించి వాకబులు, కబుర్లు.
“జగతి”  గురించి ప్రస్తావన వచ్చింది.  చందూర్ గారు పోగానే “జగతి” ప్రచురణ ని ఆపేసానని చెప్పారు. ఇంతలో నేను వద్దని వారిస్తున్నా వినకుండా “కాఫీ చేసి తెస్తానుండు”, అంటూ మా టీచర్ గారు లోపలికి వెళ్ళారు.  “అనిల్ తో మామయ్య గురించి మాట్లాడవచ్చు అంటావా?” అంటూ మాలతి గారు మా టీచర్ గారిని అడగటం..వారు “తనేమన్నా బయట వాడా నువ్వు మాట్లాడకుండా ఉండటానికి” అంటుండగానే..లోపలికి వెళ్ళి ఇంతలావు బైండ్ చేసిన పుస్తకం తీసుకువచ్చారు. అదే “జగతి డైరి”. జగతి నుంచి ఏరి కూర్చిన వ్యాస సంకలనం. చందూరు గారి వ్రాసినవి. ఎంతొ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆ పుస్తకాన్ని నాకు చూపించారు ఆవిడ. దాదాపు ఒక సంవత్సర కాలం “జగతి” లన్ని ముందేసుకుని వాటిలో ఏరి కూర్చిన సంకలనం అది.  అంత పెద్ద పుస్తకానికి ధర కూడ తక్కువే పెట్టారు.

నా భార్య గతించిన విషయం తనకి తెలిసిందని అంటూ తను వ్రాసిన శిశిరవసంతం నవల లో “సంధ్య” గురించి చెబుతూ ఆ నవలని తప్పకుండా చదవమని కోరారు.  ఆ నవలలో “సంధ్య” కి కాన్సర్.  కాన్సర్ తో చేసిన యుద్దంలో సంధ్య గెలుస్తుంది ఆ నవలలో.

పాత్రికేయురాలు అరుణ పప్పు వ్రాసిన కథా సంపుటి “చందనపు బొమ్మ“కి ఒక పరిచయ సభని మద్రాసులో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాటి సాయంత్రం వక్తలలో ఆమె ఒకరు. సినీ రచయిత, కవి భువనచంద్ర, నటి లక్ష్మి, నిర్మాత కాట్రగడ్డ మురారి, ఘంటసాల రత్నకుమార్ తదితరులు ఆ సభలో పాల్గొన్నారు.  ఆ సందర్భంలో తన కోసం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారితో సంతంకం చేయించుకున్న జ్ఞాపకంగా మిగిలి పోయిన “శిశిర వసంతం” నవల ఇది. కాని నిజ జీవితంలో గెలిచిన మాలతీ చందూర్ కాన్సర్ తో చేసిన యుద్దంలో పరాజిత.

శిశిరవసంతం, సంధ్య నాయిక

ఈ దశాబ్దం నవలది, తెలుగు కథ ది!

ముందున్నది మూడు చెరువులు.  ఒడ్డున్న ఉన్నది అప్పుడే వాటిల్లో  మునిగి, ఈది, తేలి, గట్టుకు చేరిన సుశిక్షుతులైన గజ ఈతగాళ్ళు.  ఆ చెరువులు చెరువులేనా?.. ద్రోహ వృక్షం, నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం.  ఒడ్డున్న ఉండి మళ్ళీ దూకడానికి ఉద్యుక్తుడవుతున్న నవయువకుడు శివారెడ్డి..కానీండి ఇంకా చూస్తారే?..నేనైతే  ‘జీవని‌’ లోకి దూకాను.  ‘ఐదు హంసలు‌’ని కూడా చూసాను.  దూకడమే..అలా ఒడ్డున నిలబడిపోతే  మీ జీవితంలో ఒక ఎపిక్ ప్రపోర్షన్‌ లో ఒక అనుభవాన్ని కోల్పోతారంటాడు.

ఇందులో ద్రోహవృక్షం కథల సంపుటి.  మిగతా రెండూ – నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు. రచయిత డా॥ వి. చంద్రశేకఖర రావు.

Dr. v chandrasekhara Rao novels release function
డా: చంద్రశేఖర రావు నవలలు ఆవిష్కరణ సభ..మీ ఎడమవైపు నుండి..శ్రీ జగన్నాధ శర్మ, నవ్య సంపాదకులు – ఆకుపచ్చిని దేశం తో, కవి శివారెడ్డి అక్కుపచ్చిని దేశం లో నల్ల మిరియం చెట్టు తో, రచయిత డా॥ చంద్రశేఖర రావు వి, వారి ప్రక్కన విమర్శకులు సీతారాం.

ఆ పుస్తకాల పేర్లు చూడండి.  ఒక మార్మికత లేదూ వాటిల్లో?!  చిన్నప్పుడు మా నాన్న తెచ్చి ఇస్తే పుస్తకాలు, ఏది ముందు చదవాలో అర్ధం అయ్యేది కాదు.  అన్నింటిని ఒకే సారి చదవలేము.  సరే, పుస్తక పరిచయ సభకి వెళ్ళాం కదా..ఆ మహామహుల మాటలు విన్నాం కదా?  వాళ్ళందరూ ఏదో ఒక పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తే దాంతో మొదలు పెట్టవచ్చు. అసలు ఆ సాహితీవేత్తలు ఆ అవకాశం లేకుండా అన్నింటి గురించి చెప్పేసారు.  అసలు ముందు వాళ్ళ మాటలు వింటుంటే ఒక అయోమయం.

నల్లమిరియం చెట్టు గురించి మాట్లాడుతూ, ఆకుపచ్చని దేశం లోకి వెళ్ళిపోతారు.  పోనీ దాని గురించి మాట్లాడుతారా అంటే ఉహు మళ్ళీ ద్రోహవృక్షంలోకి వెళ్ళిపోతారు.  అక్కడ ఉంటారా అంటే ఆబ్బే సుందరం అంట..ఆదెమ్మ అంట,  చెంచులు అంట, నరసింహం ఆత్మహత్య, మొసళ్ళు వాటితో యుద్దమా లేదా తప్పించుకుని అవతలి ఒడ్డుకి చేరటమా అన్న ఆలోచనంట..ఇవేవి కావు అసలు ఈ చంద్రశేఖరం గారు కవిత్వం వ్రాస్తున్నాడంటున్నారు, నా దృష్టిలో అది కవిత్వం కాదు..ఈ రచయిత రచనల మీద నేను పరిశోధన చేస్తున్నాను అని మరో వక్త.  సరే!  వాళ్ళు పుస్తకాలు చదివారు కాబట్టి వేదిక మీద ఉన్నవాళ్ళందరికి రచయితతో సహా తాము ఏమి మాట్లాడుతున్నారో తెలుసు.

మరి పాఠకుడి పరిస్థితి.

సీరియల్‌ని చదివిన పెద్దాయన కవి శివారెడ్డి.  ప్రతి వారం ఒక వార పత్రికని కొని..ఒక ముక్క చదివి..మళ్ళీ వచ్చేవారం కోసం ఎదురుచూస్తు..ముక్కలు ముక్కలుగా చదవటానికి విముఖుడు.  అలా చదవాలంటే చెడ్డ చిరాకు ఈ కవికి.  కాని ఆయన ప్రతివారం ముక్కలు ముక్కలుగానే చదువుకున్నాడంట సీరియల్‌ని.  అంతగా ఆకర్షించింది ఆయన్ని.  ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటి ఉంది.  ఆయన కవి. కథకుడు కాదు.  నవలా కారుడు అంతకంటే కాదు.  అవంటే పెద్ద ప్రేమా, మోజు లేదాయనకి. ఆయనే చెప్పుకున్నాడా మాట ఆ వేదిక మీద నుంచి.  ఏకంగా 22 పేజీల ముందుమాట వ్రాసేయించింది ఆ నవల ఆ కవితో.

ఎవరూ ఏ పుస్తకాన్ని ఒక్క సారి చదివి నమిలి పిప్పిని పారేసిన వారు కాదు, బెకన్ అన్నట్టుగా.  మాట్లాడిన వారందరూ ఆ నవలలని..ఆ కథలని పరిచయం చేసిన వారందరు ప్రతి పుస్తకాన్ని ఆవాహన చేసుకున్నవారే.  ఆ పుస్తకాలు వారందర్నీ తమ ప్రపంచంలోకి రమ్మనమని సాదరంగా ఆహ్వానించినవి.  వీరు ఆ యా ప్రపంచాలలోకి వెళ్ళి ప్రతి పాత్రతోను పయనించి,  వారి జీవితాలని స్పృశించి, ఆ లోకాలను అనుభవిస్తూ వెలికి వచ్చారు.  మళ్ళీ అ సాహిత్యంలోకి వెళ్లాలనిపించి వెళ్ళారు.  వదలలేదు.  వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్లారు.  రేపు మరోసారి మళ్ళీ వెడతారు. వారి మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ ఆ లోకాలలో విహరిస్తూనే ఉంటారనిపిస్తుంది.

నవీన్ వాసిరెడ్డి
సభకు అధ్యక్షుడు. నేను పోలీసుల చెకప్పులు, వినాయకుడి విగ్రహాలను తప్పించుకుంటూ హైద్రాబాదు ట్రాఫిక్కులోపడి ఈదుకుంటూ వెళ్ళేటప్పడికి ఆయన ఉపన్యాసం అయిపొయ్యి  వక్తలను ఆహ్వానిస్తున్నారు.

జగన్నాధ శర్మ  (నవ్య సంపాదకులు,) చాల క్లుప్తంగా మాట్లాడారు.
“సాహితీలోకంలో ఒక మాట ఉంది. 1910 నంచి 20/30 ల దాక తెలుగు సాహిత్యంలో అనువాద కాలం అని.  కాని నేను ఇప్పుడు చెబుతున్నాను.  2010 నుంచి  మళ్ళీ తెలుగు కధా సాహిత్యం, నవలా సాహిత్యం మొదలైనది.  భారతదేశంలోని ఇతర భాషలు తెలుగు భాష వైపు తెలుసు సాహిత్యం వైపు చూస్తుండాల్సిన తరుణం వచ్చేసింది.  దానికి కారణం చంద్రశేఖర రావు లాంటి రచయితలు.  నవల రూపు చూడకండి.  నవలలో వస్తున్న వస్తువుని చూడండి.  గొప్ప తెలుగు సాహిత్యం ఈ దశాబ్దం తో మొదలయ్యింది మళ్ళీ.  ఇంతకన్నా తెలుగు సాహిత్యం గురించి నేను చెప్పగలిగింది లేదు”.

కవి శివారెడ్డి
కవి శివారెడ్డి మూడు సార్లు చదివారు. ఆయన నల్ల మిరియం చెట్టు కి ముందుమాట(?) అందామా “ఒక గాధ గురించి” అని శీర్హిక పెట్టి..అంటారు కదా..తొలి వాక్యం లో.
” నేనిప్పుడో మహోపన్యాసం చెయ్యగలను డా॥ వి. చంద్రశేకఖర రావు గారి సాహిత్యం మీద”.

“Preconceived notions లేకుండా రచయిత దగ్గిరకు వెళ్ళే ఒక తరం పాఠకులొస్తారు. వచ్చారు.  విమర్శకులే రావాల్సింది.

ఊర్వశి అంటుంది పురూరవుడి తో,’ప్రేమ కావాలా..నీ అలంకారాలన్ని, ఆభరణాలన్నీ పక్కన బెట్టి దిగంబరంగా నా దగ్గిరకు రా,’ అని.  అలా పాఠకుడు అన్ని misconceived, wrong notions ని పక్కనబెట్టి – పరమ దిగంబరంగా వాచకం దగ్గిరకెళ్ళాలి –  ఆ పాల సముద్రం లో మునగాలి.”  అవి ఆయన మాటలు.

ఎ కె ప్రభాకర్ గారు
చంద్రశేఖర రావు సాహిత్యం గురించి సోదాహరణం గా వివరించారు. నల్ల మిరియం చెట్టుగురించి మాట్లాడుతూ వారి మిగతా సాహిత్యంలోకి సభికులను లాకెళ్ళారు.  ప్రత్యేకంగా ఆ నవల ముగింపుని పాజిటివ్ దృక్పధంతో నే చూడవచ్చు అని అన్నారు.

సీతారాం
చంద్రశేఖర రావు వచనం కవిత్వం కాదు.  ఆయన తన ఆవేదనని పరివేదని అలా వ్యక్తం చేస్తున్నాడు.  It is his expression of agony.  His form and content needs more critics. “ఆయన రచనలమీద పరిశోధన చేస్తున్నాను,” అని అన్నారు.  అంతగా కదిలించినవి చంద్రశేఖర రావు గారి సృజనలు ఆయనలోని విమర్శకుడిని.  నల్ల మిరియం చెట్టుగురించే తాను మాట్లాడు దాం అని అనుకున్నానని కాని..దాని పరిధి దాటి మాట్లాడారు.

గుడిపాటి
చంద్రశేఖర రావు గారి సాహిత్యం మీద చాల చర్చ జరగవలసి ఉంది.  ఇక్కడ కలిసిన ఈ రెండు మూడు వందల సాహితీవేత్తల మధ్య జరిగినదే కాదు.  ఇంకా జరగాలి.  వేదికలెక్కాలి.  పాఠకులు అందులో ఇన్వాల్ కావాలి.  ఇది ఇక్కడితో ఆగిపోదు.

రచయిత
నా కాల పరిస్థితులే నా రచనలని రూపొందించినవి. ఈ వేదిక మీద ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడం బాగుండదు.

జరిగిన సభ గుఱించి నా మాటలు:
ఎవరూ కూడా రచయిత వ్రాసిన ఏ ఒక్క కథకో ఏ ఒక్క నవలకో పరిమితం కాలేకపొయ్యారు.  కారణం రచయిత ఎన్నుకున్న వస్తువు, శిల్పం, శైలి, భాష.  ఒకరు దండోరా గుఱించి మాట్లాడితే, మరొకరు తెలంగాణా నేపధ్యంతో వ్రాసిన హె‌చ్ నరసింహం అత్మహత్య  గురించో లేక చెంచువుల గురించో..ఐదు హంసల గురించో మరో కథ గురించో మాట్లాడారు.  మధ్యలో కొ కు ఫోర్త్ డైమన్షన్ ని లాకొచ్చారు.

సాహిత్యం, పోకడలు, చంద్రశేఖర రావు రచనలు వారిమీద వారి ఆలోచనల మీద, ఆయన రచనలు తమ బుర్రకు పెట్టిన పనిమీద, పదునెక్కించిన రీతి..ఆ యా నవలల సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఒకటేమిటి ఎన్నో అంశాలు..పరిపూర్ణమైన ఒక సాహితీ సభ అది.

కొత్త తరం పాఠకులు వచ్చారు!
కొత్త తరం పాఠకులు వచ్చారు. నేనంటున్నది కూడా అదే.  నవ్య సంపాదకులు అంటున్నది అదే!  కవి శివారెడ్డి అంటున్నది అదే.  ప్రభాకర్ గారు అన్నది అదే! సీతారాం చెబుతున్నది అదే!  గుడిపాటి చెప్పింది అదే! మీరందరూ చదవవలసిన పుస్తకాలు ఇవి.

చాలా రోజుల తరువాత సాహితీ మిత్రులను చాల మందిని కలుసుకున్నాను.  చాల సంతోషమేసింది.  ఎంత సాదరంగా అహ్వానించారో!  ఆదరంగా పలుకరించారో అందరూ.

ఇక మీరు చెయ్యవలసింది.
ఈ బ్లాగ్ పోస్ట్ చూసి ఇక్కడి దాకా చదివారంటే..మీకు అంతర్జాలంతో పరిచయం ఉండే ఉండాలి.  సాహిత్యం మీద అభిరుచు ఉండి ఉండాలి.  కాబట్టి ఈ మూడు పుస్తకాలు ముందు సంపాదించండి.తరువాత వీటిని కూడా సంపాదించి చదువుకోండి.

జీవని
లెనిన్ ప్లేస్
మాయా లాంతరు
ద్రోహవృక్షం..ఈవన్నీ ఈ రచయిత కధా సంకలనాలు.

నవలలు ఇవి:  ఐదు హంసలు, ఆకుపచ్చని దేశం, నల్ల మిరియం చెట్టు.
కినిగెలో ఈ ఒక కథా సంకలనం, రెండు నవలలు..ఈ బుక్స్ గాను ప్రింట్ బుక్స్ గాను ఉన్నవి.

దిష్టి చుక్క:
తెలుగు ప్రసార మాధ్యమాల ఫోటోగ్రాఫర్‌లు.  జరుగుతున్న సభ మధ్యలో దూరి, ఆ క్రమాన్ని ఆరాచకంగా ఆపేసి, తమ కెమరా ప్రలోభానికి కి లొంగనివాడెవ్వడూ లేడని చెప్పకుండా చెబుతూ దర్పంగా వచ్చినంత వేగంగా వెళ్ళిపోతారు.  వాళ్ళు అడ్డం రావడం కారణంగా గుడిపాటి, నవీన్, ఎ కె ప్రభాకర్ బొమ్మల్లో కనిపించకుండా పొయ్యారు.  తీసినవి సరిగ్గా  రాలేదు.  ఉన్నవి కాని ఇక్కడ పోస్ట్ చెయ్యలేదు.

గొప్ప సాహితీ సభ ఎందుకైనదంటే..ఎవరూ పక్కవారి చెవులు కొరకలేదు. గుస గుసలు లేవు.  ఫోన్లు మోగలేదు.  హాలు బయట కుహానా సాహితీవేత్తల అరుపులు, పెడబొబ్బలు లేవు. ఇక సభలో ఉన్నవారి సంగతంటారా!   అందర్ని ఆ వేదిక మీద వక్తలు తమ మాటలతో కట్టి పడేసారు.  ఇప్పుడు అర్థమయ్యిందా  ఆ రచయిత డా॥వి. చంద్రశేఖర రావు రచనా పటిమ?  పుస్తకాలు కొనుక్కుని చదువుకోండి.  చదువుకుని మీ బ్లాగుల ద్వారానో మరొక వెబ్‌సైట్ ద్వారానో మీ అభిప్రాయాలని పది మందితో పంచుకోండి! ఇక మొదలెట్టండి!

డా.వింజమూరి తో సరదాగా కాసేపు RainBow FM లో

వైద్యులు వింజమూరి సూర్య ప్రకాశ్ గారు రేపు అంటే

20th, శుక్రవారం2012 రోజున,
Rainbow (Radio channel) AIR FM 101.9 లో

Spreading Lights

కార్యక్రమం గురించి శ్రోతలతో

సరదాగా కాసేపు

పంచుకుంటారు.

మధ్యహ్నాం

1.30 కి

ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.

సరే.  ఇక ఈ డా. వింజమూరి ఎవరు?
Vinjamuri
డాక్టరు గారు.  వైద్యం చేసే డాక్టరు గారు.  కాని వైద్యం కాదు మన సంఘానికి కావల్సింది విజ్ఞానం.  అది పుస్తకాలలో ఉంది కాబట్టి దానిని ముందు ప్రజల మస్తిష్కాలలోకి ఇంజెక్ట్ చేస్తే సంఘం బాగు పడుతుంది అని నమ్మి డాక్టరిని వదిలేసి ఇదిగో ఈ పస్తకాల పూజతో ప్రజలని సేవించుకుంటున్నారు.  ఒక్క రూపాయి అడగరు. నిస్వార్ధంగా చేస్తున్నారు ఈ డాక్టరు వింజమూరి గారు.

Spreading Lights
వారు మొదలుపెట్టిన “Spreading Lights” కార్యక్రమలో ఒక భాగమే పుస్తకాలను చదువుకోవడం. రచయిత తన పుస్తకాన్ని కాని, పాఠకుడు తనకు నచ్చిన పుస్తకాన్ని కాని పది మంది తో ను పంచుకోవడం ఈ కార్యక్రమం విశేషం. భాగ్యనగరం లో ఐతే ప్రకాశ్ చొరవ,కృషి, పట్టుదల పుణ్యమా అంటూ ఇప్పుడు కనీసం పది చోట్ల ప్రతి వారం ఏదో ఒక దరోజున ఈ Spreading Lights కార్యక్రమం జరుగుతున్నది.  నేను కూడా వీటిలో పాల్గొన్నాను.

మీరు కూడా మీ ప్రాంతంలో ఈ Spreading Lights కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు.  మీరు ముగ్గురే ఐనా ఫరవాలేదు.  ముప్పై మంది ఐతే మరీ సంతోషం.  🙂

సరదాగా కాసేపు

ఇక  రేపటి సరదాగా కాసేపు ప్రతి సాహిత్యాభిమాని తప్పక వినదగ్గ రేడియో కార్యక్రమం. నిజమే,ఏ సాయంత్రమో ఐతే బాగుండేది, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళకి ఇబ్బందే.

ఐనా వినడానికి ప్రయత్నించండి.

ఇక్కడ పైన ఉన్న చాయచిత్రంలో మీ ఎడమవైపు నుండి రెండో వారు శ్రీ వింజమూరి సూర్య ప్రకాశ్ గారు. (భుజానికి సంచీ తగిలించుకుని ఉన్నారే వారే)

మో “బ్రతికిన క్షణాలు” లో కొన్ని..

ఆరేళ్ళో అరవై ఏళ్ళో బ్రతుకుతాం.  ఆరేళ్ళముందెలా పుట్టామో ఎవడికి తెలీదు.  అరవై తర్వాత ఎలా చస్తామో మనకి తెలీదు.  తీసుకు తీసుకుని తడిసిన నులక మంచానికి తప్ప ఆరు నుంచి అరవైదాక ఈలోపల బేరామాడ్తాం. చివరకు గిట్టుబాటవుతుంది తప్పక.

ఒకే కవితకు ఆరు అర్థాలు ఒస్తాయని ఒకడు అమ్మ చూపుతాడు.  ఆరూ అనర్థాలే.  అసలు అర్థం అమ్మేవాడికే తెలీదు. కొనేవాడు నూరర్థాలు అడుగుతాడు – ఓ శతాధిక గ్రంధకర్తని.  శతపత్ర సుందరిని అరవై ఏళ్ళ ఆంధ్ర కవిత్వాన్ని ఆరు రూపాయలకే అచ్చెయ్యమంటాడు అరసున్నాలకి అమ్ముడు పోయేవాడు.

మో వీటిని ‘పద మూర్చన’ లన్నాడు. చచ్చిన తర్వాత చెప్పే మొదటి మాటలంట!  పైగా అంటాడు..”వాస్తవాన్ని అధివాస్తవికంగా మలుచుకునే ప్రయత్నంలో వచనం విరిగి ముక్కలయ్యి ఆ గాజు పెంకులు పద్యానికి గుచ్చుకొంటాయి”ట.

“ప్రతి నేనుకి ఒక మేనుంటుంది.  నేను లోంచి మేము, మనం అవటానికే ఏ రచన అయినా.  తారీఖులూ, దస్తావేజులూ ఏమిలేని అనామక స్వీయ జీవన చిత్రణ ఈ ‘బతికిన క్షణాలు‌’.  దృశ్యం అదృశ్యంగాను శబ్దం నిశ్శబ్దంగానూ రంగులు పులుముకుని మాటలుగా మ్రోగుతాయ్.

అంతాలో ఎంతో కొంత యిది.

ఎక్కువ మాట్లాడే వాడు ఏది చెప్పడు.

నిశ్శబ్ద క్షణంలో శాశ్వత శబ్దాన్ని పట్టుకోవాలని

ఈ నూత్న యత్నం”.

వెతకండి..ఎక్కడన్నా దొరికితే, దొరకబుచ్చుకుని చదవండి. చదివి ఆ “బతికిన క్షణాలు” మళ్ళీ బతకడానికి ప్రయత్నించండి.

ఎందుకంటే “మో” ఆ “బతికిన క్షణాలు” అన్నింటిని ఐదు వందల ప్రతులకి మాత్రమే పరిమితం చేసాడు..అది ఒక దశాబ్దం క్రితం!

మో “బ్రతికిన క్షణాలు” తొలి ముద్రణ 1990 – మలి ముద్రణ  2000

అశాశ్వత సత్యం; శాశ్వతం

కవిత నుండి కొన్ని పంక్తులు:

ఎన్ని బాడిలు అన్ని జన్మలు ఎన్నిక్షణాలు

నిల్చి సాగి తూలి జారి రాలి

నిలూనా చీలుస్తాయి నిన్నూ నన్నూ

రక్తాక్షరాలలో ఏ కవి రాసుకుంటాడు ఎన్నని

ఇన్ని సత్యాల్ని ఇన్ని ప్రేగుల్ని

బొమికెల్ని చర్మపు నునుపుల్ని

సౌందర్యపుటుంగరాల్ని కేశపాశపు మోహపు మెలికల్ని

మమతా మైత్రి పాశాలెన్నని తెంచుకుంటాడు

ఎన్ని రంగుల్ని ఉడుపుల్నిఒల్చుకుంటాడు

ఆయాసంతో

ఏ అసఫలీకృత కాంక్షల్ని

పాపం! ఎన్నిటినని పేర్చుకుంటాడు

దేహం గొప్పది దేహమే గొప్పదనకుండా!

ఆత్మలేదు

శరీరం అనాత్మ.

 చితిచింత లోని ఒక కవితలోని పై పంక్తులు “మో” వి.

మో ఇక లేరు.

‘మో’ ఎవరు?

అని నిన్న నన్నొకరు అడిగారు.

ఎక్కడ?

రవీంద్రభారతి, భాగ్యనగరం.

సందర్భం:

తనికెళ్ళ భరణి సాహితి పురస్కార ప్రదానం.

కూర్చోడానికి ఖాళీ కుర్చీ కనపడక అడిగినట్టున్నాడు.  అడిగిందెవరా అని వెనక్కి తిరిగి చూసాను.  కళ్ళజోడు. నెరిసిన జుత్తు. “సభ మొదలైన తరువాత తెలుస్తుందండి మీకు”, అని  మళ్ళీ నా దృష్టిని వేదిక మీదకి సారించాను.

అవధానం జరుగుతున్నది. అప్రస్తుత ప్రశ్న ; ” అత్యంత లోభి కూడ దానం చెయ్యలేనిది ఏది?”.  అవధాని గారు జవాబిచ్చే లోపే, నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ” కాలధర్మం” అని ఘొల్లుమన్నారు.

అధ్యక్షుడు సి. నారాయణ రెడ్డి గారు, నిషాదం అంటే సంగీతంలో సప్తమ స్వరం అని  వివరిస్తూ.. మో పుస్తకం నిషాదం చదవడం మొదలుపెట్టినప్పుడు..”ఏమో‌” అని అనుకున్నానని కాని “అమ్మో” అని అనిపిస్తుందని అన్నారు.

గవర్నమెంట్ ఎలిమెంటరి స్కూల్ళో చదువుకున్న తనకు, “మో‌” నిషాదం మీద మాట్లాడేంత పరిజ్ఞానం లేదని, నటుడు భరణి ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేసారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య.

ఇక తెలుగు భాష బోధకుడిగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, చలన చిత్ర నటుడుగా బ్రహ్మాండంగా సాగిపోతున్న బ్రహ్మానందం,

“అది గది

దాని అద్దె పది”

అనే కవితలోస్తూన ఈ రోజుల్లో, మో నిషాదం చదివి, అర్ధం చేసుకుని, జీర్ణం చేసుకునే అవకాశం ఆ భగవంతుడు తనకివ్వలేదని, తన ఫేసుకి ఆయన ఒక స్టఫ్ ని ఇచ్చి ప్రజలని రంజింపజెయ్యమన్నాడని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులతో పాటూ గా కూర్చోవలసిన తనను, వేదిక మీద కూర్చోపెట్టిన భరణి, తన అభిమానాన్ని చాటుకున్నాడే కాని తనకి ఆ అర్హత లేదని, వినమ్రంగా విన్నవించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘మో‌’ మీద కోపం వచ్చింది.  ఔను, దర్శకుడు శ్రీనివాసే! ‘మో‌’ చదివినంత తను చదవలేదు కాబట్టి, తన కోపం.  ఆ కోపంతో ఆ సాహిత్యం అంతా చదివేస్తానంటాడియన.  అసలు తనకి రవింద్ర భారతి కార్ పార్కింగ్‌లో నిలబడే అర్హత కూడా లేదని కాని భరణి మాట తీసెయ్యలేక వేదిక మీద దాక్కోడం కుదరక కూర్చున్నాని నవ్వుల మధ్య చెప్పాడు.

న్యాయనిర్ణేతలు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆచార్య మృణాళిని, కవి శివారెడ్డి.  తాము ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కవితా సంపుటి “నిషాదం” అని తమకు అందిన 108 కవితా సంపుటాలలో దానిని ఎన్నుకోవడానికి గల కొన్ని కారణాలని వివరించారు, కవి శివారెడ్డి.

తనికెళ్ళ భరణి, చక్కని చామరం క్రింద ‘మో‌’ అని  మనం పిలుచుకునే వేగుంట మోహన ప్రసాద్ ని సుఖాసీనుడిని చేసి, వేద పండితుల మంత్రోచ్హారణల మధ్య  స్వర్ణ పుష్పాభిషేకం చేసారు. వేదికనలంకరించిన పెద్దలలో చలన చిత్ర కథకులు, సంభాషణ కర్త పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వేంకటేశ్వర రావు గారితో సహా అందరూ ‘‌మో’ కి తమ శుభాకాంక్షలు అందజేసారు.

‘మో‌’ తన దైన శైలిలో..ముందే వ్రాసుకుని తెచ్చుకున్న పాఠం నుంచి కొంత మేరకు చదివి వినిపించారు.

బర్త్ డే బాయ్ భరణికి కొంత మంది మిత్రులు తమ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.

జాతీయ గీతం జనగణ మణతో సభ ముగిసింది.

ఎటువంటి హడావిడి లేకుండా, వెకిలి ప్రసంగాలు, అనవసరపు డప్పాలు లేకుండా సాఫీగా, హాయిగా జరిగిన గొప్ప సాహిత్య సభ ఇది.  తెలుగు కవి కి తెలుగు కవిత్వానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ రోజులకి ఇది తొలి రోజు మాత్రమే.

భరణి తన మాటల్లో చెప్పిన “గద్వాల్ సంస్థానం వారి ఆచారం” మళ్ళీ మొదలవ్వాలని..తెలుగు భాష బ్రతకడానికి ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు విరివిగా జరగాలని మనమందరం కోరుకోవాలి.

వీలైతే ‘మో‌’ ప్రసగం పూర్తి పాఠం, అలాగే మితృడు నరేశ్ నున్న ‘మో‌’ మీద వ్రాసి, అచ్చొత్తంచి, ఉచితంగా పంచిన ఒక చిన్న పుస్తకాన్ని మీకు ఇక్కడ అందించడానికి ప్రయత్నిస్తాను.

ఈ తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం జరిగినది కళా ఫౌండేషన్ ఆధ్యర్యంలో..కనకధార వెంచర్స్ సహాయంతో..

కినిగె.కాం లో

తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ  ..  ‘మో’ నిషాదం ఇక్కడ  లభ్యం.

మై డాడ్ డైడ్ యంగ్

Pitcheswara Rao Atluri (1924 – 1966)

అట్లూరి పిచ్చేశ్వర రావు (1924 -1966)

రచయిత, కథకుడు, నవలాకారుడు,అనువాదకుడు, చలన చిత్ర సంభాషణ కర్త

వికిపిడియలో పిచ్చేశ్చర రావు

ఆయన వ్రాసినవి కొన్ని ఇక్కడ

తెలుగు దిన పత్రిక సాక్షి లో